Home లైఫ్ స్టైల్ గుండెపోటుకు మూలకణ చికిత్స

గుండెపోటుకు మూలకణ చికిత్స

Heart-Attack

గుండెపోటు వచ్చే రోగులకు మూలకణాల వైద్యం మేలు చేస్తుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. నేచురల్ బయోటెక్నాలజీ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనంలో ఈ వివరాలన్నీ వెలుగులోకి వచ్చాయి. మానవ మూలకణాల చికిత్స వల్ల మామూలుగా గుండె పనిచేయడం కన్నా 90 శాతం మెరుగ్గా పనిచేస్తుందని పేర్కొన్నారు. కోతులపై మొదట ఈ ప్రయోగాలు చేశారు. ప్రపంచం మొత్తం మీద గుండెపోటు వల్ల 10 మిలియన్ ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయి. గుండెకు తగిన రక్త ప్రసరణ జరగకపోవడమే ఈ పరిస్థితికి కారణంగా చెబుతున్నారు. మూలకణాల చికిత్స వల్ల గుండెలో కొత్తగా కండరాలు ఏర్పడడానికి దోహదమవుతుంది. ఫలితంగా గుండె మళ్లీ రక్తాన్ని గ్రహించగలుగుతుందని వాషింగ్టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ చార్లెస్ ‘చుక్’ ముర్రీ చెప్పారు.

మూలకణాలు ఎలాంటి విభిన్నత లేనివి. ఏ రకం కణాలుగా నయినా ఇవి మార్పు చెందగలుగుతాయి. సాధారణంగా మూలకణాలు రెండు ప్రధాన ఆధారాల ద్వారా వెలువడతాయి. ఎంబ్రియోనిక్ స్టెమ్ సెల్స్. అంటే గర్భస్థ పిండం నుంచి వచ్చే మూలకణాలు ఒకటి కాగా, ఎడల్ట్ సెల్స్ అంటే కాస్త ఎదిగిన వయస్సు స్థితిలో వచ్చే మూలకణాలు రెండో రకం, ఈ రెండు రకాల మూల కణాలు దేనికవే వివిధ రకాల కణాలుగా మార్పు చెందే సామర్థం కలిగి ఉంటాయి. చర్మం, కండరం, ఎముక తదితర ఏ రకం కణాలుగా నయినా మూలకణాలు రూపాంతరం చెందగలవు. అయితే మూలకణాల చికిత్సలో వివిధ రకాల ఆధారాలు నుంచి మూల కణాలను సేకరిస్తుంటారు. ఎముకల మూలుగు, బొడ్డుతాడు నుంచి కూడా మూలకణాలు సేకరిస్తుంటారు. 1988 నుంచి ఈ మూలకణాల చికిత్స ద్వారానే ప్రాణాంతక వ్యాధులను నయం చేయగలిగారు. గత కొన్ని సంవత్సరాలుగా మూలకణాలపై పరిశోధన, అభివృద్ధి సాగుతుండడంతో అనేక రకాల మూలకణాల చికిత్సలు అభివృద్ధి చెందాయి.