Home ఆఫ్ బీట్ లోక హృదయ సోషల్ మీడియా

లోక హృదయ సోషల్ మీడియా

world-socal-media-day

కళ్లు తెరవకుండానే ఫోను కోసం తడుముకునే స్మార్ట్ కాలమిది.  కళాశాల విద్యార్థుల నుంచి దేశ ప్రధాని వరకు అందర్నీ ఒకే తీరున కట్టిపడేస్తున్నాయి సామాజిక మాధ్యమాలు.  ఏ విషయం మీద ఎవరేం అనుకుంటున్నారో, ఎక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి మాత్రమే కాకుండా చాలా రకాలుగా ఉపయోగపడుతోంది సోషల్‌మీడియా. ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌ల్లోనే చాలా పనులు చకాచకా జరిగిపోతున్నాయి. మన మనోభావాలను  పంచుకోవడానికి ఇదో వేదిక.   ఎక్కడెక్కడో ఉన్న వారిని కలుపుతోంది. వేరే గ్రహంలోని సమాచారాన్ని కూడా చేరవేస్తోంది.  ప్రపంచంలో జరిగే సమాచారాన్ని క్షణాల్లో ముందుంచుతోంది. ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లాంటివి అయితే సెలబ్రిటీలకు సామాన్యులకు మధ్య దూరాన్ని తగ్గిస్తున్నాయి. రాజకీయ నాయకులు, అధికారులు చాలా వరకు సోషల్‌మీడియా ద్వారానే సమస్యల్ని పరిష్కరిస్తున్నారు. ఎప్పటికీ మనం వంటరివాళ్లం కాదు అనే ఫీలింగ్‌ను కలుగజేస్తోంది.

ఈ సామాజిక మాధ్యమాల్లో పవర్‌ఫుల్ మంత్రం ట్వీటు మంత్రం. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ కార్యాలయాలు, వ్యాపార సంస్థలు, సెలబ్రిటీలు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఇలా ఎవరితో పనిపడినా ఒక్క ట్వీట్ చాలు. క్షణాల్లో పనైపోతుంది. మన దేశరాజకీయ నాయకుల్లో ఎక్కువగా ట్విట్టర్‌ను వాడటం మొదలుపెట్టింది కాంగ్రెస్ నేత శశిథరూర్. అప్పట్లో ఆయన్ని ట్విట్టర్ మినిస్టర్ అనేవారు. ఆ తర్వాత ప్రధాని మోడీ సెల్ఫీలతో సోషల్‌మీడియా వేదికగా యువతరాన్ని ఆకట్టుకున్నారు. ఆ తర్వాత కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, ఇతర నాయకులూ సామాజిక మాధ్యమాలను అనుసరించడం మొదలెట్టారు. వారిలో

చాలా మంది ట్విట్టర్‌లో చురుగ్గానే ఉన్నా సుష్మాస్వరాజ్, సురేష్ ప్రభుల స్థాయిలో ప్రజలకు చేరువైనవారు లేరు. మన దేశంలో ట్విట్టర్ వినియోగం 2016లో బాగా పెరిగింది. అంతర్జాతీయ స్థాయిలో సంభాషణలకు మాధ్యమంగా ఉన్న ట్విట్టర్‌లో భారతీయులు క్రియాశీలంగా పొల్గొన్నారు. ఢిల్లీలో కాలుష్యం గురించి మొదలైన చర్చ పెద్ద నోట్ల రద్దుతో పతాక స్థాయికి చేరింది. ఒలింపిక్స్‌లో భారతీయ మహిళల ప్రతిభ, టీ20 ప్రపంచకప్ క్రికెట్, ఫిల్మ్‌ఫేర్ అవార్డులు… ఇలాంటి అంశాలన్నింటిపైన స్పందించి యాక్టివ్ ట్విట్టర్ వినియోగదారుల జాబితాలో చేరిపోయారు మనవారు. ఇక వాట్సాప్ గురించి చెప్పక్కర్లేదు. స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి చేతిలో వాట్సాప్ యాప్ ఉంది. వాట్సాప్ ద్వారా గ్రూప్‌లను తయారు చేసుకుంటున్న కొంతమంది పేదలకు సాయం చేస్తున్నారు. యువతకు కౌన్సెలింగ్ ఇవ్వడం, మహిళలను ప్రోత్సహించడం.. ఇలా అన్ని వర్గాల వారు గ్రూప్‌ల ద్వారా దగ్గరౌతూ చాలా సమస్యలను పరిష్కరిస్తూ సలహాలిస్తున్నారు. యూట్యూబ్ అనేది ఓ బిజినెస్‌గా మారింది. షార్ట్‌ఫిల్మ్‌లను తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసి సంపాదించుకునే వారు ఎక్కువయ్యారిప్పుడు. బుక్స్ కొనని వారుంటారేమోగానీ ఫేస్‌బుక్ అకౌంట్ లేనివారు మాత్రం ఉండరేమో..!

సోషల్‌మీడియా వేదికగా క్యాంపెయిన్‌లు
* సెల్ఫీ విత్ డాటర్ హర్యానాలోని బీబీపూర్ అనే గ్రామ సర్పంచ్ లింగవివక్షను తరిమి కొట్టేందుకు, బాలికా విద్యను ప్రోత్సహించేందుకు సెల్ఫీ విత్ డాటర్ అనే క్యాంపెయిన్ ప్రారంభించాడు. ఆడబిడ్డలతో సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమనేది కాన్సెప్ట్. ఈ హ్యాష్‌టాగ్ క్యాంపెయిన్ నచ్చిన మోడీ బేటీ పడావో… బేటీ బచావో… కార్యక్రమానికి అనుసంధానిస్తూ ప్రచారం ప్రారంభించాడు.

* అడాప్ట్ ఎ విలేజ్ శ్రీమంతుడు సినిమాతో మొదలైన కొత్త క్యాంపెయిన్ ఇది. మహేష్‌బాబు రంగారెడ్డి జిల్లా సిద్ధాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకోగా, ప్రకాశ్‌రాజ్ కొండారెడ్డిపల్లిని, మంత్రి హరీష్‌రావు తన నియోజక వర్గంలోని ఇబ్రహీంపూర్‌ను దత్తత తీసుకున్నాడు. ఇలా ఒక్కరితో మొదలైన ప్రచారం పదుల సంఖ్యను దాటింది.

* స్వచ్ఛ తెలంగాణ ప్రధాని మోడీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని అన్ని రాష్ట్రాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా స్వచ్ఛమేవ జయతే అంటూ చేతులు కలిపింది. స్వచ్ఛతెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్ అంటూ క్యాంపెయిన్‌లు ప్రజల ఆదరణ పొందాయి. ప్రయివేటు, ప్రభుత్వ, ఐపీఎస్, ఐఎఎస్ అధికారులు, సినీతారలు, రాజకీయ నేతలు అందరూ చీపుర్లు పట్టి చెత్త తొలగిస్తూ, సరికొత్త సందేశాన్ని ఇచ్చి సామాన్యులను కూడా ఈ క్యాంపెయిన్‌లో పాల్గొనేలా చేశారు.

* సెల్ఫీ విత్ ఎ ప్లాంట్ హరితహారంలో భాగంగా ప్రతిఒక్కరూ ఒక మొక్క నాటాలి. దాంతో సెల్ఫీ తీసుకుని సోషల్‌మీడియాలో పోస్ట్ చేయాలి. హరితహారం ఫస్ట్ స్టేజ్‌లోనే మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ఇప్పటికీ ఉద్యమంలా సాగుతోంది. ప్రజల మద్దతుతో జోరందుకుంటోంది. చైనాలోని గోబీ ఎడారిలో, బ్రెజిల్‌లోని అమెజాన్ నదీ తీరంలో గతంలో ప్రజలు స్వచ్ఛందంగా చెట్లు నాటిన కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకుని మన ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. అనేక కోట్ల మొక్కలు నాటాలనే సంకల్పంతో క్యాంపెయిన్ చేసింది. మొక్కలు నాటండి సెల్ఫీలు దిగండి అనే నినాదంతో వచ్చిన ఈ కార్యక్రమంలో సినీ తారలు, రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలతోపాటు సామాన్యులు కూడా కదిలారు. సెల్ఫీ విత్ ప్లాంట్ క్యాంపెయిన్‌కు సంబంధించి కొన్ని లక్షల ఫొటోలు ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో పోస్ట్ అయ్యాయి.

* మీ టూ క్యాస్టింగ్ కౌచ్ గురించి హాలీవుడ్‌లో మొదలైన మీ టూ క్యాంపెయిన్ పెను సంచలనం సృష్టించింది. ఇక్కడ కూడా చాలా మంది బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ తదితర రాష్ట్రాల్లోని హీరోయిన్లు ఎంత మందో స్పందించారు. తమకు జరిగిన పరాభవాలను సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నారు. తెలుగు హీరోయిన్ శ్రీరెడ్డి సృష్టించిన ప్రకంపనలు మనకు తెలిసిందే.

* జాస్మిన్ విప్లవం : మూడు దశాబ్దాలుగా నిరుద్యోగం, అవినీతిని అనుభవిస్తూ స్వేచ్ఛ లేకుండా జీవిస్తున్న ట్యునీషియా ప్రజలు సోషల్‌మీడియాను వేదికగా చేసుకుని అక్కడి అధ్యక్షుడిని గద్దె దింపడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఆ దేశ అధ్యక్షుడు జైన్ ఇల్ అబిడిన్ బెన్ అలీ అరాచకాలను భరించలేని ప్రజలు డిసెంబరు 17, 2011న సోషల్‌మీడియా, టివి, పత్రికల సాయంతో తమకు స్వాత్రంత్య్రాన్ని సంపాదించుకున్నారు. ట్యునీషియా జాతీయ పువ్వు జాస్మిన్. పాశ్చాత్యమీడియాలో ఈ సంఘటనలను ‘జాస్మిన్ విప్లవం’ లేదా ‘జాస్మిన్ స్ప్రింగ్’ అని పిలుస్తున్నారు.

సదా మీ సేవలో

ట్విట్టర్ వారధిగా తమ శాఖ వినియోగదారులకు అవసరమైన సాయం అందించడంలో ముందుంటున్నారు రైల్వేశాఖ మంత్రి సురేష్‌ప్రభు. సాయానికి మారుపేరుగా మారారు. ఓసారి డెహ్రాడూన్‌లోని ఏషియన్ స్కూల్ విద్యార్థులు రైల్లో ప్రయాణిస్తున్నారు.  మంచు వల్ల వారి రైలు ఏడుగంటలపాటు నిలిచిపోయింది. ఆ రైల్లో భోజనాల ఏర్పాటు లేదు. దాంతో ఓ విద్యార్థి తమ పరిస్థితిని రై ల్వే మంత్రికి ట్వీట్ చేశాడు.  వెంటనే స్పందించిన మంత్రి పిల్లలందరికీ ఫుడ్ ప్యాకెట్లతోపాటు నీళ్ల సీసాలను సరఫరా చేయించారు. మరో సంఘటనలో రైల్లో ప్రయాణిస్తున్న  నమ్రతా మహాజన్ తన సీట్లో కూర్చున్న ఓ వ్యక్తిని లేవమన్నందుకు అతడు వేధించడం మొదలుపెట్టాడు. భౌతిక దాడికి దిగుతున్న అతడిని తప్పించుకోవడం ఎలాగో తెలియని ఆమె వెంటనే మంత్రికి ట్వీట్ చేసింది.  కాసేపట్లో రైల్వే పోలీసులు వచ్చి ఆమెకు అండగా నిలిచారు. బిడ్డకు పట్టడానికి సీసా పాలు కావాలని ట్వీట్ చేసిన మహిళకు వెంటనే తర్వాతి స్టేషన్‌లో పాలను అందించే ఏర్పాట్లు చేశారు సురేష్. ఇలాంటి సందర్భాలెన్నో ఉన్నాయి.

ట్వీట్టర్ రాయబారి

మీరు మా దేశ ప్రధాని అయితే  మా దేశం ఎంత బాగుండేదో అని పాకిస్తాన్ మహిళ చేత పొగిడించుకున్న  సుష్మాస్వరాజ్  ట్వీట్లతో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. వీసా పాస్‌పోర్టులు ఇప్పించే విషయంలో తక్షణమే స్పందిస్తూ దేశవిదేశాల్లో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.  విదేశీ పత్రికలు ఆమెకు ట్వీట్ రాయబారి అంటారు. నోయిడాకు చెందిన తన్విసేత్ అనే మహిళ ఓ ముస్లిం వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.  కొత్త పాస్‌పోర్ట్ తీసుకోవడానికి స్థానిక పాస్‌పోర్ట్ కార్యాలయానికి వెళ్లింది. అక్కడి అధికారి ఒకరు ఆమె ముస్లింను వివాహం చేసుకుందని ఆమెతో అవమానకరంగా ప్రవర్తించాడట. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ వేదికగా సుష్మాకు వివరించింది. ‘సుష్మా మేడమ్.. నేను ముస్లింని పెళ్లి చేసుకున్నానని పాస్‌పోర్ట్ కార్యాలయంలో ఓ అధికారి నన్ను అవమానించాడు. మా ఇద్దరిలో ఎవరో ఒకరు పేర్లు మార్చుకోవాలని అంటున్నాడు.  నా పాస్‌పోర్ట్‌తో పాటు నా భర్త పాస్‌పోర్ట్ కూడా హోల్డ్ పెట్టాడు.పాస్‌పోర్ట్ వచ్చేలా సాయం చేయండి’ అని పేర్కొంది. దీనిపై సుష్మా స్పందించారు. తన్వి దంపతుల పట్ల అవమానకరంగా ప్రవర్తించిన అధికారిని బదిలీ చేశారు. చివరికి వారికి పాస్‌పోర్ట్ అందడంతో బాధితులు సుష్మకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

ఫాలోయర్స్ ఎక్కువ
స్టార్ హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్‌కు 40 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు ఇంతమంది ఫాలోయర్స్ ఉండడం విశేషం. రకుల్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనాలు సృష్టిస్తోంది. ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. దానికి తోడు ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. హెల్త్ కాన్షియస్ పేరిట హాట్ ఫొటోలు తీసుకొచ్చి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది రకుల్. ఫొటోలు యువకుల మతులు పోగొట్టాయి. ఈ విధంగా సోషల్ మీడియాలో రోజురోజుకు తన ఫాలోయర్స్ సంఖ్యను పెంచుకుంటూ పోతోంది.

ఇంకుడు గుంతలు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మరో క్యాంపెయిన్ ఇంకుడుగుంతలు. ఈ కార్యక్రమానికి అన్ని రకాల ప్రజల నుంచి మద్దతు లభించింది.  సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఇంటి ముందు ఇంకుడు గుంతలు తీసి సెల్ఫీలు దిగి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు.

ఎవరు ట్వీట్ చేసినా స్పందిస్తారు

ప్రధాని మోడీ ట్విట్టర్‌లో చాలా చురుగ్గా ఉంటారు. తనను ఉద్దేశించి ఎవరు ట్వీట్ చేసినా స్పందిస్తారు. సమయోచిత సమాధానాలివ్వడంలో మోడీ ముందుంటారు. కోయంబత్తూరులోని  ఇషా యోగా కేంద్రంలో ఆదియోగి విగ్రహావిష్కరణ సందర్భంగా ప్రధాని మోడీ శివుడి బొమ్మ ఉన్న ఓ అందమైన నెమలిపింఛం రంగు ఉత్తరీయాన్ని ధరించారు. టీవీలో ఆ కార్యక్రమం చూసిన శిల్పి తివారీకి ఆ స్టోల్ నచ్చింది. అంతే ‘నాకు ఈ స్టోల్ కావాలి’ అంటూ ట్వీట్ చేసి ప్రధానికి ట్యాగ్ చేసింది. మర్నాటికల్లా ఆ స్టోల్‌తోపాటు ప్రధాని సంతకం చేసిన ఓ ఉ త్తరం శిల్పికి అందింది.  ‘ఆదియోగి బొమ్మ ఉన్న స్టోల్‌ని ఆధునిక కర్మయోగి అయిన మన ప్రధాని నాకు పంపించారంటూ’ ట్విట్టర్‌లో తన ఆనందాన్ని పంచుకుంది శిల్పి.

కెటిఆర్ రూటే సెపరేటు….

ప్రజా సమస్యలపై తక్షణం స్పందించే మంత్రి కెటిఆర్.. సోషల్ మీడియాలోనూ అంతే యాక్టివ్‌గా ఉంటారు. సమకాలీన అంశాలపై ఆయన ఎప్పటికప్పుడు ట్వీట్లు చేస్తూ ఉంటారు. ప్రజలు తమ సమస్యలను సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేస్తే వాటికి కెటిఆర్ స్పందించి పరిష్కరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆయనలో కేవలం సేవాగుణమే కాదు.. హాస్యచతురత కూడా దాగి ఉంది. ఇందుకు ఆయన చేసిన తాజాగా చేసిన ట్వీటే నిదర్శనం. ఓ చిన్నారికి సంబంధించిన హోంవర్క్ గురించి వివరిస్తూ ఆయన చేసిన ట్వీట్ నవ్వు తెప్పిస్తోంది. జీవితంలో షార్ట్‌కట్స్ లేవని ఎవరన్నారు?  ఈ విషయంలో ఈ చిన్నారి ఎంత తెలివిగా ఆలోచించిందో చూడండి. చిన్నారితో పాటు ఆ టీచర్ కూడా అంతే స్మార్ట్‌గా ఉన్నట్లున్నారు’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్‌కు చాలా మంది స్పందించారు. ఓ స్కూల్ విద్యార్థికి హోంవర్క్‌లో భాగంగా ‘ఇక్కడున్న పిల్లి..గిన్నెలో ఉన్న పాలను చేరుకునేందుకు సాయం చేయండి’ అనే పజిల్ ఇచ్చారు. అందుకా చిన్నారి పజిల్ లోపలి నుంచి కాకుండా బయటి నుంచి పిల్లి, పాల గిన్నెకు గీత గీసి పజిల్ పూర్తి చేసింది. ఈ చిన్నారి తన హోంవర్క్ చేసిన విధానం కెటిఆర్‌ను బాగా ఆకట్టుకుంది.

అంతర్యుద్ధాన్ని లోకానికి చాటింది

బనా అల్ అబెద్ అనే 8 ఏళ్ల చిన్నారి సిరియాలోని అలెప్పో నగరంలో నివసించినా బనా యుద్ధాన్ని ఎంత దగ్గరగా చూసిందో ఆమె ట్వీట్లు ప్రపంచానికి చాటాయి.  బనా తల్లి ఫాతిమా ఇంగ్లిష్ టీచర్. ఆమె కూతురికి ఇంట్లోనే ఇంగ్లిష్ నేర్పించడంతోపాటు ఆమె పేరు మీద ట్విట్టర్ ఖాతా తెరిచింది.  తల్లి సాయంతో బనా తన చుట్టూ ఉన్న పరిస్థితులను ట్వీట్‌ల ద్వారా  ప్రపంచానికి తెలపడం మొదలుపెట్టింది.  ఆమె ఖాతా ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే మూడున్నర లక్షల మందికి పైగా ఆమెను అనుసరించారు. ట్వీట్‌లలో అక్కడి పరిస్థితులను వివరిస్తూ పిల్లలకెందుకు ఈ శిక్ష అని ప్రశ్నించేది. బడికెళ్లలేకపోతున్నాను.  స్నేహితులతో ఆడుకోవడానికీ లేదు అంటూ బిక్కమొహంతో బనా చెప్పే ముద్దు మాటల వీడియోలకు ప్రపంచం ఫిదా అయింది. బాంబులు పేలుతున్నాయనీ, అర్థరాత్రిళ్లు కాల్పుల చప్పుడుకి ఉలిక్కిపడి లేస్తున్నానంటూ బనా చేసిన ట్వీట్లను పలువురు ప్రముఖులు రిట్వీట్ చేసేవారు. ఎట్టకేలకు సిరియా సంక్షోభం సద్దుమణిగింది. బనా కుటుంబం ప్రస్తుతం టర్కీలో ఆశ్రయం పొందుతోంది. ఈ చిన్నారి త్వరలో రచయిత్రికానుంది. ప్రపంచంలో ఎక్కడా యుద్ధం జరక్కూడదు అనే బనా తన పుస్తకం ద్వారా సిరియాలో ఏం జరిగిందో చెప్తానంటోంది. పుస్తకం పేరు డియర్ వరల్డ్.

రివైవ్ హ్యాండ్‌లూమ్

చేనేతను బతికించాలనే ఆలోచనతో సినీ తార సమంత చేపట్టిన కార్యక్రమం ఇది. తన తల్లి గతంలో ధరించిన చేనేత చీరను ఆమె కట్టుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నేనే కాదు మీరూ ఇలా చేయండి. అమ్మల చేనేత చీరలను ధరించి రివైవ్ హ్యాండ్‌లూమ్ , ఓపెన్ 2017 హ్యాష్‌టాగ్‌లతో సోషల్‌మీడియాలో పోస్ట్ చేయండి అని పిలుపునిచ్చింది. అంతే ఆ పోస్ట్‌కు విపరీతమైన స్పందన వచ్చింది. నేతన్నను ఆదుకోవాలనే సంకల్పంతో మంత్రి కెటిఆర్ ప్రారంభించిన ‘చేనేతకు చేయూత’ క్యాంపెయిన్‌లో రివైవ్ హ్యాండ్‌లూమ్ కూడా భాగమైంది.

* సే నో టు డ్రగ్స్ డ్రగ్స్ మాఫియాను అంతమొందించడానికి హైదరాబాద్‌లో చేపట్టిన కార్యక్రమం ఇది. సినీ పరిశ్రమలో డ్రగ్స్ అంశం హాట్ టాపిక్‌గా మారడంతో సినీ తారలు ఈ క్యాంపెయిన్‌కు పిలుపునిచ్చారు. అవేర్‌నెస్ వాక్, ర్యాలీలు జరిగాయి. ఈ క్యాంపెయిన్‌కు సంబంధించిన ఫొటోలు అప్‌డేట్ చేస్తూ నెటిజన్లను ఆకర్షించి అవగాహన కల్పించిన సందర్భాలున్నాయి.

సిస్టర్స్4చేంజ్

నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత శ్రీకారం చుట్టిన క్యాంపెయిన్ ఇది. అక్కాచెల్లెళ్లు రాఖీ పండుగనాడు తమ సోదరులకు రాఖీ కట్టి ఓ హెల్మెట్‌ను ఇవ్వడం థీమ్. తన అన్న కెటిఆర్ పుట్టినరోజు సందర్భంగా  ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.  ఔత్సాహిక ఫిల్మ్‌మేకర్ మేకల వంశీకృష్ణ తీసిన ‘రక్షా బంధన్’ లఘుచిత్రం స్ఫూర్తిగా ఈ క్యాంపెయిన్ మొదలైంది.  హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపడం వల్ల  ప్రమాదాల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు.  అందుకే అక్కాచెల్లెళ్లు సోదరులకు రాఖీతోపాటు హెల్మెట్ కూడా ఇవ్వమని సందేశమిచ్చారు కవిత. అనూహ్య స్పందన వచ్చింది. సానియామీర్జా, గుత్తా జ్వాల, పీవీ సింధులాంటి ప్రముఖ క్రీడాకారిణిలతోపాటు సినిమా తారలు ఈ క్యాంపెయిన్‌లో పాల్గొన్నారు.  యూపీ అమేథీలో అయితే రాఖీ కట్టిన అక్కాచెల్లెళ్లకు కానుకగా మరుగుదొడ్లు కట్టివ్వాలనే కార్యక్రమం ఉద్యమంలా వ్యాపించింది.

                                                                                                             మల్లీశ్వరి వారణాసి