Home ఆఫ్ బీట్ ఆహా చాయి ఎంతో హాయి

ఆహా చాయి ఎంతో హాయి

మనమే ముందు

మన దేశంలో టీ అంటే ఏమిటో తెలియని రోజులలో అంటే 1868లో విలియమ్‌సన్ మాగోర్ &కోలిమిటెడ్ అనే కంపెనీ తేయాకును మార్కెట్‌లోకి దించి భారతీయులకు చాయ్ రుచి చూపించింది. అప్పటికే అస్సాంలో తేయాకు పండించే కార్యక్రమంలో తలమునకలుగా ఉన్న కెప్టెన్ జె.హెచ్. విలియమ్‌సన్ ఈ కంపెనీలో కీలకమైనపాత్ర పోషించాడు.

Tea

ఆరుబైట వానకురుస్తుంటే..అల్లరిగాలికి జల్లు రేగి ఒళ్ళు తడుస్తూ ఉంటే ఉడుకుడుకు చాయ్ తాగితే ఉండే మజా..తాటినీరా తాగినా రాదు..ఫ్రెష్ అమృతం తాగినారాదు.. చాయ్ ప్రియులందరూ చెప్పేమాట. లోకంలో మంచినీళ్ళ తర్వాత మనుషులు ఎక్కువగా తాగే ద్రవం కూడా తేనీరే!.. ఇది ప్రపంచ లెక్కలు చెప్పిన మాట. ‘టీ మన దేశానిదికాదు..ఇంగ్లీషు వాడు అంటించిపోయిన జబ్బు..’ ఇది పెద్దలు చెప్పే మాట..! కానీ ఇది నిజంకాదు. టీ పక్కా ఆసియా మొక్క. ఇప్పుడు విశ్వరూపమెత్తి ప్రపంచ దేశాలన్నిటిలోనూ పండుతోంది. టీ మొక్కను మనం తేయాకు మొక్క అని అంటున్నాం. కానీ ప్రపంచదేశాలు కెమేలియా సైనెన్‌సిస్ అంటున్నాయి. చాయ్ వాసన ఏదైనా అన్నిటికీ ఈ ఆకే మూలం. ప్రాసెసింగ్‌లో తేడాలవల్ల ఇన్ని రకాల టీలు తయారవుతున్నాయి. వైట్ టీ, గ్రీన్ టీ, ఊలాంగ్ టీ, బ్లాక్ టీ, ప్యూర్ టీ, యెర్బామేట్ టీ, బుష్ టీ, మింట్ టీ, చెమొమిలి టీ, కెమొమిలి టీలు ప్రపంచ వ్యాప్తంగా టీ అభిమానుల గుండెలు కొల్లగొట్టాయి. తరతరాలుగా చాయ్ అభిమానులతో విడదీయరాని బాంధవ్యం కలిగి ఉన్న హెర్బల్, గ్రీన్‌టీలు 3వేల రకాలుగా రూపాన్ని మార్చుకుని..విశ్వమానవాళిని అలరిస్తున్నాయి. ఆరోగ్యాన్ని పంచి ఇవ్వడంలోనూ ఎంతో ముందున్నాయి. అందాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యభాగ్యాన్ని మధురానుభవాన్ని, మధురమైన రుచిని అందిస్తున్న చాయ్‌ల చరిత్ర, ఔషధ విశిష్టతలను పరిశీలిద్దాం.

చమొమిలి టీ 

ఇది 1వ శతాబ్దం నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అంటే గత 2వేల సంవత్సరాలుగా ఇది చాయ్ అభిమానుల్ని అలరిస్తూ ఆరోగ్యాన్ని సమకూరుస్తూ అందరి మన్ననలు అందుకుంటోంది. నిద్రపట్టనివారికి, విశ్రాంతి కోరుకునేవారికి నూరుశాతం కెఫైన్‌లేని చాయ్ ఇది. బంగారు రంగులో చూడడానికి ఎంతో అందంగా ఉండే ఈ చాయ్ పళ్ళ పరిమళంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. కండరాల నొప్పులు, వాపులు, రుతుసంబంధమైన సమస్యలు, క్రాంప్స్, కడుపులో అల్సర్లు, యాంగ్జైటీ, ఇన్‌సోమేనియా, నోటి పూత, మైగ్రైన్ వంటి అనేక అనారోగ్య సమస్యలకు నివారిణిలా పనిచేస్తుంది.

దెబ్బలను మాన్పడంలో, రక్తాన్ని శుద్ధిచేయడంలో, చర్మంలోని తేమను కాపాడడంలో, జుట్టురాలకుండా ఆపడంలో, చర్మంపై ముడతలు రాకుండా చూడడంలో, దురదలు, అలర్జీలు, ర్యాష్‌లు, వగైరాలు రాకుండా చేయడంలో, వదులు చర్మానికి బిగువు తేవడంలో, చర్మానికి బ్లీచింగ్ చేయడంలో, మొటిమలు రాకుండా చూడడంలో, ఫ్రీరాడికల్స్ వల్ల చర్మం పాడైపోకుండా చూడడంలో, కళ్ళకింద క్యారీబ్యాగ్‌లు తయారుకాకుండా చూడడంలో, నల్లమచ్చలు తొలగించడంలో, స్క్రబ్బింగ్ చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది.  ఈ పరిమళాలు అపూర్వాలు   తోడు ఆపిల్, నేరేడు, ఆరెంజ్, చెరకు, చామంతి, చాక్లెట్, దాల్చినచెక్క, ఎర్ల్‌గ్రే, జింజర్‌పీచ్,  వెనిల్లా, పసుపుఅల్లం, పసుపుదాల్చినచెక్క, దాల్చినచెక్కచామంతి, కారమెల్‌వెనిల్లా, ఆరెంజ్‌జింజర్, మామిడిపొద్దుతిరుగుడు, మందార, చెర్రి, మింట్, రాస్‌బెర్రి, బ్లాక్‌బెర్రి, బ్లూబెర్రి, స్ట్రాబెర్రి, పీచ్ పరిమళాలతో ఉన్న టీలకు విదేశాలలో విపరీతమైన డిమాండ్ ఉంది.

చాయ్ భారీగా తాగే దేశాలలో మన దేశమే ముందుంది. ప్రపంచ వ్యాప్తంగా వినిమయమయ్యే టీలో 30% చాయ్‌ని మనమే తాగేస్తున్నాం. టీని నేషనల్ డ్రింక్‌గా గుర్తించాలని 2013లో అప్పటి ప్లానింగ్ కమిషన్ చైర్మన్ అహ్లూవాలియా ప్రతిపాదించారు. అస్సాంలో మేజర్ క్రాప్ తేయాకే కావడంతో అక్కడి ప్రభుత్వం టీని ఆ రాష్ట్ర డ్రింక్‌గా గుర్తించింది. చైనా తర్వాత అతిపెద్ద ఎగుమతిదారుగా కూడా ఇండియాయే ముందుంది. అంటే ఎంత టీ తాగినా మిగులు పంట అధికంగా ఉండడంతో మనం దర్జాగా విదేశాలకు ఎగుమతి చేయగలుగుతున్నామన్నమాట. ఆయుర్వేదం హెర్బల్ టీని పరమ ఔషధంగా గుర్తించి రోగులకు అందించింది. తులసి, ఇలాచ్చి, మిరియాలు, పుదీనా, అతిమధురం ఆకులు, మూలికలతో కషాయం చేసుకుని తాగడం మన దేశంలో సర్వసాధారణంగా కనిపిస్తుంది. ఇవి కూడా ఒకరకం టీలే! రామాయణంలో కూడా టీల ప్రస్తావన ఉందని, దేవతలు తాగిన సోమరసం ఇదేనని పరిశోధకుల వాదన.

ఆ తర్వాత బౌద్ధుల బోధిధర్మలో కనబడుతుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ రాకతో మనం ప్రపంచమంతా తాగుతున్న టీని తాగడం మొదలుపెట్టాం. ఆడా, మగా, పిల్లా, పెద్దా, ముసలీ ముతకా అన్న తేడాలేకుండా అంతా లొట్టలేస్తూ టీతాగడాన్ని మనం చూడవచ్చు. తెల్లవారుజామనిలేదు. అర్థరాత్రి అపరాత్రి అని లేదు. పరగడుపు, భోజనం చేశామనిలేదు. ఎప్పుడైనా చాయ్ తాగడానికి జనం ఎవర్‌రెడీగా ఉంటారు. నిద్ర ఆపుకోడానికి కొందరు టీతాగితే ప్రశాంతంగా నిద్రపోడానికి కొందరు టీ తాగుతుంటారు. ఇలా సమయం, సందర్భం, రాహుకాలం, యమగండకాలం, గ్రహణసమయం అని లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడబడితే అక్కడ కప్పులకు కప్పులు తాగేస్తున్నాం. మన దేశంలో ఉత్పత్తి అయ్యే తేయాకులో 70% మనమే వినియోగించుకుంటు న్నాం. అస్సాం, డార్జిలింగ్, నీలగిరిలలో అంతర్జాతీయ ప్రమాణాలున్న టీ పండుతోంది.

రుచిలో మేటి మిక్స్‌డ్ టీ

ప్రపంచంలో గ్రీన్, హెర్బల్ టీలు అమిత ఆదరణ పొందిన టీలు. విడివిడిగా ఇవి చాయ్ ఎంతగా ఆకర్షించాయో అంతకుమించి వాటి మిక్స్‌డ్, బ్లండ్ వెరైటీలు చాయ్ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. పువ్వులు, మూలికలు, పండ్లు, గింజలు, ఆకులు తీసుకుని రకరకాలుగా జోడించి టీలు త యారుచేస్తున్నారు. వీటిలో పచ్చివి, ఎండువి కూడా ఉంటాయి. వీటివల్ల టీలకు ఊహకు అందనిరీతిలో రుచులు, పరిమళాలుతోడై ఆస్వాదకులకు సరికొత్త అనుభూతినిస్తున్నాయి.

ఆరెంజ్ దేశాధీశుడు విలియం ది సైలెంట్ ఒకప్పుడు టీ వ్యాపారం కోసం ప్రాణంపెట్టిన డచ్ రాజు. 1533 ప్రాం తానికి చెందిన ఈయన డచ్ విప్లవంలో ముందుకురికిన విప్లవవీరుడు. ఈ విప్లవపోరాటం దాదాపు 80యేళ్ళు సాగింది. టీ అంటే ఆయనకు అమితాభిమానం. ఆయనే స్వయంగా ఎంతో జాగ్రత్తగా తేయాకు తోటలు పెంచుకున్నాడు. తేయాకు సేద్యానికి ఆయన చేసిన సేవలకు గుర్తుగా టీ గ్రేడింగ్స్‌లో O అనే గుర్తును ఈయన పేరుమీద కేటాయించారు. ఈ గుర్తు ఉన్న ప్యాకెట్‌లో ఉన్న టీ ఆ రాజుగారంత జాగ్రత్తగా పెంచిన టీతోటల లోంచి సేకరించినది అని చెప్పడానికి దీన్ని గుర్తుగా చూపుతారు.

రూ. 6, 70,000 ఓ చాయ్ ఖరీదు

ప్రపంచంలో అత్యంత ఖరీదైన టీగా ‘డాహాంగ్ పావ్’ గుర్తింపు పొందింది. 2017లో ఒక ముంతడు డాహాంగ్ చాయ్ ధర 10వేల డాలర్లు పలికింది. అంటే మన దేశ కరెన్సీ ప్రకారం 6లక్షల 72వేల రూపాయలు. దాని తర్వాత అత్యంత ఖరీదైన టీగా పిజి టిప్స్ డైమండ్ టీ మార్కెట్‌ను దున్నుతోంది. దీని సింగిల్ ప్యాకెట్ ధర 13వేల డాలర్లు. ఇందులో ఉండే టీ ప్యాకెట్‌లో 280 అత్యున్నత నాణ్యత కలిగిన డైమెండ్లు ఉంటాయి. ఆ తర్వాతి స్థానంలో పాండా డంగ్ టీ నిలబడుతోంది. ఈ పేరు వినగానే పాండా పెంటను ఉపయోగించి టీ తయారుచేస్తారు కావచ్చుననుకుంటారు కానీ నిజానికి అలా చేయరు.

పాండా పెంటను ఎరువుగా ఉపయోగించి టీమొక్కను పెంచుతారు కనుక దీనికా పేరు వచ్చింది. దీని ధర కిలో 7వేల డాలర్లు. మన దేశంలో అత్యంత ఖరీదైన టీగా మకాయ్‌బరీ ఫస్ట్‌ఫ్లష్ చాయ్ గుర్తింపు పొందింది. నిరుడు ఈ చాయ్ పౌడర్ కిలో 19,363 రూపాయలు (302అమెరికా డాలర్లు) పలికింది. జపాన్‌కు చెందిన టీవ్యాపారి మకాయ్‌బరి 155 సంవత్సరాల క్రితం ఈ తేయాకు తోటను పెంచాడు. ఆయన ఈ టీని మాత్రమే కొనుగోలుచేసేవాడు. అందుకని దీనికి ఆయన పేరుమీదే మకాయ్‌బరీ చాయ్ అనే ముద్రపడింది.

బ్లాక్ టీ

ఇది అతి పురాతనమైన టీ. 1368లోనే చైనాలో ఈ టీని ధారాళంగా వాడేవారు. ఈ టీని తాగితే మెదడు చురుకుగా పనిచేస్తుంది. తక్షణ శక్తి సమకూరుతుంది. హార్మోన్‌ల హెచ్చుతగ్గులను నివారించి సమతూకంలో ఉంచుతుంది. నరాలబలహీనతను నివారిస్తుంది. తలనొప్పులు తగ్గిస్తుంది. ఇందులో విటమిన్‌ఎ, విటమిన్ బి 1, విటమిన్ సి, విటమిన్ బి6 ఉన్నాయి.  యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నందున శరీరంపై వృద్ధాప్యఛాయలు కనబడకుండా చేస్తుంది. చర్మం మీద పర్యావరణ ప్రభావం పడకుండా చూస్తుంది. ఎయిడ్స్ నుంచి కాపాడుతుంది. మెదడుకు రక్తం సరఫరా బాగా ఉండేలా చూస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరగకుండా చూస్తుంది. యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్‌గా పనిచేస్తుంది. శరీరం తెగినా, పుళ్లుపడినా, కాలినా, ఎండకు చర్మం కమిలిపోయినా బ్లాక్‌టీ ఆకును పైపూతగా వాడుకోవచ్చు. పళ్లుగారపట్టకుండా, చివుళ్లు పాడైపోకుండా కూడా కాపాడుతుంది. పూర్తిగా ఆక్సిడైజ్డ్ అయిన టీ. నలుపు, బ్లాక్‌బ్రౌన్ రంగులోకి మారుతుంది. దీన్ని వేడినీటిలో వేసి కాచినపుడు తేనీటి పరిమళం గుభాళిస్తుంది. ఈ బ్లాక్ టీలో కెఫైన్ శాతం చాలా ఎక్కువగా ఉండి తాగే వారికి మంచి కిక్ ఇస్తుంది. కప్పుడు బ్లాక్‌టీలో కెఫైన్ 4060శాతం అధికంగా  ఉంటుంది. మన దేశంలో డార్జిలింగ్, అస్సాం, నీలగిరి ప్రాంతాలలో టీ విస్తృతంగా పండుతుంది. సిక్కిం, సిలోన్ (శ్రీలంక), నేపాల్, టర్కీ, ఇండోనేసియా, కెన్యా, చైనా, ఆస్ట్రేలియాలలో కూడా టీతోటలు  విరివిగా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో అమెరికా, యూరోప్ దేశాలలో ఇటీవలకాలంలో దీని వాడకం ఎంతగానో పెరిగింది. ఈ టీకి పూలు, పండ్లు, ఇతర పరిమళాలు తగిలించి మరింత మధురంగా, ఆస్వాదయోగ్యంగా తయారుచేయడానికి అవకాశం ఉంది. బ్లాక్‌టీలలో ఎర్ల్‌గ్రే, ల్యాప్‌సాంగ్ సౌచాంగ్, రోజ్‌టీ, కారామెల్‌టీల వంటివి ఎంతగానో పాప్యులర్ అయ్యాయి.

ప్యూర్  టీ

చైనాలోని యన్నన్ ప్రాంతంలో తూర్పు హన్ రాజకుటుంబీకులు (25220) పాలించిన రోజులలోనే ఈ టీ బహుజనాదరణ పొందింది. ఈ కొండదారులలో టీ బస్తాలను గుర్రాలు, గాడిదల మీద తరలించేవారు. అందుకని ఆ దారికి టీ గుర్రాలదారిగా పేరొచ్చింది. ఒడిలిపోయిన తేయాకుతో తయారయ్యే చాయ్ ఇది. ఆసియా దేశాలలో ఈచాయ్‌కి ఎంతో డిమాండ్ ఉంది. ఈ చాయ్‌లో ఔషధ విలువలున్నాయి. అందుకని దీన్ని హెల్త్ డ్రింక్‌గా కూడా పరిగణిస్తారు. ముఖ్యంగా ఆల్కహాల్ తాగడం వల్ల వచ్చే హ్యాంగోవర్ వదిలించేందుకు, కొలెస్ట్రాల్ తగ్గించేందుకు, జీర్ణశక్తిని పెంచేందుకు, ఒంట్లో వేడిపుట్టించేందుకు, నోట్లో లాలాజలాన్ని పుట్టించేందుకు, దాహార్తిని తీర్చేందుకు, మైండ్‌ను ఫ్రెష్‌గా ఉంచేందుకు, ట్రైగ్లిసరైడ్ ప్రభావాన్ని తగ్గించేందుకు తోడ్పడుతుంది. విషరసాయనాల ప్రభావాన్ని నిరోధించడానికి, రక్తాన్ని శుద్ధిచేయడానికి ఉపయోగపడుతుంది.

రోజూ 58కప్పుల టీని తాగితే కొలెస్ట్రాల్ బాగా తగ్గుతుందని, కీళ్ళనొప్పులను అరికడుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. చైనీయులు దీన్ని డిటాక్స్ టీ అని పిలుస్తారు. స్లిమ్మింగ్ ప్రాక్టీస్‌లో ఉన్న వారికి ఈ టీ నిజమైన నేస్తంగా పనిచేస్తుంది. అందాన్ని ఇనుమడింపచేయడానికి కూడా ఈ టీ ఉపయోగపడుతుంది. బ్లాక్‌టీ కన్నా డార్క్‌గా, మంచి వాసనతో ఘుమఘుమలాడతూ ఉంటుంది. కప్పు టీలో 6070 మిల్లీగ్రాముల కెఫైన్ ఉంటుంది. అదే గ్రీన్‌ప్యూర్‌టీలో అయితే 3040 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది. టీ ఆకును మగ్గబెట్టి ప్యూర్‌చాయ్‌ను తయారుచేస్తారు. ఆకును యేడాదిలో రెండుసార్లు మగ్గబెట్టి ఈ చాయ్‌పత్తాని తయారుచేస్తారు. బాగా పాతబడిన ఆకుతో తయారుచేసే చాయ్ మెల్లోచాయ్. ఈ టీ తాగిన తర్వాత గొంతంతా తియ్యగా ఉంటుంది.

ఊలాంగ్ టీ

చైనాను 618907  ప్రాంతంలో  పరిపాలించిన టాంగ్ ప్రభువుల పాలనాకాలంలోనే ఈ టీ పాప్యులర్‌గా వినియోగంలో ఉండేది. బయూన్ ప్రాంతంలోని ఫోనిక్స్ కొండలలో పండే తేయాకుతో తయారయ్యే టీ కావడంతో దీన్ని బయూన్ టీగా కూడా పిలిచే వారు. ఇది కొద్దిగా ఆక్సిడైజ్డ్ అయిన తేయాకులతో తయారయ్యే టీ. ఇది గ్రీన్‌టీకి ఎక్కువ, బ్లాక్‌టీకి తక్కువ. ఇందులో కెఫైన్, యాంటీ ఆక్సిడెంట్లు తగుమాత్రంగా ఉంటాయి. అందువల్ల ఆరోగ్యం బాగుంటుంది. రుచిగా కూడా ఉంటుంది. ఈ టీకి చైనా, తైవాన్ దేశాలలో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఊలాంగ్‌టీ ఆకును ఉపయోగించి 3-7 సార్లు టీ కాచుకోవచ్చు. బలహీనపడిన కిడ్నీలను కాపాడేందుకు, నిస్సత్తువ లేకుండా చేసేందుకు ఊలాంగ్‌టీ ఎంతగానో ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి, ఊబ శరీరం పీడ వదిలించుకోవాలనుకునే వారికి, ఫాటీ డిపాజిట్లు కరగదీయాలనుకునేవారికి,  మెటబాలిజం మెరుగుపురుచుకోవాలనుకునే వారికి ఈ టీ ఎంతో మేలు చేస్తుంది. ఊలాంగ్ టీకి థాయ్‌ల్యాండ్ పెట్టిందిపేరు.  టి క్వాన్ ఇన్ బ్రాండ్ చాయ్ చైనాలో ఎంతో పాప్యులర్. కోకోనట్ కబ్నా, డార్క్‌రోస్ట్ ఊలాంగ్, ఐరన్ గాడెస్ ఊలాంగ్, రష్యన్ కార్వాన్, గోయింగ్ గోంగ్‌ఫూ బ్రాండ్లు ప్రముఖమైనవి.

వైట్ టీ

1100 సంవత్సరం నుంచే ఈ టీకి పెద్దగా గుర్తింపు ఉంది. చైనా చక్రవర్తి వైట్‌టీని వదలకుండా తాగేవాడని ప్రతీతి. ఈ టీపిచ్చిలో పడి మంగోలియన్లు యుద్ధానికి వస్తే పట్టించుకోకుండా ఓటమిపాలై రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. తేయాకును అతి తక్కువగా ప్రాసెస్ చేసి తయారుచేసే టీ ఈ వైట్ టీ. దీని కోసం లేలేత టీ ఆకులను ఎంచుకుంటారు. ఇందులో చాలా తక్కువ స్థాయిలో కెఫైన్ ఉంటుంది. ఒక కప్పుటీలో 1015 మిల్లీగ్రాముల కెఫైన్ మాత్రమే ఉంటుంది. మొదటిసారి ఈ టీ తాగినపుడు వేడినీళ్ళు తాగినట్టే రుచీపచీలేకుండా ఉంటుంది. కానీ వైట్‌టీ తాగిన తర్వాత మనం వదిలేగాలిలో, నోటిలో ఏదో తేడాగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఒకటికి రెండు సార్లు తాగాక చిరుతీపి ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఈ టీ తయారుచేసుకోడానికి 175 డిగ్రీల వేడిలో కాచి చల్లార్చిన నీటిని వినియోగించాలి. ఇది చైనాలోని ఫ్యూజియన్ రాష్ట్రం నుంచి ఉత్పత్తి అవుతుంది. 1100 సంవత్సరంలో ఇప్పుడు అమెరికాలో కూడా వైట్‌టీ ప్రియులు పెరుగుతున్నారు. జాస్మిన్ సిల్వర్ నీడిల్, సిల్వర్‌నీడిల్, మెడిటేటివ్ మైండ్, మంకీపిక్డ్‌వైట్, నాచురల్‌గ్లో , స్నోఫ్లేక్స్, కొనాయిసర్, ఆర్గానిక్ టీ సాంప్లర్ బ్రాండ్లకు ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉంది.

గ్రీన్  టీ

క్రీ.పూ. 2737 నుంచి గ్రీన్‌టీ వినియోగంలో ఉంది. 15వ శతాబ్దంలో చైనా నావికులకు విటమిన్‌సి లోపం వల్ల కలిగే స్కార్వి అనే వ్యాధికి మందుగా గ్రీన్‌టీని వాడేవారు. 100 సంవత్సరాల తర్వాత స్కార్వికి విరుగుడుమందుగా యూరోప్ దేశాలు గ్రీన్‌టీని వాడడం మొదలుపెట్టాయి. ఫ్లూవంటి జ్వరాలను మోసుకువచ్చే సూక్ష్మక్రిములను నాశనం చేయడానికి గ్నీన్‌టీ ఎంతగానో ఉపయోగపడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. కొలెస్ట్రాల్ తగ్గించడానికి, బిపి పెరగకుండా అడ్డుకోడానికి గ్రీన్‌టీ అమృతంలా ఉపయోగపడుతుంది. పళ్ళమీద పాచిపేరుకుపోకుండా నిరోధించడానికి, కావిటీలు రాకుండా చూడడానికి కూడా గ్రీన్‌టీ ఉపయోగపడుతుంది. క్యాన్సర్ కారకాలను నిర్మూలించడంలో గ్రీన్‌టీ మహత్తరంగా పనిచేస్తుంది. గ్రీన్‌టీ ఆకులో విలువలను కాపాడడానికి ఒక ప్రత్యేకమైన ఆక్సిడేషన్ విధానాన్ని అనుసరిస్తారు. టీ ఆకులు కోసిన వెంటనే పచ్చదనం పోనంత వరకు వేడిచేస్తారు. అందువల్ల ఆకులు తెల్లబడిపోకుండా, ఎండిపోకుండా ఉంటుంది. మొక్కల నుంచి ఉదయం కోసి సాయంత్రానికెల్లా కుండలో బ్రూచేస్తే తయారయ్యే టీ గ్రీన్‌టీ. ఆక్సిడేషన్ తగుమాత్రంగా చేస్తూ టీ ఆకుకు సహజంగా ఉండే ముదురాకు పచ్చదనం, అందులో ఉండే విటమిన్‌సి, పత్రహరితం, ఖనిజాలు  పోకుండా జాగ్రత్తపడతారు. అందుకని గ్రీన్‌టీ తాగితే వగరుగా, చిరు చేదుగా అనిపిస్తుంది. అతిగా ఆక్సిడేషన్ చేయకపోవడం వల్ల కెఫైన్ అతి తక్కువగా అంటే 1% మాత్రమే ఉంటుంది. అందువల్ల గ్రీన్‌టీ తాగితే ఫ్రెష్‌మూడ్ వస్తుంది. మెదడు చురుకుగా పనిచేస్తుంది. హుషారుగా కూడా అనిపిస్తుంది. కప్పు చైనా గ్రీన్‌టీలో  3035 మిల్లీగ్రాముల కెఫైన్ ఉంటుంది. జపాన్ గ్రీన్‌టీలో 2530 మిల్లీగ్రాముల కెఫైన్ ఉంటుంది. గ్రీన్‌టీకి పరిమళం చేర్చుకోవచ్చు. జాస్మిన్ గ్రీన్‌టీకి విపరీతమైన డిమాండ్ ఉంది. గ్రీన్‌టీ పండించే దేశాలలో చైనా, జపాన్ ప్రధానమైనవి. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ రావడంతో థాయ్‌ల్యాండ్, కొరియా, వియత్నాం దేశాలు కూడా గ్రీన్‌టీ పండించేందుకు కృషిచేస్తున్నాయి.

యెర్బామేట్ టీ 

1500 సంవత్సరం నుంచి చైనాలో యెర్బామేట్ టీ సేద్యం భారీగా సాగింది. పరానాపరాగ్వే నదీ తీరంలో దీని సాగు కనువిందు చేసింది. దీన్ని యెర్బామతాయ్ అని కూడా పిలుస్తారు. ఇది కూడా హెల్త్ డ్రింక్. ఇందులో 35 మిల్లీగ్రాముల కెఫైన్ ఉంటుంది. ఆకలి పుట్టించడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. విటమిన్‌సి, పొటాసియం, మాగ్నీసియం పుష్కలంగా ఉంటాయి. ఇది నరాలను ఉత్తేజపరచదు. పైగా శరీరంలోని కణాలను, కణజాలాలను శాంతపరుస్తుంది. అందువల్ల ఇది తాగితే ఎంతో హాయిగా ఉంటుంది. దక్షిణ అమెరికా, ఉత్తర అర్జెంటీనా, ప్రాగ్వే, ఉరుగ్వే, దక్షిణ బ్రెజిల్ దేశాలలో ఈ టీకి అమిత ఆదరణ ఉంది. కొలొరాడో కలెక్షన్, మచమేట్, యెర్బామేట్, క్లైంబర్స్ హైచాయ్, 7ఎఎం ఎనర్జీ బూస్ట్ టీలకు జనాదరణ పుష్కలంగా ఉంది.

మింట్  టీ

మొరాకో సంస్కృతిని పుణికి పుచ్చుకుని అక్కడి విందులకు పెద్ద ఆకర్షణగా నిలిచిన చాయ్ ఇది. 12వ శతాబ్దం నుంచి ఇది చాయ్ అభిమానులకు అందుబాటులోకి వచ్చింది. ఇది కూడా నూరుశాతం కెఫైన్‌లేని చాయ్. జీర్ణశక్తికి, తూలుడు, ఒళ్ళు తిరుగుడు, తలనొప్పి, రుతుసంబంధమైన సమస్యలను, ఊపిరి సంబంధమైన సమస్యలను నివారించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

బుష్ టీ 

కెఫైన్ ఎంత మాత్రంలేని చాయ్ ఇది. 1904 నుంచి ఈ టీ అందుబాటులోకి వచ్చింది. కెఫైన్ అంటే భయపడేవారికి దివ్యమైన టీ ఇది. దక్షిణాఫ్రికాలో ఇది లభిస్తుంది. దీన్ని రూ ఇబోస్ టీ, రెడ్‌బుష్‌టీ అని కూడా పిలుస్తారు. ఇందులో 37 రకాల యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు, ఇనుము, జింక్, కాల్షియం, పొటాషియం, ఫ్లోరైడ్, విటమిన్‌సి, అల్ఫా హైడ్రాక్సీ యాసిడ్ పుష్కలంగా ఉన్నాయి. ఇది తాగితే చర్మం ఎంతో ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంటుంది. పళ్ళు, ఎముకలు పుష్టిగా ఉంటాయి. మెటబాలిజం నియంత్రణలో ఉంటుంది. సాధారణ, చర్మసంబంధమైన క్యాన్సర్‌ను  నియంత్రిస్తుంది. అలసటను దూరం చేస్తుంది. స్ట్రెస్ తగ్గిస్తుంది. ఉదరసంబంధమైన ఇబ్బందులను పోగొడుతుంది. అలర్జీకి విరుగుడు, ఇనుము లోపాన్ని అరికట్టడానికి ఉపయోగపడుతుంది. దీన్ని చర్మానికి రాసుకుంటే సూర్యకాంతిలోంచి వచ్చే అతినీలలోహిత కిరణాల వల్ల కలిగే కీడును నియంత్రిస్తుంది.