Home బిజినెస్ జిఎస్‌టి దన్నుతో జోష్..

జిఎస్‌టి దన్నుతో జోష్..

  • కొనసాగుతున్న బుల్ జోరు
  • రికార్డు స్థాయి గరిష్ఠానికి సూచీలు
  • దివాలా చట్టం, జిఎస్‌టి దన్నుతో భారీ లాభాలు
  • సెన్సెక్స్ 255 పాయింట్లు, నిఫ్టీ 69 పాయింట్లు అప్

Stock-Markets-Bull

ముంబయి : స్టాక్‌మార్కెట్లు సరికొత్త శిఖరాలకు చేరుకు న్నాయి. సోమవారం సూచీలు లాభాలతో దూసుకెళ్లాయి. సెన్సెక్స్ 255 పాయింట్లు పెరిగి 31,312 పాయింట్ల వద్ద స్థిరపడింది. మరోవైపు నిఫ్టీ సూచీ 69.50 పాయింట్లు పెరిగి 9600 పాయింట్ల మార్క్‌ను మళ్లీ చేరుకుని ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని నింపింది. బ్యాంకుల్లో పేరుకుపో యిన మొండి బకాయి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన దివాలా చట్టం నిర్ణయం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలపర్చింది. జిఎస్‌టిపై ప్రభుత్వం ఎప్ప టికప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, బ్యాంకర్ల సమావేశం నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్ సూచీలు రికార్డుస్థాయికి చేరాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచే సూచీలు దూకు డుగా మొదలయ్యాయి. అయితే ఒకానొక దశలో గరిష్ఠం గా 306 పాయింట్ల వరకూ సూచీలు ఎగబాకాయి. చివరకు 255.17 పాయింట్ల లాభంతో 31,311.57 వద్ద సరికొత్త జీవనకాల గరిష్ఠస్థాయిలో స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 64.40గా కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఇలో టాటాస్టీల్, హిందాల్కో, అదానీ పోర్ట్, వేదాంత లిమిటెడ్, బాష్ లిమిటెడ్ షేర్లు లాభాలను నమోదు చేశాయి. డాక్టర్ రెడ్డీస్, ఐషర్ మోటా ర్స్, యస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, భారత్ పెట్రోలియం షేర్లు స్వల్పంగా నష్టపోయాయి. కాగా ఆర్‌బిఐ వెల్లడించిన 12 మంది భారీ ఎగవేతదారుల జాబితాలో తొలి విడతగా ఆరు పేర్లను వెంటనే ఎన్‌సిఎల్‌టి(నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్)కు నివేదించే విషయమై బ్యాంకర్లు సమావేశ మయ్యారు. ఆరు కంపెనీలపై దివాలా చట్టం కింద చర్యలు తీసుకునేందుకు బ్యాంకులు సిద్ధమయ్యాయి. ఆర్‌బిఐ ప్రకారం, బ్యాంకింగ్ వ్యవస్థలో ఈ 12 ఖాతాల విలువ రూ.2.5 ట్రిలియన్లు (రూ.2.5 లక్షల కోట్లు) ఉండగా.. ఈ మొత్తమే మొండి బకాయిల్లో 25 శాతం ఉండడం విశేషం. ఈ 12 ఖాతాల్లో ఆరు ఖాతాలు ఎస్ బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)కి చెందినవే ఉన్నాయి. మిగతా ఖాతాలు పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్, కార్పొరే షన్ బ్యాంక్‌లకు చెందినవి.
సిడిఎస్‌ఎల్ ఐపిఒకు మంచి స్పందన
సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్(ఇండియా) లిమిటెడ్ (సిడిఎస్‌ఎల్) ఐపిఒ తొలి రోజు పూర్తిగా సబ్‌స్ర్కైబ్ అయింది. ఐపిఒ(ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్) కింద మొత్తం జారీ చేసిన 2,48,27,046 షేర్లకు గాను 2,61,69, 500 షేర్లను అందుకుంది. ఈమేరకు స్టాక్ ఎక్సేంజ్ వివరాలను వెల్లడించింది. ఈవారంలో జిడిపిఎల్ హాత్‌వే ఐపిఒ కూడా మార్కెట్లోకి రానుంది. ఈ రెండూ దాదాపు రూ.1000 కోట్లు సమీకరించడమే లక్షంగా స్టాక్‌మార్కెట్‌కు వస్తున్నాయి. జూన్ 19న ప్రారంభమైన సిడిఎస్‌ఎల్ ఐపిఒ జూన్ 21న ముగుస్తుంది. అదే సమయంలో హాత్‌వే కేబుల్ అండ్ డేటాకామ్‌కు చెందిన జిటిపిఎల్ హాత్‌వే జూన్ 21-23 మధ్య అందుబాటులో ఉండనుంది. సిడిఎస్‌ఎల్ మొత్తం 3.5 కోట్ల విలువైన షేర్లను ఆఫర్-ఫర్-సేల్ పద్ధతిలో విక్రయించనుంది. ఒక్కో షేరు ధరను రూ.145-149 మధ్య నిర్ణయించింది. మొత్తం రూ.524 కోట్లను లక్ష్యంగా పెట్టుకుంది. మరో సంస్థ అయిన జిటిపిఎల్ హాత్‌వే తన ఐపిఒ ద్వారా రూ.485 కోట్లను సమీకరించాలని టార్గెట్ చేసుకుంది. ఇందులో రూ.240 కోట్లను కొత్తగా షేర్లను జారీ చేయటం ద్వారా, మిగిలిన మొత్తాన్ని ఆఫర్-ఫర్-సేల్ పద్ధతిలో సమీకరించాలని లక్షంగా పెట్టుకుంది. 1.44 కోట్ల షేర్లను జారీ చేయనుండగా, ఒక్కో షేరు ధర రూ.167-170 మధ్య ఉండే అవకాశం ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ బరోడా, కలకత్తా స్టాక్ ఎక్సేంజ్‌లు, ఇతర సిడిఎస్‌ఎల్ షేర్‌హోల్డర్లు ఐపిఒ ద్వారా వాటా విక్రయం చేస్తారు. రానున్న రోజుల్లో అనేక సంస్థలు ఐపిఒలకు సిద్ధమవుతున్నాయి. రూ.1741 కోట్ల సమీకరణ లక్షంతో వస్తున్న ఎరిస్ లైఫ్‌సైన్సెస్ ఐపిఒ ఇప్పటికే సిద్ధమైంది.