Search
Saturday 21 July 2018
  • :
  • :
Latest News

ఉక్కు పరిశ్రమే ఉపాధి మార్గం

 Steel industry building process in Bayyaram

మనతెలంగాణ/మహబూబాబాద్ ప్రతినిథి: ఉక్కు పరిశ్రమే మహబూబాబాద్ జిల్లా నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గం. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ నిర్మాణ ప్రక్రియ 6నెలలో ప్రారంభిస్తామని రాష్ట్రాల విభజన చట్టంలో 13వ అంశంగా పేర్కొన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఉక్కు పరిశ్రమ స్థాపించకుండా పరిశ్రమ సాధ్యం కాదని చేతులెత్తేయడం విభజన చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. అంతే కాకుండా మహబూబాబాద్ జిల్లాలో పరిశ్రమ ఏర్పాటుకు ఏకైక సోర్స్ ఉక్కు ఖనిజమే. అది లేకుంటే దేశంలోలో పరిశ్రమలు, ఉపాధి లేని మొట్టమొదటి జిల్లాగా చరిత్రలో మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో అఖిలపక్ష పార్టీలైన కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, టిడిపి, న్యూడమెమోక్రసి, టిజెఎస్, బిఎస్‌పి, న్యూడెమోక్రసి ప్రతిఘటన ఒక వేదికపైకి వచ్చి ఐక్యపోరాటాలకు పిలుపునిచ్చారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ సాధించేవరకూ ఈ ఉద్యమం తీవ్రతరం చేస్తామని అఖిలపక్షాలు హెచ్చరించాయి. ఉద్యమ నగారా మ్రోగించాయి.
పరిశ్రమ ఏర్పాటు అవసరాలు ఇవీ..
మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ప్రభుత్వ ఉక్కు పరిశ్రమ నిర్మాణం చేపట్టేందుకు 2014 ఫిబ్రవరి 18న పార్లమెంట్ ఆమోదించి రాష్ట్రాల విభజన చట్టంలో 13వ అంశంగా చేర్చి 6నెలల్లో బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ప్రక్రియను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం సెయిల్ బృందం సర్వేలు, పర్యటనల పేరుతో ఈ ప్రాంతానికి వచ్చి నమూనాలు సేకరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలైనా ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోగా ఇటీవల కేంద్రం సుప్రీకం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో బయ్యారంలో ఉక్కు పరిశ్రమ నిర్మించలేమని, అది లాభసాటి కాదని ప్రకటిండం అన్యాయం. రాష్ట్ర పునర్విభజన చట్టం ద్వారా సంక్రమించిన ఏకైక పరిశ్రమ బయ్యారం ఉక్కు పరిశ్రమ కావడంతో పరిశ్రమ రాదని ఒక్కసారిగా జిల్లా నిరుద్యోగ యువత ఉలిక్కి పడిండి. కేంద్ర ప్రభుత్వం ఉక్కు పరిశ్రమ సాధ్యం కాదని చేసిన ప్రకటన ఉప సంహరించుకుని తక్షణమే వెనుకబడిన, గిరిజన జనాభా అత్యధికంగా ఉన్న మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు యద్ద ప్రాతిపదికన సన్నాహాలు చేపట్టాలని అఖిలపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. పరిశ్రమ సాధనకై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి బయ్యారం ఉక్కు మానుకోట హక్కుగా జిల్లావాసుల హక్కును రక్షించుకోవాలని అఖిలపక్షాలు పిలుపునిచ్చాయి. దశలవారీగా ఉద్యమ కార్యచరణ ప్రకటించారు. ప్రభుత్వం నిర్ణయం ఆలస్యమైతే ఉక్కు ఉద్యమం తీవ్రం అవుతుందని హెచ్చరించారు. ఇప్పటికే బయ్యారం ఉక్కు ఉద్యమం జిల్లా నలుమూలలా ప్రాకి ప్రతి మండలంలో ఉద్యమాలు ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై రాష్ట్ర ప్రభుత్వం తగిన రీతిలో స్పందించి ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవాలని అన్ని పక్షాలు డిమాండ్ చేస్తున్నారు.
పరిశ్రమ ఏర్పాటు ఎందుకు?
బయ్యారంలో పరిశ్రమ ఏర్పాటు ఎందకని ప్రశ్న ఎదురు కావచ్చు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి కావల్సిన వనరులు అన్నీ ఉన్నాయి. బయ్యారంతోపాటు చుక్కుప్రక్కల పరిసర ప్రాంతాలైన గార్ల, నేలకొండపల్లి, గూడూరు మండలాల్లో ఇనుప ఖనిజం విస్తారంగా ఉంది. బయ్యారానికి 10కిలో మీటర్ల దూరంలో మాదారంలో డోలమైట్ ఖనిజం, 20 కిలోమీటర్లు దూరం ఇల్లందులో బొగ్గు గనులు ఉన్నాయి. చేరువలోనే రైల్వే లైన్ కూడా ఉంది. పరిశ్రమలకు నీటి కొరత లేకుండా రాష్ట్ర ప్రభుత్వం బయ్యారం పెద్ద చెరువును సీతారామ ప్రాజక్టు ద్వారా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా మార్చనుంది. అన్ని హంగులు, సంపదతోపాటు కేంద్ర ప్రభుత్వ విభజన చట్టబద్ద హామీ కూడా ఉన్నందున బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ కుంటి సాకులే తప్ప ఎలాంటి అడ్డంకులూ లేవు. ఏ వనరులూ లేని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ సుదూర ప్రాంతాలైన డోర్నకల్, బయ్యారం ఇనుప ఖనిజాలు, డోలమైట్ సంపద, ఇతర ప్రాంతాలపై ఆధారపడి లాభాలు గడిస్తుంటే అన్ని హంగులూ, సంపద దగ్గరలోనే ఉన్న బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ఎందుకు సాధ్యం కాదని ఈ ప్రాంత వాసుల ప్రధాన ప్రశ్న. బయ్యారం ఉక్కు పరిశ్రమ స్థాపించకుంటే జిల్లాకు చెందిన నిరుద్యోగ యువతకు ఉపాధి లేకుండా పోతుంది. యువత ప్రక్కదారి పడుతుంది. పరిశ్రమ ఏర్పాటుతో మహబూబాబాద్ జిల్లా అభివృద్ది దిశగా అడుగులు వేస్తుంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై మరొకరు రాష్ట్ర ప్రభుత్వ సహకరించడం లేదని, కేంద్ర, సెయిల్ ముందుకు రావడంలేదని సాకులు చెప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారు. మరో ప్రక్క రాష్ట్ర ప్రభుత్వం జిందాల్ ప్రయివేట్ సంస్థలకు ఇస్తామని, సింరేణి సంస్థకు ఇప్పగిస్తామని ప్రకటించింది. పరిశ్రమను ప్రైవేటు సంస్థకు అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇప్పటికైనా జిల్లాలో ఎక్కువశాతం గిరిజన జనాభా ఉన్నందున కేంద్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాల అభివృద్దికి కేటాయిస్తున్న నిధులను కూడా ఈ ప్రాంతంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుచేయడానికి కేటాయిస్తే సులభంగా పరివ్రమ నిర్మాణం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించి ఉద్యమ తీవ్రతను ప్రపంచ వ్యాప్తంగా చూపించిన మహబూబాబాద్ జిల్లాలో బయ్యారం ఉక్కు పరిశ్రమ తక్షణమే నిర్మించాలని అఖిలపక్షపార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.
ఉద్యమానికి అండగా కాంగ్రెస్: డిసిసి అధ్యక్షులు భరత్‌చందర్‌రెడ్డి
బయ్యారం ఉక్కు పరిశ్రమ సాధన ఉద్యమానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అంగడా ఉంటుందని, అఖిలపక్ష పార్టీలతో కలిసి పరిశ్రమ సాధించే వరకూ జిల్లా యువతకు వెన్నుంటామని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షలు జెన్నారెడ్డి భరత్‌చందర్‌రెడ్డి అన్నారు. కేంద్రం మెడలు వంచైనా బయ్యారం ఉక్కు సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఏకైక మార్గం బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటేనన్నారు.
ఉక్కు పరిశ్రమతోనే యువతకు ఉపాధి: సిపిఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి
ఉక్కు పరిశ్రమ ఏర్పాటుతోనే జిల్లా గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని సిపిఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి అన్నారు. పరిశ్రమ ఏర్పాటుపై వెనుకడుగు వేస్తే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై వత్తిడి తెచ్చి అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఉక్కుపరిశ్రమ సాధనకై సిపిఐ పార్టీ ప్రధాన భూమిక పోషిస్తుందని, ఉక్కు పరిశ్రమ సాధిస్తామని విజయసారథి అన్నారు.
గిరిజన యువతను మేల్కొల్పుతాం : ఎఐసిసి ఎస్‌టి సెల్ ఉపాధ్యక్షులు బెల్లయ్యనాయక్
మహబూబాబాద్ జిల్లాలో బయ్యారం ఉక్కు పరిశ్రమ సాధనకై జిల్లాలోని గిరిజన యువతను మేల్కొల్పుతామని ఎఐసిసి ఎస్‌టిసెల్ ఉపాధ్యక్షులు బెల్లయ్యనాయక్ తెలిపారు. ఎల్‌హెచ్‌పిఎస్ ఆధ్వర్యంలో గిరిజన తెగలను ఏకం చేసి ఉక్కు పరిశ్రమ సాధనే ధ్యేయంగా ముందుకు వెళతామన్నారు. అఖిలపక్ష పార్టీలతో ఎల్‌హెచ్‌పిఎస్ కలిసి పోరాడుతుందన్నారు. పరిశ్రమ సాధించేవరకూ ఉక్కు ఉద్యమానికి గిరిజన సంఘాలు అండగా ఉంటూ వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని ఆయన తెలిపారు. అవసరమైతే డిల్లీలో సెయిల్ అధికారులను కూడా కలిసి, గిరిజన ప్రాంతానికి ఉక్కు పరిశ్రమ నిర్మాణ అవసరాన్ని వివరిస్తామన్నారు.
విభన చట్టం విస్మరిస్తే ఉపేక్షించేది లేదు: టిజెఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ డోలి సత్యనారాయణ
కేంద్రం జిల్లాల విభజన చట్టంలో పొందుపర్చిన 13వ అంశాన్ని విస్మరించి బయ్యారం ఉక్కు పరిశ్రమ ప్రక్రియ ప్రారంభించకుటే ఉపేక్షించేది లేదని టిజెఎస్ జిల్లా కో-ఆర్డినేటర్ డాక్టర్ డోలి సత్యనారాయణ అన్నారు. జిల్లాలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకుంటే చెడు మార్గాలకు పోతారని, తెలంగాణ రాష్ట్రానికి పునర్విభజన చట్టం ద్వారా లభించిన హక్కులు కాలరాస్తే ప్రభుత్వానికి గుణపాఠం తప్పదదని ఆయన హెచ్చరించారు. తెలంగాణ వస్తే ఈ ప్రాంతం గిరిజన యువత జీవితాలు బాగుపడతాయని అనుకుంటే ఉక్కు పరిశ్రమ సాధ్యం కాదని కేంద్రం చెప్పడం విభజన చట్టాన్ని ఉల్లంగించడమేనన్నారు.

Comments

comments