Home తాజా వార్తలు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు డిసెంబరు 7

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు డిసెంబరు 7

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు డిసెంబరు 7, ఫలితాలు 11

ఒకే రోజు పోలింగ్, నోటిఫికేషన్: నవంబర్ 12, నామినేషన్లకు తుది గడువు: 19, పరిశీలన: 20, ఉపసంహరణ: 22

మొత్తం శాసనసభ నియోజక వర్గాలు: 119, ఎస్‌సి స్థానాలు : 19, ఎస్‌టి : 12

మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరాంలతో పాటు తెలంగాణ షెడ్యూల్‌ను ప్రకటించిన కేంద్ర ఎన్నికల కమిషన్

ts

మన తెలంగాణ / హైదరాబాద్:కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు శనివారం షెడ్యూలు విడుదల చేసింది. డిసెంబరు 7వ తేదీన ఒకే విడతలో మొత్తం 119 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రావత్ ప్రకటించారు. వచ్చే నెల 12వ తేదీన నోటిఫికేషన్ జారీ అవుతుందని, అదే రోజున నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. షెడ్యూలు విడుదల చేయడంతో తక్షణం ఎన్నికల కోడ్ (ప్రవర్తనా నియమావళి) అమల్లోకి వచ్చిందని తెలిపారు. వచ్చే నెల 19వ తేదీ వరకు నామినేషన్లను దాఖలు చేయవచ్చునని, డిసెంబరు 7వ తేదీన పోలింగ్ జరుగుతుందని, అన్ని రాష్ట్రాలకూ కలిపి డిసెంబరు 11వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుందని, డిసెంబరు 15వ తేదీకల్లా ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. ఈ నెల 8వ తేదీన లేదా పదవ తేదీ తర్వాత లేదా 12న షెడ్యూలు ఉంటుందని రకరకాల వ్యాఖ్యలు వినిపించినప్పటికీ వాటిని పటాపంచలు చేస్తూ అక్టోబరు 6వ తేదీనే షెడ్యూలును విడుదల చేసింది. నాలుగు రాష్ట్రాలతో పాటే తెలంగాణకూ ఎన్నికలు వస్తాయని ఊహించినప్పటికీ చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాం రాష్ట్రాల తర్వాత చివరి విడతలో పోలింగ్‌ను నిర్వహించేలా షెడ్యూలును రూపొందించింది.
సవరణకు తగినంత సమయం ఉంది : రావత్
తెలంగాణలో ఓటర్ల జాబితాకు సంబంధించి కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని ప్రధాన కమిషనర్ రావత్‌ను పాత్రికేయులు ప్రశ్నించగా, జాబితా సవరణకు తగినంత సమయం ఉందని బదులిచ్చారు. ప్రస్తుతం న్యాయస్థానంలోని కేసు ఓటర్ల జాబితాకు సంబంధించింది మాత్రమేనని, మొత్తం ఎన్నికల ప్రక్రియకు సంబంధించి కాదని వివరణ ఇచ్చారు. ఓటర్ల జాబితా వ్యాజ్యానికి సంబంధించి అన్ని వివరాలనూ కోర్టుకు సమర్పిస్తామని తెలిపారు. నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణకు కూడా ఎన్నికలు షెడ్యూలు ప్రకటించిన నేపథ్యంలో మిజోరాం, తెలంగాణ రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం స్వయంగా వెళ్ళి ఎన్నికల నిర్వహణ పరిస్థితులపై అధ్యయనం చేయా ల్సి ఉందని, త్వరలోనే బృందాన్ని పంపనున్నట్లు రావత్ వివరించారు. అసెంబ్లీ రద్దయిన రాష్ట్రాలకు ఆరు నెలల లోపు ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు గతంలో పేర్కొన్నదని, తెలంగాణకు సంబంధించిన ఓటర్ల జాబితా అంశ ంపై హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉందని గుర్తుచేశారు. తెలంగాణలో ఈ నెల 8న ఓటర్ల తుది జాబితా ప్రచురితం కావాల్సి ఉందని, కేంద్ర ఎన్నికల సంఘానికి చేరాల్సి ఉందని, అయితే ప్రస్తుతం హైకోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో నాలుగు రోజుల గడువును పొడిగించి ఈ నెల 12న తుది జాబితాను ప్రకటించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. గత నెల 6న తెలంగాణ అసెంబ్లీ రద్దుకావడంతో ఇప్పటికే ఎన్నికల కోడ్ అమలులో ఉందని, మిగతా రాష్ట్రా ల్లో తక్షణం ఎన్నికల కోడ్ అమలులోకి వస్తోందని తెలిపారు.
రెండు నెలల ప్రచారం
సాధారణంగా ఎన్నికల షెడ్యూలు విడుదలైన తర్వాత పదిహేను రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయడం ఆనవాయితీ అయినప్పటికీ తాజా తెలంగాణ ఎన్నికలకు మాత్రం షెడ్యూలు తర్వాత నెల రోజులకు పైగా నోటిఫికేషన్‌కు గడువు ఉంది. నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత పోలింగ్ తేదీ మూడు వారాలకంటే ఎక్కువ దూరంలో ఉంది. షెడ్యూ లు విడుదలైన తర్వాత రెండు నెలలకు పోలింగ్ జరుగుతున్నందున దీర్ఘకాలం ప్రచారంపైనే అభ్యర్థులు సమయాన్ని వెచ్చించాల్సి వస్తోంది. అసెంబ్లీ రద్దయిన రోజునే టిఆర్‌ఎస్ ఒకేసారి 105 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించడంతో మరుసటిరోజు నుంచే వారివారి నియోజకవర్గాల్లో ప్రచారాన్ని ప్రారంభించారు. ఇప్పటికే చాలా గ్రామాల్లో ప్రచారపర్వం ముగిసింది. ఇంకా రెండు నెలల పాటు ఈ ప్రచార పర్వం కొనసాగనుంది. విపక్షాలు మాత్రం ఇంకా సీట్ల సర్దుబాటు ప్రక్రియనే ముగించకపోవడంతో అభ్యర్థులెవరో తెలియలేదు, ప్రచారాన్ని ప్రారంభించనూ లేదు. ఎన్నికల సంఘం శనివారం ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మరో రెండు నెలల తర్వాత పోలింగ్ జరగనుంది. షెడ్యూలు ప్రకటించిన తర్వాత 63 రోజులకు పోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ పోలింగ్ అంశం గురించి ఎన్నికల కమిషనర్లు వ్యాఖ్యానించారు. తెలంగాణ ఎన్నిలకు నవంబర్ 12 వ తేదీ న నోటిఫికేషన్ జారీ చేస్తామని, పోలింగ్ డిసెంబర్ 7 వ తేదీ న నిర్వహిస్తామని కమిషన్ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తం గా రెండు నెలల పాటు ఎన్నికల వాతావరణం కొనసాగనుంది.

అభ్యర్థుల్లో అమావాస్య ఫికర్

కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ఎన్నికల తేదీ (డిసెంబర్ 7) అమావాస్య రోజు కావడంతో రాజకీయ పార్టీలు, అభ్యర్థు ల్లో ఒక రకమైన ఆందోళన వ్యక్తమవుతోంది. మంచిపని తలపెట్టే ముందు శుభ ఘడియలు, మంచి ముహూర్తాల ను చూసుకోవడం ఆనవాయితీ. రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే పోలింగ్ తేదీ కూడా అలా ఉండాలని కోరుకో వడం సహజం. అయితే కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయిం చిన పోలింగ్ తేదీ అమావాస్య రోజు రావడంతో ఒక్కసారి గా అభ్యర్థుల్లో గుబులు మొదలైంది. పోలింగ్ జరిగే అమావాస్యరోజు రాజకీయ భవిష్యత్తుకు కలిసొస్తుందా..? లేదా..? అని అంతర్మథనంలో పడ్డారు. జ్యోతిష్యశాస్త్రాన్ని, సంఖ్యా శాస్త్రాన్ని ప్రగాఢంగా విశ్వసించే అభ్యర్థులు పోలింగ్ తేదీ అనుకూలమా..? లేక ప్రతికూలంగా ఉండబోతుందా..? అని పండితుల దగ్గర జాతకాలను చూపించికుంటున్నట్లు తెలిసింది. పోలింగ్ తేదీ (డిసెంబర్ 7) అమావాస్య కావడం శుభ సూచకం కాదని, ఫలితాలు వెల్లడించే డిసెంబర్ 11వ తేదీ కూడా సంఖ్యాశాస్త్రం రీత్యా చూస్తే అనుకూలంగా లేదని కొంతమంది అభ్యర్థులు ఆందోళన పడుతున్నారు. అయితే ముస్లిం అభ్యర్థులు మాత్రం అటు అమావాస్యగానీ, ఇటు ఫలితాలు వెల్లడయ్యేరోజుగానీ అనుకూ లమేనన్న అభిప్రాయంతో ఉన్నారు. అభ్యర్థుల జాతకాలు, పోలింగ్ తేదీలపై పండితులు, సంఖ్యా శాస్త్ర నిపుణులను ఇప్పటికే చాలా మంది సంప్రదించడం మొదలుపెట్టారు. దీనిపై సోషల్ మీడియాలో చర్చలు కూడా జరుగుతున్నాయి. నెటిజన్లు ఆయా పార్టీలకు అనుకూల ప్రతికూల పోస్టింగులు పెడుతున్నారు. అమావాస్య రోజు జరిగే పోలింగ్ ఎంతమంది జీవితాలలో చీకటి నింపుతుందో అనే వ్యంగ్యాస్త్రాలను సంధిస్తున్నారు.
పండితులతో పార్టీ అధినేతల మంతనాలు
పోలింగ్ తేదీ అమావాస్య రోజు రావడంపై వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అధినేతలు పండితులు, సంఖ్యాశాస్త్ర నిపుణులతో మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది. తమ జాతకాలతో పాటు పార్టీకి అనుకూల, ప్రతికూల పరిస్థితులపై సుధీర్ఘ చర్చలు చేస్తున్నట్లు సమాచారం. ఈ అంశంపై ఆయా రాజకీయ పార్టీలలో ముఖ్య నేతలతో అధినేతలు సమావేశాలు నిర్వహించి చర్చలు జరుపుతున్నారు. పోలింగ్ తేదీ, తుది ఫలితాలు వెల్లడించే తేదీల అనుకూల, ప్రతికూల పరిస్థితులపై ఆయా రంగాలకు చెందిన నిపుణులతో సంప్రదింపులు చేస్తూ పరిస్థితులను విశ్లేషించుకుంటున్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ పంచాంగం తిథులను చూసి షెడ్యూలు తయారుచేయదు కాబట్టి ఇప్పుడున్న షెడ్యూలులో మార్పులు చేసే అవకాశం లేదన్న అభిప్రాయానికి వచ్చిన కొద్దిమంది అభ్యర్థులు ఆ రోజును (అమావాస్య)ను అనుకూలంగా మార్చుకునేందుకు ఎలాంటి పూజలు, యాగాలు చేస్తే అనుకూలంగా మార్చుకోవచ్చో ఆలోచనలు చేస్తున్నారు. పండితులు కూడా సూచనలు సలహాలు ఇస్తున్నారు.