Home కలం హేమంత పువ్వు

హేమంత పువ్వు

Haridsulu

 

పరిగెడుతున్న కాలం నుండి

హేమంత ఋతువు భూమిపైకి రాలిపడి
శీతల పవనాల విత్తులు చిగురించాయి
కోట్ల కాంతుల ఖిలలు విరజిమ్ముతూ…
అంబరమణి మకరంలోకి దూకి
గగన పసిడి ద్వారాలను తెరిచాడు!
చలి రాకాసి శరీరాన్ని కొరుకుతుంటే…
అగిని నోట్లో మా గతాన్ని పోసి వెలిగిస్తే…
ఆ వెలుగులు మా కష్టాల గొంతులు నులిమి
అంధకార బందీఖానా నుండి విముక్తులను చేసి
భోగి పూల వర్షాన్ని కురిపించాయి!

ముంగిళ్ళు రంగవళ్ళులు అద్దుకుంటే…
డోలు సన్నాయిలు స్వరాలు అందిస్తే…
హరిదాసు గళం రాగాలాలపిస్తే…
డూడూలు నృత్యాలతో దండాలు చేస్తే…
పిండి వంటలు మా నాలుకలకు రుచులద్దితే…
మా పల్లె శోభను చూడటానికి
పట్టణమంతా వలసొచ్చింది!
ఆదర్శాల తీగలతో ఆశయాల పతంగులను
మేఘాల అంచుకు చేరుస్తాము!
సూర్య రేచ్ఛస్సుతో రేగు పండ్లు చేసి
చిన్నారుల దేహాలను అభిషేకిస్తాము!
సంప్రదాయాలను నిలువెల్లా నింపుకొని
మంచు పువ్వులను సాగనంపుతాము!!

విరాజిత (విజ్జు), 9700747280