Home లైఫ్ స్టైల్ పరకాయప్రవేశం చేసి రాస్తా

పరకాయప్రవేశం చేసి రాస్తా

తెలంగాణ అనుభవాల పాఠాలే జీవనవేదాలుగా, సామాజిక సమస్యలే సాహిత్య దొంతరలుగా పేరు గడిస్తున్న సినిమా పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ జీవితమే ఓ పోరాటం. తండ్రి సుద్దాల హన్మంతు పాటలతో ఉద్యమానికి బాటలుడుతూ పసులకాసే పిల్లవాడి ఆర్తిని, బాధను రాస్తే; అశోక్ తేజ ఒకటె మరణం.. ఒకటె జననం అంటూ పాటల రహదారుల్లో బండితోలుతున్న బహుదూరపు బాటసారి. నమస్తే అన్న చిత్రం ద్వారా తెలుగు సినీ తెరకి పరిచయమయ్యాడు. తనికెళ్ళ భరణి లాంటి వారి ప్రోత్సాహంతో సినిమా రంగంలో పాటల ప్రస్థానం ప్రారంభించాడు.ఒసేయ్ రాములమ్మా, నిన్నే పెళ్ళాడతా సినిమాలో పాటలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఠాకూర్ చిత్రంలో నేను సైతం  పాట జాతీయ ఉత్తమపాట పురస్కారాన్ని అందుకుంది. ఫిదా సినిమాలో రాసిన క్రీం బిస్కెట్ పాట ప్రపంచమంతటా 13 కోట్ల మంది ప్రజలు ఆద రించి చరిత్ర సృష్టించింది. తెలంగాణ సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తూ వేలాది పాటలు రాస్తున్న సుద్దాల అశోక్ తేజతో విజేత ఇంటర్వూ ..

suddala-ashok

* తెలంగాణ సాహిత్యంలో అద్భుతమైన సాహిత్యం ఉన్నా ఆశించినంత మేరకు ప్రజల్లోకి ఎందుకు వెళ్ళలేక పోయింది…
సమైక్య పాలనలో తెలంగాణ యాస, భాష, యాసలు నిరాదరణకు గురయ్యాయి. తెలంగాణ ఆవిర్భావం అనంతరం తెలంగాణ సాహిత్యానికి ప్రభుత్వం పట్టం కట్టింది. తెలంగాణ భాషా సాహిత్యం ఎంతో గొప్పది. ఇక్కడి జానపదుల భాషను మాండలికం అన్నవారు కళ్ళు మూసుకుని ఏనుగు తోకను పట్టుకుని అదే ఏనుగు అనుకుంటున్నారు. తెలంగాణ భాషను విమర్శించిన వారికి మందార మకరందాలు రాసిన పోతన, పాలకుర్తి సోమన కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. భాషాకిరీటంలో ఒదిగిన వజ్రం తెలంగాణ యాస అన్నారు.
* తెలంగాణ పాట,భాష, ఔన్నత్యంపై మీ అభిప్రాయం…
తెలంగాణ భాష మనిషి ఉన్నంతకాలం, మట్టి ఉన్నంత కాలం, ఆకాశం ఉన్నంతకాలం, అవసరం ఉన్నంతకాలం కవుల కలాల్లో, చిత్రకారుల కుంచెల్లో, తెలంగాణ కళారూపాల్లో, శిలుల ఉలుల్లో సవ్వడి చేస్తూనే ఉంటుంది.
* బాల్యం నుంచి మీలో ఉన్న సామాజిక ప్రేరణకు కారణం…
ప్రజాకవి సుద్దాల హన్మంతు కొడుకుగా బాల్యం నుంచి సమాజాన్ని అర్థం చేసుకునే అవకాశం లభించింది. గుండాల మండలం సుద్దాలలో పుట్టిన నేను ఆనాడే జెండా గురించి కవిత్వంలో పొందుపరిచాను. ఆ తర్వాత సినారే ప్రేరణతో పాటలు రాస్తున్నాను. ఇప్పటివరకు 3,500 పాటలు రాయడంతో పాటు ఊరూరా శ్రమకావ్యం గానం చేస్తున్నాను. మాతృదేవోభవ సినిమాలో రాసిన పాటలు నన్ను ఎక్కడికో తీసుకు వెళ్ళాయి. ఒకటె జననం, ఒకటె మరణం పాట ప్రజల్లో ఎంతో ప్రాచుర్యం పొందింది. ఆ తరువాత ఫిదా సినిమాలో క్రీం బిస్కెట్ పాట యూట్యూబ్ లో పెడితే నాలుగు కోట్ల లైకులు వచ్చాయి. నాటి ఉద్యమాల్లో నాన్నతో నడిచిన సన్నిహితులను నేను ఏనాడు మర్చిపోను. భాషను నేర్పిన గురువులు అంతరంగంగా నన్ను ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటారు. అశోక్ తేజ ‘ఆడదాన్నిరో నేను ఆడదాన్నిరో నేను ఈడ ఎవనికి కానిదాన్ని ఏడిదాన్నిరా’ అనే పాట రాసిండు. సుద్దాల హనుమంతు కొంతవరకు రాసి వదిలివెళ్లిన ఈర

* తెలంగాణ యక్షగానాన్ని పూరించాడు అశోక్‌తేజ. ప్రజాకవి హన్మంతు కొడుకైన మీరు సినారే ను ఎందుకు ఆదర్శంగా తీసుకుంటారు…
తెలుగు చలనచిత్ర రంగంలో పాత్రలకు అనుగుణంగా పాటలు రాయాల్సి ఉంటుంది. ఒక పోరాటమే కాదు జాలి, కరుణ,ప్రేమను ప్రదర్శించాల్సి ఉంటుంది. పాత్రలకు అనుగుణంగా పరకాయప్రవేశం చేసే సినారే నాకు ఆదర్శం. సినారే లోని కవితా మాధుర్యం ఎప్పుడూ సువాసనలు వెదజల్లుతూనే ఉంటుంది. ఆయన ఉన్నా..లేకున్నా.
* గీతం విశ్వవిద్యాలయం డాక్టరేటు ఇచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు….
మంచి సాహిత్యాన్ని మరింత సృష్టించాలనే బాధ్యత పెరిగింది. అందుకే తెలుగు సినీ పాటల్లోని విభిన్న కోణాలను ఎప్పటికప్పుడు సృజిస్తుంటాను. మంచిసాహిత్యం వచ్చినప్పుడు ఎంతో ఆనందపడతాను. సినిమాపాటల రచనలు వ్యాపార కోణంలోనే సాగుతుంటాయి. నిర్మాత, దర్శకుడు, సంగీత దర్శకుడు ప్రజలను మెప్పించ గలిగితేనే పాటలరచయితకు సినిమాల్లో గుర్తింపు వస్తుంది.1200ల చిత్రాల్లో 3,500 పాటలు రాసిన నాకు ఇంకా ఏదో వెలితి కనిపిస్తుంటుంది. మంచి పాటలు రాయాలని నిరంతరం అన్వేషిస్తూనే ఉంటాను. విభిన్న పాత్రలకు పాటలు రాసేటప్పుడు మనసు పొరల్లో ఘర్షణ ప్రారంభమవుతుంది. ఆ ఘర్షణల్లో రాసే పాటలు ఆణిముత్యాలుగా ప్రజల్లోకి వెళతాయి. ఒక పాటను ప్రజలు ఆదరించగానే ఎంతో ఆనందంతో మరో పాట రాయాలనిపిస్తుంది. సినిమా పాటల రచయిత నిరంతర సాహిత్య అన్వేషి.
* నిర్మాతల కోరికమేరకు, సంగీత దర్శకుని బాణీలకు అనువుగా పాటలు రాయాల్సి ఉంటుందా…
దర్శకుడు చెప్పే కథకు అనువుగా పాత్రల్లో జీవం పోస్తూ పాటలు రాయాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో రాసి రెడీగా ఉన్న పాటలను చిత్రీకరిస్తుంటారు. దాసరి నారాయణరావు ఒసే రావులమ్మ చిత్రంకోసం ముందుగానే పాట రాశాను, ఆ తర్వాత దాసరి ఆ పాటకు అనువుగా చిత్రీకరించారు.

  వి.భూమేశ్వర్