Search
Wednesday 26 September 2018
  • :
  • :

ఉక్కు పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం : బీరేంద్రసింగ్

Steel Industries will be Set Up : Birender Singh

ఢిల్లీ : తెలుగు రాష్ట్రాల్లో ఉక్కు పరిశ్రమల ఏర్పాటుకు కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేంద్ర సింగ్ తెలిపారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ టిడిపి రాజ్యసభ సభ్యుడు సిఎం రమేశ్, ఎంఎల్‌సి బిటెక్ రవిలు ఆమరణనిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో టిడిపి ఎంపిలు కేంద్రమంత్రి బీరేంద్రసింగ్‌తో బుధవారం భేటీ అయ్యారు. అనంతరం బీరేంద్రసింగ్ మీడియాతో మాట్లాడారు. కపడ ఉక్కు పరిశ్రమ విషయంపై టిడిపి ఎంపిలు తనతో మాట్లాడారని ఆయన తెలిపారు. సుప్రీంకోర్టులో దాఖలైన పిల్ విషయంలో కేంద్ర ఉక్కు శాఖ అఫిడవిట్ దాఖలు చేసిందన్నారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయట్లేదని వచ్చిన వార్తలపై తాము ప్రకటన చేశామని ఆయన తెలిపారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సరైన మార్గంలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన చెప్పారు. ఈ విషయంపై టాస్క్‌ఫోర్స్ అధ్యయనం చేస్తుందని, రవాణా, నీరు, భూమి, రాయితీ తదితర అంశాలపై ఎపి ప్రభుత్వ స్పందనను తాము కోరినట్టు ఆయన వెల్లడించారు. విభజన హామీలను అన్నింటిని నెరవేరుస్తామని ఆయన చెప్పారు. 1.5 మిలియన్ టన్నుల సామర్థం గల ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.

ఉక్కు పరిశ్రమ ఏర్పాటపై రాష్ట్రం నుంచి కొంత సమాచారం రావాల్సి ఉందని, దీని కోసమే తాము వేచి చూస్తున్నామని బీరేంద్రసింగ్ తెలిపారు. భూమి అప్పగింతపై మరింత స్పష్టతతో కూడిన సమాచారం రావాల్సి ఉందని ఆయన చెప్పారు. జూన్ 22న మెకాన్ సంస్థ ఎపి ప్రభుత్వానికి లేఖ రాసిందని ఆయన పేర్కొన్నారు. మెకాన్ నుంచి నివేదిక రాగానే నిర్ణయం తీసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. కడపలో ఉక్కు పరిశ్రమ అంశం రాష్ట్ర ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశమని, కాలపరిమితితో కూడిన ప్రకటన చేయాలని ఎంపిలు మంత్రి బీరేంద్రసింగ్‌ను కోరారు. టిడిపి ఎంపిలు మంత్రి బీరేంద్రసింగ్‌తో మరోసారి భేటీ అయ్యారు. ఉక్కు పరిశ్రమపై కాలపరిమితితో కూడిన స్పష్టమైన ప్రణాళికను విడుదల చేయాలని వారు మంత్రిని కోరారు. ఉన్నతాధికారులతో సమీక్ష చేస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన ఉన్నతాధికారులతో కడప, బయ్యారం ఉక్కు పరిశ్రమల ఏర్పాటుపై చర్చించారు.

Steel Industries will be Set Up : Birender Singh

Comments

comments