Home కలం ‘కథానిక ఆలోచింపజేస్తుంది’

‘కథానిక ఆలోచింపజేస్తుంది’

klm2

గురజాడ, గిడుగు, శ్రీపాద, పాలగుమ్మి, బుచ్చిబాబు వంటి సాహితీ దిగ్గజాల జ్ఞాపకాల సేవలో తరించినవాడు ‘పాపం పసివాళ్ళు’గా అనాథ బాలల్ని గుండెలకు హత్తుకుని కలం నడిపిన వాడు. బయటి ప్రపంచానికి కానరాని యదార్థాలను జైలు లోపలికి వెళ్లి శోధించినవాడు. ‘కథానిక’ అనే సాహితీ ప్రక్రియనే ఆరోప్రాణంగా బ్రతుకు వెళ్ళదీస్తున్నవాడు. అష్టకష్టాల్లో ఉన్నా ఎందరికో ఆసరాగా నిలిచి కథానికా సాహిత్యానికి ఊతకర్రయై నిలుస్తున్నవాడు. నటుడిగా, జర్నలిస్టుగా, దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా పేరు గాంచినవాడు. పేజీ కథలు, కాలం కథలు, గల్పికలు, స్కెచ్‌లు, కల్పికలు, ఆత్మకథలు, పరిశోధనాత్మక కథలు, వైద్యరంగపు కథలు వంటి ఎన్నెన్నో సాహితీ ప్రక్రియల్ని స్పృశించి సుసంపన్నం గావించినవాడు. పాత్రికేయ వృత్తినుండి సాహిత్య సృజనాత్మక పాత్రను పోషించిన వాడు. ప్రసార మాధ్యమాలన్నింటిలో రాణించిన వాడైన కథానికల వైతాళికుడు వేదగిరి రాంబాబు విశిష్ట సాహితీసేవకు గుర్తింపుగా ఈనెల 6న గుంటూరులో అజోవిభోకందాళం ఫౌండేషన్ వారు ‘విశిష్ట సాహితీ మూర్తి జీవితకాల సాధన పురస్కారం’ అందించబోతున్నారు. ఆ సందర్భంగా మన తెలంగాణ ‘కలం’ పేజి ఆయనతో కాసేపు ముచ్చటించింది.

ప్ర : మీకు కథానికపై ఆసక్తి కలగడానికి కారణం?
జ: 1974 ప్రాంతంలో అనుకోకుండా విహారి గారి ఉపన్యాసం విన్నాను. తర్వాత ఆయనతో చనువు పెంచుకున్నాను. బందరు నవకళా టాకీస్ ఎదురుగా ఉన్న పార్క్‌లో విహారిగారితో పాటు సింగరాజు రామచంద్రమూర్తి, ఆదివిష్ణు, యర్రంశెట్టి సాయి, చందు సోంబాబు, పిశుపాటి ఉమామహేశ్వరమ్, విశ్వభరత్ లాంటి వారు రోజూ అక్కడ కలుసుకుని సాహిత్య చర్చలు సాగించేవారు. వాళ్లు పోటీపడి రాస్తుండేవారు. వారి స్ఫూర్తితో కథానికలు రాస్తుండేవాడిని. విహారిగారు, యర్రంశెట్టి సాయి రచనా మెలకువలు తెలిపారు. బందరులో డిగ్రీ పూర్తయ్యేనాటికి ఆంధ్రపత్రిక దీపావళి కథానికల పోటీలో బహుమతి కూడా పొందాను.
ప్ర: ఆకాశవాణితో మీ అనుభవాలు తెలుపుతారా?
జ: రేడియో అన్నయ్యగా ప్రసిద్ధులైన న్యాయపతి రాఘవరావుగారు నన్ను క్యాజువల్ ఆర్టిస్టుగా ఆకాశవాణి హైదరాబాద్ ద్వారా పరిచయం చేశారు. నాకప్పటికి 19 ఏళ్ళు. అనంతరం రేడియో అనౌన్సర్‌గా, రిపోర్టర్‌గా, డ్రామా వాయిస్ ఆర్టిస్ట్‌గా, డ్రామా ప్రొడ్యూసర్‌గా, న్యూస్ రీడర్‌గా వివిధ భూమికలు పోషించాను. ఆ సమయంలో పి.ఎస్.నారాయణ, పి.వి.ఆర్.శివకుమార్, మైనంపాటి భాస్కర్, తులసీ బాలకృష్ణ, పురాణం శ్రీనివాసశాస్త్రి, ప్రతాప రవిశంకర్ వంటి రచయితలమంతా కలివిడిగా ఉండేవాళ్ళం.
ప్ర : పత్రికారంగంలో మీ సేవ లెలాంటివి?
జ: ఆంధ్రభూమిలో ఏడేళ్లు సీనియర్ సబ్ ఎడిటర్‌గా చేశాను. ‘పల్లకి’ వారపత్రికకి కొంతకాలం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా చేశాను. ఆంధ్రభూమిలో వీక్లీతోపాటు సినిమా పత్రిక, మాస పత్రికను కూడా నేనే చూశాను. పల్లకిలో ఇచ్ఛాపురం జగన్నాధరావు, వీరాజీ వంటి వారితో కథలు రాయించాను. అప్పుడు బాపుగారు ఆ రెండు పత్రికలకు మంచి ఖ్యాతిని పెంచారు.
ప్ర : ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా మీ సాహిత్య కృషి ఎలాంటిది?
జ : ఆ కాలంలో ఆర్థికంగా చాలా కష్టపడ్డాను. చంచల్‌గూడా జైలును సందర్శించి వాళ్ళ కథనాలతో ‘జైలుగోడల మధ్య’ అనే పేరిట స్వాతిలో సీరియల్ కథనాలు రాశాను. వీధిబాలలు, అనాథబాలల వాస్తవ కథలతో ఆంధ్రభూమిలో, దూరదర్శన్‌లో ప్రసారితాలైనాయి. వాటికి నిర్మాత, దర్శకుడు, రచయిత బాధ్యతల్ని తీసుకున్నాను. నిర్మాతగా బంగారు నంది, దర్శకుడిగా నంది అవార్డును పొందాను. వరకట్నాలమీద వాస్తవ కథనాలుగా ‘అగ్నిసాక్షి’ రాశాను. అవీ ఆంధ్రభూమి, దూరదర్శన్‌లో వచ్చాయి. సమాజంలో నిరాదరణకు గురైన వారిగురించి ఆంధ్రప్రభలో ‘వీళ్లేమంటారు?’ అని వారిని స్వయంగా సంప్రదించి రాశాను. నేను రాసి, దర్శకత్వం వహించి, నిర్మించిన ‘అడవి మనిషి’ బాలల చిత్రానికి నంది అవార్డు లభించింది. ఇస్కాన్ (మధుర, బృందావనం), బ్రహ్మకుమారీస్ (మౌంట్ ఆబూ), స్వామి సమర్ధ (అక్కల్ కోట్), గాయత్రీ పరివార్(హరిద్వార్), గాడ్ గారు (వెదురుపాక) లాంటి క్షేత్రాలు దర్శించి అక్కడి సమాచారాలతో ఆయా ‘స్కూల్స్ ఆఫ్ థాట్స్’ని తెలుపుతూ డాక్యుమెంటరీగా చేశాను. అది దూరదర్శన్‌లో సీరియల్‌గా వచ్చింది. తర్వాత నా రచనా, దర్శకత్వాలతో ‘కథావీధి’పేరుతో, దిద్దుబాటు, కలుపుమొక్కలు, దాసరి పాట లాంటివి అట్లాగే విద్యావిషయక డాక్యుమెంటరీలు చేశాను. అవన్నీ దూరదర్శన్‌లో ప్రసారమైనాయి.
బాల సాహిత్యంలో తొలిసారిగా చిల్డ్రన్స్ వీడియో మేగజైన్‌ను 7 సంపుటాలుగా ‘ఇంద్రధనస్సు’ పేరుతో తయారు చేశారు. ఇవి దూరదర్శన్‌లో వచ్చాయి. కేంద్ర సాహిత్య అకాడెమీ పక్షాన 5 రోజుల కథానికా రచయితల కార్యగోష్టికి సంచాలకుడిగా నిర్వహించాను. 1991లో ‘నాలుగు శతాబ్దాల నగరం’ రాశాను. అది ఆకరగ్రంథం, అనేక భాషల్లోకి అనువాదమైంది. కడప, నరసరావు పేట పట్టణాల ప్రత్యేక చరిత్రా సంచికలకు సంపాదకత్వం చేశాను. పిల్లల కోసం రచనలు చేశాను. అందులో ‘మన హైదరాబాద్’, సంక్షిప్త ఆంధ్రుల చరిత్ర వంటివి ముఖ్యమైనవి.
వైద్య విజ్ఞాన రంగంలో ‘సీరీస్’ పుస్తకాలు రాశాను. ‘మన ఆరోగ్యం’ వంటి పత్రికల్ని ఎడిట్ చేశాను. ఉస్మానియా, తెలుగు , అంబేద్కర్ యూనివర్శిటీల్లో జర్నలిజం కోర్సులకు విజిటింగ్ ఫ్యాకల్టీ నైనాను. అనేక ప్రయోగాత్మక రచనల చేశాను. ఇప్పటివరకు 60 వరకు పుస్తకాలు రాయడం, 50కి పైగా సంపాదకత్వం వహించడం. యాభైకిపైగా వీడియో డాక్యుమెంటరీలు, 200కి పైగా ఆడియోలు నాటికలు, నాటకాలు, రూపకాలూ ఉన్నాయి.
ప్ర: కథ కథానికలకు తేడా చెప్పండి?
జ: కథ అందమైన అబద్దాల్ని కాల్పనికతో చెపుతుంది. కథానిక నిజజీవితానికి శిల్ప సమేతంగా అద్దం పట్టేది కథానిక అంటే నాకు అమితమైన ఇష్టం. ఆ ప్రక్రియను బతికించుకోవడానికై అనేక సదస్సులు నిర్వహించాను. డైరెక్టు కథలతో కొత్త కథ, సరికొత్త కథ, విన్నూత కథ, నవతరం కథానికా సంకలాల్ని తెచ్చాను. రచన, ఆహ్వానం వంటి పత్రికల సహకారంతో సాహితీ లోకంలో నవచైతన్యానికి నాంది పలికాను. ఆర్థికంగా నష్టపడినా భరించాను.
ప్ర: గురజాడ, గిడుగులంటే మీకెందుకంత ఇష్టం?
జ: మనుషులు కష్టసుఖాలు చెప్పుకునే భాషను గ్రంథరచనలో ఉండాలని తాపత్రయ పడినవారు వారిద్దరు. క్రియాశీలంగా గురజాడ కథానిక, నాటకం, కవితల వంటి పక్రియల్లో ఆధునికతను ప్రవేశపెట్టాడు. తన 52 ఏళ్ళ జీవితకాలంలోనే గొప్ప సాహితీసేవ చేశాడు. నిబద్ధత గలవాడు. విశ్వ మానవతావాది, గిడుగు వాడుకభాషకు పట్టంకట్టాడు. ఎంతో మంది ఛాందస సంప్రదాయ వాదుల నెదుర్కొని గెలిచి నిలిచాడు. అందుకే విజయ నగరంలో గురజాడ ఇంటిని స్వంత ఖర్చులతో బాగుచేయించాను. ఆయన దేశభక్తి గేయాన్ని పోరంకి వారి సహకారంతో 24 జాతీయ, అంతర్జాతీయ భాషల్లోకి అనువదింపజేసి ప్రచురించాను. అనేక చోట్లా సెమినార్లు నిర్వహించాను.
గిడుగు సాహిత్య మంతా సేకరించి తెలుగు అకాడెమీ ద్వారా ప్రచురింపజేశాను. సామల రమేష్ బాబుతో కలిసి పర్లాకిమిడి మొదలు గిడుగు అడుగు పెట్టిన అనేక చోట్లతో పాటు ఆయన మరణించిన చెన్నై వరకు సెమినార్లు పెట్టాం.‘గిడుగు పిడుగు’ గ్రంథం రాశాను. ‘సవర సంబంధి’కి సంపాదక, ప్రచురణ బాధ్యతల్ని నిర్వహించాను.
ప్ర:ఇంకా ఇతర సాహితీవేత్తలపై మీ అభిమానాన్నిచాటుకున్నారా?
జ: ఔనండీ! చాలా పేదరికంలో ఉండి కూడా శ్రీపాద వారిజన్మస్థలమైన రాజమండ్రిలో వారి నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్టింపజేశాను. ఆ తర్వాత దాన్నెవరూ పట్టింకోకుంటే దానికో వెల్ల గొడుగునీ ఏర్పరిచాను. జర్నలిస్టు వీరాజి రాసిన శ్రీపాద వారి మోనోగ్రాఫ్‌నీ ప్రచురించాను. శ్రీపాద మంచికథలు కు సంపాదకత్వం వహించాను. అట్లాగే, పాలగుమ్మి పద్మరాజు, బుచ్చిబాబు, కొనకళ్ళ వెంకటరత్నం గారల శత జయంతి ఉత్సవాల్ని నిర్వహించాను. పాలగుమ్మికి తిరుపతిలో విగ్రహం పెట్టించాను.
ప్ర: మీరు పాతతరం రచయితల్నే గౌరవిస్తారని అపప్రద ఉంది? ఏమంటారు?
జ : ఎవరన్నా రండీ! వేదగిరి కమ్యూనికేషన్స్ ద్వారా విహారి రచన కథాకృతి’ మూడు సంపుటాలు, ఇనాక్ గారి ‘దళితకథలు’ యర్రంశెట్టి హాస్య కథలు, కాలువ మల్లయ్య ‘నేలతల్లి’, శిరంశెట్టి కాంతారావు ‘మట్టి తాళ్ళవల’ కథానికా సంపుటాల్ని ప్రచురించాము. అట్లాగే బాలసాహిత్య కారులెందర్నో పోత్సహించాను.
ప్ర: నేటి యువరచయితలకు ‘కథానిక’ పక్షాన మీరిచ్చే సందేశం!
జ: ‘కథానిక’ రచన విస్మరించరానిది. అతి తక్కువ సమయంలో చదివించబడి, ఎక్కువ సమయంగా ఆలోచింపజేస్తుంది. అది ఆ ప్రక్రియ అంతస్సత్వం ఆ సజీవ ప్రక్రియ నేటియువతరం రచయితలు కాపాడతారనే ఆశ ఉంది.
ముఖాముఖి : డా. పల్లేరు, 9441602605