Home తాజా వార్తలు ఓటేద్దాం

ఓటేద్దాం

State Assembly Election Polling Is Today

 

బ్యాలట్ పోరు

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేడే

106 నియోజక వర్గాల్లో ఉ : 7నుంచి సా : 5 వరకు

13 స్థానాల్లో సాయంత్రం 4 గంటల వరకు

హైదరాబాద్ నగరం నుంచి అసంఖ్యాకంగా ఓటర్ల పల్లెబాట

ప్రశాంత ఎన్నికలకు సకల ఏర్పాట్లు
భారీ స్థాయిలో పోలీసు బందోబస్తు
మావోయిస్టు ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ్
పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్ళిన ఇవిఎంలు, వివిప్యాట్‌లు

మన తెలంగాణ/హైదరాబాద్: శాసనసభ ఎన్నికలకు అంతా సిద్ధమైంది. రాష్ట్రంలోని 106 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన సిర్పూర్, చెన్నూర్(ఎస్‌సి), బెల్లంపల్లి(ఎస్‌సి), మంచిర్యాల్, అసిఫాబాద్ (ఎస్‌టి), మంథని, భూపాలపల్లి, ములుగు(ఎస్‌టి), పినపాక(ఎస్‌టి), ఇల్లందు (ఎస్‌టి), కొత్తగూడెం, అశ్వారావుపేట(ఎస్‌టి), భద్రాచలం (ఎస్‌టి) తదితర 13 నియోజకవర్గాల్లో మాత్రం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాష్ట్రం మొత్తం ప్రశాంతంగా పోలింగ్‌ను నిర్వహించేందుకు అని ఏర్పాట్లనూ పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి డాక్టర్ రజత్ కుమార్ వెల్లడించారు. సాయంత్రం 5 గంటలలోపు పోలింగ్ కేంద్రంలోకి వచ్చిన వారందరికీ ఓటు హక్కు వేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. ఇందులో 12 స్థానాలు ఎస్‌టి, 19 స్థానాలు ఎస్‌సి రిజర్వ్‌డ్‌గా ఉండగా, 88 జనరల్ నియోజకవర్గాలుగా ఉన్నాయి.

రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో అన్ని పార్టీల తరఫున పోటీ చేసే వారితో పాటు స్వతంత్ర అభ్యర్థులందరూ కలిపి 1821 మంది పోటీలో ఉన్నారు. సెప్టెంబరు 6న అసెంబ్లీని రద్దు చేయడంతో రాష్ట్రంలో ఎన్నికల సందడి మొదలైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సుమారు మూడు నెలల పాటు ఎన్నికల ప్రచారానికి అభ్యర్థులకు సమయం లభించింది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పుడు నాలుగు రాష్ట్రాలతో పాటు జరుగుతున్న తెలంగాణ ఎన్నికలకు రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో నిర్వహణను కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ప్రతిష్టాత్మంగా తీసుకున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ముగ్గురు కమిషనర్లు రెండు విడతలుగా రాష్ట్రంలో పర్యటించి ఎన్నికల ఏర్పాట్లను, సన్నద్ధతను సమీక్షించాయి.

State Assembly Election Polling Is Today

Telangana Latest News