Home కలం గతాన్ని వర్తమానంతో కలిపిన కజువో ఇషిగురో

గతాన్ని వర్తమానంతో కలిపిన కజువో ఇషిగురో

Kazuo-Ishiguro

జపాన్ జాతీయుడు, బ్రిటన్ వాసి అయిన కజువో ఇషిగురో కు ఈ ఏడాది సాహిత్యంలో నోబెల్ బహుమతి వచ్చిందంటే ఆయనా నమ్మలేదు. సాహిత్యాభిమానులూ నమ్మ లేదు. ఆయన నమ్మకపోవడానికి వినయం కారణం కావచ్చు. ఎందుకంటే ఎన్ గుగి వ తియోంగొ, హరుకి మురకమి, మార్గరెట్ అట్వుడ్, సల్మాన్ రష్దీ లాంటి ప్రసిద్ధ రచయితల్లో ఎవరికో ఒకరికి కాకుండా తనకు నోబెల్ సాహిత్య బహుమతి ఏమిటి అని ఇషిగురో ఆశ్చర్యపడ్డారు. ఇది ఆయన నమ్రతకు నిదర్శనం. కాని సాహిత్యాభిమానులు, పాఠకులు కూడా ఆయనకు ఈ బహుమతి వచ్చిందని నమ్మలేదు. వాళ్ల అభిప్రాయం ఏమిటంటే ఆయనకు ఇంతకు ముందే ఆ సత్కారం అంది ఉండాలిగదా అని. అంటే పాఠకాదరణ ఆయనకు ఎంత ఉందో అర్థమవుతోంది. ఇషిగురోకు 62 ఏళ్లు. ఆ బహుమతి తొందరగా వచ్చిందేమోనని కూడా ఆయన భావించారు. సాధారణంగా తల పండిన రచయితలకు మాత్రమే ఇలాంటి అత్యున్నత పురస్కారాలు అందుతాయి.

గత సవత్సరం బాబ్ డిలాన్ కు సాహిత్యంలో నోబెల్ బహుమతి దక్కడం కొంత వివాదాస్పదం అయింది. కాని ఈ సారి ఇషిగురోకు ఆ బహుమతి దక్కడం వల్ల ఆ బహుమతి ఏర్పాటు చేసిన ప్రయోజనం నెరవేరిందన్న అభిప్రాయం కలుగుతోంది. నోబెల్ బహుమతుల్లో కూడా రాజకీయాలు ఉన్నాయన్న అభిప్రాయాలు ఉన్నప్పుడు ఈ మాట వినిపించడంలో సబబు ఉంది. ఇషిగురో 1954లో జపాన్ లోని నాగసాకిలో జన్మించారు. కాని ఇషిగురో అయిదవ ఏటనే ఆయన తండ్రి సముద్ర విజ్ఞాన శాస్త్రంలో పరిశోధన చేయడానికి ఇంగ్లాండ్ వెళ్లి అక్కడే ఉండి పోయారు. ఇషిగురో పెద్దవాడయ్యాక తప్ప జపాన్ సందర్శించలేదు. తెలిసీ తెలియని వయసులోనే స్వదేశం వదిలి వెళ్లినా ఆయనకు తన మాతృ భూమి మీద మమకారం పోలేదు. తన పితామహులను, మాతా మహులను, చిన్న నాటి స్నేహితులను వదిలి వెళ్లాల్సి వచ్చిందే అన్న బాధ ఆయన మనసులో గూడు కట్టుకు పోయింది. ఆయన పుట్టింది అణుబాంబు దాడికి గురైన నాగసాకి కావడం వల్ల ఆ బీభత్సం కలవరపెట్టడం మానలేదు. అందుకే ఆయన ఇంగ్లాండ్ లో స్థిరపడ్డా ఆయన రచనల్లో జపాన్ నీడలు కనిపిస్తూనే ఉంటాయి. ప్రపంచం అస్థిరంగా కనిపిస్తున్న దశలో తనకు ఈ బహుమతి దక్కినందుకు సంతోషంగానే ఉందని ఆయన అంటారు.

‘మనం ఉంటున్నది భయంకరమైన పరిస్థితిలో. మన రాజకీయ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోతున్నాం. నాయకుల మీద విశ్వాసం లేదు. మన విలువలేమిటో మనకు తెలియడం లేదు. నాకు నోబెల్ బహుమతి దక్కడం వల్ల శాంతి సౌహార్ద్రం వెల్లి విరియడానికి, ప్రపంచ శాంతి పరిఢవిల్లడానికి అవకాశం ఉంటుందేమో‘ అని ఇషిగురో అన్నారు. అందుకే తన సమకాలికుల్లో ఆ పురస్కారం దక్క వలసిన వారు చాలా మందే ఉండగా తనకు అందడం ఏమిటి అన్నది ఆయన ప్రశ్న. ప్రపంచంతో మనకున్న సంబంధాల విషయంలో మనకున్న భ్రమలను తొలగించి మన జీవితాల్లో ఎంత అగాథం ఉందో తన రచనల ద్వారా చూపించిన వాడు ఇషిగురో. కీర్తి ప్రతిష్ఠలు సంపాదించిన వారినందరినీ పూవు పుట్టగానే పరిమళించినట్టు అని పొగడడం ఆనవాయితీ. కాని ఇషిగురో మొదటి నుంచి రచయిత ఏమీ కాడు. అంతకు ముందు ఆయన కొన్ని ఉద్యోగాలు చేశాడు. గ్లాస్గో, లండన్ లో సామాజిక కార్యకర్తగా పని చేశారు. కాస్త వయసు వచ్చిన తర్వాతే రచయిత అవతారమెత్తారు. ఆ తర్వాత పూర్తి కాలం రచయితగా మారిపోయారు. ‘ఈ బహుమతి వచ్చినంత మాత్రాన నేను అలసత్వం చూపను. నేను చేస్తున్న పనిలో మార్పేమీ ఉండదు. నోబెల్ బహుమతి తలకెక్కదు. యువతరం నా రచనలు చదువుతున్నందుకు నాకు గర్వంగా ఉంది‘ అని ఇషిగురో చెప్పడం ఆయన విజ్ఞతకు తార్కాణం.

ఇషిగురో ఇప్పటి వరకు 8 నవలలు వెలువరించారు. 1982లో మొదటి నవల ఎ పేల్ వ్యూ ఆఫ్ ది హిల్స్ రాయడానికి ముందు ఆయన ఈస్ట్ ఆగ్లియా విశ్వవిద్యాలయంలో సృజనాత్మక రచనల విభాగంలో శిక్షణ పొందారు. ది రిమేన్స్ ఆఫ్ ది డే ఆయనకు బాగా పేరు తెచ్చిపెట్టిన నవల. ఆ నవలకే 1989లో బుకర్ ప్రైజ్ వచ్చింది. తర్వాత సినిమాగా కూడా వచ్చింది. ఇషిగురోకు సినిమా స్క్రిప్టులు రాయడంలో కూడా అనుభవం ఉంది. గతాన్ని అవగాహన చేసుకోవడం అంటే ఇషిగురోకు ఆసక్తి. అయితే గతాన్ని ఆరాధించి గతమెంతో మేలు అనుకునే తిరోగమన వాది కారు. వ్యక్తి గాని, సమాజం గాని భవిష్యత్తు మీద ఆశతో మనుగడ సాగించాలంటే గతంలో జరిగిన దుస్సంఘటనలను మరిచిపోక తప్పదంటాడు ఇషిగురో. ఆయన మొదటి రెండు నవలలు నాగసాకి మీద అణుబాంబు దాడి, రెండవ ప్రపంచ యుద్ధం సృష్టించిన బీభత్సం నేపథ్యంగా రాసినవే.

ఇషిగురో మీద ఫ్రాంజ్ కాఫ్కా, మార్సెల్ ప్రౌస్ట్, జేన్ ఆస్టిన్ ప్రభావం ఉందనే సాహిత్య విమర్శకులు ఉన్నారు. కాని ఇషిగురో ఈ వాదనను ఖండించారు. చిన్నప్పుడు షెర్లాక్ హోమ్స్ రచనలు చదివినందువల్లే సాహిత్యాభిమానం ఏర్పడిందని మాత్రం ఇషిగురో అంగీకరిస్తాడు. దోస్తోవిస్కీ ప్రభావం మాత్రం ప్రస్ఫుటంగానే కనిపిస్తుంది.ఆయన రచనల్లో సైన్స్ ఫిక్షన్ లక్షణాలు కనిపిస్తాయి. తనకు ప్రపంచ యుద్ధానికి ముందు, ఆ తర్వాతి పరిణామాల మీద శ్రద్ధ ఉందంటారు. అణుబాంబు పేల్చక ముందు జనానికి ఉన్న ఆదర్శాలు భిన్నమైనవని ఆయన అంటారు. విలువలను, ఆదర్శాలను బేరీజు వేయడం మీద ఆయనకు ఆసక్తి ఎక్కువ. జపాన్ తో ఆయన సంబంధం తెగిపోయి అయిదు దశాబ్దాలు గడిచినా స్వస్థలం ఆయనను ఆకర్షిస్తూనే ఉంది. ఆర్టిస్ట్ ఇన్ ది ఫ్లోటింగ్ వరల్డ్ నవల తన ఊహలోని జపానే అంటారు. మళ్లీ జపాన్ వెళ్లాలన్న కోర్కె ఉండడం వల్లే ఆ దేశాన్ని మరిచి పోలేక పోతున్నానంటారు. ఆ దేశంతో ఆయనకు భావ సాన్నిహిత్యం ఎక్కువ. అయితే తన తల్లిదండ్రుల దృక్కోణం నుంచే తాను జపాన్ ను చూస్తానంటారు. ప్రత్యక్ష సంబంధం కొరవడినప్పుడు ఇది సహజమే గదా.

జ్ఞాపకాలను విస్మృతితో, చరిత్రను వర్తమానంతో, కల్పనను వాస్తవంతో ముడిపెట్టడంలో ఇషిగురో దిట్ట. ఆయన వచనం లయాత్మకంగా ఉంటుంది. అయినా ధీర గంభీరంగా భాసిస్తుంది. మాటలను పొదుపుగా వాడతారు. హాస్యాన్ని పండించడంలో నిపుణుడు. ఆయన నవలల్లో కథా నాయకుల చిత్రణ పాఠకులను కట్టి పడేస్తుంది. తన సౌందర్యాత్మక ప్రపంచాన్ని తానే సృష్టించుకున్నారు. జపాన్ మీద ఎంత అభిమానం ఉన్నా తాను జీవిస్తున్న నేల సంప్రదాయాలను, ఆనవాయితీలను తన నవలల్లో ప్రస్పుటంగా వ్యక్తం చేశారు. ఆయన కల్పనా సాహిత్యంలో డిటెక్టివ్ అంశాలూ కనిపిస్తాయి. రచనతో పాటు పియానో, గిటార్ వాయించడం కూడా ఇషిగురోకు ఇష్టం. ఇంట్లో మాతృ దేశ భాషే మాట్లాడతారు.

-ఆర్.వి.రామారావు, 9676999856