Home ఖమ్మం జగమేలుకో

జగమేలుకో

sri-ramవైభవంగా శ్రీరామచంద్రుని పట్టాభిషేకం
రాజ ఠీవీతో దర్శనమిచ్చిన రామభద్రుడు
పట్టువస్త్రాలు సమర్పించిన రాష్ట్ర గవర్నర్ నరసింహన్
కనులారా తిలకించి పులకించిన భక్తులు
మహాకుంభ ప్రోక్షణం, వేద ఆశీర్వచనం, శత అష్టోత్తర శత హరతుల మంగళ నీరాజనాల నడుమ జగమేలే స్వామి జగదభి రామయ్య పట్టాభిషేక మహోత్సవం ఘనంగా సాగింది. ముందురోజు పసువు పస్త్రాలతో భక్తులకు అభయమచ్చిన కల్యాణ రాముడు శనివారం నాడు ముహూర్తాన వజ్రాల కిరీటాన్ని ధరించి రాజఠీవీతో మహారాజులా కనువిందు చేశారు. రుత్వికుల వేద మంత్రోశ్చరణల నడుమ భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వంతో మునిగితేలారు. నేత్ర పర్వంగా సాగిన పట్టాభిషేక మహోత్సవాన్ని చూసిన భక్తులు ఏలుకో… శ్రీరామా…. మమ్మేలుకో… అంటూ భక్తి పారవశ్యంలో మునిగితేలారు. రఘువంశోత్తమ రామా… జయహో… అంటూ భక్తులు పెద్ద పెట్టున జయజయధ్వనాలు చేశారు.
భద్రాచలం: రఘువంశోత్తముడైన శ్రీ సీతారామచంద్రమూర్తి పట్టాభిషేకం శనివారం వైభవోపేతంగా జరిగింది. మిథిలా స్టేడియంలో భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుండగా భద్రాద్రి రామయ్య మేళతాళాలు, భక్తుల రామనామ స్మరణలు,కోలాట నృత్యాల నడుమ ఊరేగింపుగా కళ్యాణ మండప ప్రాంగణంలోని విచ్చేశారు. ఈ సందర్భంగా స్వామివారిని మండపంలో ప్రత్యేక వేదికపై కూర్చుండబెట్టారు. విశ్వక్షేణపూజ, పుణ్యహావచనం నిర్వహించారు. అనంతరం వేదపండితుల మంత్రోశ్చరణల నడుమ పట్టాభిషేక ఘట్టం జరిపించారు. పట్టాభిషేక విశిష్టతను వేదపండితులు భక్తులకు అర్థమయ్యే రీతిలో కన్నులకు కట్టినట్లుగా వివరించారు. పట్టాభిషేకంలో భాగంగా తెల్లవారు ఝామున 4 గం.లకే రామాలయం తలుపులు తెరిచారు. ముందుగా సుప్రభాత సేవ, ఆరాధన, బాలభోగం, నివేదన, సేవాకాలం, బలిహరణం, మంగళశాసనం నిర్వహించారు. ఇందులో భాగంగా నదీ, సముద్ర జలాలు ఉన్న కళశాలను రుత్వికులు శిరస్సుపై పెట్టుకుని తీసుకోచ్చారు. అదేవిధంగా స్వామిని గర్భగుడి నుంచి యాగశాలకు తీసుకోచ్చి ప్రత్యేకపూజలు చేసిన అనంతరం మంగళవాయిధ్యాల నడుమ పల్లకీలో కళ్యాణ మండపానికి కోలాహలంగా తోడుకోచ్చారు. సరిగ్గా ముహూర్తపు వేళ ఉ.10.30 గం. లకు పట్టాభిషేక తంతును శాస్త్రోక్తంగా, వైదిక సాంప్రదాయాను సారం ప్రారంభించారు. ఆ తర్వాత పూజకు వినియోగించే ద్రవ్యాలను సంప్రోక్షణం చేశారు. స్వామికి శ్రీరామ పాదుకలు, రాజముద్రలు సమర్పించారు. అంతే కాకుండా శ్రీ రామదాసు చేయించిన పచ్చల పతకం, చింతాకు పతకం, రాజముద్రతో పాటు రామయ్యకు ఖడ్గం, రామమాఢ, సుదర్శన చక్రం, శంఖుచక్రాలు, ముత్యాలహారం, కిరీటాన్ని సమర్పించారు.
పట్టువస్త్రాలు సమర్పించిన గవర్నర్: రాష్ట్ర ప్రభుత్వం తరుపున తెలంగాణ రాష్ట్ర గవర్నర్ నర్సింహన్ పట్టాభిషేక మహోత్సవానికి ప్రత్యేక హెలీకాప్టర్‌లో విచ్చేశారు. ఈ సందర్భంగా రామాలయంలో పూజలు చేసి పట్టాభిషేక రామునికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు అత్యంత భక్తిశ్రద్ధలతో నెత్తిన పెట్టుకుని మిధిలా స్టేడియానికి చేరుకున్నారు. గవర్నర్ రాకతో ఓక్క సారిగా స్టేడియంలో సందడి వాతారణం నెలకోంది. రాజాధిరాజు రామచంద్ర ప్రభువుకు గవర్నర్ సాంప్రదాయాను సారం పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా చేతులు జోడించి స్వామికి దండాలు పెట్టారు. అనంతరం రామయ్యకు నదీ జలాలతో సంప్రోక్షణ జరిగింది. ఈ జలాలను అర్చకులు భక్తులపై చిలకరింపజేశారు. భక్తులపై సంప్రోక్షణ చేసిన నదీ జలాలను చిలరింపజేసుకోవడం వల్ల సకల పాపాలు హరించుకుపోతాయి మోక్షప్రాప్తి సిద్ధిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు,స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అశ్వరావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ దివ్య,ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి రాజీవ్ గాంధీ హన్మంతు, ఎస్పి లు షహనాజ్ ఖాసీమ్, విష్ణు వారియర్, ఏఎస్పి భాస్కరన్,ఆలయ కార్యనిర్వాహణాధికారి కూరాకుల జ్యోతి, తహశిల్దార్ రామకృష్ణ, సిఐ సారంగపాణి, ఎస్సై కరుణాకర్ తదితరులున్నారు.