Home ఎడిటోరియల్ క్యాబ్ డ్రైవర్ల ఎదురీత

క్యాబ్ డ్రైవర్ల ఎదురీత

Cabs

ఆధునిక సాంకేతిక విజ్ఞాన అభివృద్ధి వల్ల సమాచార వ్యవస్థలో పెనువిప్లవమే వచ్చింది. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారిత సేవలు అన్ని రంగాల్లో విస్తరించాయి. ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు మధ్య దూరభారాలు తగ్గించే ఎన్నో సాఫ్ట్‌వేర్ అప్లికేషన్లు తెరపైకి వచ్చాయి. పెద్దగా పెట్టుబడి అవసరం లేకుండా డొమైన్ నిర్వహణ ఖర్చులతో వెబ్‌సైట్ తెరిచి తమకున్న సాఫ్ట్‌వేర్ పరిజ్ఞానంతో ఎందరో కొత్తకొత్త వ్యాపారాలను నెలకొల్పుతున్నారు. ఇదేరకంగా రవాణారంగంలో మధ్యవర్తి పాత్ర పోషించేందుకు ఊబర్, వోలా లాంటి సంస్థలు ప్రవేశించాయి. అమెరికాకు చెందిన ఊబర్ సంస్థ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 66 దేశాల్లో విస్తరించింది. బెంగుళూరుకు చెందిన ఇద్దరు ఐఐటియన్లు 2010లో ఓలా సంస్థను స్థాపించారు. ఈ రెండు సంస్థలు దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో క్యాబ్ సర్వీసును నిర్వహిస్తున్నాయి. వీటిరాక కన్న ముందు నుండే మన నగరాల్లో రేడియో క్యాబ్, మేరు, డాట్ క్యాబ్ ప్రజారవాణా సేవలందిస్తున్నాయి. ఆటోలు కిలోమీటర్‌కు సుమారుగా రూ.9/- వసూలు చేస్తుండగా క్యాబ్‌కు రూ.12/ దాకా చార్జి చేసేవి. మూడేళ్ల క్రితం హైదరాబాద్‌లో ప్రవేశించిన ఓలా, ఊబర్‌లు ఆటో రిక్షా ఖర్చులతో ఎసి కార్లలో తిరగండని ప్రచారం మొదలుపెట్టాయి. వివిధ ఆకర్షక పథకాలతో ప్రజారవాణా అనుమతులున్న కార్లను తమవైపు తిప్పుకున్నాయి. ఇలా వాటికి అనుసంధానమైన వాహనదారులు క్రమంగా ఇబ్బందుల పాలయినట్లు పలు సంఘటనలు తెలియజేస్తున్నాయి.
వారం క్రితం హైదరాబాద్‌లో ఓ క్యాబ్ డ్రైవర్ కారు లోను కిస్తులు కట్టలేక బలవన్మరణానికి ప్రయత్నించినట్లు వార్త వచ్చింది. దీంతో మరోసారి క్యాబ్ డ్రైవర్లపై ఆ సంస్థల ఒత్తిళ్లు బయటపడ్డాయి.
కిరాయిపై సొంతకార్లు నడుపుకునే వారికి తొలుత ఈ సంస్థల పథకాలు అత్యంత ఆకర్షణీయంగా కనిపించాయి. రోజుకు పన్నెండు గంటలు పనిచేసినా ఖర్చులు పోనూ నెలకు రూ.60,000/ ఆదాయం వచ్చింది. రోజుకు రూ.1500/సంపాదించిన డ్రైవర్‌కు రూ. 3000/ ప్రోత్సాహకం కంపెనీ తరఫున అందేది. ఈ కంపెనీలకు డబ్బులు ఎక్కువైనాయా అని అందరూ అనుకునేవారు. ఆ సంపాదన చూసిన డ్రైవర్లు తమ బంధుమిత్రులను కూడా డ్రైవింగ్ నేర్చుకొని బ్యాంకు, బయటి రుణాలు తీసుకొనేలా ఈ సంస్థల్లో చేర్పించారు. కంపెనీలు కేవలం 5% కమిషన్ తీసుకోవడంతో డ్రైవర్లు ఉత్సాహంగా పనిచేశారు. దూరాన్నిబట్టి, ట్రిప్పుల బట్టి ప్రతిభ చూపించిన డ్రైవర్లకు ఇన్‌సెన్‌టివ్‌లు లభించేవి. ప్రయాణీకులకు కూడా ఉచిత ట్రిప్పులు, డిస్కౌంట్లు ఈయడంతో వాటిలో ప్రయాణించడానికి అన్ని తరగతులవారు ముందుకు వచ్చారు. ఎటైనా వెళ్లాలంటే నగరంలో కారులేని వాళ్లు క్యాబ్ బుక్ చేసుకోవడం సర్వసాధారణమైంది. ఇలా చౌకధరల సేవలు, ప్రోత్సాహకాలవల్ల ఈ సంస్థలకు తొలినాళ్లలో కోట్లాది రూపాయల నష్టం వచ్చింది. ఓలా
2015-16 సంవత్సరానికి రూ.13.3 కోట్ల నష్టం చవిచూసింది.
బుకింగ్‌లు పెరిగి వాహనాలు సరిపోకపోవడంతో అద్దె కొనుగోలు పద్ధతిలో డ్రైవింగ్ తెలిసినవారికి ఈ సంస్థలు కార్లు అందజేశాయి. ఈ రకంగా కారు తీసుకొనేవారు సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ. 27,000/- చెల్లించాలి. వారానికి రూ.5,512/చొప్పున మూడేళ్లపాటు చెల్లించితే కారు డ్రైవర్ సొంతమవుతుంది. ఈ పథకం కింద ఓలా 2,50,000కార్ల ను దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టింది.
ఇలా ప్రవేశపెట్టిన కార్లకు ఎక్కువ ఆదాయం వచ్చేలా బుకింగ్‌లలో వీటికి ప్రాధాన్యత ఈయడంతో సొంత వాహనం కలిగి ఒప్పందం చేసుకున్న వారికి ఆదాయం తగ్గింది. శంషాబాద్ విమానాశ్రయంలో గంటల తరబడి వేచియున్న వాళ్లకు కాకుండా అప్పుడే వచ్చిన కారుకు గిరాకి తగలడంతో ఈ బండారం బయటపడింది. సుమారు 40కి.మీ. దూరమున్న విమానాశ్రయానికి వెళ్లే క్యాబ్‌లకు తిరుగు ప్రయాణం బుకింగ్ దొరకకపోతే నష్టమే. అందుకే రాత్రి వెళ్లినవారు ఇంటికి రాకుండా ఉదయం దాకా వేచి ఉండక తప్పదు. దాంతో చాలామంది ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ సంస్థలకున్న క్యాబ్ డ్రైవర్లలో అత్యధికం లీజు పద్ధతిలో వాహనాలు తీసుకున్నవారే. అందువల్ల ఓలా, ఊబర్‌లు తమ ప్రతాపం చూపించడం మొదలు పెట్టాయి. ఇంటెన్‌సివ్‌లు తగ్గించి సంస్థలకు వచ్చే కమీషన్ పెంచేశాయి. చివరకు ఈ సంవత్సరం ఆరంభం నాటికి ప్రోత్సాహకాల్లో వివిధ కారణాలతో కోతలు విధించి కమిషన్‌ను 25% చేసుకున్నాయి. వేలల్లో ఉన్న కార్లు లక్షల్లోకి మారడం వల్ల బుకింగ్‌లు తగ్గిపోయాయి. వేలల్లో వచ్చే ఆదాయం వందల్లోకి జారిపోయింది. రోజుకు రూ.1600/ సంపాదనలో రూ.500/ గ్యాస్‌కు, రూ.700/ కంపెనీకి కమిషన్ లీజుకు పోగా రూ.400/డ్రైవర్‌కు మిగులుతుందని ఓ డ్రైవర్ టివి ఇంటర్వూలో చెప్పాడు.
2015లో నెలకు రూ.60,000/దాకా సంపాదించుకున్నవాళ్ళకు ఇప్పుడు దినానికి 18 గంటలు డ్యూటీ చేసినా అందులో సగం కూడా మిగలడం లేదని డ్రైవర్లు బాధపడుతున్నారు. విరామం లేని శ్రమవల్ల అనారోగ్యం పాలవుతున్నారు. కనీసం కారు అప్పు తీర్చుకొనైనా దానిని సొంతం చేసుకుందామనే చివరి ఆశతో నిద్రాహారాలకు, కుటుంబానికి దూరమవుతున్నారు. ఈ ఒత్తిడిని తట్టుకోలేక గత ఫిబ్రవరిలో ఢిల్లీలో ప్రవీణ్ కుమార్ అనే డ్రైవర్ ఆత్మహత్య చేసుకోవడంతో పెల్లుబికిన ఉద్రేకంతో రెండు సంస్థల ఒప్పందదారులు సమ్మెకు దిగారు. సమ్మె క్రమం గా దేశవ్యాప్తంగా విస్తరించింది. నాయకులుగా ముందుకు వచ్చిన వారినుండి యాప్ డివైజ్ లాక్కొని గూండాలతో నెట్టేయించాయి కంపెనీలు. ప్రభుత్వాల నుండి గాని, ఇతర కార్మిక సంఘాలనుండి గాని వీరికి ఎలాంటి మద్దతు లభించలేదు. చట్టరీత్యా కంపెనీలవైపునుండి ఎలాంటి తప్పిదాలూ ఉల్లంఘనలు లేవని రవాణా శాఖ చేతులెత్తేసింది. రెండు వారాలు గడవడంతో ఖర్చులు, కిస్తీలకు భయపడి డ్రైవర్లు సమ్మెను విరమించారు. వీరు ఇంతకన్నా ఏమీ చేయలేరని కంపెనీలకు ముందే తెలుసు.
ఏప్రిల్‌లో ఢిల్లీలో సర్వోదయా డ్రైవర్స్ అసోసియేషన్ తరఫున వీరు సమ్మె చేశారు. తిరిగి ఢిల్లీలోనే జూన్‌లో ఒక రోజు సమ్మెచేసి ప్రధానమంత్రి నరేంద్రమోడీకి, కేంద్ర రవాణా శాఖమంత్రి నితిన్ గడ్కరీకి, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు తమ సమస్యల పత్రం సమర్పించారు. ఫలితం శూన్యం. సెప్టెంబర్‌లో ఓలా, ఊబర్ సంస్థలకు వ్యతిరేకంగా బొంబాయిలో మెరుపు సమ్మె జరిగింది. అక్టోబర్ 27 నాడు బెంగళూరులో ఈ బాధితులు సమ్మెకు దిగారు.
ఉద్యోగులనుండి ఒత్తిళ్లు ఎక్కువైనప్పుడు ఆయా ప్రాంతాల్లోంచి కంపెనీని ఎత్తేసిన చరిత్ర ఊబర్‌కు ఉంది. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో, ఖతర్, మరికొన్ని దేశాల్లో వ్యతిరేకతను తట్టుకునేందుకు సంస్థ కార్యకలాపాలు మూసివేసింది. దానివల్ల అప్పు చేసి కార్లు కొన్నవారు గిరాకీలు లేక తీవ్రంగా నష్టపోయారు. సంస్థకెలాంటి నష్టం లేదు.
మనదేశంలో ఊబర్ 26 నగరాల్లో 2,50,000 వాహనాలు నడుపుతుంటే, ఓలా 102 నగరాల్లో 3,50,000 కార్లు కలిగి రోజుకు పదిలక్షల బుకింగులు సంపాదిస్తోంది. దేశీయ సంస్థ అయిన ఓలాతోనయినా ప్రభుత్వాలు సంప్రదింపులు జరుపవలసిన అవసరం ఉంది. బలహీన వర్గాలకు చెందిన అభివృద్ధికర పథకాల కింద డ్రైవర్ల అప్పులను ప్రభుత్వాలు చెల్లించడం ద్వారా రాబోయే రోజుల్లో వచ్చే ఉపద్రవాలను ఆపవచ్చు. డ్రైవర్ల ఆదాయం తినివేస్తున్న సంస్థలను రవాణా విధివిధానాల ద్వారా కట్టడి చేయవచ్చు.ఇన్ని కట్టుదిట్టమైన చట్టాలున్న దేశంలో లక్షలాదిమంది రవాణా కార్మికులను రెండు సంస్థలు ఊపిరాడకుండా చేస్తుంటే వారిని కాపాడేందుకు కావలసిన మార్గదర్శక సూత్రాలు తయారు చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలదే.