Home రాష్ట్ర వార్తలు స్పెషలాఫీసర్లకు మార్గదర్శకాలు రెడీ

స్పెషలాఫీసర్లకు మార్గదర్శకాలు రెడీ

రేపటి నుంచే విధుల్లోకి

Special-Officer

మన తెలంగాణ / హైదరాబాద్ : గ్రామ పం చాయతీల పదవీకాలం బుధవారంతో ముగుస్తున్నందున మరుసటి రోజు నుంచే స్పెషలాఫీసర్ల పాలన ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని మొత్తం 12,751 పంచాయతీల్లో రోజువారీ కార్యకలాపాలను నిర్వహించే నిమిత్తం ఇప్పటికే వివిధ శాఖల నుంచి స్పెషలాఫీసర్లుగా ఎంపిక చేసిన ఉద్యోగులకు నిర్దిష్టమైన మార్గదర్శకాలను పంచాయతీరాజ్ శాఖ రూపొందించింది. ఎక్కువ జనాభా ఉ న్న పంచాయతీలకు తహసీల్దా రు, సూపరింటెండెంట్ లాం టి గెజిటెడ్ అధికారుల స్థా యి ఉద్యోగులను స్పెషలాఫీసర్లుగా ఎంపిక చేసి తక్కువ జనాభా ఉన్నవారికి సీనియర్ అసిస్టెం ట్, రెవిన్యూ ఇన్‌స్పెక్టర్ స్థాయి వరకు ఎంపిక చేసినట్లు ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అయితే విద్యా శాఖ నుంచి మాత్రం ఇందుకోసం ఎవ్వరినీ తీసుకోలేద ని, విద్యార్థులకు ఇబ్బంది రావద్దనే ఉద్దేశంతోనే ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. స్పెషలాఫీసర్లుగా ఎంపికైన ఉద్యోగులు వారి శాఖలోని ప్రధాన బాధ్యతల కు అదనంగా పంచాయతీల వ్యవహారాలను చూస్తారని, ఆయా పంచాయతీల్లో చేపట్టాల్సిన పనులకు సంబంధించి గ్రామాభివృద్ధి ప్రణాళికలు కూడా సిద్ధమైనట్లు వివరించారు.

కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పారిశుద్యం, పచ్చదనం, విద్యుత్‌దీపాలపై ప్రధాన దృష్టి సారించనున్నట్లు తెలిపారు. తొలిసారి స్పెషలాఫీసర్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్నవారికి తగిన అవగాహన కల్పించే నిమిత్తం త్వరలో జిల్లా స్థాయిలో శిక్షణా శిబిరాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. స్పెషలాఫీసర్ల బాధ్యతలు, విధులు తదితరాలకు సంబంధించి రూపొందించిన మార్గదర్శకాల్లో నిర్దిష్టంగా ఒక్కో అంశం గురిం చి వివరించినట్లు ఆయన తెలిపారు. కొత్తగా ఉనికిలోకి వచ్చిన గ్రామ పంచాయతీల్లో కార్యాలయాలు లేనందు న తాత్కాలికంగా అద్దె భవనాలను వినియోగించుకోనున్నట్లు ఒక ప్రశ్నకు స మాధానంగా తెలిపారు. వీలైనంత వరకు ప్రభుత్వానికి చెందిన అంగన్‌వాడీ తదితర భవనా లను వినియోగించుకుంటామని, అందుబాటులో లేనట్లయితే ప్రైవేటు భ వనాలను అద్దెకు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ బాధ్యతలను జిల్లా, మండలస్థాయి అధికారులకు అప్పజెప్పిన ట్లు తెలిపారు. స్పెషలాఫీసర్లుగా బాధ్యతలు నిర్వహించ డం పెద్ద కష్టమేమీ కాబోదని వివరించిన ఆ ఉన్నతాధికా రి, సర్పంచ్ స్థానంలో గ్రామాభివృద్ధి ప్రణాళికకు అనుగుణంగా క్రిందిస్థాయి సిబ్బందికి దిశానిర్దేశం చేస్తారని, జనాభాకు అనుగుణంగా క్రిందిస్థాయిలో ఎంత మంది సిబ్బందిని నియమించాలనేదానిపై ఇప్పటికే స్పష్టత వ చ్చిందని తెలిపారు. త్వరలో కొత్తగా ఉనికిలోకి రాబోయే పంచాయతీ కార్యదర్శులంతా స్పెషలాఫీసర్ల కిందనే పనిచేస్తారని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

 పంచాయతీ కార్యదర్శుల రెగ్యులరైజేషన్

ప్రతీ పంచాయతీకి ఒక కార్యదర్శి తప్పనిసరిగా ఉండే లా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గ్రామీణాభివృద్ధికి మంచి పరిణామమని వ్యాఖ్యానించిన ఆ ఉన్నతాధికారి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్న ఈ పోస్టులకు వారి పనితీరు ఆధారంగా మూడేళ్ళ తర్వాత క్రమబద్ధీకరిస్తామని స్పష్టం చేశారు. ఈ విధానం ప్రస్తుత పంచాయతీ కార్యదర్శులకు మాత్రమే పరిమితం కాదని, ఐఏఎస్ స్థా యివారికీ ఉందని అన్నారు. మూడేళ్ళ ప్రొబేషన్ కాలం లో వారు పనితీరును మెరుగుపర్చుకుంటారని, లేనిపక్షంలో నిర్ణయం ఏంటో వారికే తెలుసునని నొక్కిచెప్పా రు. అయితే దీన్ని కాంట్రాక్టు ప్రాతిపదికన నియమిస్తున్నట్లు ఏ మాత్రం భావించాల్సిన అవసరం లేదన్నారు. ఐఏఎస్ సహా అనేక స్థాయి ఉద్యోగులకు ఈ విధానం అ మలులోనే ఉందని, ఇప్పుడు కొత్తగా వచ్చిందేమీ కాదన్నారు.

కొత్త మున్సిపాలిటీలకూ స్పెషలాఫీసర్లు

కొత్తగా మున్సిపాలిటీలుగా మారిన పూర్వ గ్రామ పంచాయతీలకు సైతం ప్రభుత్వం ప్రత్యేకాధికారులను, ఇన్‌ఛార్జి కమిషనర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకాలం గ్రామ పంచాయతీలుగా ఉన్న కొన్ని గ్రామాలు తాజాగా మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ కావడంతో బుధవారం వరకు మాత్రమే అవి పంచాయతీలుగా కొనసాగనున్నాయి. గురువారం నుంచి అవి మున్సిపాలిటీలుగా మారుతున్నందున వాటికి ఆయా మండలాలకు చెందిన తహసీల్దార్లు, ఎండిఓలు మున్సిపల్ కమిషనర్లు (ఇన్‌ఛార్జి)గా వ్యవహరించనుండగా ఆర్‌డిఓలు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు ప్రత్యేకాధికారులుగా విధులు నిర్వర్తించనున్నారు. ఈ విధంగా మొత్తం 22 జిల్లాల పరిధిలోని 61 మున్సిపాలిటీలకు నియమించింది. ఇవన్నీ తదుపరి ఎన్నికలు జరిగి ప్రజలచేత మున్సిపల్ ఛైర్‌పర్సన్లు, కౌన్సిలర్లు ఎన్నికయ్యేంత వరకు ప్రత్యేకాధికారుల పాలన కొనసాగనుంది.