Home తాజా వార్తలు సిరిసిల్లను’ సిరుల ఖిల్లాగా’ మార్చిన కెటిఆర్

సిరిసిల్లను’ సిరుల ఖిల్లాగా’ మార్చిన కెటిఆర్

Special Report on KTR Sircilla Development

సిరిసిల్ల ః తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధికి మారుపేరుగా సిరిసిల్లను రాష్ట్ర మాజి ఐటి, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆదర్శంగా నిలిపారు. సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగో పర్యాయం 89,009 ఓట్ల భారీ మెజార్టితో గెలిచి మరో సారి మంత్రి వర్గంలో కెటిఆర్ ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ నెల 19న మంత్రి వర్గ విస్తరణలో కల్వకుంట్ల తారక రామారావుకు బెర్త్ ఖాయమని తేలిపోయింది. సిరిసిల్ల నుండి నాలుగో సారి గెలిచిన కెటిఆర్ సిరిసిల్లను అభివృద్ధికి కేరాఫ్‌గా నిలిపారు. అభ్యుదయ భావాలు ఉంటే అభివృధ్ధి చేయాలనే సంకల్పముంటే తాము ప్రాతినిద్యం వహించే ప్రాంతాన్ని ఎలా అభివృధ్ధి పర్చవచ్చో కల్వకుంట్ల తారక రామారావు చేసి చూపించడానికి సిరిసిల్ల ప్రాంతం ఒక మచ్చు తునక. కెటిఆర్ సిరిసిల్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి దశాబ్దాలుగా పలు కారణాల వల్ల కార్మికుల ఆత్మహత్యలతో నిరంతరం వార్తల్లో నిలుస్తూ ప్రపంచం దృష్టిలో సిరిసిల్ల కాదది ఉరిసిల్ల అని ముద్రబడ్డ సిరిసిల్ల ను తన మేధో మధనం ద్వారా అభివృధ్ధికి దారులు వెదికి తనదైన తీరులో ముందుకు సాగి సిరిసిల్లను సిరుల ఖిల్లాగా మార్చి ఆత్మహత్యలకు, ఆకలిచావులకు మారుపేరుగా నిలిచిన సిరిసిల్ల నేతన్నల కుటుంబాల్లో ఆనందపు సిరుల జల్లును కురిపించడానికి కెటిఆర్ పడిన తపన, శ్రమ అనితర సాధ్యం.

ఆయన తీసుకున్న నిర్ణయాలు సిరిసిల్ల ప్రజల్లో, నేతన్నల్లో ఆత్మస్థైర్యాన్ని నింపి భవిష్యత్తుపై భరోసాను కల్పించాయి. అందుకే 2018 డిసెంబర్ ఎన్నికల్లో అధికార పార్టీ నేతలే కాదు మీడియా, ప్రత్యర్థులు కూడా ఊహించని మెజార్టీని కెటిఆర్ స్వంతం చేశారు. ఒకప్పుడు ఆత్మహత్యలకు మారుపేరుగా నిలిచిన సిరిసిల్ల నేడు రాష్ట్రంలో అభివృద్ధికి మారుపేరుగా నిలవడానికి కెటిఆర్ చొరవే కారణమని ఘంటాపథంగా చెప్పుకోవచ్చు. సిరిసిల్ల నియోజకవర్గం అభివృద్ధికి మంత్రిగా కెటిఆర్ ఇప్పటి వరకు 6 వేల కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడంతో పాటుగా, 1,000 కోట్ల రూపాయలకు పైగా సంక్షేమ కార్యక్రమాలకు కేటాయించడం విశేషం. సిరిసిల్ల నియోజక వర్గంలో వ్యవసాయ రంగం అభివృద్ధికి సాగునీటి ప్రాజెక్ట్‌ల నిర్మాణం, చెరువుల అభివృద్ధి, నాణ్యమైన నిరంతర ఉచిత విద్యుత్ సరఫరా, సబ్‌స్టేషన్ల నిర్మాణం, గోదాముల నిర్మాణం, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, వ్యవసాయ యాంత్రీకరణకు ట్రాక్టర్లు, ఇతర పనిముట్ల పంపిణీ, పాడిపరిశ్రమ, మత్స పరిశ్రమ అభివృద్ధితో పాటు సిరిసిల్ల నేతన్నల సంక్షేమం కోసం మరమగ్గాల ఆధునీకరణ, టెక్స్‌టైల్ పార్కు, అపెరల్ పార్కు, గ్రూప్ వర్క్‌షెడ్, కామన్ ఫెసిలిటీ సెంటర్, కార్మికులకు నిరంతర ఉపాధికి ప్రభుత్వపు అవసరాలకు వినియోగించే గుడ్డ ఉత్పత్తి ఆర్డర్లు ఇవ్వడం వంటి అనేక చర్యలు మంత్రి కెటిఆర్ తీసుకోవడం స్థానికుల అభిమానానికి కెటిఆర్‌ను పాత్రున్ని చేసింది.

తెలంగాణలోని 95 లక్షల మంది ఆడపడుచులందరికి బతుకమ్మ చీరెలు ఇవ్వడానికి సిఎం కెసిఆర్ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో సిరిసిల్లలోనే బతుకమ్మ చీరెల కోసం నిరంతరంగా పవర్‌లూంలు గుడ్డను 2019లో కూడా ఉత్పత్తి చేస్తున్నాయి. బతుకమ్మ చీరెలు, బ్లౌజుల కోసం అవసరమైన గుడ్డను సిరిసిల్లలోనే తయారు చేసేందుకు రాత్రింబవళ్లు కార్మికులు పనిచేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మంత్రి కెటిఆర్ నిరంతర చింతనలోంచి పుట్టుకొచ్చిన ఆలోచనే బతుకమ్మ చీరల తయారీకి సిరిసిల్ల నేతన్నలకు ఆర్డరివ్వడం. సిరిసిల్లలో సుమారు 30 వేలకు పైగా పవర్‌లూంలు ఉండగా దాదాపుగా 20 వేల మంది పవర్‌లూం కార్మికులు ఉన్నారు. నిత్యం ఆర్థిక, ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొన్న సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ప్రతి నిత్యం ఆత్మహత్యలకు కేంద్రంగా మారింది. వందలాది మంది వ్యాపారులు దివాళా తీసే పరిస్థితులు సిరిసిల్లలో నిత్యం జరిగేవి. ఇలాంటి స్థితిలో సిరిసిల్లకు శాసనసభ్యునిగా ఎన్నికైన తారకరామారావు సిరిసిల్ల ముఖచిత్రాన్ని మార్చడానికి నిరంతరం ఆలోచించి ఎట్టకేలకు తెలంగాణ స్వరాష్ట్రం సాధించిన తర్వాత కృతకృత్యులయ్యారు.

ప్రభుత్వ అవసరాలకు వినియోగించే రాజీవ్ విద్యా మిషన్ యూనిఫాంల దుస్తులు, బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ దుస్తుల పంపిణీకి, కెసిఆర్ కిట్‌కి అవసరమయ్యే వస్త్రాలన్నీ సిరిసిల్లలోనే తయారు చేయించి నేత కార్మికులకు నెలకు రూ. 15000 – రూ. 20,000 వేతనం అందేలా చర్యలు చేపట్టారు. మరోవైపు అపెరల్‌పార్కును ఏర్పాటు చేసి అందులో 10, 000 మంది మహిళలకు ఉపాధి కల్పించడానికి చర్యలు తీసుకున్నారు. దాదాపు 1100 మంది ఆసాములను యజమానులుగా మార్చేందుకు గ్రూప్ వర్క్‌షెడ్ పథకాన్ని అమలు చేస్తున్నారు. దాదాపు వంద శాతం సబ్సిడీతో 8100 మరమగ్గాలను ఆధునీకరించారు. సిరిసిల్ల టెక్స్‌టైల్ పార్కు అభివృద్ధికి దాదాపు 11 కోట్ల రూపాయలు విడుదల చేశారు. 40 కోట్ల రూపాయలతో 65 ఎకరాల స్థలంలో అపెరల్ పార్కును ఏర్పాటు చేసే చర్యలు చేపట్టారు. పట్టణంలోని 6 వేల మంది పవర్‌లూం కార్మికులకు మంత్రి కెటిఆర్ స్వయంగా ప్రీమియం చెల్లించి జనశ్రీ భీమాలో చేర్పించారు. సిరిసిల్లలోని 820 మంది నేతన్నల లక్ష లోపు రుణాలను మాఫీ చేయించి అందుకోసం 3.80 కోట్ల రూపాయలను విడుదల చేయించారు. సిరిసిల్లలోని 5251 మంది మరమగ్గాల విద్యుత్ వినియోగం కోసం 50 శాతం సబ్సిడీ 5 హెచ్‌పి మీటర్లకు అమలు పరిచారు. ఇందుకోసం 6.51 కోట్ల రూపాయలను ఏటా విడుదల చేస్తున్నారు.

త్రిఫ్ట్ పథకం అమలు కోసం 2000 మంది కార్మికులకు 40 లక్షల రూపాయలు మంజూరు చేశారు. గతంలో సిరిసిల్ల నుండి అనేక మంది సూరత్, భీవండి, బొంబాయి వంటి ప్రదేశాలకు జీవనోపాధి కోసం వలసలు వెళ్లగా ప్రస్తుతం సిరిసిల్లలో లభిస్తున్న కూలీ ఉపాధి చూసి పలువురు తిరిగి రావడమే కాక ఇతర ప్రాంతాల వారు సిరిసిల్లలో పనుల కోసం వస్తుండడం విశేషం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పాటుతో జిల్లా కేంద్రంగా మారిన సిరిసిల్ల పట్టణం రూపురేఖలను మంత్రి కెటిఆర్ సంపూర్ణంగా మార్చివేశారు. సిరిసిల్లలో మౌళిక వసతుల కల్పన కోసం 195 కోట్ల రూపాయలను కేటాయించి ప్రధాన రహదారులు, కూడళ్లను అభివృద్ధి పరచడంతోపాటు అంతర్గత రహదారులు, మురికి కాలువలు, సామాజిక సంఘ భవనాలు, మహిళా సమాఖ్య భవనాల నిర్మాణం, పార్కులు, కొత్త చెరువు సుందరీకరణ, వైకుంఠధామాల నిర్మాణం, ఎల్‌ఈడీ దీపాల ఏర్పాటుతో పాటు మిషన్ భగీరథ పనులను చేపట్టారు. సిరిసిల్లలో పురపాలక సంఘం అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక బహుమానాలను గెలుచుకుంది. పురాతన మహాత్మాగాంధీ, అంబేద్కర్ విగ్రహాలను తొలగించి భారీ కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేయించారు. ప్రధాన కూడళ్లలో ఫౌంటేన్లను ఏర్పాటు చేయించారు. ఇటీవలే మ్యూజికల్ వాటర్ ఫౌంటేన్‌ను, కార్మికులకు ఉపయోగకరంగా ఉంటుందని ఐదు రూపాయలకు భోజనం అందించే అక్షయపాత్రను ప్రారంభించారు.

మంత్రి కృషి వల్ల సిరిసిల్ల వందశాతం బహిరంగ మలవిసర్జన రహిత పట్టణంగా, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ సేవలకు గానూ భారత ప్రభుత్వం సిరిసిల్ల మున్సిపాలిటీకి స్వచ్ఛతాహి సేవా అవార్డు 2017 ను అందించింది. ఓడిఎఫ్ + గా గుర్తింపు సాధించింది. ఓడిఎఫ్++ గుర్తింపు కోసం ముందుకు సాగుతోంది. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ లో వినూత్నమైన అంశాలకు ఎల్‌ఈడి స్ట్రీట్‌లైట్ల, పౌరసేవా కేంద్రం నిర్వహణకు గానూ నాలుగు స్కోచ్ నేషనల్ అవార్డులు సిరిసిల్లను ఢిల్లీలో వరించాయి. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌లో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ స్టేట్ ఎక్స్‌లెన్స్ అవార్డు – 2018ను అందించింది. మంత్రి కెటిఆర్ కృషితో స్వచ్ఛభారత్‌లో భాగంగా సిరిసిల్లలో 260 సానిటరీ టాయిలెట్స్ నిర్మించారు. 5754 ఇన్‌సైట్ సానిటరీ టాయిలెట్స్ నిర్మించారు. సిరిసిల్లలో కొత్తగా 4254 ఎల్‌ఈడీ బల్బులు అమర్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతుబంధు పథకం కింద 95,072 మంది రైతులకు 91,76,00,000 రూపాయలను అందించారు. జిల్లాలో 56,109 మంది రైతులకు 240 కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింది. నిరంతరాయంగా ఉచిత విద్యుత్ వ్యవసాయానికి అందిస్తున్నారు. రైతు బీమా పథకంలో జిల్లాలోని రైతులందరికి అవకాశం కల్పించారు.

ప్రతిరైతుకు రూ.లు 2,271 ప్రీమియం చెల్లించారు. జిల్లాలో గతంలో 5,200 టన్నుల నిలువ సామర్దం గల గోదాములు మాత్రమే ఉండగా మంత్రి కెటిఆర్ రూ.లు 24 కోట్లు వెచ్చించి 40 వేల టన్నుల సామర్దం గల 8 ఆధునిక వ్యవసాయ గోదాములను నిర్మించారు. సర్దాపూర్ వద్ద రూ.లు 20 కోట్లతో నూతన మార్కెట్ యార్డ్‌ను నిర్మిస్తున్నారు. పండించిన ఉత్పత్తులు రైతులు నేరుగా అమ్ముకునేందుకు వీలుగా రూ.లు 3.45 కోట్లతో సిరిసిల్లలో, రూ.లు 30 లక్షలతో వేములవాడలో రైతు బజారులు నిర్మిస్తున్నారు. జిల్లాలో 94,378 కొత్త పట్టాదార్ పాసుపుస్తకాలు అందించారు. జిల్లాలో 625 చెరువులుండగా 338 చెరువులను రూ.లు 138 కోట్లతో మిషన్ కాకతీయ క్రింద పునరుద్ధరించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలో రూ.లు 94 కోట్లతో గుడిచెరువు అభివృధ్ధి పనులు జరుగుతున్నాయి. రూ.లు 16 కోట్లతో నాలుగు మినీ ట్యాంక్‌బండ్‌లను అభివృధ్ధి చేస్తున్నారు. జిల్లాలోని బీడు భూములను సాగుదిశగా మల్లించేందుకు మంత్రి కేటిఆర్ విశేష కృషి చేస్తున్నారు. జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు 9వ ప్యాకేజి పనుల్లో భాగంగా రూ.లు 1,462 కోట్లతో పనులు సాగుతున్నాయి. సిరిసిల్ల జిల్లాలోని మధ్యమానేరు ప్రాజెక్టు నుండి ఎగువ మానేరు ప్రాజెక్టు వరకు 11.634 టిఎంసిల నీటిని ఎత్తి పోయడం ద్వారా జిల్లాలో 86,150 ఎకరాలకు సాగునీరందించే చర్యలు సాగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు 9,10,11,12 ప్యాకేజిలద్వారా 1,53,150 ఎకరాలకు, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా 52,000 ఎకరాలకు నీరందించేందుకు పనులు శరవేగంగా సాగుతున్నాయి.

జిల్లాలోని 2,04,865 ఎకరాలకు సాగునీరందించాలనేది సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ లక్షం. జిల్లాలో మిషన్ భగీరథ క్రింద ఇంటింటికి త్రాగునీరందించే ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. జిల్లాలోని 13 మండలాల పరిధిలోని 351 ఆవాసాల్లోని 5,50,000 మంది ప్రజలకు త్రాగునీరందించేందుకు 1132 కోట్ల రూపాయలతో పనులు చేపట్టి దాదాపు పూర్తి చేశారు. గ్రామాలకు బల్క్ వాటర్ ఇప్పటికే అందుతోంది. ఫిబ్రవరి నెల చివరాఖరు నాటికి ఇంటింటికి అందించే దిశగా పనులు వేగంగా సాగుతున్నాయి. సిరిసిల్ల జిల్లాలో ఈ సారి 91 లక్షల మొక్కలు నాటుతామని ప్రణాళికను సిద్దం చేశారు. అన్ని ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో దాదాపు 50 శాతం మొక్కలు నాటారు. జిల్లాలో మొదటి విడతలో 20,23,000 మొక్కలు, రెండో విడతలో 73,40,000 మొక్కలు, మూడో విడతలో 81,97,000 మొక్కలు నాటారు. మంత్రి కేటిఆర్ పలు పర్యాయాలు జిల్లాలో పర్యటించి మొక్కలు నాటుతూ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులను, ప్రజలను ఉత్సాహపరిచారు. మొక్కల సంరక్షణలో (58.48 శాతం) జిల్లా రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచింది. జిల్లాలో 1,15,178 మందికి వివిధ రకాల పెన్షన్ల క్రింద ప్రతినెల రూ.లు12.11కోట్లు అందిస్తున్నారు.

ఇటీవలే కొత్తగా 901 మందికి బోధకాలు వ్యాధి గ్రస్తులకు పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. సిరిసిల్ల పట్టణానికి మంత్రి కేటిఆర్ 300 పడకల సూపర్ స్పెషాలిటి ఆసుపత్రిని మంజూరు చేయించారు. ఇందుకోసం రూ.158.70 కోట్లు మంజూరు చేయించారు. మాతా శిశు కేంద్రం, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, ఐసియు, రక్తనిధి, డయాలసిస్ సెంటర్, ట్రామాకేర్ సెంటర్ తదితరాలు మంజూరు చేయించారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయించారు. ఎల్లారెడ్డిపేట ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల ఆసుపత్రిగా మార్పించారు. త్వరలోనే ముస్తాబాద్, గంభీరావుపేటలో కూడా 30 పడకల ఆసుపత్రుల ఏర్పాటుకు కృషి చేస్తున్నారు. జిల్లాలో కెసిఆర్ కిట్ పథకం అమలైన తర్వాత 2535 మందికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగి వారికి కెసిఆర్ కిట్లతో పాటు 3.80 కోట్ల రూపాయలను అందించారు. జిల్లాలో విద్యుత్ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం మంత్రి కెటిఆర్ చొరవ తీసుకుని రెండు గ్రామాలకో సబ్‌స్టేషన్ ఉండేలా కృషిచేస్తున్నారు.

ఇప్పటికే నియోజకవర్గంలో 17 33/11 కెవి సబ్‌స్టేషన్లు, చిప్పలపల్లిలో 132/33 కెవి సబ్ స్టేషన్, పెద్దూరులో 220/132 కెవి సబ్‌స్టేషన్‌ను మంత్రి కెటిఆర్ అదనంగా మంజూరు చేయించారు. ప్రతి మండలంలో విద్యుత్ సబ్‌స్టేషన్ల సంఖ్యను పెంచేందుకు నాణ్యమైన విద్యుత్ సరఫరాకు నిరంతరం శ్రమిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు 6,786 రెండు పడక గదుల ఇండ్లు మంజూరు కాగా మంత్రి కేటిఆర్ చొరవతో 729 ఇండ్లు నిర్మాణం పూర్తయ్యాయి. మిగతావి ప్రగతిలో ఉన్నాయి. వాటిని కూడా త్వరగా పూర్తి చేయించాలని చూస్తున్నారు. సిరిసిల్ల ప్రాంతం అభివృధ్ధి పూర్తిగా నేతన్నలపైన ఆధార పడిఉందన్న కారణంగా మంత్రి కేటిఆర్ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృధ్ధికి నిరంతర ఉపాధి కల్పన కోసం ఇప్పటికే 650 కోట్ల రూపాయల బట్ట ఉత్పత్తి ఆర్డర్ ఇప్పించారు. 1104 మంది కార్మికులను యజమానులుగా మార్చాలనే ఉద్దేశ్యంతో పెద్దూరులో 88 ఎకరాల స్థలం కేటాయించి, ఉచితంగా వర్క్ షెడ్ నిర్మించి నాలుగు పవర్‌లూంలను 50 శాతం సబ్సిడిపై అందించేందుకు ప్రణాళికను పూర్తి చేశారు.

సబ్సిడీ నూలు అందించేందుకు నూలు డిపోను, కామన్ ఫెసిలిటి సెంటర్‌ను మంజూరు చేశారు.రూ.లు 40 కోట్లతో పెద్దూరులో 65 ఎకరాల స్థలంలో అపెరల్ పార్క్‌ను రూపొందిస్తున్నారు. వంద శాతం రాయితీతో 25 వేల మరమగ్గాలను ఆధునీకరించుకునేందుకు రూ.లు 30 కోట్లు కేటాయించారు. స్వచ్ఛత, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో సిరిసిల్లకు దేశవ్యాప్త ఖ్యాతి రావడానికి మంత్రి కేటిఆర్ చూపిన చొరవే ప్రధాన కారణమని చెప్పవచ్చు. మంత్రి కేటిఆర్ ఒంటెద్దు పోకడతో కాకుండా స్థానిక ప్రజాప్రతినిధులందరిని, జిల్లా యంత్రాంగాన్ని సమన్వయ పరుస్తూ ప్రగతిని పరుగులు పెట్టిస్తున్న విషయాన్ని స్థానికంగా ప్రతి ఒక్కరు బహిరంగంగా చర్చించుకుంటుండటం మంత్రి కేటిఆర్ హయాంలో జరిగిన అభివృధ్దికి గుర్తుగా చెప్పుకోవచ్చు. ఈ నేపద్యంలో మరో సారి కేటిఆర్ ఈ నెల 19న ఏర్పడే కేసిఆర్ నూతన మంత్రి వర్గంలో మంత్రిగా బాధ్యతుల స్వీకరించనున్నారనే తీపి కబురు సిరిసిల్లప్రాంత ప్రజలకు విశేషమైన అనందాన్ని కలిగిస్తోందనడం అతిశయోక్తి కాదు.

Special Report on KTR Sircilla Development