Home తాజా వార్తలు చెక్కులా, కార్డులా?

చెక్కులా, కార్డులా?

state government is preparing Rs 6,000 crore farmers under

యాసంగి రైతుబంధు సాయాన్ని ప్రీపెయిడ్ కార్డుల ద్వారా అందించడానికి ప్రభుత్వం యోచన

మన తెలంగాణ/ హైదరాబాద్: యాసంగిలోనూ పంట సాగు చేసినా, చేయకపోయినా రైతుబంధు కింద రైతులకు రూ.6 వేల కోట్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. అక్టోబర్ నుంచే యాసంగి ప్రారంభమవుతుండటంతో ముందస్తుగానే సెప్టెంబర్ చివరి వారంలో నే రైతులకు పెట్టుబడి అందించేందుకు వ్యవసాయ శాఖ సన్నాహాలు ప్రారంభించింది. గతంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీలో ఏర్పాటు చేసిన ప్రాంతీయ రైతు సమన్వయ సమితి సదస్సు సందర్భంగా సిఎం కె.చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ వానాకాలం సీజన్‌లో చెక్కులను పంపిణీ చేశామని, యాసంగి నుంచి ప్రీపెయిడ్ కార్డులను అందిస్తామని ప్రకటించారు. అయితే యాసంగి రైతుబంధు పంపిణీకి మరో రెండు నెలలు మాత్రమే మిగిలి ఉం ది. ఇప్పటికీ ఎకరాకు రూ.4 వేలు రైతులకు ఎలా అందజేయాలనే దానిపై మాత్రం స్పష్టత రాలేదు. ప్రీపెయిడ్ కార్డులిస్తే అవి ఎలా ఉంటాయి, ఎలా వాడాలి కేవలం ఎరువు లు, విత్తనాలు కొనుగోలు చేసేందుకే వినియోగించేలా ఇస్తారా ఎటిఎం కార్డులా పనిచేస్తుందా అనే అనేక అనుమానాలు అధికారులతో పాటు రైతుల్లోనూ ఉన్నాయి. మరోవైపు మళ్లీ రైతుబంధును చెక్కుల రూపంలోనే పంపిణీ చేయాలనే అభిప్రాయం ప్రజాప్రతినిధుల్లో వ్యక్తమవుతోం ది. ప్రతి గ్రామంలో పండుగ వాతావరణంలో చెక్కులు ఇవ్వడంతో ప్రభుత్వాని కి మంచి మైలేజ్ వచ్చిందని, ఒకవేళ ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సి వస్తే చెక్కులతో ఇవ్వడమే బెటర్ అని పలువురు మంత్రులు, ఎంఎల్‌ఎలు సిఎం కెసిఆర్ ముందు కూడా అభిప్రాయం వ్యక్తపరిచినట్లు తెలిసింది. వాస్తవానికి మొదటిసారి చెక్కులను పంపిణీ చేసేందుకు వ్యవసాయ శాఖ పెద్ద కసరత్తే చేసింది. ప్రభుత్వ, అధికారుల స్థాయిలో కాకుండా క్షేత్రస్థాయిలో వ్యవసాయ విస్తరణ అధికారుల సహకారంతో రైతుల అభిప్రాయాలనే తీసుకుని మెజార్టీ నిర్ణయం మేరకు చెక్కులు పంపిణీ చేయాలని కోరడంతో ఆ రకంగా చేశారు. అయితే సిఎం యాసంగి నుంచి ప్రీపెయిడ్ కార్డులు అని చెప్పడంతో ఆసక్తి రైతుల్లో ఏర్పడింది. వాస్తవానికి వానాకాలం సీజన్‌కు మేలో ప్రభుత్వం రైతుబంధు చెక్కులను పంపిణీ చేసినప్పుడు చా  లా మంది రైతులు వ్యవసాయ రంగానికి కాకుం డా ఇతరత్రా తమ అవసరాలు తీర్చుకునేందుకు వాడుకున్నారు. కొందరు రైతులు సాగు అవసరాల కోసమే వినియోగించారు. మరికొంత మంది ఎవరైతే తమ భూములను కౌలుకు ఇచ్చి పట్టణాల్లో ఉద్యోగాలు చేస్తున్నారో వారు మాత్రం ఆదాయపు పన్ను కట్టుకోవడానికి వాడుకోవడంతో పాటు తమ సేవింగ్స్ ఖాతాలో జమ చేసుకున్నారని బ్యాంకు ఉన్నతాధికారి ఒకరు మన తెలంగాణతో వ్యాఖ్యానించారు. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన అనంతరం ప్రభుత్వం పార్ట్ ఎ భూములను ఎటువంటి వివాదాలు లేనివిగా గుర్తించి 1.40 కోట్ల ఎకరాలకు పెట్టుబడి చెక్కులను ముద్రించింది. పార్ట్ బిలో లిటిగేషన్‌లో 16.53 లక్షల ఎకరాల ఉన్నాయి. ఇందులో 4.22 లక్షల మంది రైతులున్నారు.