Home దునియా ప్రేమ ఎంత మధురం

ప్రేమ ఎంత మధురం

lovers-day-spl

ప్రేమ అంటే పరస్పర ఆకర్షణతో పాటు పరస్పర నమ్మకం … ఒకరంటే ఒకరికి ఇష్టం.. ఒకరినొకరు కలిసి జీవితం గడపాలన్న ఆసక్తి… అదో స్పందన..ఒక వ్యక్తిని చూస్తే అతనితో మాట్లాడాలనిపించడం..ఆ వ్యక్తితో కంఫర్టుగా ఫీలవడం.. ప్రేమ రెండు మనసుల్ని కలుపుతుంది. కొందరు అలౌకిక భావన అంటారు..మరి కొందరు అదే దైవం అంటే.. ఇంకొందరు ప్రేమే ఊపిరి అని.. మానసిక శాస్త్రవేత్తలు అదో భావన అంటారు. బయాలజిస్టులు బయో కెమిస్ట్రీ అంటూ.. ఇలా ఎవరికి తోచిన నిర్వచనాలు వారు చెప్తారు. ఇలాంటి ఈక్వేషన్స్‌తో అవసరం లేని వాళ్లే ప్రేమికులు. ఎందుకంటే వాళ్లకు ప్రేమకు అర్థం చెప్పక్కర్లేదు. ఆల్రెడీ అందులోనే ఉన్నారు కాబట్టి. ఒకప్పుడు కళ్లతో మొదలై ..ఊహల్లో విహరించి…లేఖల్లో స్మరించి…గొంతు దాటడానికే తటపటాయించేది ప్రేమ…ఇప్పుడు ఫేస్‌బుక్‌ల్లో , మెసేజుల్లో దూసుకుపోతోంది. అప్పట్లో ఓ రెడ్ రోజ్, గ్రీటింగ్‌కార్డుతో ప్రేమను వ్యక్తం చేయడానికి నానా తంటాలు పడేవారు. రోజంతా ఖాళీ లేకుండా వీడియో ఛాట్‌లు, ఫేస్‌బుక్, వాట్సప్ మెసేజ్‌లతో మునిగి తేలుతున్న నేటి యువతరానికి ప్రేమను వ్యక్తంచేయడం అంతకష్టమైన విషయమేం కాదు.

కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనో అని ఓ సినీ కవి చెప్పినట్లుగా … ప్రేయసి పక్కనుంటే లోకాన్నే మర్చిపోతూ కొత్త అనుభూతులను అనుభవించడం అనేది అందరికీ వర్తించేదే. తమ ప్రేమను వ్యక్తం చేయడానికి ఏడాదంతా ఎదురుచూస్తూనే ఉంటారు. ప్రేమలో ఉన్నవారంతా ఫిబ్రవరి 14 రోజు కోసం ఎదురుచూస్తారు. తమ ప్రేమ ఆకాశం కన్నా పెద్దదనీ, సాగరాన్ని మించి లోతైనదనీ, మంచు కన్నా తెల్లనిదనీ, మల్లెకన్నా తెల్లనిదనీ, చెప్పేందుకు అనుక్షణం ప్రయత్నిస్తూనే ఉంటారు. ప్రతిరోజూ ప్రతి క్షణం అలా వ్యక్తం చేయ ప్రేమికుల రోజు వస్తుందంటే చాలు యువత మనసు గాల్లో తేలినట్టే వుంటుంది. పార్కులు సినిమాలు ఇలా కాస్తంట చోటు కనిపిస్తేచాలు ప్రేమలోకంలో మునిగిపోతారు. రెండు దశాబ్దాల కిందట మన దేశంలో పాపులర్ అయిన ఈ వాలంటైన్స్‌డే సంస్కృతి ఇప్పుడు పీక్ స్టేజ్‌కు వెళ్లింది. వాలంటైన్స్ డే కేవలం ప్రేయసీ ప్రియులకు సంబంధించినది మాత్రమే కాదు. అక్కాచెల్లెళ్లకు, తల్లిదండ్రులకు , కన్నబిడ్డలపై ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ చేసుకునే పండుగనే వాదం కూడా వినిపిస్తోంది.

మేం ఎప్పటికీ వాలంటైన్స్‌మే…

పద్మారావునగర్‌లో ఉంటున్న సాయి జగన్నాథ్, శాంతా జగన్ లకు 1968లో ఫిబ్రవరి 14న పెళ్లయింది. మేం ఎప్పటికీ వాలంటైన్స్‌మే అంటూ తమ అభిప్రాయాలను హరివిల్లుతో పంచుకున్నారు. సాయి జగన్నాథ్ మాట్లాడుతూ…అప్పట్లో వాలంటైన్స్‌డే గురించి తెలియదు. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. అది కూడా కొంచెం డిఫరెంట్‌గా జరిగింది. పెళ్లికూతురు తరఫున వాళ్లే నన్ను చూడటానికి వచ్చారు. పెళ్లి కూతురు తండ్రికి ట్రావెలింగ్ అంటే ఇష్టం. అందుకని వాళ్లే వచ్చారు. మాది ఒరిస్సాలోని బరంపూర్. తెలుగువాళ్లు చాలా మంది అక్కడ ఉండేవాళ్లు. నేను 1941లో పుట్టాను. శాంత 1947లో పుట్టింది. ఆమెది తిరునల్వెల్లి. నేను 1968లో ఎల్‌ఐసీలో క్లాస్‌వన్ ఆఫీసర్‌గా జాయిన్ అయ్యాను. మా నాన్న సాయి శ్రీరంగం నాయుడుతో సహా మా ఇంట్లో చాలా మంది జడ్జిలుగా పనిచేశారు.

మాకు ఒకమ్మాయి. ఒక అబ్బాయి. ఇద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. విదేశాల్లో సెటిల్ అయ్యారు. మేం ఆరునెలలు యూఎస్‌లో, ఆర్నెల్లు ఇండియాలో ఉంటుంటాం. నాకు మొదట్నించీ బహుమతులు ఇవ్వడం, సర్‌ప్రైజ్ చేయడం అంటే చాలా ఇష్టం. పెళ్లయ్యాక శాంతకు అలా చాలా సర్‌ప్రైజ్‌లు ఇచ్చాను. ప్రతి సారీ ఎక్కడో ఒకచోట విదేశాలకు తీసుకెళ్తూ ఆశ్చర్యపరుస్తాను. చివరి నిముషం వరకూ ఎక్కడికి వెళ్లేదీ ఆమెకు తెలియదు. చివరికి తెలిసి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఇంటర్నేషనల్ టూర్స్ వెళ్లడం ప్రతి వాలంటైన్స్ డే జరుగుతుంటుంది. మా ఇద్దరికీ ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. మా పిల్లలకు చదువు పూర్తవగానే ట్రావెలింగ్ చేయడం మొదలెట్టాం. టివిలు వచ్చాక తెలిసింది వాలంటైన్స్ డే గురించి. మా పిల్లలకు ఇండిపెండెంట్‌గా ఉండటం నేర్పించాం. శాంత హోం సైన్స్ చదివింది. ఇప్పటికీ మా ఇంట్లో పని మేమే చేసుకుంటాం. పనిమనిషి లేదు. ఇద్దరం కల్సి పనిచేసుకుంటాం. అమ్మాయిలు ఎప్పుడూ ఇండిపెండెంట్‌గా ఉండాలని చెప్తుంటాం. భర్తతో సాన్నిహిత్యంగా ఉంటూనే సొంత ఆలోచనలు కలిగి ఉండాలంటాం. శాంత ఆరోజుల్లోనే కార్ డ్రైవింగ్ నేర్చుకుంది. నాపై ఆధారపడకుండా అన్ని పనులు తనే చూసుకునేది. ఇప్పటికీ మాకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు. అన్ని దేశాలు తిరిగాం. ప్రేమ అంటే రొమాంటిక్ ఆలోచన మాత్రమే కాదు. ఒకరిపై ఒకరికి భరోసా, అభిమానంలాంటివి. ఇప్పటికీ బయట తిండి తినడం మాకు అలవాటు లేదు. ఇంటి వంటనే ప్రిఫర్ చేస్తాం. రాగులు, జొన్నలు, కొర్రల్లాంటివి ఆహారంలో భాగమైనాయి. అందువల్లే బిపి, షుగర్‌లాంటివి దూరంగా ఉన్నాయి.

శాంతా జగన్ మాట్లాడుతూ …ఒకసారి కేరళలోని కొబర్‌గావ్‌కు వెళ్లాం. ఆయన నాకు శ్రీకాకుళం అని చెప్పారు. తీరా చూస్తే కొబర్‌గావ్ బోటింగ్ హౌస్‌కి తీసుకెళ్లారు. అక్కడే కేక్ కట్ చేశా. బ్యూటిఫుల్ లొకేషన్. లాస్ట్ ఇయర్ నా బర్త్‌డే డిసెంబర్ 18న మాల్దీవులు వెళ్లాం. అదీ సర్‌ప్రైజే. నార్త్‌పోల్‌కి కూడా వెళ్లొచ్చాం. దాదాపు ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో అన్ని కంట్రీలు చూశాం. యూఎస్‌లో పిల్లలకు సంస్కృతి, సంప్రదాయాలు నేర్పిస్తారు. ప్రతి అమ్మాయి ఆరంగేట్రం చేయాల్సిందే. అదీ పెళ్లిలాగా చేస్తారు. ఇక్కడ అవన్నీ ఎందుకని పాటించరని మా పిల్లలు ఆశ్చర్యంగా అడుగుతుంటారు. అక్కడ పెద్దవాళ్లను చాలా గౌరవిస్తారు. కాకతాళీయంగా మా అబ్బాయి పెళ్లి కూడా వాలంటైన్స్ డే రోజే జరిగింది.

లవ్‌లాక్ వంతెనలు

వాలంటైన్స్‌డే రెండు రోజులకు ముందు లండన్‌లోని షోర్‌డిచ్ బ్రిడ్జి దగ్గర హడావుడి ఉంటుంది. వందలాది మంది జంటలు పువ్వులు, చాక్లెట్లతో తమ ప్రేమను వ్యక్తపరుస్తుంటే,  కొంతమంది మాత్రం లవ్‌లాక్‌ల ద్వారా ప్రకటిస్తున్నారు. వాలంటైన్స్‌కు రెండు రోజుల ముందు తాళం కప్పపై తమ ప్రేమికుడి పేరును రాసి లండన్‌లోని బ్రిడ్జిలకు లాక్ చేస్తుంటారు. అసలీ సంప్రదాయం ఎలా వచ్చిందంటే.. 1980లో  హంగరీలోని జంటలు బ్రిడ్జిలకు లాక్‌లను వేసి ఆ తాళాలను నీళ్లలో వేసేవారట.  ఇలా చేయడం వల్ల ఇరువురి హృదయాలు బంధించినట్లు  భావించేవారట. ఒక్కోసారి తాళం కప్పకే కీని వదిలేస్తుంటారట. మళ్లీ ఎప్పుడైనా తిరిగి వచ్చినప్పుడు చూసుకుని ఆనందించేవారట. చైనా నుంచి పారిస్ వరకు ఇలాంటి లవ్‌లాక్ బ్రిడ్జిలున్నాయి. 2000 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ప్రదేశాల్లో లవ్‌లాక్ బ్రిడ్జిలు విస్తరించాయి. పర్యాటక ఆకర్షణగా మారింది. ఇదిలా ఉంటే పారిస్‌లోని లవ్‌లాక్ వంతెనను మూసేసినట్లు సమాచారం. పర్యావరణానికి ముప్పుగా ఉందని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు.

 ఆసక్తికరమైన కొన్ని విషయాలు

– ప్రపంచంలో అన్ని దేశాల్లో గ్రీటింగ్ కార్డులు క్రిస్మర్ రోజు ఎక్కువగా అమ్ముడుపోతాయట. ఆ తర్వాత వాంటంటైన్స్ డే రోజు అంతే ఎక్కువగా సేల్ అవుతాయట.
-వాలంటైన్స్ డే రోజున ఫిన్‌లాండ్‌లో ఎస్టమన్‌ఫైవా అనే పేరుతో సెలబ్రేట్ చేసుకుంటారట. అంటే ఫ్రెండ్స్ డే అని అర్థం. లవర్స్ కంటే ఎక్కువగా తమను ఎంతో అభిమానించే వారితో గడపడం అక్కడి సంప్రదాయంగా మారింది.
– 1800ల సంవత్సరాల్లోనే మొట్టమొదటిసారిగా కాడ్‌బరీ చాక్లెట్‌నీ తయారుచేసి వాలంటైన్స్ డే రోజు గిఫ్టులుగా ఇవ్వడం ప్రారంభించారు.
-ప్రేమికుల రోజు సుమారుగా మూడున్నర కోట్ల వరకూ లవ్ సింబల్ ఉన్న చాక్లెట్ బాక్స్‌లు సేలవుతాయి.
-ప్రపంచం మొత్తం మీద వందశాతం వరకూ పువ్వులు కొంటూంటే, అందులో డెభై శాతం వరకూ మగవారే కొంటారట.
-యూఎస్‌లో ఆడవాళ్లు 50శాతం వరకూ పువ్వుల్ని కొని తమకు ఎవరో ప్రపోజ్ చేస్తూ పంపిస్తున్నట్లు వాళ్లకు వాళ్లే పంపించుకుంటారట.
-వాలంటైన్స్‌డే రోజు యూఎస్‌లో సుమారుగా ఆరువేల కోట్ల రూపాయల విలువైన చాక్లెట్స్ అమ్ముడవుతూ ఉంటాయి.
-వాలంటైన్స్‌డేకి ఆరు రోజుల ముందుగానే చాలామంది గ్రీటింగ్‌కార్డులను గానీ, గిఫ్టులను గానీ తమ దగ్గర పెట్టుకొని వాలంటైన్ రోజు ప్రేమికులకు గిఫ్టుగా ఇస్తుంటారు.
– -జపాన్‌లో వాలంటైన్స్‌డే ఒక్కరోజు మాత్రమే అమ్మాయిలు చాక్లెట్లు కొని అబ్బాయిలకు తమ ప్రేమను తెలియజేస్తుంటారు. కానీ అబ్బాయిలు మాత్రం ఈరోజు తమ ప్రేమను వ్యక్తపరచరు. దానికి ఇంకో రోజు ఉందట. అదే వైట్ డే గా సెలబ్రేట్ చేసుకుంటారట. అంటే వాలంటైన్స్‌డే రోజు ఎవరైతే అమ్మాయిలు ప్రపోజ్ చేశారో ఈ వైట్‌డే రోజు సమాధానం చెప్తారట. మార్చి 14న వైట్ డేగా జపాన్ ప్రభుత్వం ఫిక్స్ చేసింది.
-యూఎస్‌లో ప్రేమికుల రోజు సుమారు గా 20 కోట్ల వరకూ గులాబీ పూలు అమ్ముడవుతూ ఉంటాయట. అందులోనూ వాటిలో ఎర్ర గులాబీలే ఎక్కువట.
-2011లో ఇరాన్ ప్రభుత్వం వాలంటైన్స్‌డే రోజున వాలంటైన్ కార్డుల్ని, టెడ్డీబేర్‌లను బ్యాన్ చేసింది. ఎందుకంటే పాశ్చాత్య సంస్కృతి ప్రాచుర్యం పొందకూడదననే ఉద్దేశంతో ..
-విక్టోరియన్ కాలంలో వాలంటైన్స్ రోజు ఎవరైతే గ్రీటింగ్ కార్డుల్లో సంతకాలు పెడతారో వారికి చాలా ఆపద జరుగుతుందని భావించేవారట.

ప్రేమికుల రోజున ఒక్కటైన
కొన్ని జంటలు. గాయనీగాయకులు హేమచంద్ర,శ్రావణభార్గవి.
నటి మందిరాబేడీ,రాజ్‌కౌషల్ దంపతులు.

                                                                                                                 మల్లీశ్వరి వారణాసి