Home ఎడిటోరియల్ చేనేత ‘జియో ట్యాగింగ్’

చేనేత ‘జియో ట్యాగింగ్’

Special Story on GeoTags to Weaving

తెలంగాణను నిన్న మొన్నటి వరకు వెనకబడేసి ఉంచినప్పటికీ, నేడు దేశానికి ఆదర్శవంతమైన రాష్ర్టంగా ముందుకు సాగుతున్నది. కొట్లాడి సాధించుకున్న రాష్ర్టం నాలుగేళ్లు పూర్తి చేసుకుని 28 రాష్ట్రాల దృష్టిని ఆకర్షిస్తోంది. కులవృత్తులను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తీర్చిదిద్దుతూ సబ్బండ వర్ణాల జీవనశైలిలో విప్లవాత్మకమైన మార్పులను ఆహ్వానిస్తున్నది. మరోపక్క సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రపంచ దేశాల పక్కన నిలబెట్టే చర్యలు తీసుకుంటున్నది. తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం చేపట్టిన అనేక పథకాలు ఇప్పటికే పలు రాష్ట్రాలు తమ ప్రజలకు అన్వయించే ప్రయత్నం చేస్తున్నారు.

వ్యవసాయం తర్వాత ప్రధాన వృత్తిగా ఉన్న చేనేతపై దృష్టిని సారించి మగ్గాలను ‘జియో ట్యాగింగ్’ చేసిన విషయం తెలిసిందే. చేనేత, మరమగ్గాల కార్మికుల కష్టాలను తొలగించడానికి జియో ట్యాగింగ్ చేయడంతో ప్రభుత్వ పథకాలను అర్హులైన నేత కార్మికులకు లబ్ధిచేకూర్చేందుకు దోహదపడుతున్నది. తెలంగాణలో విజయవంతమైన ఈ జియో ట్యాగింగ్ ప్రక్రియను దేశవ్యాప్తంగా అమలుచేయాలని కేంద్ర ప్రభుత్వంతోపాటు ఇతర రాష్ట్రాలు నిర్ణయించడం విశేషం. ఇప్పటికే పలు రాష్ట్రాల అధికారులు ఇక్కడి వచ్చి చేనేత, జౌళిశాఖ అధికారులను సంప్రదించి సాంకేతిక సహకారం అందించాలని కోరడం జరిగింది. జియో ట్యాగింగ్ ద్వారా ప్రభుత్వాలు అందించే ప్రోత్సాహకాలు, రాయితీలు, సబ్సిడీలు తదితరమైన పథకాలు నేరుగా అబ్ధిదారులకు అందుతుందని భావిస్తున్నారు.

చేనేత కార్మికుల సమగ్ర సమాచార సేకరణకు తెలంగాణ ప్రభుత్వం సర్వే చేయించాలని 2016లో నిర్ణయించింది. చేనేతకు సంబంధించిన సమగ్ర సమాచారం ప్రభుత్వం వద్ద అందుబాటులో లేకపోవడంతో దీనిపై దృష్టి సారించింది. నేత కార్మికుల ఆకలి చావులను నివారించడంతో పాటు చేనేతకు పూర్వవైభవం తీసుకురావడానికి పథకాల రూపకల్పనకు సర్వే అనివార్యమైంది. మగ్గాలపై పనిచేసే కార్మికులు ఎందరు, వారి కుటుంబ వివరాలు, పనిచేస్తున్న సొసైటీ, ఏ రకమైన వస్త్రం తయారుచేస్తున్నారు, కార్మికుడిపై ఎంత మంది ఆధారపడి ఉన్నారు… తదితరమైన వివరాలను సేకరించడానికి నడుం బిగించింది.

ఈ సర్వే ద్వారా తప్పుడు లెక్కలు చూపే వారికి, సొసైటీలోని అవకతవకలకు చెక్ పెట్టవచ్చని భావించింది. రాష్ర్టంలో పనిచేసే ప్రతి మగ్గం (వర్కింగ్ లూవ్‌ు) వివరాలను జియో ట్యాగింగ్ చేసి, ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు, ప్రయోజనాలు నేరుగా కార్మికుడి అకౌంట్లో జమ కావాలని ప్రభుత్వం ఆశించింది. ఇందుకోసం కార్మికుల వివరాలను డిజిటలైజేషన్ చేయడానికి సిబ్బందిని రంగంలోకి దించింది. మగ్గం వివరాలను అక్కడిక్కడే జియో ట్యాగింగ్ చేయడంతో పాటు ఆ మగ్గం మీద జరిగే పనిపై పరోక్షంగా ఆధారపడిన, సహకరిస్తున్న వారి వివరాలను సేకరించింది. సర్వేలో ప్రధానంగా కార్మికుడి కుటుంబ వివరాలతో పాటు అధార్ నంబర్, బ్యాంక్ అకౌంట్ నంబర్, బ్రాంచి, ఐఎఫ్‌ఎస్‌సి కోడ్ తదితరమైనవి నమోదు చేశారు.

ఈ నేపథ్యంలో చేనేత కార్మికుల వాస్తవ వివరాల నమోదు చేసిన అధికారులు, ప్రతి చేనేత కార్మికుడికి యూనిక్ ఐడింటిఫికేషన్ నంబర్ (విశిష్ట గుర్తింపు సంఖ్య)ను కేటాయించారు. ఈ నంబర్ ప్రామాణికంగా ప్రభుత్వం అందించే పథకాలు, ఆర్థిక సహాయం, సబ్సిడీలు, ప్రోత్సాహకాలు, పావలా వడ్డీ, రాయితీలు అందేలా చర్యలు తీసుకోవాలని భావించారు. చేనేత కార్మికుల సమగ్ర వివరాలతో కూడిన సర్వేను రాష్ర్టవ్యాప్తంగా 31 జిల్లాల్లో ఎంపిడిఒలు, తహశీల్దార్లు, పంచాయితీ కార్యదర్శులు, విఆర్‌ఒలు 2017లో ఫిబ్రవరి చివరి వారంలో మొదలుపెట్టి మార్చి మొదటివారంలో ముగించారు. 15 అంశాలను పరిగణనలోకి తీసుకుని రూపొందించిన పత్రంలో చేనేత కార్మిక కుటుంబాల వివరాలను పూర్తిచేశారు. కుటుంబసభ్యుల వృత్తి, పిల్లల చదువులు, ఆర్ధిక స్థితిగతులు, ఇతర వివరాలు నమోదు చేసి మగ్గం మీద కార్మికుడు పనిచేసే ఫోటోలు తీసుకున్నారు. అలాగే చేనేత కార్మికుడు ఏ రకమైన వస్త్రాలను తయారుచేస్తారనే విషయాన్ని కూడా పొందుపరిచారు. పూర్తి చేసిన సర్వే నివేదికను రెవెన్యూశాఖ క్రోడీకరించి చేనేత జౌళి పరిశ్రమల శాఖకు అప్పగించింది.

సర్వే చేస్తున్న సమయంలో మగ్గం నేసే కార్మికుల వివరాలే కాకుండా రాట్నం చుట్టేవారు, రంగులు అద్దేవారు, అచ్చు అతికేవారితో పాటు కుటుంబసభ్యులను కూడా చేర్చాలనే డిమాండ్లను పరిగణనలోకి తీసుకొని సర్వేను పూర్తి చేశారు. రాష్ర్ట వ్యాప్తంగా 16,776 చేనేత మగ్గాలకు జియో ట్యాగింగ్, ఆధార్, బ్యాంక్ అకౌంట్లను అనుసంధానం చేశారు. ఈ మగ్గాల ద్వారా ఏటా రూ.717 కోట్ల విలువైన 209 లక్షల మీటర్ల వస్త్రాల ఉత్పత్తి అవుతున్నట్లు సర్వేలో తేలింది. ఇందులో 106.36 లక్షల మీటర్లు కాటన్, 57.38 లక్షల మీటర్ల సిల్క్, 38.10 లక్షల మీటర్ల పాలిస్టర్, 7.62 లక్షల మీటర్ల ఉన్ని వస్త్రాలు ఉత్పత్తవుతున్నట్లు తేల్చింది. ఇందుకు రూ.206 కోట్ల విలువైన నూలు అవసరంకాగా, రాష్ర్ట ప్రభుత్వం భరించనున్న 40 శాతం ఇన్‌పుట్ సబ్సిడీకి రూ.82 కోట్లు అవసరమవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.

చేనేత సమస్యలకు శాశ్వత ప్రాతిపదికన పరిష్కారం చూపాలని పట్టుదలతో ఉన్న ప్రభుత్వం, కార్మికులు నేసే ప్రతి మీటరు వస్త్రాన్ని కొనుగోలు చేయాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నది. నూలు మీద 50 శాతం సబ్సిడీ, నేత కార్మికులకు నెలకూలీ కనీసం రూ.15 వేలు, రుణమాఫీతో పాటు చేనేత లక్ష్మీ, చేయూత పథకాలను అమలు చేస్తున్నది. చేనేత మగ్గాలకు చేసిన జియో ట్యాగింగ్ తరహాలోనే మరమగ్గాలను కూడా గుర్తించి జియో ట్యాగింగ్ చేయడం జరిగింది. రాష్ర్టవ్యాప్తంగా 35 వేల మరమగ్గాలు ఉండగా, ఒక్క సిరిసిల్లలోనే 25,749 వేల మగ్గాలు ఉన్నట్లు తేల్చింది. ఆలేరు, భువనగిరి, జనగాం, వరంగల్ ప్రాంతాల్లోనూ మరమగ్గాలు ఉన్నట్లు గుర్తించింది. చేనేత, మరమగ్గాలను జియో ట్యాగింగ్ పూర్తిచేసి ఏడాదిపాటు ఈ డేటాను టెక్స్‌టైల్ శాఖ ఫ్రీజ్ చేసింది. ఏడాది క్రితం పూర్తిచేసిన జియో ట్యాగింగ్ ఆధారంగా 201819 బడ్జెట్‌లో రూ.1200 కోట్లు కేటాయించింది.

చేనేతరంగాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వ చర్యలు, పక్కాగా సంక్షేమ ఫలాలు అర్హులకు అందించేందుకు ప్రవేశపెట్టిన జియో ట్యాగింగ్ విధానంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ విధానంను దేశవ్యాప్తంగా అమలుచేయాలని కేంద్ర పరిశ్రమల శాఖ(టెక్స్‌టైల్) నిర్ణయించింది. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేసింది. చేనేతరంగాభివృద్ధి వేగవంతమైన తీరును పరిగణలోకి తీసుకుంది. సంక్షేమ ఫలితాలు అసలైన లబ్ధిదారుడికి అందడంలో జియో ట్యాగింగ్ పద్ధతి ఆచరణీయమైనదిగా గుర్తించారు. ఎన్‌హెచ్‌డిసి, చేనేత ఉత్పత్తుల ప్రమోషన్ కోసం చేపడుతున్న నేషనల్ హ్యాండ్లూం ఎక్స్‌పో తదితర పథకాల నిధుల దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి ఏకైక మార్గం గా ఉంటుందని భావించారు. కేంద్రంతో పాటు జమ్ముకాశ్మీర్, బీహార్, కర్ణాటక రాష్ట్రాలు కూడా జియో ట్యాంగింగ్‌వైపు మొగ్గుచూపాయి. ఈమేరకు తెలంగాణ రాష్ర్ట చేనేత, జౌళిశాఖ అధికారులను సంప్రదించి సాంకేతిక సహకారం అందించాలని కోరాయి.

-కోడం పవన్‌కుమార్, 9848992825