Search
Thursday 15 November 2018
  • :
  • :

ఫ్లాట్‌గా స్టాక్ మార్కెట్లు

bsns

ఊతమిచ్చిన ఐటి, టెక్, హెల్త్‌కేర్ షేర్లు

ముంబయి: స్టాక్ మార్కెట్లు శుక్రవారం రోజున నష్టాల నుంచి కోలుకుని చివరికి ఫ్లాట్‌గా ముగిశాయి. చైనా వస్తువులపై అమెరికా విధించిన సుంకాలకు ఆసియా దేశాల స్టాక్ మార్కెట్లు బలహీనపడ్డాయి. ఈ పరిణామం దేశీయ మార్కెట్లపై కూడా ప్రభావం చూపాయి. స్టాక్‌మార్కెట్ ఆరంభం నుంచే సూచీలు ఒడిదుడుకులు ఎదుర్కొన్నాయి. బిఎస్‌ఇ సెన్సెక్స్ 22.32 పాయింట్లు పెరిగి 0.06 శాతం లాభంతో 35,622.14వద్ద, నిఫ్టీ50 9.65 పాయింట్లు పెరిగి 0.09 శాతం లాభంతో 10,817.70 వద్ద ముగిశాయి. ఐటి, టెక్, హెల్త్‌కేర్ రంగాల షేర్లు తప్పించి మిగతా అన్ని రంగాల షేర్లు నష్టాల బాటనే పట్టాయి.
నిఫ్టీ ఫార్మా సూచీ 2 శాతం లాభపడింది. డాక్టర్ రెడ్డీస్ లాబరేటరీస్, సిప్లా, పిరామల్ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు లాభపడ్డాయి. నిఫ్టీ ఐటి సూచీ సయితం 2 శాతం పెరిగింది. ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టిసిఎస్) షేర్లు ర్యాలీ చేశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజిలో టిసిఎస్ షేరు రూ. 1,849 ధరతో కొత్త గరిష్ఠాన్ని తాకింది. షేరు ఒక్కింటికి రూ. 2,100 చెల్లించే ప్రాతిపదికన 76.19 మిలియన్ ఈకిటీ షేర్లను బైబ్యాక్ చేసేందుకు బోర్డు ఆమోదించిందని టిసిఎస్ తెలిపింది. దీంతో బిఎస్‌ఇలో టిసిఎస్ స్టాకు 2.75 శాతం లాభపడి రూ. 1841.45 వద్ద ముగిసింది. కాగా హిందాల్కో 2.86 శాతం నష్టపోయి రూ. 237.45, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 2.30 శాతం నష్టపోయి రూ. 168.10, యస్ బ్యాంక్ 1.91 శాతం నష్టపోయి రూ. 330.55, కోల్ ఇండియా 1.59 శాతం నష్టపోయి రూ. 279.05 వద్ద ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం 50 బిలియన్ డాలర్ల చైనా ఉత్పత్తులపై సుంకాలు గణనీయంగా విధిస్తామని ఆ వస్తువుల జాబితా ప్రకటించారు. దీనికి ధీటుగా సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చైనా హెచ్చరించింది.
యుఎస్ ఫెడరల్ రిజర్వు గురువారం వడ్డీరేట్లను పెంచింది. ఇక దేశీయంగా.. భారత్‌లో వాణిజ్య లోటు నాలుగు నెలల గరిష్ఠానికి అంటే 14.62 బిలియన్ డాలర్లకు మే నెలలో చేరుకుంది. దిగుమతులు 15 శాతం పెరిగినట్లు శుక్రవారం ప్రభుత్వం పేర్కొంది. ప్రపంచపరంగా చూస్తే ఆసియా పసిఫిక్ ఎంఎస్‌సిఐ సూచీ(గత జపాన్ సూచీ) 0.3 శాతం పడిపోయింది. పైగా వారంతపు నష్టం 1శాతం కంటే ఎక్కువే మూటగట్టుకుంది. చైనా స్టాకులు కూడా నష్టాలే చూశాయి. షాంఘై కాంపోజిట్ సూచీ 20 నెలల కనిష్ఠాన్ని తాకింది. అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా ఆర్థిక నష్టానికి మదుపరులు కలత చెందారు. ఇక జపాన్ నిక్కీ 0.5 శాతం లాభంతో ముగిసింది.

Comments

comments