Home జాతీయ వార్తలు గత ప్రభుత్వాలను తలదన్నాం

గత ప్రభుత్వాలను తలదన్నాం

Speech from Red Fort on occasion of the 72nd Independence Day

అసాధారణ ఫలితాలు సాధించాం
గత రెండేళ్లలో ఐదు కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చాం
ప్రతిపక్షాలవి అర్థరహిత ఆరోపణలు
50 కోట్ల మంది పేదలకు వర్తించేలా ఆయుష్మాన్ భారత్‌ను త్వరలో ప్రారంభిస్తాం
ఎర్రకోట నుంచి ఐదోసారి చేసిన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం 72వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపైనుంచి చేసిన ప్రసంగం ఆద్యంతం రానున్న సార్వత్రిక ఎన్నికలే లక్షంగా సాగింది. 80 నిమిషాల పాటు ప్రసంగించిన ప్రధాని తన ప్రభుత్వ హయాంలో సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ 2014లో దేశ ప్రజలు తన పై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని తెలిపే ప్రయత్నం చేశా రు. ముఖ్యంగా మరుగుదొడ్ల నిర్మాణం, అందరికీ వంటగ్యాస్, విద్యుదీకరణ, ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ విస్తరణలాంటి రంగాల్లో తమ ప్రభుత్వం గత ప్రభుత్వాలకన్నా అసాధారణ ఫలితాలు సాధించిందని చెప్పుకొచ్చారు.

సాయుధ దళాలకు ఒన్ ర్యాంక్.. ఒన్ పెన్షన్ అమలుతో పాటుగా రైతు పెట్టుబడికి ఒకటిన్నర రెట్లు అదనంగా కనీస మద్దతు ధరలను నిర్ణయించడం, వస్తు సేవల పన్ను( జిఎస్‌టి), బ్యాంకింగ్ సంస్కరణలు, లక్షిత దాడులు( సర్జికల్ స్ట్రైక్స్)లాంటివాటిని ఆయన ప్రస్తావించారు. జమ్మూ, కాశ్మీర్‌లో పరిస్థితి, మహిళలపై నేరాలు, ట్రిపుల్ తలాఖ్‌పై చట్టం చేయడం లాంటి అనేక అంశాలను కూడా మోడీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ప్రతిపక్షాలు తనపై అర్థరహితమైన ఆరోపణలు చేస్తున్నాయని అన్న ఆయన పేదలు, సమాజంలో వెనుకబడిన వర్గాల సముద్ధరణకు తమ ప్రభుత్వం చేపట్టిన అనేక సాహసోపేతమైన చర్యలను వివరించారు. వీటి ఫలితంగా గత రెండేళ్లలో అయిదు కోట్ల మందిని పేదరికంనుంచి బైటికి తీసుకు వచ్చామని కూడా ఆయన చెప్పారు. భారత్ రెడ్‌కార్పెట్‌కు మారిందని, రిఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్‌కు మారిందని అంటూ, ఇదంతా తమ ప్రభుత్వ ఘనతేనని చెప్పుకొన్నారు.

దాదాపు 50కోట్ల మంది పేదలకు ఆరోగ్య బీమా సదుపాయాన్ని కల్పించే ఆయుష్మాన్ భారత్ పథకాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు ప్రకటించిన ప్రధాని, సైన్యంలో పురుషుల మాదిరిగానే మహిళలను కూడా రెగ్యులర్‌గా పియమించడం జరుగుతుందని చెప్పారు. ‘ షార్ట్ సర్వీస్ కమిషన్( ఎస్‌ఎస్‌సి)లోకి రిక్రూట్ చేసుకున్న మహిళా అధికారులకు పురుషులలాగా శాశ్వతంగా నియమించే అవకాశం అభిస్తుంది’ అని మోడీ చెప్పారు. గతంలో సందిగ్ధంలో ఉండిన పలు నిర్ణయాలను తాము సాహసోపేతంగా చేపట్టామని చెప్పుకోవడానికి ఆయన ప్రయత్పించారు. 2022లో అంతరిక్షంలోకి భారత వ్యోమగామిని పంపుతామని ప్రకటించడం ద్వారా భారతీయుల్లో 2019 ఎన్నికలకు ముందు తన నాయకత్వం పట్ల ్ల కొత్త ఆశలను రేకెత్త్తించే ప్రయత్నం చేశారు.

మహిళలపై లైంగిక దాడులను ప్రస్తావిస్తూ, మహిళలపై లైంగిక దాడులకు పాల్పడే వారిని ఉపేక్షించే ప్రసక్త్తే లేదని ప్రధాని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వానికి చట్ల నిబంధనలే ముఖ్యమని అంటూ, లైంగిక దాడులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించడం ద్వారా ఇలాంటి దాడులకు పాల్పడే వారి వెన్నులో వణుకు పుట్టేలా చేయడం ముఖ్యమన్నారు.ఈ సందర్భంగా ఆయన ఇటీవల రాజస్థాన్ ,మధ్యప్రదేశ్‌లోని ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు రేపిస్టుకు ఉరిశిక్ష విధిస్తే తీర్పు చెప్పడాన్ని ప్రశంసించారు. లైంగిక దాడుల ఆలోచనే లేని సమాజం ఆవిష్కృతం కావాలన్నారు. ఇక సామాజిక రంగాల్లోనూ తాము తీసుకున్న నిర్ణయాలను వివరించడం ద్వారా ఆయా వర్గాలను ఆకట్టుకోవడానికి ప్రయత్నించారు. ఎస్‌సి, ఎస్‌టిల చట్టాన్ని పటిష్ఠం చేయడంతో పాటు బిసి కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పిస్తూ తీసుకున్న నిర్ణయాలను ప్రస్తావించారు.

మార్పు కోసం అసహనంతో అవిశ్రాంతంగా పని చేస్తున్నాని చెప్పిన ప్రధాని ఎవరేమనుకున్నా  తాను నిరంతరం అందుకోసమే కృషి చేస్తున్నానని చెప్పారు. అందుకు కారణాలనుసైతం ఆయన వివరిస్తూ చాలా దేశాలు మన దేశంకన్నా  ఎంతో ముందుకు వెళ్లాయని,  వాటిని మించి పోయేలా దేశాన్ని అభివృద్ధి చేయాలని తాను కోరుకుంటున్నానన్నారు. బాలలు పోషకాహార లోపంతో ఉండడంవల్ల తాను అసహనంతో ఉన్నానని అన్నారు. ప్రజలందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు, తాగు నీరు, విద్యుత్,గృహవసతి, వంటగ్యాస్, శానిటేషన్, ఆరోగ్యం అందించడమే లక్షంగా తమ ప్రభుత్వం కృషి చేస్త్తోందని  చెప్తూ  ప్రధాని తన ప్రసంగాన్ని ముగించారు.