Home సినిమా శ్రీరెడ్డి… మరో సంచలన ట్వీట్!

శ్రీరెడ్డి… మరో సంచలన ట్వీట్!

Sri-Reddy, Sri Reddy's New Tweet On Casting Couch in Tollywood

హైదరాబాద్: టాలీవుడ్‌లోనూ కాస్టింగ్ కౌచ్ కొనసాగుతుందంటూ నటి శ్రీరెడ్డి గత కొన్ని రోజులుగా తీవ్ర ఆరోపణలు చేస్తూ మీడియాలో హల్‌చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు కొనసాగుతున్నాయని, తనకు కూడా చాలా అన్యాయం జరిగిందంటూ పోరాటం చేస్తున్న శ్రీరెడ్డి తాజాగా మరో బాంబు పేల్చింది. శ్రీరెడ్డిలీక్స్ పేరిట ట్విట్టర్‌లో పలువురు టాలీవుడ్ పెద్దల వ్యవహారాలను బయటపెడుతున్న ఆమె శుక్రవారం మరో సంచలన ట్వీట్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పుకుని తెలుగు ఇండస్ట్రీలో కొందరు వ్యక్తులు ఎంతో మంది ఆడవాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నారని ఆమె చెప్పుకొచ్చింది. ఈ ట్వీట్‌లో ప్రధానంగా ఎగ్జిక్యూటివ్ నిర్మాత వాకాడ అప్పారావును లక్ష్యంగా చేసుకొని శ్రీరెడ్డి ఆరోపణలు చేయడం గమనార్హం.

వాకాడ అప్పారావు ఎంతో మంది ఆడవారి జీవితాలను నాశనం చేశాడని, ఆయన చేతిలో బలైనవారిలో 16 సంవత్సరాల చిన్న పిల్లలు కూడా ఉన్నారని తెలిపింది. ‘మెగాస్టార్ చిరంజీవిగారు… ఇతను మీ పేరు చెప్పుకుని ఎంతో మంది ఆడవారి జీవితాలను నాశనం చేశాడు, దయచేసి ఇటువంటి వారిని ప్రోత్సహించకండంటూ’ ఆమె విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలాఉండగా ఇప్పటికే శ్రీరెడ్డికి ఊహించని విధంగా ప్రజా సంఘాలతో పాటు మహిళా సంఘాల నుంచి మద్దతు లభిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ‘మా’ పెద్దలు కూడా ఆమెపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసి ఇండస్ట్రీలో ఎవరైనా శ్రీరెడ్డితో నటించ వచ్చని ప్రకటించారు.