Home తాజా వార్తలు కొలవుల కసరత్తు

కొలవుల కసరత్తు

State govt issued notification

 

కొత్త నోటిఫికేషన్ల జారీకి వీలుగా ఉద్యోగుల లెక్కలు తీస్తున్న ప్రభుత్వ విభాగాలు

మంజూరైన పోస్టులు, ప్రస్తుతమున్న ఉద్యోగుల సంఖ్యపై ఆరా

మన తెలంగాణ /హైదరాబాద్: ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయాలనుకుంటున్నందున ఇప్పుడు ఏయే శాఖలో, విభాగంలో ఎంత మంది ఉద్యోగులు ఉన్నారు, ఎన్ని ఖాళీగా ఉన్నాయో తేల్చే పనిలో పడింది. అన్ని శాఖల, విభాగాల అధిపతులకు ఇటీవల లేఖలు రాసిన ప్రభుత్వం పూర్తి వివరాలను ఆర్థిక విభాగానికి ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇందుకోసం కొన్ని నమూనాలను కూడా జతచేసింది. ప్రతీ శాఖ, విభాగంలో మంజూరైన పోస్టులు, ప్రస్తుతం పనిచేస్తున్నవారి సంఖ్య, ఖాళీ పోస్టుల సంఖ్య, ఇతర విభాగాల నుంచి డిప్యూటేషన్‌పై వచ్చినవారి వివరాలు, ఔట్‌సోర్సింగ్/కాంట్రాక్టు తదితరాల కింద పనిచేస్తున్నవారు, వారికి చెల్లిస్తున్న వేతనం, వారిని నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులు, వారికి ఇస్తున్న జీతం ఏ ఖాతాలోంచి వెళ్తోంది, డైలీవేజ్ కార్మికులు ఎంత మంది ఉన్నారు, పార్ట్‌టైమ్/ఫుల్‌టైమ్ సిబ్బంది ఎంత మంది ఉన్నా రు.ఇలా అన్ని వివరాలను ఆర్థిక శాఖకు పంపాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది.

ఈ లెక్క తేలిన తర్వాతనే ఏయే శాఖల్లో ఎన్ని ఖాళీ పోస్టులు ఉన్నాయో, ఎన్నింటిని ఎలా భర్తీ చేయాలో ప్రభుత్వం ఒక స్పష్టతకు రాగలుగుతుంది. ఆ తర్వాతనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను ఇవ్వడానికి వీలవుతుందని, అందువల్లనే ఈ ప్రక్రియను ప్రారంభించినట్లు ఆర్థికశాఖలోని అధికారి ఒకరు వివరించారు. కొన్ని విభాగాల్లో మంజూరైన సంఖ్యకంటే పనిచేస్తున్నావారి సంఖ్య ఎక్కువగా ఉందని, ఇది ఎందువల్ల జరిగిందో తేలాలంటే ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నవారి వివరాలు, వారి నియామకానికి ఎప్పుడు ఉత్తర్వులు జారీ అయ్యాయి, ఎంత కాలం నుంచి పని చేస్తున్నారు, వారికి ఇస్తున్న వేతనాలను ఏ ప్రాతిపదికన ఇస్తున్నారు, ఆ విధంగా ప్రతీ ఏటా ఎంత ఖర్చవుతోంది తదితరాలన్నింటిపై స్పష్టత వస్తుందని ఆ అధికారి పేర్కొన్నారు. దీనికి తోడు పదోన్నతుల విషయంలోనూ అనేక సమస్యలు ఉన్నాయని, కొన్నింటిపై న్యాయస్థానాల్లో విచారణ పెండింగ్‌లో కూడా ఉందని, కొత్త జోనల్ వ్యవస్థ అమలులోకి వచ్చిన తర్వాత బదిలీలు, పదోన్నతుల విషయంలో నిబంధనల ప్రకారం వ్యవహరించాల్సి ఉన్నందున ఇప్పుడు పని చేస్తున్నవారి వివరాలు తెలియకుండా ఆ దిశగా ఎలాంటి నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదని వివరించారు.

సమైక్య రాష్ట్రంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయడానికి 1999లో అప్పటి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని, 175 పోస్టులకు మెరిట్ జాబితా కూడా సిద్ధమైందని, ఆ తర్వాత పదోన్నతుల ద్వారా కొన్ని పోస్టుల్ని భర్తీ చేయడంతో మెరిట్ జాబితాలో ఉన్నవారికి  నియామక అవకాశం రాలేకపోయిందని, కోర్టులో పిటిషన్ వేయడంతో ఇటీవల వారిని నియమించాల్సిందిగా ఉత్తర్వులు వెలువడ్డాయని గుర్తుచేశారు. పదోన్నతుల్లో జరిగిన పొరపాట్ల కారణంగా 175 పోస్టుల భర్తీకి మెరిట్ జాబితాలో ఉన్నవారికి నియామక పత్రాలు ఇవ్వడం వీల్లేకపోవడంతో ఆ ప్రక్రియనే ఆపేయాల్సి వచ్చిందని, ఇప్పుడు కోర్టు ఉత్తర్వుల ప్రకారం భర్తీ చేయాలంటే వారిని ఎక్కడ నియమించాలో, ఎక్కడ ఖాళీలు ఉన్నాయో లేవో తేలాల్సి ఉంటుందని ఉదహరించారు. ప్రతీ శాఖలో ఎంత మంది సిబ్బంది ఉన్నారో ఇప్పటికీ స్పష్టత లేనందువల్ల ఆ వివరాలన్నింటినీ అధ్యయనం చేసిన తర్వాత సర్దుబాటు ప్రక్రియకపై స్పష్టత వస్తుందని, ఖాళీ పోస్టుల నియామకం కోసం నోటిఫికేషన్ ఇవ్వడంపై కూడా స్పష్టత వస్తుందని, అందులో భాగమే ఇప్పుడు అన్ని విభాగాలు, శాఖల నుంచి సిబ్బంది వివరాలను సేకరిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం దగ్గర ప్రతీ విభాగానికి సంబంధించిన పూర్తి డాటా ఉన్నట్లయితే ఇబ్బందులను నివారించవచ్చని, ఈ ప్రక్రియతో అది సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

State govt issued notification for replacement of jobs

Telangana Latest News