Search
Saturday 22 September 2018
  • :
  • :

తొలి విజయం కోసం లంక కసరత్తు!

Srilanka

కోల్‌కతా: భారత గడ్డపై ఇప్పటి వరకు ఒక్క టెస్టు మ్యాచ్‌లో కూడా నెగ్గని శ్రీలంక జట్టు ఈసారైనా ఈ చెత్త రికార్డును చెరిపి వేయాలనే పట్టుదలతో ఉంది. దినేష్ చండీమల్ సారథ్యంలోని లంక జట్టు మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్‌తో తలపడనుంది. ఈ సిరీస్‌పై లంక భారీ ఆశలనే పెట్టుకుంది. ఇటీవల సొంతగడ్డపై భారత్ చేతిలో ఘోర పరాజయం చవిచూసిన లంక తర్వాత యూఎఇలో పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఘన విజయం సాధించింది. ఈ విజయం లంకలో ఆత్మ స్థైర్యాన్ని పెంచింది. అయితే తర్వాత జరిగిన వన్డే, టి20 సిరీస్‌లలో ఘోర పరాభవం పాలైంది. ఇదిలావుండగా టెస్టుల్లో చండీమల్ సారథిగా ఉండడం లంకకు ఊరటనిచ్చే విషయం. అంతేగాక రంగన హెరాత్ రూపంలో మ్యాచ్ విన్నర్ బౌలర్ వారికి అందుబాటులో ఉన్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయడంలో చండీమల్‌కు పెట్టింది పేరు. స్పిన్‌కు సహకరించే భారత పిచ్‌లపై హెరాత్ లంకకు ప్రధాన అస్త్రంగా మారనున్నాడు. హెరాత్ చెలరేగితే భారత బ్యాట్స్‌మెన్‌కు ఇబ్బందులు తప్పక పోవచ్చు. ఇక, దిల్రువన్ పెరీరాను కూడా తక్కువ అంచనా వేయలేం. అతను కూడా మెరుగైన బౌలర్‌గా పేరు తెచ్చుకున్నాడు. భారత పిచ్‌లపై అతను తన స్పిన్‌తో చెలరేగే అవకాశాలను కొట్టి పారేయలేం. ఇక ఫాస్ట్ బౌలర్ లక్మల్ రూపంలో మరో పదునైన అస్త్రం లంకకు అందుబాటులో ఉంది. టెస్టుల్లో లక్మల్‌కు మంచి రికార్డే ఉంది. ఈసారి కూడా జట్టుకు అండగా నిలువాలనే పట్టుదలతో ఉన్నాడు. చైనామెన్ బౌలర్ లక్షన్ సండకన్ కూడా మ్యాచ్ విన్నర్ బౌలర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఆడింది కొన్ని టెస్టులే అయినా తన పదునైన చైనామెన్ బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు కొరకరాని కొయ్యగా మారాడు. అతన్ని ఎదుర్కొవడం భారత్‌కు అనుకున్నంత తేలిక కాదనే చెప్పాలి. బ్యాటింగ్‌లో కూడా లంక మెరుగ్గానే ఉంది. కెప్టెన్ చండీమల్‌కు టెస్టుల్లో మంచి రికార్డే ఉంది. ఇప్పటికే అతను ఈ ఫార్మాట్‌లో తొమ్మిది సెంచరీలు సాధించాడు. ఈసారి కూడా జట్టు అతనిపై భారీ ఆశలే పెట్టుకుంది. ఇక, కరుణరత్నె రూపంలో మరో ప్రపంచ స్థాయి బ్యాట్స్‌మన్ ఉండనే ఉన్నాడు. ఇటీవల కాలంలో కరుణరత్నె ప్రపంచ క్రికెట్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఎటువంటి బౌలింగ్‌నైనా చిన్నాభిన్నం చేసే సత్తా అతనికుంది. ధనంజయ డిసిల్వాను కూడా తక్కువ చేసి చూడలేం. అతనికి కూడా మంచి రికార్డే ఉంది. తక్కువ సమయంలో మెరుగైన బ్యాట్స్‌మన్‌గా పేరు తెచ్చుకున్నాడు. తిరిమన్నె రూపంలో మరో స్టార్ బ్యాట్స్‌మన్ జట్టులో ఉన్నాడు. తనదైన రోజు ఎంతటి బౌలింగ్ లైనప్‌నైనా చిన్నాభిన్నం చేసే సత్తా అతని సొంతం. వికెట్ కీపర్ డిక్వెల్లా ఈ సిరీస్‌లో లంకకు ప్రధాన అస్త్రంగా మారాడు. అతనిపై జట్టుకు భారీ ఆశలే ఉన్నాయి. అంతేగాక మాజీ కెప్టెన్ మాథ్యూస్ రూపంలో ప్రపంచ స్థాయి ఆల్‌రౌండర్ జట్టుకు అందుబాటులో ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో లంక సిరీస్‌పై భారీ ఆశలే పెట్టుకుంది. అయితే ప్రపంచంలోనే ఉత్తమ జట్టుగా వెలుగొందుతున్న భారత్‌ను వారి సొంత గడ్డపై ఓడించడం లంకకు ఊహించినంత తేలిక కాదు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కోహ్లి సేన ఎదురులేని శక్తిగా మారిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో లంక తన లక్ష సాధనలో ఎంత వరకు సఫలం అవుతుందో వేచి చూడాల్సిందే. ఇరు జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ ఈ నెల 16న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్‌లో ప్రారంభమవుతోంది.

Comments

comments