Home జగిత్యాల జగిత్యాలలో యువకుడి హత్య

జగిత్యాలలో యువకుడి హత్య

Strangled with a knife and thrown into the pond
జగిత్యాలటౌన్ : జగిత్యాల పట్టణం బాలాజీనగర్‌కు చెందిన ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. దుండగులు కత్తితో పొడిచి మృతదేహాన్ని మండలంలోని అంతర్గాం చెరువులో పడేశారు. పోలీసుల కథనం ప్రకారం… జగిత్యాల పట్టణం బాలాజీనగర్‌కు చెందిన లవంగ దీపక్ (23) అనే యువకుడి తండ్రి మీనయ్య ఏడేళ్ళ క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా దీపక్ ప్రైవేట్ చిట్టిల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. బుధవారం రాత్రి 10.30 ప్రాంతంలో బయటకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి తన హోండా యాక్టివా ద్విచక్రవాహనంపై వెళ్ళిపోయాడు. సుమారు 11.30 ప్రాంతంలో దీపక్ ఇంటికి ఫోన్ చేసి తనకు భయం వేస్తుంది… ఎక్కడ ఉన్నానో తెలియడం లేదంటూ మాట్లాడుతుండగానే ఫోన్ కట్ అయింది. దీంతో ఆందోళనకు గురైన దీపక్ తల్లి రాత్రి టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాత్రి 12 నుండి తెల్లవారు 5 గంటల వరకు దీపక్‌కు ఫోన్ చేస్తూనే ఉన్న ఫోన్ రింగ్ అవుతున్నా స్పందించడం లేదు. పోలీసులు సిడిఆర్ ద్వారా ఫోన్ లోకేషన్‌ను ట్రాక్ చేయగా మండలంలోని అంతర్గాం చెరువు వద్ద ఉన్నట్టు కనుగొన్నారు. ఉదయం వెళ్ళి చూడగా చెరువు కట్టపై దీపక్ హోండా యాక్టివా వాహనం, సెల్‌ఫోన్, కత్తి, రెండు పెట్రోల్ బాటిళ్ళు లభించాయి. వెంటనే చెరువులో గాలింపు చర్యలు చేపట్టి దీపక్ మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహాన్ని పరిశీలించగా పొత్తి కడుపుపై, చేతిపై కత్తి గాయాలు కనిపించాయి. అయితే ఆర్థిక లావాదేవీలే దీపక్ హత్యకు కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాతే నిజానిజాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు పేర్కొన్నారు. తల్లి రాణి ఫిర్యాదు మేరకు టౌన్ సిఐ ప్రకాష్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.