Home భద్రాద్రి కొత్తగూడెం శ్రీ సీతారాముల కళ్యాణం చూతం రారండి

శ్రీ సీతారాముల కళ్యాణం చూతం రారండి

Sita-Ramula-Marriage

భద్రాచలం :  జగదభిరాముని కల్యాణానికి భద్రగిరి ముస్తాబైంది. దక్షిణ భారత దేశంలో అతి పెద్ద పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో పెళ్లి కళ ఉట్టి పడుతోంది. ఆలయ పరిసర ప్రాంతాలతోపాటు సీతారాముల ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రాష్ట్ర నలు మూలల
నుండే కాక పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వేలాదిమంది భక్తులు తరలి రానుండటంతో ఏర్పాట్లు శరవేగంగా పూర్తి చేశారు. ప్రతిఏటా భద్రాచలంలో జరిగే రాముల వారి పెళ్లి కన్నులారా వీక్షిస్తే అక్షయమైన అశ్వమేధ యాగఫలం లభిస్తుందని ప్రతీక. అందుకే రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా
ఇతర రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, రాష్ట్రాల నుంచి కూడా సుమారు రెండు లక్షల వరకు భక్తులు రావచ్చని అంచనా వేస్తున్నారు.

5వ తేది బుధవారం శ్రీరా మ నవమి, 6న పట్టాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు సిద్ధ్దం చేశారు. లోకకల్యాణార్ధం జరిగే శ్రీసీతారాముల వివాహం వేడుక భక్తరామదాసు చేయించిన మంగళ సూత్రాలతో అమ్మవారికి మాంగళ్యధారణ , ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సీతారాములకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీసుకు రానున్నారు. ఎక్కడ చూసిన భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా చేసారు. భక్తులు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మిధిలా స్టేడియంలో చలవ పందిర్లు ఏర్పాట్లు చేశారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది రామయ్య కల్యాణాన్ని చూసి తరించేందుకు భక్తులు భారీగ వస్తున్నారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులతో భద్రాద్రి కిటకిట లాడుతోంది. ఏ ప్రాంతంలో చూసిన రామ నామ స్మరణతో మారు మ్రోగుతుంది. నూతన వదూవరులైన సీతారాముల పెళ్లిని మిధిలా స్టేడియంలో వీక్షించేందుకు వెయ్యికళ్లతో భక్తులు ఎదురుచూస్తున్నారు.

శోభాయమానంగా రామాలయం …
శ్రీ సీతారాముల కల్యాణం సందర్భంగా భద్రాద్రి రామాలయాన్ని సర్వాంగా సుందరంగా తీర్చిదిద్దారు. విధ్యుత్ దీపాలవెలుగులతో రామాలయం నూతన శోభను సంతరించుకుంది. కరకట్ట ఆలయ పరిసరాలు పావన గోదావరి నదిపై ఉన్న వంతెనను సైతం రంగురంగుల దీపాలతో తీర్చి దిద్దారు.కళ్యాణ తంతును నిర్వహించేందుకు మిధిల స్టేడియం ముస్తాబైంది. ఛాందిని వస్త్రాలు, కలకత్తా పెండాల్స్‌తో పాటు పెళ్లి వేదికను చలువ పందిర్లతో ఏర్పాటు చేశారు. స్వామి వారి కళ్యాణం జరిపించేందుకు మండపాన్ని చక్కగ తీర్చి దిద్దారు.మండపం ముందున్న గజరాజులతో పాటు మండపాన్ని ప్రత్యేకంగా తెప్పించిన పూలతో ముస్తాబు చేస్తున్నారు. రామయ్యకళ్యాణాన్నివీక్షించేందుకు దేవస్ధానం వారు టికెట్ల విక్రయించేశారు.ఇక స్వామివారి కళ్యాణ తంతు వీక్షించేందుకు మిధిలా స్టేడియంలో ఎల్‌ఈడి తెరలు ఏర్పాటు చేశారు.

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు…

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సీతా రాములు వివాహానికి పట్టు వస్త్రాలు ,ముత్యాల తలంబ్రాలు తీసుకురానున్న సందర్భంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుచేశారు.జిల్లా ఎస్పీ అంబర్ కిషోర్ ఝా నేతృత్వంలో భద్రా చలం ఏఎస్పి సునీల్ దత్ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. స్పెషల్ పార్టీ పోలీసులు,సిఆర్‌ఫిఎఫ్ స్కాడ్ ఇతర పోలీసు ఉన్నాధికారులులతో ఏర్పాటు చేసి నిఘా నేత్రాలను అప్రమత్తం చేశారు. కళ్యాణం తిలకించే సామాన్య భక్తులకు, వివిఐపి, విఐపిలకు ఎటువంటి ఇబ్బందులు తలేత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కల్టెర్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఆర్టీసి బస్టాండ్ భక్తులతో కిటకిటలాడింది. భక్తులకు సమాచారాన్ని అందించేందుకు పబ్లిక్ అడ్రసింగ్ సెంటర్లు, ముత్యాల తలంబ్రాలు, ప్రసాదాలు భక్తులకు అందించేందుకు పలు ప్రాంతాల్లో స్పెషల్ కౌంటర్లు పెట్టారు.