Home తాజా వార్తలు రమణీయం శ్రీరామకొండ దివ్య క్షేత్రం

రమణీయం శ్రీరామకొండ దివ్య క్షేత్రం

sri-rama-konda
*భక్తులతో పులకించిన శ్రీరామకొండ
మహబూబ్‌నగర్: రమణీయం శ్రీరామకొండ దివ్య క్షేత్రం వేలాది మంది భక్త జనసందోహంతో శ్రీరామకొంద పులకించిపోయింది. ఆదివారం తెల్లవారుజామున నుంచే కొండకు భక్తులు భారీగా తరలిరావడం జరిగింది. శ్రీరామకొండ దివ్య క్షేత్రంలో వెలసిన కోనేరులో భక్తులు కుటుంబ సమేతంగా స్నానాలు ఆచరించి శ్రీ సీతారాముల వారిని దర్శించుకుని తమ మొక్కులను చెల్లించుకున్నారు. తాము అనుకున్న కోరికలు నెరవేరితే ఈ కొండకు మరో సారి ఎక్కుతామని భక్తులు తమ మదిలో శ్రీరామున్ని వేడుకున్నారు. మహిమగల శ్రీరామకొండ క్షేత్రంలో వెలసిన అనేక రకాల వనమూలికలలో ఒకటైన పెదముష్టి చెట్టును భక్తులు తిరిగి వెళ్లేటప్పుడు ఇంటికి తీసుకెళ్లారు. కొండపై నుంచి తీసుకెళ్లిన వనమూలికలను ఇంటి గుమ్మంపై ఉంచితే ఎలాంటి అనర్ధాలు చోటు చేసుకోవని భక్తుల నమ్మకం. దైవ దర్శనం అనంతరం భక్తులు మునులు, రుషులు, ధ్యానం చేసిన స్థావరాలను కనులారా వీక్షించారు. ఆదివారం ఆమావాస్య సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు దాదాపు 50 వేల మంది శ్రీరామున్ని దర్శించుకోవడం జరిగింది. కొండపై వెలసిన వ్యాపార దుకాణాలు భక్తులతో కిటకిటలాడాయి. నారాయణపేట ఎమ్మెల్యే ఎస్. రాజేందర్‌రెడ్డి తన తండ్రి రాజేశ్వర్‌రెడ్డి జ్ఞాపకార్థకంగా వచ్చి వెళ్లే భక్తులకు 20 వేల వాటర్ ప్యాకెట్లను ఉచితంగా పంపిణీ చేశారు. కోయిలకొండ ఎస్‌ఐ మురళి తన సిబ్బందితో ఎలాంటి సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.