Home తాజా వార్తలు ఒత్తిడి ఆస్తులు

ఒత్తిడి ఆస్తులు

SBI Chief Rajnish Kumar

 

ఐసియు పేషెంట్ లాంటివే..
ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది: ఎస్‌బిఐ

న్యూఢిల్లీ: ఒత్తిడి ఆస్తులు ఐసియులో పేషెంట్ లాంటివేనని ఎస్‌బిఐ చీఫ్ రజనీష్ కుమార్ వ్యాఖ్యానించారు. వాటిపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోనట్లయితే అప్పు తీసుకున్నవాళ్లనే కాక, ఇచ్చిన రుణదాతలు కూడా నష్టపోవాల్సి ఉంటుందని అన్నారు. ఫిబ్రవరి 12 సర్క్యులర్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసిన తర్వాత ఆర్‌బిఐ జారీ చేసిన కొత్త సవరణలు చిన్న, పెద్ద బ్యాంకులకు సాయం చేస్తాయని అన్నారు. కొత్త సర్కులర్‌లో మొండి బకాయిలను గుర్తించడానికి 30 రోజుల కాలపరిమితిని ఇచ్చింది. ఈ నేపథ్యంలో వీలయినంత తొందరగా మొండి బకాయిలను గుర్తిస్తే వెంటనే రికవరీకి ఆస్కారం ఉంటుందని, ఎంత లేటు చేస్తే అంత నష్టం వస్తుందని ఎస్‌బిఐ చీఫ్ అన్నారు. 30 రోజుల పరిమితి గడువును రుణదాతలు సరిగ్గా వినియోగించుకోవాలని, ఈ కాలపరిమితి కారణంగా వేగవంతమైన పరిష్కారాలు తీసుకునేందుకు వీలు చిక్కుతుందని ఆయన అన్నారు.

గతంలో రుణదాతలు మధ్య ఉన్న ఇంటర్ క్రెడిటార్ ఒప్పందానికి ప్రస్తుతం నియంత్రణా పరమైన మద్దతు లభించిందని, ఇది ఆహ్వానించదగ్గ పరిణామమని చెప్పారు. తాజాగా ఆర్‌బిఐ తెచ్చిన నిబంధనలు వెంటనే అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే ఫిబ్రవరి 12 సర్క్యులర్ ఆధారంగా ఎన్‌సిఎల్‌టికి వెళ్లిన వాళ్లు ఆయా కేసుల్లో రిఫరెన్సు తేదీని జూన్ 7 గా మార్చుకోవాల్సిఉంటుందని కుమార్ చెప్పారు. కాగా సవరించిన మార్గదర్శకాలు ఒత్తిడి ఆస్తులకు పరిష్కారం చూపుతాయని, రుణ సంస్కృతిలో స్థిరమైన మెరుగుదల చూస్తామని ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఇటీవల అన్నారు. కొత్త సర్కులర్‌తో అధనపు ప్రొవిజనింగ్‌కు అవకాశం ఏర్పడుతుందని, రిసొల్యూషన్ ప్రొసీడింగ్స్ ప్రారంభంలో జాప్యాన్ని నిరోధిస్తుందని అన్నారు.

కొత్త వ్యవస్థ ఇంటర్ క్రెడిటార్ అగ్రిమెంట్స్‌ను తప్పసరి చేస్తుందని, మెజారిటీ నిర్ణయానికి ప్రాధాన్యత కల్పిస్తుందని అన్నారు. మరోవైపు కొత్త సర్కులర్ పట్ల ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్(ఐబిఎ) హర్షం వ్యక్తం చేసింది. ప్రోవిజనింగ్ అవసరాలను ఇనుమడింపజేస్తుందని, నిర్ణయాలను తీసుకోవడంలో బ్యాంకులకు మరింత స్వేచ్ఛ ఇచ్చినట్టవుతుందని కొత్త సర్కులర్‌పై ఐబిఎ చైర్మన్ సునీల్ మెహతా అభిప్రాయపడ్డారు. ఫిబ్రవరి 12 సర్కులర్‌ను సుప్రీం కోర్టు రద్దు చేసిన తర్వాత రెండు నెలలకు ఆర్‌బిఐ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.

Stressed assets are like ICU patients