Home దునియా తెలంగాణ శకుంతలగా గుర్తించారు…

తెలంగాణ శకుంతలగా గుర్తించారు…

dandora-komaram

పశువులంటే మాకు ప్రాణం పొద్దుగల లేస్తం పాలుపిండుతం, మా ఇంటికి యాజమానురాలిని నేనే ఈ డైలాంగ్ వినగానే మనకు ముందుగా గుర్తొచ్చోది జబర్దస్త్ కొమరం. ఈ మధ్య కాలంలో టివి షోలకు వున్నంత క్రేజ్ సినిమాలక్కూడా లేదు. ఐదేళ్లుగా తెలుగువారిని నవ్వుల ప్రపంచంలోకి తీసుకెళ్తున్న కార్యక్రమం జబర్దస్త్. అందులో నటించే హాస్య నటులు తెరమీద మనకు వారి వేషాలతో హాస్యాన్ని తెప్పిస్తుంటారు కాని తెర వెనుక వారు పడేకష్టాలు ఎవ్వరికి తెలియవు. అటువంటి వ్యక్తుల్లో
పాలమూరు ముద్దుబిడ్డ జబర్దస్త్ కొమరం (కొమ్రక్క)ఒకరు. ఆయనకు హాస్యనట చక్రవర్తి బిరుదు ప్రదానం చేసిన సందర్భంగా హరివిల్లు పలకరించింది.

జబర్దస్త్‌లో ఛాన్స్ ఎలా వచ్చింది?
ఒక రోజు నేను పటాస్ ప్రోగ్రాంకి ఆడిషన్స్ జరుగుతున్నప్పుడు వెళ్లాను. అక్కడ నాకు వెంకీ అన్న కలిసి నా గ్రూప్‌లో చేస్తావా అని అడగటంతో ఆలస్యం చేయకుండా టీంలో చేరాను. అందులో దాదాపు 50కి పైగా ఎపిసోడ్‌లు చేశాను. చమ్మక్ చంద్ర టీంలో ఒక సంవత్సరం చేసాను. కిరాక్ ఆర్‌పి టీంలో చేరాక చాలా కాలం తర్వాత ఒక రోజు నేను చేసిన ఒక షో నా జీవితాన్నే మార్చేసింది. పశువులంటే మాకు ప్రాణం. పొద్దుగాల లేస్తం పాలు పిండుతం మా ఇంటికి యాజమానురాలుని నేనే….. అనే డైలాగ్‌తో రెండు తెలుగు రాష్ట్రల ప్రజల గుండెల్లో స్థానం పొందాను.

సినిమాల్లోనూ నటించినట్లున్నారు…
సలాం హైదరాబాద్, కోనపురంలో జరిగిన కథ సినిమాలో హీరోకి స్నేహితుడిగా నటించాను. మళ్లీరావాలో సుమంత్‌కి ఫ్రెండ్‌గా చేశాను. వెల్‌కమ్ జిందగిలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా చేస్తున్నాను. గిల్లిదండాలో వికలాంగుడిగా, కన్నడంలో కూడా ఒక సినిమా చేసాను. ప్రస్తుతం 5 సినిమాలు రిలీజ్‌కి రెడీగా ఉన్నాయి.

బుల్లితెరపై ఇప్పటి వరకు ఎన్ని షోలు చేశారు?
నా మొట్టమొదటి షో మిర్చిన్యూస్, 6టివీలో వన్స్‌మోర్ , ఖతర్నాక్ కములవ్వ, బిత్తిరి సత్తి నేను కలిసి అవ్వతాతా, 10 టివిలో నాకు తెలియాలని, మా టివీలో ఊతప్పం, టివీ9 లో వీకెండ్ మస్తీ, ఈటివీ ప్లస్‌లో అనుభవించురాజా, జబర్దస్త్ చేస్తున్నాను. ప్రస్తుతం సొంత స్క్రిప్ట్‌తో టివి1లో దండోరా చేస్తున్నాను. అందులోని డైలాగ్స్ అన్ని నేనే రాసుకుంటా.

జబర్దస్త్‌లో ముసలమ్మ వేషంలో చేయాలనే ఆలోచన…
మా నానమ్మ అంటే చాలా ఇష్టం. చిన్న తనం నుంచి తనతోనే ఎక్కువ సమయం గడిపాను. ఆమె మాట్లాడే భాష, మా ఇంటికి వచ్చిన వారితో ఎలా ఉంటుందో అన్నీ గమనించేవాన్ని. ప్రస్తుతం నేను వేస్తున్న ముసలమ్మ, కొమ్రక్క వేషాల్లో ్ల నన్ను చూసుకుంటే నాకు మా నాన్నమ్మను చూస్తున్నట్టే ఉంటది. అందరూ నన్ను తెలంగాణ శకుంతలగా పిలుస్తున్నారు. అది నా అదృష్టంగా భావిస్తున్నా.

తెలంగాణ యాసలో మాట్లాడడానికి మొదట్లో ఏమైనా ఇబ్బందిపడ్డారా?
ఇప్పుడు తెలంగాణ యాస మాట్లాడుతుంటే అందరూ విని ఆనందిస్తున్నారు. కాని ఒకప్పుడు తెలంగాణ యాసను చాలా చిన్న చూపు చూసేవారు. సినిమాల్లో ఆఫర్లు ఇచ్చేవారు కాదు. అలా చాలా వరకు నటనపై ఆశలు పెట్టుకుని వచ్చిన వారు తిరిగి వెనక్కు వెళ్లిపొయారు. ఇప్పుడు ప్రాంతీయ భేదాలు లేకుండా అందరికీ అవకాశాలు ఇస్తున్నారు.

కమల్‌హాసన్ నుంచి అవార్డు తీసుకున్నప్పుడు మీ ఫీలింగ్..
కమల్‌హాసన్‌ని చూస్తానని ఎన్నడూ అనుకోలేదు. అలాంటిది ఆయన నుంచి జంధ్యాల అవార్డు తీసుకోవడం..చెప్పరాని ఆనందంతో ఏడ్చేశాను. ఆ రోజు వారి ముందు ఓ చిన్న ప్రోగ్రాం చేసాను. నా జీవితంలో మరిచిపోలేని రోజుగా ఎప్పటికీ గుర్తుంచుకుంటా.

మీ తల్లిదండ్రులు, కుటుంబనేపథ్యం…
మాది మహబూబ్‌నగర్ జిల్లా బాల్‌నగర్ మండలం ఉడిత్యాల్ గ్రామం. తల్లిదండ్రులు పద్మ, మల్లయ్య. అమ్మ కూరగాయలు అమ్ముతది. నాన్న పాల వ్యాపారం చేస్తడు. అక్క, అన్న ఉన్నారు. నేను పదో తరగతి చదువుకున్నా. ఆర్థిక పరిస్థితుల వల్ల పైకి చదవలేకపోయాను. తర్వాత ఏం పనిచేయాలో తెలియక హైదరాబాద్‌కి వచ్చాను. ఇక్కడ ఎవ్వరూ పరిచయం లేరు. కోఠిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరుగుతూ సాయంత్రం సమయంలో ఒక హోటల్లో పనిలో చేరాను. దాదాపు ఎనిమిది సంవత్సరాలు అనేక హోటళ్లలో పని చేసాను. ఇప్పడు ఏ ఏరియాకి వెళ్లినా ఈ హోటల్లో నేను పనిచేసాను కదా అని గుర్తు చేసుకుంటా..! చిన్నప్పటి నుంచి మిమిక్రీ అంటే చాలా ఇష్టం. స్కూల్లో ఉన్న సమయంలో నేనూ మా చెల్లి ఇద్దరం కలిసి లేడిస్ వాయిస్‌లో పాటలు పాడి ఎన్నో అవార్డులు గెలుచుకున్నాం.

సినిమాల్లో మీవాళ్ళెవరైనా ఉన్నారా…?
సినిమా రంగంలో మావాళ్ళెవరూ లేరు. కాకపొతే గ్రామల్లో వేసే నాటకాల్లో నటిస్తుండేవాడిని. స్కూల్లో వేసే నాటకాలలో లేడీ గెటప్ ఉందంటే చాలు మా టీచర్లు నన్నే వేయమనేవారు. హైదరాబాద్‌లో సూపర్‌వైజర్‌గా పనిచేసే సమయంలో శ్రీచైతన్య కాలేజీలో జరిగిన ఒక చిన్న కార్యక్రమానికి వెళ్లాను. అప్పుడక్కడ టీచర్లు విద్యార్థులను ఎవరైనా స్టేజీపైకి వచ్చి మీ ప్రతిభను నిరూపించుకోండి అన్నారు. కానీ ఎవ్వరూ వెళ్లలేదు. అప్పుడు నేను అక్కడున్న ఓ టీచర్‌తో మేడమ్ నాకు మిమిక్రీ వచ్చు చేస్తానండి అన్నాను. ఆమె సరే అనడంతో కొంత మంది హీరోలు, రాజకీయ నాయకుల గొంతులను అనుకరించి చూపించేసరికి అక్కడున్న వారంతా హాయిగా నవ్వుతుంటే తెలియని ఆనందం కలిగింది. అప్పుడు వారు రు. 200 ఇచ్చి నాకు సన్మానం చేశారు. ఇప్పటికీ ఆ డబ్బులు అలాగే దాచిపెట్టుకున్నాను. ఆ రోజుల్లో నేను పని చేస్తున్న హోటల్లో నా జీతం రూ.150. చిన్నప్పటి నుంచి సినిమాల్లో చేయాలనే ఒక చిన్న ఆశ ఉండేది. కోఠిలో రోడ్డు పక్కన వాచ్‌లు, గొలుసులు, నైటీలు, చెప్పులు, గొడుగులు అమ్మేవాడిని. ఇప్పుడు నేను చేస్తున్న కొన్ని సన్నివేశాలు ఒకప్పుడు నేను అనుభవించినవే.

మీ భార్య సహకారం ఎలా ఉంది?
నా మరదలినే ప్రేమించి పెళ్లిచేసుకున్నా. ఆమె పేరు రజిత. మాకు ఇద్దరు అబ్బాయిలు. పెళ్ళయిన తరువాత నాలుగు సంవత్సరాలపాటు ఊర్లోనే పాల వ్యాపారం చూసుకున్నా. ప్రతి రోజు సాయంత్రం ఇంటికి వచ్చి టివీలో జబర్దస్త్ కార్యక్రమాన్ని చూసేవాన్ని. ఒక రోజు మా గ్రామంలో మల్లన్న ఒగ్గు కథ ఆడుతున్నారు. అందులో మా నాన్నకి ఓచిన్నవేషం ఇచ్చారు. నాకేమో ఆడవేషం ఇచ్చారు. నా నటనను అందరూ మెచ్చుకున్నారు. ఒక కంపెనీలో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నప్పుడు, అక్కడున్న మా సార్ ..“కొమరం నీలో ఒక మంచి నటుడున్నాడు సినిమాల్లో ప్రయత్నించు ” అన్నాడు. నాలో ఆశ కలిగింది. నా భార్య కూడా ప్రోత్సహించింది. “నీకో మూడేళ్లు టైం ఇస్తున్నా…అనుకున్నది సాధించు” అంది. ఆ మాటలతో నాలో మనోధైర్యం పెరిగింది. 5000 రూపాయలు, కొన్ని వంట సామాన్లు ఇచ్చి నన్ను హైదరాబాద్ పంపింది.

మీకు లంబాడీ వచ్చునట కదా..ఇంకా ఏమేం భాషలు వచ్చు..?
మా ఊరి చుట్టు పక్కల చాలా తండాలున్నాయి. వాళ్లతో ఉంటూ లంబాడీ భాష నేర్చుకున్నాను. హోటల్స్‌లో పనిచేసేటప్పుడు తమిళం, నేపాల్, హిందీ, కన్నడ నేర్చుకున్నాను.

చిన్నప్పటి స్నేహితులతో ఇప్పటికీ మాట్లాడుతుంటారా….
నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే కారణం నా స్నేహితులే. హైదరాబాద్‌లో ఉన్న ఐదు సంవత్సరాలు నా కుటుంబానికి రాజ్‌కుమార్, రామకృష్ణ, వెంకి, గణేష్‌లు వెన్నండగా నిలిచారు. నాకు ఎలాంటి కష్టం వచ్చినా మొదటగా గుర్తొచ్చేది వెంకీ. ఏ చిన్న ఇబ్బంది వచ్చినా వెంటనే స్పందించేవాడు.

మీకు నచ్చిన హీరో.. డైరెక్టర్…
రాజామౌళి సినిమాల్లో నటించాలని చాలా కోరిగ్గా ఉంది. మహేష్ బాబు అంటే ఇష్టం. తన సినిమాలో కూడా ఒక క్యారెక్టర్ చేయాలనుంది.
కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వారికేం చెబుతారు..?
ఇండస్ట్రీకి వచ్చేవారికి ఓర్పు చాలా అవసరం. ఎందుకంటే మీరు ఊరూవాడా, ఇల్లూ వాకిలిని, అయిన వారిని ఆలుబిడ్డలను వదిలి వస్తారు. ఆశపడి హైదరాబాద్‌కి వచ్చినంత వేగంగా అవకాశాలు రావు. దానికి కొంత సమయం పడుతుంది. అవకాశాలు రావడంలేదని ముక్కూ మొహం తెలియని వారికి డబ్బులు ఇచ్చి మోసపోవద్దు. మనలోని నటనని చూసి గుర్తించినవాడే నిజమైన డెరెక్టర్. ఇక్కడ డబ్బుతో, వయసుతో, ఆందంతో ఆఫర్స్ రావు.

                                                                                                 విష్ణుచారి కాసోజు