Home ఆఫ్ బీట్ ఆధ్యాత్మిక కళాధామం బుద్ధగయ

ఆధ్యాత్మిక కళాధామం బుద్ధగయ

Gautama Buddha Gained place

 

ప్రపంచం దుఃఖమయం. దుఃఖానికి కోరికలే కారణం. కోరికలను జయించటానికి ఆష్టాంగమార్గమే సరిఅయిన మార్గం అని చాటి చెప్పిన మహనీయుడు గౌతమ బుద్ధుడు. ఆయన సంచరించిన ప్రదేశాలు మన దేశంలో అనేకం ఉన్నప్పటికీ, వీటిలో బుద్ధుడు జ్ఞాన సిద్ధిని పొందిన ప్రదేశం మాత్రం బుద్ధగ.

బుద్ధునికి జ్ఞానోదయం కల్గిన పుణ్యప్రదేశంగా, దేశంలోనే బుద్ధుని పాదస్పర్శతో పునీతమయిన పుణ్యప్రదేశాలలో ఒకటిగా, ప్రసిద్ధ పర్యాటక క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న ఈ దివ్య క్షేత్రం బీహార్ రాష్ట్రం, గయ జిల్లాలో ఉంది. బుద్ధగయ లో ఉన్నబోధి వృక్షం అంటే రావి చెట్టు క్రింద బుద్ధునికి జ్ఞానోదయం కలిగింది . బుద్ధునికి చెందిన మహిమాన్విత క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న బుద్ధగయ దివ్య క్షేత్రం అపురూపమైన అందాలకు నెలవుగా అలరారుతోంది.

ఈ క్షేత్రాన్ని చారిత్రికంగా ఉరువేల, సంబోధి, వజ్రాసన లేదా మహాబోధి అని పిలుస్తాం. గౌతమ బుద్ధుడు ఫాల్గు నది ఒడ్డున ఉన్న బోధి చెట్టుకింద ధ్యానం చేయడానికి ఇక్కడికి వచ్చాడని బౌద్ధ పురాణాల కథనం. బుద్ధుడు తన ఆధ్యాత్మిక ఎదుగుదలకు సంబందించి అన్ని ప్రశ్నలకు సమాధానాలు పొందిన ప్రదేశమిది. అలాగే, 13 వ శతాబ్దంలో టర్కిక్ సైన్యాలు ఈ క్షేత్రాన్ని ఆక్రమించేంత వరకు, ఈ ప్రాంతం కొన్ని శతాబ్దాలుగా బౌద్ధ నాగరికతకు కేంద్రంగా ఉంది.

బుద్ధుడు వెళ్ళిన అనేక శతాబ్దాల తరువాత, మౌర్య రాజు అశోకుడు బౌద్ధమతానికి గుర్తుగా పెద్ద సంఖ్యలో ఆరామానాలు, స్తంభాలను నిర్మించాడు. బుద్ధగయలో ఉన్న ముఖ్యమైన పర్యాటక స్థలం ఇక్కడున్న మహాబోధి ఆలయం. దీనిని గౌతమ బుద్ధుడు జ్ఞానాన్ని పొందిన స్థలంగా భావించి పూజిస్తారు. ప్రశాంతమైన వాతావరణం ప్రకృతి అందాల నడుమ అలరారుతున్న మహాబోధి ఆలయాన్ని పూర్తిగా ఇటుకలతో నిర్మించారు. ఆ మందిరం ఎత్తు 170 అడుగులు. ఈ మందిరాన్ని 2300 సంవత్సరాల క్రితం అశోకుడు నిర్మించాడు. మహాబోధి ఆలయం ద్రవిడుల నిర్మాణ శైలిలో ఉంది. ఈ ఆలయ ప్రధాన గోపురాన్ని 19వ శతాబ్దంలో 55 మీటర్ల ఎత్తులో పునర్నిర్మించారు. ప్రధాన గోపురం చుట్టూ, అదే శైలిలో నాలుగు చిన్న గోపురాలు నిర్మించారు. ఈ ఆలయ నాలుగు సరిహద్దులు రెండు మీటర్ల ఎత్తులో దగ్గరగా రాతి రైలింగుతో ఉన్నాయి. అనేక రైలింగ్‌లు సూర్య, లక్ష్మి, ఇంకా అనేక భారతీయ దేవీ దేవతల విగ్రహాలతో ఉంటే, కొన్ని రైలింగ్‌లు తామరపూలతో దర్శనమిస్తాయి.

రోజూ వేలాది మంది పర్యాటకులు దర్శించుకునే ఈ ప్రాంగణంలోని అసలు బోధి వృక్షాన్ని బౌద్ధమతస్థులు నేపాల్‌కు తీసుకువెళ్ళగా, అక్కడ నుంచి ఒక శాఖను తెచ్చి ఇక్కడ నాటారని చెబుతారు. విశాలంగా పరచుకున్న ఈ బోధి వృక్షం చుట్టూ ఫెన్సింగ్ చేసి గేటు నిర్మించారు. ఈ గేటును దాటి లోపలికి వెళితే బుద్ధుడు కూర్చున్న ప్రదేశం ఉంది. బుద్దునికి జ్ఞానోదయం అయిన తర్వాత ఈ క్షేత్రంలోనే ఏడు వారాలు గడిపాడంటారు. ఇదే ప్రాంగణంలో అనేక స్తూపాలు దర్శనమిస్తాయి. ఆ స్తూపాల మధ్యలో ఒక మనిషి పడుకోవటానికి సరిపడే బెడ్డులు పరిచి ఉన్నాయి. కొందరు భక్తులు అక్కడనే నిద్రపోతారు. అలాగే అక్కడే ధ్యానం చేస్తారు. దీనికి కొంచెం దూరంలోనే బుద్ధుడు తన ప్రధాన శిష్యులకు జ్ఞాన బోధను చేసిన ప్రదేశం ఉంది. ఇక్కడ బుద్ధుడు జ్ఞాన బోధను శిష్యులకు చేస్తున్నట్టుగా ఉన్న మూర్తులు అందంగా దర్శనమిస్తాయి. దీనికి సమీపంలోనే పూరి జగన్నాధుని ఆలయంతో పాటు, టిబెట్, చైనా, జపాన్ దేశస్థులు నిర్మించిన మరో మూడు మందిరాలు కూడా దర్శనమిస్తాయి.

ఉత్సవాలు, పండుగలు:
ఏటా బుద్ధ జయంతిని ఈ ప్రాంగణంలో అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఆ రోజున లక్షలాది మంది దేశ విదేశీ బౌద్ధ పర్యాటకులు ఈ క్షేత్రాన్నిసందర్శిస్తారు. అలాగే ఏటా నవంబర్ నెలలో మూడు రోజుల పాటు వార్షిక బుద్ధ ఉత్సవాన్నినిర్వహిస్తారు.

రవాణ సదుపాయం :
ఈ దివ్య క్షేత్రానికి చేరుకోవడానికి దేశంలోని అనేక ప్రాంతాల నుంచి రవాణ సదుపాయం ఉంది. ఈ క్షేత్రం వారణాసి నుంచి 255 కిలోమీటర్ల దూరంలో ఉంది. అందువల్ల వారణాసి వరకు రైలులో గాని, విమానంలోగాని, బస్సులో గాని వచ్చి అక్కడ నుంచి ఏదైనా వాహనంలో ఇక్కడకు చేరుకోవచ్చు. అలాగే ‘గయ’ వరకు వచ్చి అక్కడ నుంచి ఏదైనా వాహనంలో కూడా చేరుకోవచ్చు.

భోజన, వసతి సదుపాయాలు
దేశ విదేశీ పర్యాటకులు విపరీతంగా సందర్శించే ప్రాంతం కావడం వల్ల ఇక్కడ భోజన, వసతి సదుపాయాలకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ అనేక హోటళ్ళు,సత్రాలు అందుబాటులో ఉన్నాయి.

Story about Gautama Buddha Gained place knowledge

Telangana Latest News