Home లైఫ్ స్టైల్ భం భం భోలేషా

భం భం భోలేషా

bole

సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక స్టైల్… క్లాస్ మాస్ మెలోడీ ఏదైనా సరే అవలీలగా అందించేయగలడు… తెలంగాణ పాటలతో ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుని, తనకంటూ ఓ  ఇమేజ్‌ను సొంతం చేసుకున్న తెలంగాణ జానపద కళాకారుడు, టాలీవుడ్ సంగీత దర్శకుడైన వరంగల్ బిడ్డ షేక్ భోలేషావలి. తన ప్రస్థానాన్ని విజేతతో పంచుకున్నాడు.. 

* భోలె అంటే మీ ఇంటి పేరా..?
కాదు నా పేరే భోలె షావలి. ఇంటి పేరు షేక్ భోలే షావలి. అది దర్గా పేరు. భోలె, బాంబే భోలె అని పిలుస్తుంటారు.
* సంగీతం ఎక్కడ నేర్చుకున్నారు. మీ గురువు ?
ముంబయిలో సంగీతం నేర్చుకున్నాను. హిందీ సినిమా సంగీత దర్శకుడు నదీమ్ శ్రావణ్ నాగురువు. సాజన్, ధడ్‌కన్, రాజాహిందుస్థాని వంటి సినిమాలకి సంగీతం అందించారు.
* తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ జన్మించారు.?
మాది వరంగల్ జిల్లా . ఇప్పుడు మహబూబాబాద్ జిల్లా. పెనుకొండ గ్రామంలో పుట్టి పెరిగాను.
* మీ నేపథ్యం ..?
మాది వ్యవసాయ కుటుంబం. ఏడుగురు పిల్లలం. నలుగురు అన్నలు. ఇద్దరు చెల్లెళ్ల్లు అందరం చదువుకున్నాం. నేను గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకున్నా. చిన్నప్పటి నుంచీ పాటలంటే చాలా ఇష్టం. స్కూల్లో పాటలు పాడే వాడిని. పాడుతూ పాడుతూ నా పదవ తరగతి అయిపోంది. అదే సమయంలో అక్షర దీపిక అనే కార్యక్రమాలొచ్చాయి. అందులో పని చేయడం. ఎపిఎన్‌ఎమ్ ఆంధ్ర ప్రజా నాట్యమండలి వంటి వాటిలో కూడ కొంతకాలం పని చేశాను. ఆ తరువాత ఫోక్( జానపదం) ప్రోగ్రాములు చేశాను.
* తెలంగాణ పాటలు అనగానే మీరే గుర్తొస్తారు.. ?
తెలంగాణ అవతరించిన తరువాత నాకు బతుకమ్మ, బోనాల పాటలు పా డాను. బోనాలు జాతర పాటలతో నాకు అంత పేరు రావడం చాల సంతోషంగా ఉంది.
* మీకు అవకాశాలు ఎలా వచ్చాయి.?
నేను డిగ్రీ చదవడానికి హైదరాబాద్ వచ్చాను. సిటి అకాడమీలో బిఎ పూర్తి చేశాను. మొదటగా tv9, 6tv లో పనిచేశాను. v6 చానల్ బతుకమ్మ, బోనాల పాటల ద్వారా నేను చాల ఫేమస్ అయ్యాను. రచయిత కందికొండ గారు నన్ను పిలిపించి v6 కి పరిచయం చేశారు. చక్రి గారి తర్వాత నేను మంచి సంగీత దర్శకుడినని అంటారు. చక్రి గారితో నన్ను పోల్చడం నాకు ఆనందాన్ని ఇస్తుంది.
* చదువు కాదని సంగీతం వైపు ఎందుకొచ్చారు.. ?
స్కూలు కాలేజీలో ఏవైనా ఉత్సవాలు జరిగితే, క్లాస్ టీచర్ రాకపోయిన నాతో పాటలు పాడించేవారు. ఖాళీ సమయం దొరికితే హాస్టల్లో చదువుతున్నపుడు బట్టల పెట్టెలను బ్యాండ్, తబలాగా ఊహించుకుని రిథమ్ కొట్టేవాణ్ణి. అలా నాకు చిన్నతనంలోనే సంగీతం, పాటల మీద ఆసక్తి పెరిగింది.
* టాలీవుడ్‌లో ఎలా ఎంట్రీ అయ్యారు?
నేను ఒక కళాకారుణ్ని నాకు ప్రతిభ ఉంది అని పట్టుదలతో ప్రయత్నం చేశా ను. కృష్ణానగర్‌లో రూమ్ తీసుకుని అవకాశాల కోసం ఎదురు చూస్తున్నపు డు, రావెపల్లి రాంబాబు నా పాటవిని ఆయన ఇంట్లో ఉండమన్నాడు. కొంత కాలం ఆయనే నాకు అన్నం పెట్టారు. సాయి సుధాకర్ నాయుడు వంటి వా ళ్ల సహాయంతో ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను.
* ఎన్ని సినిమాలకు సంగీతాన్నందించారు ?
20 సినిమాలకు సంగీతాన్ని ఇచ్చాను. మొదటి సినిమా రామ్- లక్ష్మణ్ తీసిన ఒక్కడే గాని ఇద్దరు, ధనలక్ష్మీ తలుపుతడితే, సాగరతీరంలో.. వంటి సినిమాలకు సంగీతం అందించాను. రవితేజ కిక్ 2 సినిమాలో మమ్మి కడుపులో అంటూ, ఒక పాట కూడ పాడాను.
* ఇప్పటి వరకు మీరు ఎన్ని ఆల్బమ్స్ చేశారు.?
చాలా ఆల్బమ్స్ చేశాను. ఎక్కువగా తెలంగాణ పాటలే చేశాను.
* లిరిక్స్ కూడ రాస్తారా?
రాస్తాను చాలా రాశాను కూడా. కిక్ 2లో మమ్మీ మమ్మీ పాటకు లిరిక్స్ నేనే రాశాను. ఆ పాట పెద్ద హిట్టయింది.
* ముందు బాలీవుడ్‌కి వెళ్లి .. మళ్లీ టాలివుడ్‌కి రావడానికి కారణం..?
టాలీవుడ్‌కి రావడానికి మా అమ్మ కారణం. తెలుగులో అయితేనే మా అమ్మకి ఇష్టం. ముందు తెలుగు సినిమాలే చేయి. బాలీవుడ్ అంటే సముద్రం లాంటిది. చాలా పెద్డది కష్టమైన పని కాబట్టి ముందు టాలీవుడ్ లాంటి చిన్న చెరువులో నేర్చుకోవాలి అని చెప్పింది. తెలుగు వాడివి కాబట్టి నీ సొంత ఊర్లో చేసినట్టుంటది. నీ సంగీతం నీ పాటలు తొందరగా ప్రజలకు చేరువవుతాయి. నువ్వు కూడ తక్కువ సమయంలో మంచి పేరు సంపాదిస్తావు అని చెప్పింది.
* వెస్ట్రన్‌లో ఫోక్‌ను మిక్స్ చేస్తారు…ఈ ఆలోచన ఎలా వచ్చింది?
ప్రజలకు కొత్తదనం చూపించాలి. సంగీతంలో ప్రయోగాలు చేయడం అనేది సహజం. ఇంత వరకు ఎవరూ రాయని చేయని పద్ధ్దతిలో కొత్త ట్యూన్ కొత్త లిరిక్స్ రాయాలి. అందులో భాగంగానే వెస్ట్రన్‌లో ఫోక్ మిక్స్ చేశాను. మంచి స్పందన వచ్చింది.
* చక్రితో మీ పరిచయం?
ఆయన స్టూడియో నా స్టూడియో పక్క పక్కనే ఉన్నాయి. ప్రతి రోజూ కలిసి మాట్లాడుకునే వాళ్లం. కాని నా మొదటి అల్బమ్ చక్రి, కందికొండ లక్ష్మణ్, నేను ముగ్గురం కలిసి అమృతవాణి స్టూడియోలో పండువెన్నెల అనే ఆల్బమ్ చేశాం.
* హాలీవుడ్ ఆల్బమ్ చేస్తున్నారుగా ఆ పని ఎంత వరకు వచ్చింది ?
చేస్తున్నాను తొందరలో పూర్తి చేసి విడుదల చేస్తా..
* సంగీతంలో స్పూర్తి.. ?
ఇళయరాజా
* మీరు పాడిన మొదటి సినిమా .?
శ్రీనిలయం
* 2016 లో V6 పాట చాలా పాపులర్ అయ్యింది కదా..?
నవ్వుతూ…. అవును ఆ పాట నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది.
* ఈ బోనాలకు మరో పాట వస్తుందా..?
గోరెటి వెంకన్న రాశారు. నేను మధుప్రియ గానం చేశాం. త్వరలో రిలీజ్ చేయబోతున్నాం.
* జానపదానికి భవిష్యత్తు ఉంటుందంటారా.?
జానపదం అంటేనే జనపదం. జనం బతికున్నంతకాలం జాన పదానికి ఢోకాలేదు. అలాగే అన్నం పెట్టిన వారిని మనం ఎప్పటికి మరిచిపోకూడదు.

 బొర్ర శ్రీనివాస్