Home దునియా శ్రీ బుగులు వేంకటేశ్వర శతకం

శ్రీ బుగులు వేంకటేశ్వర శతకం

Sri-Venkateswara-Bugulu-Sat

శతకావిర్భావం నన్నయ్య ఆంధ్రీకరించిన మహాభారతంలోని ఉదంకోపాఖ్యానంలో “యయ్యహిపతి మాకు బ్రసన్నుడయ్యెడున్‌” అనే నాలుగు పద్యాలలో ఛాయామాత్రంగా కనిపిస్తుంది. కానీ, తెలుగులో మొదటి శతకం పాల్కురికి సోమనాథుడు రాసిన ‘వృషాధిప శతకము’ గానే పరిశోధకులు నిర్ధారణ చేశారు. అప్పటినుండి నిరంతర స్రవంతిలా శతకం నేటికీ తెలుగు సాహిత్యంలో విరాజిల్లుతూనే ఉంది. అలా నేటికీ తెలుగులో వేలాది శతకాలు వచ్చి, ఆ ప్రక్రియను ప్రథమ స్థానంలో నిలబెట్టుతున్నాయి.

శతకం ముక్తకాల సముదాయం, కొన్ని ఛందోబంధనాలు అనివార్యంగా ఉంటాయి. ఒక పద్యానికీ మరొక పద్యానికీ సంబంధాలుండనవసరం లేదు. మకుటధారిగా ఉంటుంది. ఏక ఛందోరూపం ధరిస్తుంది. అన్ని సామాజిక అంశాలను ఇముడ్చుకుంటుంది. మనిషికి సాంస్కృతిక, ఆర్థిక, ఆధాత్మిక, పారమార్ధిక ఇలా ఎన్నింటినో స్పృశిస్తుంది. ప్రస్తుతం నెల్లుట్ల రాధాకిషన్ రావు గారు తన విశేష అనుభవసారంతో, భక్తి ప్రపూరితంగా 108 పద్యాలతో ‘శ్రీ బుగులు వేంకటేశ్వర శతకము’ను వెలువరించినారు. ఈ స్వామి వరంగల్లు జిల్లా ఘన్‌పూర్ (స్టే) ప్రాంతంలోని చిలుపూరు గుట్ట మీద కొలువుదీరినాడు. రాధాకిషన్ రావుగారు వంశపారంపర్యంగా ఆ దేవున్ని ఆరాధిస్తూ ఉన్నారు.

సంప్రదాయయుక్తంగా శ్రీకారంతో ఈ శతకం ఆరంభమవుతుంది. “నీట మునిగిన కుండలో నీరుజేరి/ బయట లోపలంతట బరుగు నీరు/ అట్లెమాలోన బయటను అమరినావు” అని వేంకటేశ్వరు కని సాదృశ్యమానం చేసుకున్నాడు. “ఇంటి యజమాని నొక్కని నింటివారు/ వేరు వేర్వేరు వరుసల పిలిచినట్లు / వేయి నామాల నుతియింత్రు వివిధ జనులు” వంటి పద్యపాదాలు కవి యొక్క లోకజ్ఞతలను పట్టిచూపినాయి. మహా విష్ణువు దశావతారాలను పది పద్యాల్లో సులభంగా చెప్పారు. అయితే తొమ్మిదవ అవతారంగా బుద్ధున్ని చెప్పడం కొంత ఆలోచించాల్సిందే. ఎందుకంటే, బుద్ధుడే స్వయంగా హేతుబద్ధంగా ఆలోచించాలన్నాడు. కానీ,మన సంప్రదాయవర్గం బుద్ధున్నే అవతారవర్గంలో కలిపేశారు మరి! అదట్లా ఉంచుదాం.

రాధాకిషన్‌రావు వినయశీలి. అందుకే, “పాట వినిపింప సంగీత ప్రజ్ఞ లేదు/ నాట్య రీతులు యెరుగను నాట్యమాడ/ మాట కారిని గాను నీ మహిమ బొగడ” అంటున్నాడు. కవి సామాజిక బాధ్యత వహిస్తున్నడనడానికి “అన్న పానీయములు కొంటి మధిక ధరకు/ ప్రాణవాయువునిక కొనవలసివచ్చు / నట్టి దౌర్భాగ్యస్థితి నుండి అవనిగాయు,” మంటూ మానవతావాదిగా నిరూపించుకున్నాడు. శతకం చివరి ఐదు పద్యాల్లో స్వవిషయంగా స్వామిని వేడుకొంటూ కూడా రాశాడు.

చక్కని తేటగీతి పద్యాల్లో ‘సంకట వినాశ! బుగులు శ్రీ వేంకటేశ” అనే మకుటంతో పన్నిద్దాళ్వారులను స్మరించడంతో పాటు, అనేక అంశాలను ఈ శతకంలో పేర్కొన్నాడు కవి- గతంలో రాసిన శ్రీ వేణుగోపాల (1988), శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహ శతకం(1994), శ్రీరామ చరితం (2000) వంటి వాటి అనుభవంతో చక్కని ధారాశుద్ధితో రాసిన ఈ శతకం ఈ ప్రక్రియలో మకుటాయ మానంగా నిలుస్తుంది. ప్రచురించిన శ్రీ పోతన విజ్ఞాన పీఠం- వరంగల్లు నిర్వాహకులు శ్రీ నమిలికొండ బాలకిషన్‌రావు అభినందనీయులు.

శ్రీ బుగులు వేంకటేశ్వర శతకం -కవి- నెల్లుట్ల రాధాకిషన్‌రావు, పుటలు : 32, వెల రూ.50/- ప్రతులకు : రచయిత # 2-32, ఆబాది ఘనపురం (స్టే), వరంగల్లు జిల్లా -506144.