Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

ఆయకట్టు చివరి వరకు సాగునీరు

field

*తక్కువ నీటితో ఎక్కువ సేద్యం
*చివరి భూములు తడవడమే ప్రధాన లక్షం
*ప్రాజెక్టులు, కాలువల ఆధునీకరణకు ప్రణాళిక
*కేంద్ర పథకం కింద ఐదు ప్రాజెక్టుల ఎంపిక

మన తెలంగాణ / ఆదిలాబాద్ బ్యూరో:  తక్కువ నీటితో ఎక్కువ సేద్యపు లక్షాన్ని సాధిం చేందుకు ప్రణాళికలు రూపొందుతున్నాయి. నీటి వృధాను అరికడుతూ ఆయా ప్రాజెక్టులకు సంబంధించి చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించాలనే లక్షంతో ప్రభుత్వం కసరత్తు జరుపుతోంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ ప్రణాళికలు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇన్‌సెంటివైజేషన్ స్కీమ్ ఫర్ బ్రిడ్జింగ్ ఇరిగేషన్ గ్యాప్ పథకం కింద ఉమ్మడి జిల్లాలోని ఐదు ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. సాత్నాల ప్రాజెక్టు, వట్టివాగు ప్రాజెక్టు, కడెం ప్రాజెక్టు, స్వర్ణ ప్రాజెక్టు, గడ్డెన్న వాగు ప్రాజెక్టులను మొదటి దశలో భాగంగా ఈ పథకం కింద ఎంపిక చేయడం జిల్లాకు వరంగా మారబోతోంది. ఈ ప్రాజెక్టుల మొదలు నుంచి చివరి ఆయకట్టు వరకు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా సాగు నీరు అందించాలనే లక్షంతో ఈ పథకాన్ని రూపొందించారు. ఓ వైపు నీటి వృథాను అరికడుతూ మరో వైపు తక్కువ నీటితో  ఎక్కువ సేద్యం చేయాలనే ఆశయంతో ఈ పథకాన్ని రూపొందించారు. కాగా ప్రస్తుతం ఆయా  ప్రాజెక్టుల ఆయకట్టు లక్షం మేరకు సాగు నీరును అందించ లేని పరిస్థితులు కొనసాగుతున్నాయి. పైభాగంలోని  వ్యవసాయ భూములన్నీ సిరులు కురిపిస్తుండగా చివరి ఆయకట్టు భూములకు నీరందక అవి బీళ్లుగా మారుతున్నాయి. ముఖ్యంగా ప్రాజెక్టులకు సంబంధించి కాలువలు, ఫీల్డ్ చానళ్లు, డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ అధ్వానంగా తయారవ్వడంతోనే సాగు నీటి సరఫరా లక్షాన్ని చేరుకోవడం లేదు. కేంద్ర పథకంలో  భాగంగా కాలువలు, డిస్ట్రిబ్యూటర్‌లను, ఫీల్డ్ చానళ్లను పూర్తిస్థాయిలో  అభివృద్ధి చేయనున్నారు. అలాగే చివరి వరకు నీరు అందని పరిస్థితిల్లో అక్కడ మైక్రో ఇరిగేషన్ వ్యవస్థను తెరపైకి తేనున్నారు. ఈ వ్యవస్థను నిర్వహించేందుకు అవసరమయ్యే విద్యుత్‌ను సౌర విద్యుత్ ద్వారా సేకరించనున్నారు. ఇదిలా ఉండగా ఇన్‌సెంటివైజేషన్ స్కీమ్ ఫర్ బ్రిడ్జింగ్ ఇరిగేషన్ గ్యాప్ పథకం కోసం ఎంపికైన కడెం, స్వర్ణ, వట్టివాగు, సాత్నాల, గడ్డెన్న వాగు ప్రాజెక్టులకు సంబంధించి డిటేయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్(డీపీఆర్)లను తయారు చేయాలంటూ ప్రభుత్వం సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలోని ఈ ఐదు ప్రాజెక్టుల అధికారులు క్షేత్ర స్థాయిలో కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు, ఫీల్డ్ ఛానళ్లను స్వయంగా పరిశీలించి వాటిని ఆధునీకరించేందుకు గాను అవసరమయ్యే డిపిఆర్‌లను రూపొందించాల్సి ఉంది. ఈ డిపిఆర్‌ల ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి యాభై శాతం నిధులను అందిం చనుంది. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు కానున్న కొత్త పథకం జిల్లాలోని సాగు నీటి ప్రాజెక్టులకు వరంగా మార బోతుండడమే కాకుండా ఆయా ప్రాజెక్టుల పరిధిలోని చివరి ఆయకట్టుకు పూర్తి స్థాయిలో  సాగు అందించనున్నట్లు అభిప్రాయపడుతున్నారు.

Comments

comments