Home సినిమా ‘స్పైడర్’ మహేశ్‌బాబులా స్టైల్‌గా హ్యాండ్‌సమ్‌గా ఉంటుంది

‘స్పైడర్’ మహేశ్‌బాబులా స్టైల్‌గా హ్యాండ్‌సమ్‌గా ఉంటుంది

SPYDER-Pre-Release

సూపర్‌స్టార్ మహేష్‌బాబు, టాప్ డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్‌లో ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘స్పైడర్’. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం దసరా కానుకగా ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో స్పైడర్ సినిమా పాటలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా సూపర్‌స్టార్ కృష్ణ మాట్లాడుతూ “నేను చెన్నై వచ్చిన కొత్తలో సినిమాల్లో నటించాలని అనుకుంటున్న సమయంలో ఓసారి కుటుంబరావుతో మాట్లాడుతుంటే దర్శకుడు శ్రీధర్ వచ్చి తమిళ సినిమాలో నటించే అవకాశం ఉందని అన్నారు. నాకు తమిళం రాదని చెబితే… ఆయనే తమిళం నేర్పిస్తానన్నారు. కానీ నాకు తమిళం రాకపోవడంతో ఆ సినిమాలో చేయలేకపోయాను. ఆ సినిమాయే ‘కాదలిక్క నేరమిల్లై’. ఆతర్వాత నాకు ఆదుర్తి సుబ్బారావు సినిమాల్లో అవకాశమిచ్చారు. అలా నన్ను అభిమానులు 350 సినిమాల్లో ఆదరించారు. ఇప్పుడు మహేష్‌ను ఆదరిస్తున్నారు. ప్రతి సినిమాలోనూ మహేష్‌లో అద్భుతమైన మెరుగుదల కనపడుతోంది. స్పైడర్ ట్రైలర్ అద్భుతంగా ఉంది. గొప్ప దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ తమిళంలో పరిచయం కానుండడం ఆనందంగా ఉంది. సినిమాలో పాటలన్నీ బావున్నాయి. సినిమా తప్పకుండా సూపర్‌హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా చెబుతున్నాను”అని అన్నారు. చిత్ర దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్ మాట్లాడుతూ “ఒక దర్శకుడికి మంచి బలం హీరోనే. స్పైడర్ ఎలా వచ్చిందని చాలా మంది అడిగారు. వారికి నేను చెప్పేదేమిటంటే… స్పైడర్ మహేష్‌బాబులా వచ్చింది. స్టైల్‌గా, హ్యాండ్‌సమ్‌గా సినిమా ఉంటుంది. తప్పకుండా సినిమా అందరికీ నచ్చుతుంది. ఈ సినిమా కోసం ఆరు నెలల పాటు నైట్ షూటింగ్ చేశాను. కానీ ఏ రోజు కూడా… నేను రేపు ఆలస్యంగా షూటింగ్‌కు వస్తానని మహేష్ చెప్పలేదు. అంత కమిట్‌మెంట్ ఉన్న హీరో మహేష్. నేను చాలా మంది సూపర్‌స్టార్స్‌తో పనిచేశాను. కానీ మహేష్‌లాంటి హీరోను ఎక్కడా చూడలేదు. సంతోష్ శివన్ వర్క్‌తో కొత్త మహేష్‌ను ఈ సినిమాలో చూస్తారు. హరీష్ జైరాజ్ అందించిన పాటలు ఇదివరకే హిట్ అయ్యాయి”అని తెలిపారు. మహేష్ మాట్లాడుతూ “ఈ సినిమా కోసం ఏడాదిన్నరగా ఎదురుచూస్తున్నాం. నాకు మురుగదాస్ సినిమాలంటే చాలా ఇష్టం. ఆయన తీసే కథలు, స్క్రీన్‌ప్లే, సినిమాలకు నేను పెద్ద ఫ్యాన్‌ని. ఒక బైలింగ్వల్ సినిమా చేయడం జోక్ కాదు. మా అంత సరిగ్గా ఇప్పటివరకు బైలింగ్వల్ సినిమా ఎవరూ చేయలేదేమో. ఒక షాట్‌ను తెలుగులో ఐదు సార్లు, తమిళంలో ఐదు సార్లు చేయడం జోక్ కాదు. అది గ్రేట్ డైరెక్టర్ మురుగదాస్ వల్లే సాధ్యమైంది. స్పైడర్‌లాంటి సినిమా తీయాలంటే గట్స్ ఉండాలి…ప్యాషన్ ఉండాలి. మా మీద నమ్మకంపెట్టిన నిర్మాతలకు థాంక్స్. ఈ సినిమాకు మేమెంత కష్టపడి పనిచేయాలో అంత కష్టపడి పనిచేశాం. ఈనెల 27న ‘స్పైడర్’ను హిట్ చేసే బాధ్యత అభిమానులదే. సంతోష్ శివన్‌తో వర్క్ చేయడం మరచిపోలేని అనుభవాన్నిచ్చింది. నేను చెన్నైలో చదువుకుంటున్నప్పుడు దళపతి, రోజా సినిమాలు చూసి పెద్దయ్యాక ఆయనతో సినిమాలు చేయాలనుకున్నాను. చాలాసార్లు ప్రయత్నించాను. మురుగదాస్ వల్ల అది కుదరింది. ఎస్.జె.సూర్య దర్శకత్వంలో పనిచేశాను. ఇప్పుడు కోస్టార్‌గా కూడా పనిచేశాను. అద్భుతమైన క్లైమాక్స్ కోసం 2000 మంది జూనియర్ ఆర్టిస్టులతో కలిసి పనిచేశాం. హరీష్‌జైరాజ్ ఈ సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. నేను ఒకసారి కథ ఒప్పుకొని చేస్తే… దానికి నేను ప్రాణం పెట్టేస్తాను. నాకు నా డైరెక్టర్ దేవునితో సమానం. అది నమ్మినందుకే ఒక అతడు, ఒక పోకిరి, ఒక శ్రీమంతుడు సినిమాలు వచ్చాయి. అందువల్లే నేను ఇంతవాడినయ్యాను. నాకున్న అభిమానులు ఏ హీరోకు ఉండరు. నాకు తమిళం మాట్లాడటం వచ్చినా… బయట మాట్లాడటం, సినిమాల్లో మాట్లాడటం వేరు. నాకు ఆ నమ్మకాన్ని ఇచ్చి తమిళంలో డబ్బింగ్ చెప్పే అవకాశం కలిగించారు మురుగదాస్‌”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయనిర్మల, రకుల్‌ప్రీత్ సింగ్, ఎస్.జె.సూర్య, వంశీ పైడిపల్లి, హరీష్ జైరాజ్, ఎన్.వి.ప్రసాద్‌తో పాటు చిత్ర బృందం పాల్గొంది.