Home ఆఫ్ బీట్ రాముడా ? రామనారాయణుడా ? భద్రాద్రిలో ఉన్నది ఎవరు?

రాముడా ? రామనారాయణుడా ? భద్రాద్రిలో ఉన్నది ఎవరు?

Bhadrachalam1

భద్రాచలం పేరెత్తగానే నిశ్శంసయంగా అందరికీ గుర్తుకొచ్చేది రాములవారే! ‘ముదముతొ సీతాముదిత, లక్ష్మణుడు కలిసి కొలువుగా ప్రభువై’ ఈ ధరాతలాన్ని ఏలుతున్నాడని రామదాసుగారు గొంతెత్తి మరీ చెప్పాడు. శ్రీరమ సీతగాగ నిజసేవక బృందం వీరవైష్ణవాచార గణంబుగాగ విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరాగ్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణువు’ అని కూడా బల్లగుద్ది చెప్పాడు. కనుక భద్రాచలంలో ఉన్నది నారాయణస్వరూపుడైన రాముడేనని స్పష్టంగా తేలింది. ఈ భావన ఉన్న వాడు కనుకనే రామదాసు తనను వీరవైష్ణవాచార గణాలలో ఒకడిగా వేసుకున్నాడు. రాముడు ఈ గడ్డ మీద నడయాడిన సమయంలోనే నేనూ పుట్టి ఉంటే రాముడికి ఇన్ని కష్టాలు రానిచ్చేవాడినా అన్నిటికీ ముందుండి, అందరికన్నా ముందుండి రాముడికి ఎప్పటికప్పుడు జాగ్రత్తలు చెప్పకపోయేవాడినా అనుకున్నాడు.

రాముడు అడవులపాలయ్యే సందర్భంలో కైకా, భరతుల కాళ్ళూవేళ్ళూ పట్టుకుని, రాముడి పాదాలమీదపడి బతిమాలి ఆపేవాణ్ణి కానా అనుకున్నాడు. రాముడు గంగానది దాటే సందర్భంలో గుహుడితోపాటే ఒక చేయి వేసి ఆయనకు శ్రమ కాస్త తగ్గించేవాణ్ణికానా..సీతమ్మకు కాలక్షేపం కోసం కబుర్లు చెప్పి ఉండేవాణ్ణి కానా అని బాధపడ్డాడు. రావణుడు సీతను అపహరించుకుపోవడానికి వచ్చినపుడు జటాయువు కన్నా ముందే పోరాడి తరిమికొట్టకపోయేవాణ్ణా అనుకున్నాడు. హనుమంతుడికి బదులుగా లంకకు వెళ్ళి రావణుని చావగొట్టి సీతను విడిపించుకురాకపోయేవాణ్ణా అనుకున్నాడు. ఆనందంగా అందరూ కలిసిన శుభవేళ రాముడు పట్టాభిషేకం చేసుకుంటే పక్కన చేరి వింజామర వీచి సేవించుకునే వాణ్ణి కదా అనుకుంటాడు. అంత భక్తాగ్రేసరుడైన రామదాసు రాముణ్ణి నారాయణుడనే సేవించాడు. రాముణ్ణి కలలో దర్శించి ఆయన శిలావిగ్రహాలను పుట్టలోంచి బైటికి తీసి లోకానికి అందించిన మహాభక్తురాలు పోకల దమ్మక్క కూడా రాముడు నారాయణుడనే భావనచేసింది. సాక్షాత్తు నారాయణుడే నేను రాముడి రూపంలో పుట్టలో ఉన్నానని చెప్పుకున్నాడు. రాముడు నారాయణుడా? శివుడా? అన్న సమస్యే తలెత్తనపుడు భద్రాద్రిలో ఉన్నది రాముడా..? రామనారాయణుడా? అన్న అనుమానాలు రేకెత్తించడం అసంగతం..అసంబద్ధం.

రాముణ్ణి నారాయణుడు కాడని ఎవ్వరూ అనలేదు..అనలేరు కూడా! వాల్మీకి తన రామాయణంలో నారాయణుడు నాలుగై నలుగురు కుమారులుగా దశరథునికి జన్మించాడని చెప్పాడు. ఈ కారణాన్ని చూపే పండితులు రాముడు పరిపూర్ణ నారాయణాంశ కాదని శ్రీకృష్ణుడే పరిపూర్ణమైన నారాయణావతారమని వాదించారు. ఈ వాదానికి సమాధానం చెప్పడానికా అన్నట్టు అధ్యాత్మరామాయణ కర్త వేదవ్యాసుడు నారాయణుడు రాముడిగానూ, ఆయన ఆయుధాలు శంఖ, చక్రాలు, ఆయన పానుపైన ఆదిశేషుడు సోదరులుగానూ దశరథునికి పుత్రులుగా పుట్టారని చెప్పాడు. ఇందువల్ల రాముడు పూర్ణావతారుడు కాడు అన్న వాదానికి సమాధానం చెప్పినట్లయింది. పండితులు ఎలా కొట్టుకున్నా రాముడు మాత్రం నేను దేవుణ్ణి కానని, దశరథరాజకుమారుడినని చెప్పుకున్నాడు. అలా పిలిపించుకోడానికి, అలా ఉండడానికే ఇష్టపడతానని చెప్పుకున్నాడు. ఆయనలోలేని తహతహను, తాపత్రయాన్ని పండిత ప్రకాండ్రులు పులుముకుని శిగపట్లకు దిగడమెందుకో అర్థంకాదు.
భద్రాచలం క్షేత్ర చరిత్ర ప్రకారం చూసినా, వివిధ రామాయణాల వర్ణనల ప్రకారం చూసినా రాముడు నారాయణుడే! రామాయణకాలంలోనూ ఆయన వైకుంఠం నుంచి బయల్దేరి నేరుగా భూమ్మీదికి వచ్చాడు.

యజ్ఞపురుషుడు ఇచ్చిన పాయసం ద్వారా కౌసల్య, సుమిత్ర, కైకేయి గర్భాలలో చేరి తొమ్మిది నెలలు ఉండి ఆ తర్వాతే అందరి పిల్లలలాగ అమ్మల ఒడిచేరాడు. రాముడు పుట్టడానికి ఎంతో కాలం ముందుగానే మహర్షులు నారాయణుడు రాముడిగా వస్తాడని, రావణుని అంతుచూస్తాడని స్పష్టంగా చెప్పాడు. ఈ విషయం ఆఖరికి దశరథుని మంత్రి సుమంత్రుడికి కూడా దశరథునికన్నా ముందే తెలుసు. అందుకే ఆయనను అంతా ఆదరంగా, అపురూపంగా చూసుకున్నారు. రాముణ్ణి గంగ దాటించిన గుహుడు కూడా ఈ భక్తిభావనతోనే కాళ్ళు కడిగి తలపై జల్లుకున్నాడు. మహర్షులు మోహపరవశులై రాముణ్ణి కౌగలించుకున్నారు. ఈ జగదేక సౌందర్యం ఆయన నారాయణుడవడం వల్లే వచ్చింది. ఆయన జగన్మోహినిగా ఉన్నప్పుడు దేవదానవులు ఎలా వెంటపడ్దారో అందరికీ తెలిసిందే! ఆయన నారాయణుడౌనా కాదా అని వాల్మీకి ఏనాడూ అనుమాన పడలేదు..కారణం? రాముడి గురించి నారదుడు చేసిన ఉద్బోధ. నారాయణుడే దశరథుని కొడుకు రాముడిగా పుట్టాడు అని స్పష్టంగా చెప్పాడు.

ఇక భద్రాచలం స్థలపురాణం కూడా అక్కడ ఉన్నవాడు నారాయణుడు అని స్పష్టంగా చెప్పింది. రాముడు వనవాస సమయంలో దండకారణ్యంలో సంచరిస్తూ నేటి భద్రాద్రి వైపు వచ్చినపుడు మేరు పర్వతరాజు కుమారుడు భద్రుడు చూశాడు. వారిని తన కొండకు ఆహ్వానించి అక్కడ లభించే పళ్ళుతిని, తేనెతాగి, దాహం తీర్చుకుని కాసేపు కొండగాలికి సేదతీరి వెళ్ళమని కోరాడు. అయితే రాముడికి చేయాల్సిన పనులు చాలా ఉన్నందున ఇప్పుడు కాదన్నాడు. తిరుగుప్రయాణంలో తప్పకుండా వచ్చి కాసేపు విశ్రాంతి తీసుకుని వెళతానన్నాడు. కానీ కారణాంతరాలవల్ల రాముడు పుష్పక విమానంలో శ్రీలంక నుంచి అయోధ్యకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత క్షణం తీరుబడిలేనంతగా పాలనా వ్యవహారాలలో మునిగితేలాడు. ఆ తర్వాత అవతార పరిసమాప్తి చేసుకుని వైకుంఠానికి వెళ్ళిపోయాడు.

రాముడు భూమ్మీద లేడని తెలిసి భద్రుడు బోరున ఏడ్చాడు. దాంతో జరిగిన పొరబాటు గ్రహించుకున్న రాముడు భద్రాచలానికి సీతా, లక్ష్మణ సమేతుడై చేరుకున్నాడు. హడావుడిగా వైకుంఠం వదిలి లక్ష్మీనారాయణులు భూమికి పరుగుతీయడంతో విషయం అర్థంకాని శంఖ, చక్రాలు, గరుత్మంతుడు కూడా వారిని అనుసరించి వచ్చారు. శంఖ, చక్రాలను అపసవ్యంగా ధరించి వచ్చినవారెవరో భద్రుడికి అర్థంకాలేదు. అందుకే ఎవరు స్వామి నీవు? అని అడిగాడు. దాంతో నేను రాముణ్ణి అని నిరూపించుకునే పరిస్థితి నారాయణుడికి ఏర్పడింది. అందుకని ధనుర్బాణాలు ధరించి నేనే రాముణ్ణి అని అనిపించుకున్నాడు. కానీ రాముడికి శంఖ, చక్రాలు ఉండవు కదా! కానీ ఆ క్షణంలో రాముణ్ణి అని చెప్పుకున్న నారాయణుడి చేతిలో శంఖ, చక్రాలూ ఉన్నాయి..ధనుర్బాణాలు ఉన్నాయి. సర్వ ప్రహరణాయుధః అన్నట్టుగా ఉన్న రాముణ్ణి చూసి ముచ్చటపడి ఇలాగే నా కొండమీద ఉండమని భద్రుడు కోరాడు. రాముడు సరే అన్నాడు. శంఖ, చక్రాలు ధరించి ఉండడమన్నది ఒక్క నారాయణుడికే తప్ప మరెవ్వరికీ లేని లక్షణం. రామత్వం, నారాయణత్వం ఏకమైన రూపంగా కనిపించే రాముణ్ణి రామనారాయణుడు అంటే తప్పేమిటి? అదేమైనా దుష్ట సమాసమా?

నారాయణుడు 21 అవతారాలెత్తాడు. అందులో 10 అతి ప్రధానమైనవి. ఈ అవతారాలన్నీ నారాయణుడివే అయినా వాటిని నారాయణ శబ్దం తగిలించి చెప్పడంలేదు కదా అన్నది ఒక వాదన. నారాయణుడు ఎత్తిన అవతారాలలో రామ, కృష్ణ అవతారాలే పూర్ణావతారాలుగా పూజలందుకుంటున్నాయి. కృష్ణుణ్ణి కృష్ణభగవానుడు అంటున్నారు కదా..! కృష్ణహరి అని కూడా అంటున్నారు. కృష్ణవంశీ అనీ, వంశీకృష్ణ అనీ అంటున్నారు. ఈ పలురకాల పిలుపులకు కూడా శాస్త్ర ప్రమాణం లేదు. ప్రజల అభిమానమే కొలమానంగా ఏర్పడిన నామాలు అవి. మంత్రం పేరుతో వాటిని దూరంపెడితే ఆ మంత్రాలు ఒక వర్గం వద్దే ఉండిపోయి జనాదరణకు దూరమవుతాయి. ఒక కవి సుకవి కావాలంటే ప్రజాకవిగా రాణించాలంటే జనం నాలుకలనే తాటాకులుగా చేసుకుని జీవించాలి అని గుర్రంజాషువా అన్నమాటలు గుర్తున్నాయి కదా! ఇది ఒక కవికే కాదు జనంలో ఉండాలనుకున్న వారికందరికీ వర్తించేమాట. జనాదరణలేకపోతే ఎంత గొప్పవాడైనా కనుమరుగైపోతాడు. జగదభిరాముడు, ప్రజారాముడు జనం మనిషి. జనం కోసం జనంతో, జనంలో జీవించినవాడు. అలాంటి వాణ్ణి మంత్రాలలో ఇరికించి మహిమాన్వితుణ్ణి చేసే కంటే మనుషుల మధ్య ఉండనిచ్చి సజీవంగా నిలవనీయడమే మంచిది.

భద్రాద్రి రాముణ్ణి వైకుంఠ రాముడు, ఓంకార రాముడు, రామభద్రుడు అనడంలో లేని అభ్యంతరం రామనారాయణుడు అనడానికి ఎందుకు వస్తుంది? రామబ్రహ్మం అనడానికి అభ్యంతరంలేని ఈ పెద్దలకు..శ్రీరామచంద్రపరబ్రహ్మణేనమః అనడానికి వెనకాడని ఈ పెద్దలకు రాముడా..నారాయణుడా అనే సామాన్యుడి పిలుపు ఎందుకు వినబడవు? రాముడా నారాయణుడా అనే జనసామాన్యమే రామనారాయణా అంటోంది. అది అసభ్యమూ, అశ్లీలమూ కానపుడు ఆ మాటను ప్రవరలో చేరిస్తే జనవాక్యాన్ని గౌరవించినట్లవుతుందే తప్ప పురాణాలనో, వేదాలనో, శాస్త్రాలనో అగౌరవ పరిచినట్లెలా అవుతుంది. బాలరాముడిగా, రాజారాముడిగా, మర్యాదరామన్నగా పిలుచుకుని ప్రజలు అభిమానాన్ని ప్రకటించుకుంటున్న తీరును ఎవ్వరూ మరిచిపోకూడదు. ఈ పిలుపులలో వేటికీ శాస్త్రప్రమాణాలులేవు.

ఒక అందమైన నామాన్ని పలకడానికి శాస్త్రప్రమాణం దేనికి? ప్రతీదీ శాస్త్రమే చెప్పాలంటే ఒక్క అడుగూ ముందుకు పడదు. శాస్త్రకారులకు జీవిత కాలం చాలదు. కాలంతో సమానంగా మారే ప్రజల మనోభావాలను, భక్తి, అనురాగాన్ని అర్థం చేసుకుని గౌరవించడం, ఆదరించడం చాలా అవసరం.  మార్పును అంగీకరించే మనస్తత్వమే లేకుంటే భాగవతం నవవిధ భక్తిమార్గాలకు తోడుగా విజ్ఞానగర్భిణి అనే మరోమార్గాన్ని తీసుకురాగలిగేదా? మార్పును గౌరవించాలే తప్ప చాదస్తానికి పోయి సమాధి చేసే ప్రయత్నం చేయకూడదు.

గుడిని కొన్న రాముడు

Bhadrachalam2

ఎక్కడైనా భగవంతుడికి ఆలయం భక్తులు కట్టిస్తారు. అందులో కొలువుదీరి దేవుడు సేవలు, పూజలు అందుకుంటాడు. కానీ భ ద్రాచలంలో మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంటుంది. స్వామివారిని గుర్తించింది పోకల దమ్మక్క అయినా అప్పుచేసి ఆలయాన్ని కట్టించి నానాకష్టాలు పడ్డది రామదాసే అయినా వారెవ్వరూ ఈ ఆలయం మాది మేం కట్టించాం అని ధైర్యంగా చెప్పుకునే పరిస్థితిలేదు. ఈ మందిర నిర్మాణానికి 6 లక్షలు ఖర్చయ్యాయి. ఈ మొత్తాన్ని రామదాసు అప్పటి నిజాం నవాబు తానీషాకు చెప్పకుండా, ఆయన అనుమతి తీసుకోకుండానే ఖర్చుచేశాడు.

అందుకు కఠిన కారాగార శిక్ష అనుభవించాడు. ప్రాణాలు పోవడమే తప్ప ప్రభుత్వానికి తిరిగి చెల్లించాల్సిన 6 లక్షలలో అణాకాణీ కూడా తీర్చే పరిస్థితిలో రామదాసులేడు. ఆ స్థితిలో రాముడు, లక్ష్మణుడు హైదరాబాద్ వచ్చి తానీషాకు మందిర నిర్మాణానికి అయిన 6 లక్షల పైకాన్ని బంగారు కాసుల రూపంలో తిరిగి చెల్లించి లిఖితపూర్వకంగా రశీదు కూడా పొందారు. ఆయన ఇచ్చిన బంగారు నాణాలు భద్రాచలం గుడిలో మనం ఇప్పటికీ చూడవచ్చు.

ఆలయం కట్టిందెవరైనా, కట్టించిందెవరైనా డబ్బుచెల్లించి కొనుక్కున్నది రాముడు కావడంతో అది ఆయనకు స్వగృహంగా మారింది. ఏ దేశంలోనూ ఏ దేవుడూ ఇలా గుడిని కొనుక్కుని అందులో నివాసం ఏర్పరచుకోలేదు. అది ఒక్క రాముడి విషయంలోనే అదీ భద్రాద్రిలోనే జరిగింది. కనుక ఆ రామమందిరం అచ్చంగా రాముని మందిరమే!

ఎందరో రామదాసులు

భద్రాచలం పేరెత్తగానే రామదాసు కీర్తనలు, ఆయన రచించిన దాశరథీ శతకం మాత్రమే గుర్తుకువస్తాయి. కానీ రామదాసులాగే ఆ రామచంద్రమూర్తిని సేవించిన మరి కొందరు భక్తులు మనకు కనబడతారు. వారే పోకల దమ్మక్క. తూము నరసింహదాసు, వరద రామదాసు.

పోకల దమ్మక్క

Dammakka

రామాయణంలో శబరిలాగా రాముని దర్శించి, సేవించి తరించిన ఆదివాసీ మహిళ పోకల దమ్మక్క. ఈమెకే తమ్మల దమ్మక్క అనే పేరు కూడా ఉంది. భద్రాచలానికి ఒక మైలు దూరంలో ఉండే భద్రిరెడ్డి పాలం ఈమెది. భద్రాద్రిలో రాముడికి గుడికట్టించడానికి మూలకారణం ఈమెనే! రాముడు భద్రగిరులలో ఒకచోట చీమల పుట్టలో ఉండిపోయన రోజులలో ఈమెకు కలలో కనబడి తనను బైటికి తీసుకురమ్మని చెప్పాడు. శ్రీరాముని ఆనతిని శిరసావహించి వంద బిందెల గోదావరి జలాలలను నది నుంచి కొండపైకి మోసుకు వచ్చి చీమల పుట్టను కరగదీసి రాముని వెలికి తీసింది. మట్టి నుంచి బైటపడ్డ రామునికి నీడకావాలని పరితపించింది. ‘తాటాకు పందిరే తాటకాంతక నీకు భవనమయ్యా..తాటి పళ్ళే ఓ మేటి రాకుమారా విందులయ్యా..’ అంటూ ఆయనకు తాటి పందిరి వేసి తాటిముంజలను ఆహారంగా అందించింది. కంచర్లగోపన్న పాల్వంచ పరగణాకు తహసిల్దార్‌గా వచ్చాడని తెలిసి రాముడి పరిస్థితి వివరించింది. స్వతహాగా పరమభక్తుడైన గోపన్న రాముడి విగ్రహాలు చూసి పులకించిపోయి ఆయనకు భవ్య మందిరాన్ని నిర్మించాడు.

ఒకనాడు ఆరోగ్యం బాగోక ఆమె లేవలేని స్థితికి చేరింది. ఆ పరిస్థితుల్లో కూడా తన గురించికాక రాముడి గురించే బాధపడింది. ఆయనకు ప్రసాదం ఎలా అని విలవిలలాడింది. తన కూతుర్ని పిలిచి రాముడు ఆలస్యమైతే రాముడు ఆకలికి ఆగలేడనీ, ముంజలు ప్రసాదంగా పెట్టి రమ్మని చెప్పింది. ఆ పాప రాముడికి ప్రసాదం పెట్టి తినమని కోరింది. రాముడిలో చలనం కనిపించలేదు. ఒకటికి పదిసార్లు కోరిన ఆ పాప బోరున యేడవడం మొదలుపెట్టింది. నువ్వు తినకపోతే మా అవ్వకు మొహం ఎలా చూపించాలి. నీ ఆకలి ఎలా తీరాలి అంటూ వాపోయింది. రాముడు ఆ పాప భక్తికి కరిగి ప్రత్యక్షమయ్యాడు. ఆమె ప్రేమగా ముంజలు పెడుతుంటే తిని ఆనందపరిచాడు. సంతోషం తట్టుకోలేకపోయిన ఆ పాప అవ్వ దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళి జరిగిన విషయం చెప్పింది. ఆమె మాటలు నమ్మలేకపోయిన దమ్మక్క కొండకు వచ్చి అక్కడ ప్రసాదం తిన్న గుర్తులు చూసి ఈ అదృష్టం నాకు కలిగించలేదేమని విలపించింది. రాముని మనసా వాచా కొలిచి ఆయనలోనే విలీనమైంది. ఇంతకాలం మౌన ప్రేక్షకురాలిగా ఉండిపోయిన దమ్మక్కకు ఇటీవల మంచి గుర్తింపు లభించింది. ఆమె జ్ఞాపకంగా దమ్మక్క సేవా యాత్ర మేళతాళాలతో, సాంస్కృతిక వైభవం ఉట్టిపడేలా జరుగుతోంది.

తూము లక్ష్మీనరసింహదాసు

dasu

పాలవంచ పరగణాకు వచ్చిన మరో తాసిల్దార్ అపర రామదాసుగా పేరు గడించినవాడు తూము లక్ష్మీనరసింహదాసు. ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరుజిల్లాకు చెందినవాడు. అప్పయ్య, వెంకమాంబ దంపతులకు జన్మించినవాడు. మంగళగిరి నరసింహుని పేరులో నిలుపుకున్నా పరమ రామభక్తుడు అపరరామదాసుగా విఖ్యాతుడైనవాడు నరసింహదాసు. తెలుగు, సంస్కృతం, సంగీత విద్యలలో పట్టు ఉన్న నరసింహదాసు గొప్ప తత్తవేత్త. ఉదారస్వభావి. కంజీరా వాయించడంలో చెయ్యిదిరిగినవాడు. కీర్తనలను ఆశువుగా పాడి భక్తుల మనసునేకాదు భగవంతుడి మనసునూ గెలుచుకున్నవాడు. మొదట్లో కొంతకాలం రెవెన్యూ విభాగంలో ఉద్యోగం చేసినా మానేసి భద్రాచలానికి మకాం మార్చి రామసన్నిధిలో తరించాడు. రామాలయంలో ఇప్పటికీ అనుసరించే నిత్యకళ్యాణాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, పునర్వసు ఉత్సవాల వంటి పది రకాల ఉత్సవాలు, సేవలు తీసుకునవచ్చాడు. వీటిని దశవిధ ఉత్సవాలు అంటారు. ఏ సేవ ఎలా చేయాలో నిర్దేశించి ఉత్తర్వులు జారీ చేశాడు. నిత్యకైంకర్యాలు ప్రభటసేవ నుంచి పవళింపు సేవ వరకు జరిగే అన్ని రకాల సేవలలో పాడుకోడానికి వీలుగా పలు కీర్తనలు రచించాడు. నరసింహదాసుకు లయ జ్ఞానం చాలా ఎక్కువ. అందుకని ఆయన పాడుతూ దానికి తగ్గట్టుగా నాట్యం కూడా చేసేవాడు. జులువ తాళం అని ఒక కొత్త రకం తాళాన్ని కూడా సంగీతంలో ప్రవేశపెట్టాడు.

మారువ వంటి అరుదైన రాగాలలో కూడా కీర్తనలు ఆలపించాడు. రామభక్తితో పరవశించి పాడడంలో, భావావేశం పొందడంలో ఈయనకు రామదాసు, త్యాగరాజు ఆదర్శంగా నిలిచారు. సాహిత్య పోకడలలోనూ వారి ప్రభావం స్పష్టంగా కనబడుతుంది. భద్రాచల రామదాసు ఉన్నాడో లేడో భద్రాద్రియందు అని అసావేరి రాగంలో ఒక కీర్తన రాస్తే నరసింహదాసు కలడో లేడో శ్రీరాముడు అంటూ రీతిగౌళలో ఒక కీర్తన రచించాడు. త్యాగరాజు విడెముసేయవే అని సంప్రదాయ కీర్తన రాస్తే ఈయన కప్పురంపు విడెము సేయవే అని కాపీ రాగంలో కీర్తించాడు. మొత్తంగా ఎన్ని కీర్తనలు రచించాడో అంచనాకు అందలేదు కానీ 120 కీర్తనలు దొరికాయి. ఈయన కీర్తనల్లో తన పేరునే ముద్రగా నిలిపాడు. భక్తిభావం పొందిపొరలే ఈ కీర్తనలు మధురస గుళికలు. కీర్తనలతోపాటే ఈయన చూర్ణికలు, ద్విపదలు, కంద, సీస పద్యాలు, పంచచామర పద్యాలు, తోహ్రాలు రచించాడు. భద్రాచలం నుంచి తిరువాయూరు వెళ్ళిఆయన అక్కడ త్యాగరాజస్వామివారిని దర్శించుకున్నాడు. రామనామామృతమే నీకు అనే కీర్తనను ఈ సందర్భంగా రచించాడు.

వరద రామదాసు


రామదాసు తర్వాత అంత పేరు సంపాదించుకున్న రామభక్తుడు వరదరామదాసు. తూము నరసింహదాసుకు అత్యంత సన్నిహిత మిత్రుడు. తమిళనాడులోని కంచివరానికి చెందినవాడు. భద్రచలం తహసీల్దార్ కార్యాలయంలో ఇద్దరూ సహోద్యోగులుగా పనిచేశారు. భద్రాచలం ఆలయంలో వీరు నిత్యపూజలు చేసేవారు. భ ద్రాచల క్షేత్రంలో పర్వదినాలు, సేవలు, ఉత్సవాలు ఏర్పరచి వాటిని విజయవంతంగా నిర్వహించి ఈ క్షేత్రానికి వీరు గొప్ప గుర్తింపు తెచ్చారు. వీరు జారీచేసిన హుకుంనామాలు ఇప్పటికీ ఆలయ నిర్వాహకులకు శిరోధార్యాలుగా ఉన్నాయి. ప్రతీరోజూ జరిగే మేలుకొలుపు, అభిషేకం, కళ్యాణం, తదితర సేవలకు తోడు నెలనెలా వచ్చే పునర్వసు నక్షత్రం రోజున పునర్వసు ఉత్సవం చేయడం అనే సంప్రదాయానికి వీరే ఆద్యులు. ఈ నక్షత్రోత్సవం యేడాది మొత్తం మీద 13 సార్లు వస్తుంది. ఈ ఉత్సవం 10 రోజుల పాటు జరుగుతుంది. ఇది పగల్పత్తు ఉత్సవం కావడం వల్ల పగటిపూట గోదావరి తీరాన పునర్వసు మంటపంలో దీన్ని నిర్వహిస్తారు. ఈ ఉత్సవ సమయంలో సంప్రదాయ కీర్తనలను శ్రవణానందంగా గానం చేస్తారు. వరదరామదాసు కాలధర్మం చెందినందుకు ఎంతో కుంగిపోయిన తూము నరసింహదాసు ఆయన అస్థికలను గోదావరిలో కలిపేందుకు వెళ్ళి నీట మునిగి శరీరత్యాగం చేశాడు. నరసింహదాసు పూజచేసుకున్న విగ్రహమూర్తులు ఇక్కడే చరిత్ర ప్రసిద్ధికెక్కిన అంబసత్రంలో ఉన్నాయి. ఇక్కడే రామలక్ష్మణులు వంట చేసిన పెద్దపెద్ద గుండిగలు కూడా కనబడతాయి.

కబీర్‌దాసు

Kabir-Dasu1

రామభక్తి సామ్రాజ్యంలో ఓలలాడిన మహాభక్తులలో ప్రధానమైనవాడు కబీరుదాస్. కబీర్ అంటే జ్ఞాని అని అర్థం. జ్ఞాన భక్తికి ఈయన దాసుడు. అందుకే ఈయన గొప్ప సంఘ సంస్కర్తగా కూడా వాసికెక్కిడాడు. ఆర్థికంగా ఆయన ఎంత దారిద్య్రాన్ని అనుభవించాడో రామభక్తిలో అంత కోటీశ్వరుడయ్యాడు. అక్షరజ్ఞానం లేకపోయినా అందరి కళ్ళు తెరిపించే బోధలనెన్నిటినో చేశాడు. ఈయన బోధనలను శిష్యులు అక్షరబద్ధం చేసి కబీరు బీజక్ అని పేరు పెట్టారు. ఈయన రచనలన్నీ దోహా ప్రక్రియలో ఉంటాయి. ఈయన గురువు రామానందుడు..శిష్యుడు రామదాసు. భద్రాద్రిని దర్శించుకున్న కబీరు రామదాసుకు కర్తవ్యబోధ చేసి ఆలయ నిర్మాణానికి ప్రోత్సహించాడు. రామ్ రహీమ్ ఏక్ హై అని నినదించిన కబీరు పూవులోని పరిమళంలాగే దేవుడు నీలోనే ఉంటాడు అని ఉద్బోధించాడు.