Home ఎడిటోరియల్ ‘సిసి’ నిఘా కింద ఎస్‌ఎస్‌సి పరీక్షలు!

‘సిసి’ నిఘా కింద ఎస్‌ఎస్‌సి పరీక్షలు!

SSC

సిసి కెమెరాల నిఘా నీడన ఎస్‌ఎస్‌సి పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం చేస్తున్న కసరత్తు, విద్యార్థు లు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయ వర్గాలలో తీవ్రమైన కలకలం రేపుతోంది. పదవతరగతి పరీక్షలు భవిష్యత్ జీవితానికి పునాదిగా, ప్రతిభకు కొలమానంగా భావించడం వల్ల ఈ పరీక్షలు ప్రతిష్టా త్మకమైనవిగా, ప్రతిష్టకు సంబంధించినవిగా మారిపోయాయి. తద్వారా మార్చి, ఏప్రిల్ మాసాలు అందరికి పరీక్షా కాలంగా మారిపోయింది. మెరుగైన ఫలితాలు, ర్యాంకులు సాధించాలనే ఏకైక లక్షంతో పది పరీక్ష లు అనేక అక్రమాలకు, అవినీతికి, తప్పుడు పద్ధతు లకు ఆలవాలమైనట్లు అనేక విమర్శలకు గురి అవు తున్నవి. పదిలో సాధిస్తున్న ఫలితాల శాతానికి, ఇంటర్మీడియట్ ఫలితాల శాతానికి ఏ మాత్రం పొంతనలేకపోతున్న విషయాన్ని పలు సర్వేలు చెబు తున్నాయి. విషయం న్యాయస్థానం వరకు పోవడం, సామాజిక ఆర్థిక కోణంలో సమస్యను పరిశీలించ కుండా, మాల్‌ప్రాక్టీస్, అక్రమాలను అరికట్టడానికి సిసి కెమెరాలు పెట్టండి అని అదేశించడం, అందుకు ప్రభుత్వం సిద్ధపడడం వల్ల సుమారు మూడు లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయ వర్గాలు ఆందోళన చెందుతున్నారు.

ప్రపంచీకరణ, సరళీకరణ విధానాలు సాంకేతిక విప్లవాన్ని సృష్టించి, అరచేతిలోనే సమాచారాన్ని చేర వేస్తున్నాయి. తద్వారా ప్రతిదీ మార్కెటీకరణ కావించ బడి అందులో భాగంగానే విద్య వ్యాపారీకరణ, కార్పొరేటీకరణ, విద్యా మాఫియాను సృష్టించింది. దానికి ప్రభుత్వ అండదండలు లభించడంతో, విద్య లాభసాటి వ్యాపారంగా మారిపోయింది. తల్లిదండ్రు లు కూడా తమ పిల్లలకు మెరుగైన విద్య (కార్పొరేట్ విద్య మెరుగైనది ఎంతమాత్రంకాదు) అందించాలని శక్తికి మించి అప్పులు చేసి ప్రైవేట్ బడుల్లో చదివిం చాలని నిర్ణయానికి వచ్చే విధంగా మార్కెట్ వారి మైండ్‌సెట్‌ను మార్చివేసింది. కార్పొరేట్ శక్తులు విద్య ను తమ గుప్పిట్లో పెట్టుకొని లక్షలాది రూపాయలు ఫీజులు, డొనేషన్లు ఇతరేతర రూపంలో వసూలు చేస్తూ, తదనుగుణమైన ఫలితాలు రాబట్టడం కోసం ఎంతటి అక్రమాలకైనా పాల్పడడానికి వెనకాడడం లేదు. ఈ శక్తులు విద్యను డబ్బుపెట్టి కొనుక్కునే మార్కెట్ సరుకుగా మార్చివేశాయి. ఈ క్రమంలో వసతుల లేమితో, నిబద్ధత లోపంతో కొట్టుమిట్టాడు తున్న ప్రభుత్వ పాఠశాలలు, అందమైన భవంతులు, హంగు ఆర్భాటాలతో ఏర్పడిన ప్రైవేటు విద్యాసంస్థల పోటీని తట్టుకొని నిలబడలేకపోతున్నాయి.

దానికి తోడు ప్రభుత్వం చేయిస్తున్న అడ్డమైన పనులు, అడ్డదిడ్డమైన విధానాలు, ప్రభుత్వ ఉపాధ్యాయ వర్గం పైన తీవ్రమైన ఒత్తిడి ఏర్పరచి, అనివార్య పరిస్థితిలో పది పరీక్షల్లో అక్రమాలు జరిగే స్థితి ఏర్పడింది. వ్యవస్థలో ఉన్న వ్యక్తుల స్వభావాలు ఆ వ్యవస్థ అనుస రిస్తున్న విధానాలకు ప్రతిబింబాలు మాత్రమే అనే విషయం అందరం గ్రహించాలి. కొన్ని సంవత్సరా లుగా పాఠశాల విద్యారంగంలో ప్రభుత్వం అనేక ప్రయోగాలు, నూతన కార్యక్రమాలు చేపట్టి, ప్రస్తుతం సిసిఇ విధానం అమలు జరుగుతుంది. ఈ విధానం లో విద్యార్థులు క్రియాశీలక భాగస్వామ్యం కలిగి, ఉపాధ్యాయుడు కేవలం మార్గదర్శి పాత్రకే పరిమితం కావడం, విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేని స్వేచ్ఛా యుత వాతావరణంలో విద్యను అభ్యసించడం ప్రధాన లక్షం. తదనుగుణంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు సిసిఇ విధానానికి సన్నద్ధులు అయ్యే దశ కొనసాగుతుంది. ఈ దశలో సిసి కెమెరాలు పెట్టి ఎస్‌ఎస్‌సి పరీక్షల నిర్వహణ హాస్యాస్పదంగా ఉంది, ఇప్పటికే అంతంత మాత్రంగా నడుస్తున్న ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు భయకంపితులై పరీక్షలు సరిగా రాయక పోవడం వల్ల ఫలితాలు తగ్గిపోయి ప్రభుత్వ పాఠశాలలు ఇంకా బలహీనపడుతాయి. ఇప్పటికే పిల్లలు లేరనే సాకుతో రేషనైలైజేషన్ కత్తి ప్రభుత్వ బడుల మెడ మీద వేలాడుతున్న విషయం అందరికీ తెలిసిందే. సిసి కెమెరాలు పెట్టి భయానక పరిస్థితిలో పరీక్షలు రాయించి, ఫలితాల సాకు చూపించి ప్రభుత్వ బడుల మూసివేత కార్యక్రమం కొనసాగింపులో భాగంగా ఈ విధానం ముందుకు వచ్చినట్లు విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. అసలు ఎలాంటి మాస్ కాపీయింగ్‌కు ఆస్కారం లేనటు వంటి సిసిఇ విధానం పరిశీలిస్తే ఎవ్వరికైనా అవగతం అవుతుంది.
సిసిఇ (కాంప్రిహెన్సివ్ కంటిన్యూస్ ఎవాల్యు యేషన్) పద్ధతి ప్రకారం పరీక్ష విధానాన్ని రెండు రకాలుగా విభజించారు. ఒకటవది, ఇంటర్నల్-ఇరవై మార్కులు, రాతపని, సామాజిక, సమకాలీన అంశాల ప్రతిపాదన, ప్రాజెక్ట్‌పని లఘుపరీక్షలనే నాలుగు అంశాల పరిశీలన ఆధారంగా కేటా యించాలి. రెండవది-ఎనభైమార్కుల రాతపరీక్ష, ఆరు అంశాల ఆధారంగా పరీక్షించాలి(సబ్జెక్ట్‌ను బట్టి సామర్థాలు ఉంటాయి). రెండుదశల్లో పరీక్ష విధానాన్ని పరిశీలిస్తే విద్యార్థులు అరవైమార్కుల వరకు ప్రశ్నపత్రం ఆధారంగా స్వంతంగా ఆలో చించి పొందగల్గుతారు. మార్కులు కూడా నాలుగు, రెండు, ఒకటి, అరగా కేటాయించారు. ఏది ఏమైనా ఫెయిల్‌శాతం చాలాతక్కువగా ఉంటుంది, మాల్ ప్రాక్టీస్ ఏమాత్రం ఆస్కారం లేనటువంటి ఈ విధానంలో అక్రమాలను అరికట్టడానికి సిసికెమెరాల నిఘావిధానం పరిష్కారం కాదు. ఫలితాలను ఇవ్వ దు. కార్పొరేట్ శక్తుల దోపిడి విధానాల వల్ల, అవినీతి అక్రమాలు, నేర స్వభావం తీవ్రవాదం లాంటి సమస్యలు సమాజంలో పుట్టుకవచ్చాయి.

వ్యవస్థే మనిషిని చట్టబద్ధంగా అవినీతి అక్రమాలవైపు నడిపి స్తున్నప్పుడు, మళ్లీ యంత్రాల సహాయంతో జరుగు తున్న తప్పులను అరికట్టాలనుకోవడం మరో మార్కెట్ దోపిడీ విధానమే కానీ, మార్పును ఆశించి చేస్తున్న పని ఎంతమాత్రం కాదు. ఇక సిసి కెమెరాలు పెట్టా లనే ప్రభుత్వ నిర్ణయం వెనక అసలు మర్మం మార్కెట్ శక్తుల క్రయ, విక్రయ ఎత్తుగడ మాత్రమే. బహుళ జాతి కంపెనీలు సాఫ్ట్ వేర్ పరికరాలను కుప్పలు తెప్ప లుగా ఉత్పతి చేస్తున్నాయి. ఉత్పత్తికి తగిన మార్కెట్ కావాలి. ఆ పని ప్రభుత్వం ద్వారానే చేయించి, వస్తువులను అమ్ముకోవాలనే ఎత్తుగడల నుండి పుట్టిన ఆలోచనే ఈ విధానం ముఖ్య ఉద్దేశం. దానికి కోర్టుల మద్దతు లభించడం, ప్రభుత్వం అసలు సమస్యలను పక్కకు పెట్టి ఈ విధానానికి ఉత్సాహం చూపడంతో సిసి కెమెరాలు పెట్టడానికి కసరత్తు జరుగుతుంది. అధికారిక లెక్కల ప్రకారం ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలు 1250, పదవ తరగతి పరీక్షా కేంద్రాలు 2600, మొత్తం కలిపి 3850 పరీక్షా కేంద్రాలలో వేలాది సిసి కెమెరాలు, మానిటర్స్, కంప్యూటర్ సిస్టమ్స్ అవసరం అవుతాయి. ఈ మొత్తం ప్రాజెక్టు వెనక ఒక కాంట్రాక్ట్, కమీషన్లు షరా మామూలే.

మనుషుల్ని అనుమానిస్తూ, వారు చేసే పనిమీద నిఘా పెట్టే కార్పొరేట్ సంస్కృతిని విద్యావ్యవస్థలోకి తీసుకు రావడం అవమానకరం. ఆక్షేపణీయం. ఎలాంటి నైపుణ్యం శిక్షణ లేనటువంటి వ్యక్తుల్ని ఉపాధ్యా యులుగా పెట్టుకొని, నామమాత్రపు జీతాలు ఇస్తూ, లాభదాయక విద్యా వ్యాపారం చేస్తున్న ప్రైవేటు విద్యాసంస్థల ర్యాంకుల బాగోతం నుండి పుట్టక వచ్చిన మాల్‌ప్రాక్టీస్ విధానాన్ని అరికట్టడానికి, సమస్య మూలాల్లోకి వెళ్లి పరిశీలించి, శాశ్వత పరి ష్కారం కనుగొనే విధంగా ప్రభుత్వ విధానం ఉండా లి. అంతేకాని, అన్ని సమస్యలకు మందు, సిసి కెమెరాలే అనడం అర్థరహితం. అసలు సమస్య ఏంటంటే ప్రభుత్వం పునాదిని విస్మరించి, ఉపరి తలాన్ని సంస్కరించే ప్రయత్నం చేస్తుంది. అత్యున్నత ప్రభుత్వ యంత్రాంగంనుండి కుటుంబ స్థాయి వరకు ప్రాథమిక స్థాయివిద్యా విధానాన్ని గాలికి వదిలేసి, పదవ తరగతికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంలోనే సమస్య మొదలౌతుంది. ప్రాథమిక స్థాయినుండే విద్యార్థులకు ఒక బలమైన పునాది, మెరుగైన విద్యా విధానం, చిత్తశుద్ధితో పనిచేయు ఉపాధ్యాయ వర్గాన్ని తయారు చేయాలి. అందుకు తగిన భౌతిక వసతులు కల్పించి, ఉపాధ్యాయుల సమస్యలేంటో ఓపెన్‌మైండ్ తో డెమాక్రటిక్‌గా చర్చ చేయాలి. కాంట్రాక్టులు, కమి షన్లు, కంటితుడుపు చర్యలు కాకుండా, సమగ్రమైన ఒక విద్యా విధానాన్ని రూపొందించి, కార్పొరేట్ పని సంస్కృతి అయిన సిసికెమెరాల ఆలోచనను ఉప సంహరించుకోవాలి. విద్యార్థులకు కుటుంబ, ఆర్థిక, సామాజిక నేపథ్యాల ఆధారంగా విద్యాప్రణాళికలు జరగాలి. క్రమక్రమంగా కామన్ స్కూల్ విధానం తీసుకురావాలి.
విద్యావ్యవస్థలో నిజమైన మార్పును ప్రభుత్వం ఆశించినట్లయితే తక్షణమే కొన్ని చర్యలను చేపట్టాలి.
* ప్రభుత్వం ప్రాథమిక విద్యను పూర్తిగా నిర్లక్షం చేస్తూ, పదవ తరగతి మీదనే ప్రత్యేక శ్రద్ధ కనబరిచినట్లు దాని కార్యాచరణ ద్వారా తెలుస్తుంది. గత సంవత్సరం పాఠశాల విద్యాశాఖ 16వేల కోట్లు బడ్జెట్ ప్రతిపాదనలు చేయగా, కేవలం 7804 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుంది.
* రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు మొత్తం 25,966 ఉన్నాయి. ఈ సంవత్సరం 18వేలకోట్లు బడ్జెట్ ప్రతిపాదనలు పాఠశాల విద్యాశాఖ తయారు చేసినట్లు సమాచారం. బడ్జెట్‌లో ఈ సారైనా నిధులు ఎక్కువ కేటాయించి, అన్ని పాఠశాలలను ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలలను ఆధునీకరించాలి.
* ప్రాథమిక స్థాయినుండి పదవ తరగతి వరకు పరీక్ష విధానం ఒకేలా ఉండేవిధంగా, సమాన ప్రాధాన్యత ఇవ్వాలి.
* అన్ని విషయాలలో అమెరికాను అనుసరించే ప్రభుత్వ వర్గాలు, అక్కడ ప్రాథమిక విద్యను అధ్యయనం చేసి, వారు ప్రాథమిక విద్యకు ఇస్తున్న ప్రాధాన్యతను, ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకు ఇస్తున్న గౌరవాన్ని, వేతనాలను ఇవ్వాలి. తద్వారా ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో పని చేయగల్గుతారు. కిందిస్థాయి పని విధానాన్ని గౌరవించాలి.
* విద్య వ్యవస్థలో మార్కెట్ సంస్కృతిని తొలగిం చాలి. మార్కెట్ ఎప్పుడు లాభం కోసమే ఆలోచిస్తుంది కాని, పిల్లల సంక్షేమం చూడదు. లాభంకోసం జరిగే ప్రక్రియలో అవినీతి, అక్రమాలకు ప్రముఖ స్థానం ఉంటుంది. విద్యను పౌరనిర్మాణం జరిగే ప్రక్రియగా చూడాలి. అందుకు సంబంధించిన ఆలోచనలు, ఆచరణకు సంబంధించిన ప్రణాళికలు రూపొందించి అమలు పరచాలి.
* కార్పొరేట్ హంగు, ఆర్భాటాల ప్రైవేటు పాఠశాలలను ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని, డబ్బున్న వారికి, పేదలకు సమాన విద్యను అందించే కామన్ స్కూల్ విధానం తీసుకువచ్చి, సమాజంలో ఏర్పడిన అసమాన విభజన రేఖలను తొలగించాలి. అందరికి ప్రభుత్వ పాఠశాలలనుండే నాణ్యమైన విద్య అందించడం ప్రభుత్వ బాధ్యతగా భావించాలి.

– చిలువేరు అశోక్
9492443141