Home ఆఫ్ బీట్ లాభాపేక్షలేని సంస్థగా పతంజలి

లాభాపేక్షలేని సంస్థగా పతంజలి

baba

సనాతన భారతీయ సంప్రదాయాలు, ఆచారాల ద్వారా ఆరోగ్యకరమైన అలవాట్లను అలవరచి వ్యక్తిత్వ వికాసాన్ని కలిగించి జాతిని బలంగా ముందుకు నడపాలని ఉద్యమస్ఫూర్తితో ముందుకు నడుస్తున్న అద్భుత చైతన్యమూర్తి బాబా రామ్‌దేవ్. నిజమైన సన్యాసి ఆత్మోద్ధరణకుకాక సమాజోద్ధరణకు పాటుపడాలని అన్న స్వామి దయానంద సరస్వతి అడుగుజాడల్లో నడుస్తూ సమకాలీన సమాజాన్ని ప్రేరేపిస్తున్న ఆధ్యాత్మిక గురువు రామ్‌దేవ్. భారత స్వాభిమాన్ కార్యక్రమంలో దేశంలో ఉన్న 600 జిల్లాలు, 2లక్షల గ్రామాలు సమరోత్సాహంతో కదంతొక్కి పదం కలపాలని ఆయన ప్రబోధిస్తుంటారు. ఇప్పటికే ఈ కార్యక్రమంతో మమైక్యమై పనిచేసే వారి సంఖ్య 10 లక్షలు దాటింది. పతంజలి యోగ సమితి ద్వారా ఆయన నిత్యం లక్ష యోగ తరగతులు నిర్వహిస్తూ లక్షల మందికి ఆరోగ్యాన్ని పంచుతున్నారు. మూడు రోజుల పర్యటనకై నిజామాబాద్ జిల్లాకు వచ్చిన రాందేవ్‌బాబా మనతెలంగాణతో ముచ్చటించారు. ఆ వివరాలు మీకోసం…

ఆయురారోగ్యాల యోగా:ప్రాచీన భారతీయ జీవన విధా నం ఎంతో గొప్పది. ప్రపంచానికి స్ఫూర్తినిస్తున్నది. ఆధునిక యు గంలో మానవుడు లేచింది మొదలు పడుకునే వరకు అనేక ఆందోళనలతో, మానసికంగా, శారీరకంగా కృంగిపోతున్నాడు. మానవుడికి ఆత్మవిశ్వాసాన్ని ఆయుష్షు పెంచే యోగాను నిత్యం సాధన చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా ధైర్యం, ధృడత్వం కలుగుతాయి.
ఆధ్యాత్మిక భారత్ కోసం: అనారోగ్యాలు రాకుండా చూడాలన్న లక్షంతో నిరంతర సాధనతో సంపూర్ణ ఆరోగ్యం, ఆధ్యాత్మిక భారత్ నిర్మాణమే లక్షంగా ప్రతిఒక్కరూ కృషి చేయాలి. అనారోగ్యాలులేని సమాజం నిర్మించుకోవాలి. స్వదేశీ ధర్మం, స్వదేశీ కట్టుబొట్టు, సంస్కృతి, భాష, సామాజిక విధానమే మనకు జీవకళనిస్తాయి. పతంజలి యోగా సమితి ద్వారా లక్ష మంది విద్యార్థులకు ఉచిత విద్య, వైద్యసేవ, చికిత్స, గోసేవ వంటి కార్యక్రమాల్లో శిక్షణ ఇస్తున్నాం. రోగ రహిత భారత్ కోసం, భారతీయ స్వాభిమాన్‌ట్రస్టు, పతంజలి యోగా పీఠ్, సంయుక్త ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా యోగా శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం.
విదేశీజాఢ్యం పోవాలి:మనదేశానికి స్వాతంత్య్రం రాకముందు విదేశీవస్తువులను బహిష్కరించాం. స్వాతంత్య్రం వచ్చాక విదేశీ వస్తువులను విపరీతంగా వినియోగిస్తున్నాం. ఇటీవలి కాలంలో అది ఇంకా పెరిగిపోయింది. విదేశీ కంపెనీల అధిపత్యం తగ్గించడం కోసమే దేశవ్యాప్తంగా పతంజలి సంస్థ ద్వారా ఉత్పత్తులు అమ్మకాలు ప్రారంభించాం. ఇప్పటికే 10
వేలకు పైగా ఉత్పత్తులు పతంజలిలో అందుబాటులో ఉన్నాయి. వచ్చే ఏడాది నుండి వస్త్రాల తయారీ, అమ్మకాలు చేపడతాం.
పసుపుబోర్డు తెస్తాం:జాతీయ పసుపుబోర్డును నిజామాబాద్‌లో ఏర్పాటు చేయడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాం. ఈ విషయంలో నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కవిత పట్టుదలతో కృషి చేస్తున్నారు. ఈ ప్రాంతంలో అత్యధికంగా పసుపు పండించే రైతులకు పసుపు బోర్డు ఏర్పాటు ఎంతో ఉపయోగకరం. పసుపు సౌభాగ్యానికి చిహ్నం. ఆ పసుపు పండిస్తున్న రైతులకు న్యాయం జరగాలంటే, పసుపు బోర్డు ఏర్పాటు కావాలి. ఈ విషయమై ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి లేఖ రాశాను. రైతులకు అనేక సంక్షేమ పథకాలు ప్రకటించి అమలు చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆదర్శంగా నిలుస్తున్నారు. తెలంగాణాను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారు. కేంద్ర ప్రభుత్వం రాయితీలు కల్పిస్తే, నిజామాబాద్ జిల్లాలో పసుపు, స్వీట్ కార్న్, బత్తాయి, జొన్న, వరి, మామిడి తదితర పంటలకు సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ పంటలతో ఎక్కువ కష్టం, తక్కువ లాభం. అయినా రైతుల సంక్షేమం కోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. నిజామాబాద్ జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటుచేసేందుకు నందిపేట, మాక్లూర్ మండలాల మధ్యన ఉన్న లక్కంపల్లి ప్రాంతాన్ని పరిశీలించాం. ఈ యూనిట్ కోసం రైతులకు రాయితీలు కల్పించాలన్నది నా భావన.
విదేశీపెట్టుబడులకు : విదేశీ ప్రత్యక్షపెట్టుబడులను అనుమతించడం మంచిదికాదు. పతంజలి సంస్థను విస్తరించేందుకు ఆర్థిక సహకారం ఎవరు అందించినా స్వీకరిస్తాం. అలాచేయడం తప్పు కాదు. స్వదేశీ వస్తువుల గురించి మాట్లాడే మీరు అమెజాన్, పేటిఎం వంటి అంతర్జాతీయ సంస్థలను ఆశ్రయించడమేమిటి అని ఈ మధ్య కొందరు నన్నడుగుతున్నారు. తప్పేముంది? అవి అంతర్జాతీయ సంస్థలైనా మన సరుకులను కూడా అమ్ముతున్నాయి కదా! అనతికాలంలోనే అందరి మన్ననలు అందుకున్న పతంజలి సంస్థను లాభాపేక్షలేని సంస్థగా మార్చేస్తా..అందువల్ల ఆ సంస్థ సంపాదించే ఆదాయమంతా సమాజానికే చెందుతుంది. ఈ సంస్థ సేవల ఫలితం జనసామాన్యానికే అందుతుంది.