Home సినిమా మ్యూజిక్ డైరెక్టర్ కాకపోతే క్రికెటర్‌ను అయ్యేవాడినేమో

మ్యూజిక్ డైరెక్టర్ కాకపోతే క్రికెటర్‌ను అయ్యేవాడినేమో

taman

సౌత్ సినీ ఇండస్ట్రీలోని టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్ ఒకరు. తెలుగులోని స్టార్ హీరోలందరితో సినిమాలు చేసి మ్యూజికల్ హిట్స్‌ను అందించారు ఆయన. ప్రస్తుతం బివిఎస్ రవి దర్శకత్వంలో సాయిధరమ్‌తేజ్ హీరోగా చేసిన ‘జవాన్’ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఇక తమన్ గురువారం తన బర్త్‌డేను జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా తమన్‌తో ఇంటర్వూ విశేషాలు… 

 స్టార్ హీరోలు అందరితో…
కెరీర్‌లో మ్యూజిక్ డైరెక్టర్‌గా ఇప్పటివరకు దాదాపు 70 సినిమాలు చేశాను. తెలుగులో ఎన్టీఆర్‌తో నాలుగు సినిమాలు, మహేష్‌బాబుతో మూడు సినిమాలు, రవితేజతో ఎనిమిది సినిమాలు, రామ్‌చరణ్‌తో రెండు, బన్నీతో రెండు సినిమాలు చేశాను. టాలీవుడ్‌లోని స్టార్ హీరోలు అందరితో సినిమాలు చేయడం ఆనందంగా ఉంది.
బర్త్‌డే స్పెషల్‌గా…
సాయిధరమ్‌తేజ్ హీరోగా నటించిన ‘జవాన్’ చిత్రానికి ఐదు పాటలు అందించాను. వీటిలో ఇప్పటికే మూడు పాటలు రిలీజయ్యాయి. గురువారం నా బర్త్‌డే స్పెషల్‌గా నాలుగో సాంగ్ విడుదలకానుంది. ఈ సినిమాలో ఇంట్రడక్షన్ సాంగ్ మాత్రం పేటియాట్రిక్ సాంగ్‌గా ఉంటుంది. మిగతావన్నీ కమర్షియల్ సాంగ్సే.
 రాశి మంచి సింగర్…
హీరోయిన్ రాశీఖన్నా మంచి సింగర్. ఆమె ‘జిల్’లోని పాటను అద్భుతంగా పాడింది. ‘జవాన్’లోని ఓ పాటను రాశీతో పాడించాము. ఆమె చక్కగా పాడింది. ఆ పాట హైలైట్‌గా ఉంటుంది.
పాటలకు మంచి ప్రమోషన్…
ఆడియోను విడుదల చేయడంతో సినిమాలోని పాటలన్నీ ఒకేసారి రిలీజయ్యేవి. కానీ ఇప్పుడు ఒక్కొక్క పాట రిలీజ్ అవుతుంది. దీంతో పాటలకు మంచి ప్రమోషన్ జరుగుతోంది. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ప్రతి నెలా వందకు పైగా కొత్త పాటలు వింటున్నారు ప్రేక్షకులు.
 సినిమా విజయంలో మ్యూజిక్…
ప్రతి సినిమాకు మ్యూజిక్‌కు మంచి స్కోప్ ఉంటుంది. ప్రతి ఫిల్మ్‌మేకర్ సినిమాను హిట్ చేయాలనే చూస్తాడు. సినిమా విజయంలో పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎంతగానో తోడ్పడతాయి.
 హీరో చెట్టులాంటివాడు…
మన ఇండస్ట్రీలో హీరో సెంట్రిక్ సినిమాలే ఎక్కువగా వస్తాయి. హీరో చెట్టులాంటి వాడైతే మేమందరు కొమ్మల్లాంటివాళ్లం. ముఖ్యంగా కమర్షియల్ సినిమాల్లో హీరో క్యారెక్టరే ప్రధానంగా ఉంటుంది.
ఏ జోనర్ అయినా…
హర్రర్ సినిమాల్లో డైలాగులు తక్కువ కాబట్టి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు స్కోప్ ఎక్కువగా ఉంటుంది. కమర్షియల్ సినిమాల్లో సాంగ్స్‌కు స్కోప్ ఉంటుం ది. ఏ జోనర్ సినిమాల్లో అయినా మ్యూజిక్‌కు ప్రాధాన్యత ఉంటుంది.
మంచి అనుభవం…
కెరీర్ ప్రారంభంలో 64 మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గర పనిచేశాను. కీరవాణి, ఇళయరాజా, మణిశర్మ, రెహమాన్, ఆర్‌పి పట్నాయక్, చక్రి, దేవిశ్రీ ప్రసాద్‌లతో కలిసి పనిచేశాను. వారితో పనిచేయడం మంచి అనుభవాన్నిచ్చింది. రెహమాన్, ఇళయారాజాలను చూసి ఎంతో నేర్చుకున్నాను.

 నాకు ఇల్లు…
మ్యూజిక్ డైరెక్టర్‌గా స్టూడియోనే నాకు ఇల్లు. నా బర్త్‌డేను స్టూడియోలోనే సెలబ్రేట్ చేస్తాను. పుట్టినరోజు సందర్భంగా కొత్త ఎక్విప్‌మెంట్స్ కొంటాను. ఇక నేను పబ్‌లు, డిస్కోలకు వెళ్లాను.
ఆ రోజుల్లో క్రికెట్ గ్రౌండ్‌లోనే…
క్రికెట్ అంటే నాకెంతో ఇష్టం. మ్యూజిక్ డైరెక్టర్ కాకపోతే క్రికెటర్‌ను అయ్యేవాడినేమో. ఇక శని, ఆదివారాలు క్రికెట్ గ్రౌండ్‌లోనే గడుపుతాను. ఈ విషయం ఫిల్మ్‌మేకర్స్ అందరికీ తెలుసు.
లవ్‌స్టోరీస్ చేయాలనుకుంటున్నా…
లవ్ స్టోరీ మూవీస్ ఎక్కువగా చేయాలనుకుంటాను. ఇప్పటివరకు వైశాలి, లవ్ ఫెయిల్యూర్, జబర్దస్త్ వంటి కొన్ని లవ్ స్టోరీస్ సినిమాలు చేశాను. ఇక కమర్షియల్ సినిమాల్లో మంచి మెలోడి సాంగ్స్ ఇవ్వాలని అనుకుంటాను.
 ఆ ఆలోచన లేదు…
ఇటీవల ‘మహానుభావుడు’ చిత్రంలో సంగీత వాయిద్యాలతో ప్రయోగాలు చేశాను. అదేవిధంగా ‘రాజుగారి గది 2’లో కూడా ప్రయోగం చేయడం జరిగింది. వాటికి మంచి స్పందన వచ్చింది. ఇక సినిమాల్లో నటించమని కొందరు అడుగుతున్నారు. కానీ ఇప్పట్లో ఆ ఆలోచన లేదు.