Home సినిమా ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ

ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ

krishna

సుధీర్‌బాబు, అదితీరావు హైదరి జంటగా మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘సమ్మోహనం’. ఈ చిత్రం ఈనెల 15న విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్ర
నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌తో ఇంటర్వూ విశేషాలు…

సరిగ్గా రెండేళ్ల తర్వాత… దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణతో 2016లో హిట్ మూవీ ‘జెంటిల్‌మన్’ సినిమా చేశాను. సరిగ్గా రెండేళ్ల తర్వాత ఇప్పుడు ‘సమ్మోహనం’ సినిమా చేయడం జరిగింది. కథ, డైలాగ్ వర్షన్‌తో కూడిన ఓ పుస్తకాన్ని రాసి ఇంద్రగంటి నాకు ఇచ్చారు. కథ నాకు బాగా నచ్చింది. అక్కడ నుంచి మా ప్రయాణం ప్రారంభమైంది.
కథ నచ్చి చేశారు… హీరోయిన్‌గా అదితిరావు హైదరీ అయితే బావుంటుందని ఇంద్రగంటి అన్నారు. ఆమె నటించిన మణిరత్నం సినిమా ‘చెలియా’ చూశాం. మా సినిమాలో హీరోయిన్ పాత్రకు సరిగ్గా సరిపోతుందని ఆమెను తీసుకున్నాం. కథ విన్న వెంటనే అదితి ఈ సినిమా చేయడానికి అంగీకరించింది. ఆతర్వాత సుధీర్‌బాబును కలిసి కథ చెప్పాం. ఆయనకు కూడా నచ్చి సినిమా చేయడానికి అంగీకరించారు. అలాగే తండ్రి పాత్రలో నరేశ్‌ను తీసుకున్నాం. తండ్రిగా ఆయన అద్భుతంగా నటించారు.
ఓ ప్లానింగ్‌తో… ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీని అందంగా తీయాలి… భావోద్వేగాలను హృద్యంగా తెరకెక్కించాలని దర్శకుడు ఇంద్రగంటి భావించి ఓ ప్లానింగ్‌తో సినిమాను రూపొందించారు. నేను ఏ సినిమా చేసిన నిర్మాణంలో ఎక్కడా రాజీపడలేదు. ఈ సినిమా మేకింగ్‌లో రిచ్‌నెస్ కనిపిస్తుంది. ఇంద్రగంటి సినిమా కథకు తగ్గట్టు ‘సమ్మోహనం’ అనే టైటిల్ పెట్టారు.
హాయిగా నవ్వుకునే...కుటుంబంతో కలిసి హాయిగా నవ్వుకొని చూసే ఫీల్‌గుడ్ లవ్ స్టోరీ ఇది. మ్యూజిక్ పరంగా కూడా సినిమా అద్భుతంగా ఉంటుంది. బుధవారం సెన్సార్ పూర్తవుతుంది. సినిమా అవుట్‌పుట్ అనుకున్నట్లుగానే వచ్చింది.
విభిన్నమైన ప్రేమ కథ… నిజ జీవితంలో ఓ హీరోయిన్ ఓ సాధారణ యువకుడితో ప్రేమలో పడటం అనేది చాలా సందర్భాల్లో జరిగాయి. ప్రతి ఇండస్ట్రీలో ఇలాంటి ప్రేమ కథలున్నాయి. సీతామహాలక్ష్మి, రంగీలా, శివరంజని వంటి సినిమాలు కూడా ఇదే బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కాయి. పెయింటింగ్ వేసే ఓ సాధారణ మధ్యతరగతి యువకుడికి ఓ స్టార్ హీరోయిన్ ఎలా పరిచయమైంది? వారి మధ్య ప్రేమ ఎలా పుట్టింది? చివరకు వీరి ప్రేమ ఎక్కడికి చేరుకుంది? అనేదే ఈ సినిమా కథ.
అన్నీ కుదిరితే చేస్తా… ఎప్పుడు అడిగినా బాలకృష్ణ సినిమా చేయడానికి సిద్ధంగా ఉంటారు. కానీ ఆయనతో చేసే సినిమాకు మంచి కథ, చక్కగా తెరకెక్కించే దర్శకుడు కావాలి. అన్నీ కుదిరితే తప్పకుండా చేస్తాను.
తదుపరి చిత్రం… ప్రస్తుతం రెండు కథలు సిద్ధంగా ఉన్నాయి. ఏ సినిమా చేయాలనేది ఇప్పుడే నిర్ణయించుకోలేదు. ‘సమ్మోహనం’ విడుదల తర్వాత నెక్స్ సినిమా గురించి ఆలోచిస్తాను.