Home నాగర్ కర్నూల్ దు:ఖంలోను పరీక్షకు హాజరు

దు:ఖంలోను పరీక్షకు హాజరు

తండ్రి మరణవార్త దిగమింగుకుని వచ్చిన విద్యార్థిని

Student

ఆమనగల్లు/వెల్డండ: తండ్రి మరణించాడనే బాధను దిగమింగుకుని, పుట్టెడు దుఖంతో పరీక్ష రాసింది ఆమనగల్లు మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన విద్యార్థిని. ఇంట్లో తండ్రి మృతదేహం ఉన్నా ఆ బాధను కడుపులో దాచుకొని ఇంటర్ పరీక్షకు హాజరై వచ్చి అంత్యక్రియల్లో పాల్గొంది. వివరాల్లోకి వెళితే…. ఆమనగల్లు మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన సుక్క బానుశ్రీ నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం చదువుతూ అక్కడే వసతిగృహంలో ఉంటుంది.

కాగా తండ్రి రాములుగౌడ్ అనారోగ్యంతో ఫిబ్రవరి 21న ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. బుధవారం పరీక్షకు వెళ్లడానికి సిద్ధమవుతుండగా బానుశ్రీకి తండ్రి మరణ వార్త తెలియగానే రోదిస్తూ కుప్పకూలింది. అయినా తండ్రి మరణవార్త బాధను దిగమింగుకుని ఏడాది చదువు వృధా కాకూడదనే ఆశయంతో వెల్దండ మండల కేంద్రంలోని కళాశాలలో మొదటి రోజు తెలుగు పరీక్షకు హాజరై పరీక్ష పూర్తయ్యాక స్వగ్రామానికి వచ్చి అంత్యక్రియల్లో పాల్గొంది. బానుశ్రీ సోదరి చందనశ్రీ ఆమనగల్లులోని ప్రైవేటు పాఠశాలలో 9వతరగతి చదువుతుండగా సోదరుడు అభినయ్ చింతలపల్లిలోనే 4వ తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులు మృతి చెందడంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. గ్రామస్తులు, బంధువులు ముగ్గురు చిన్నారుల పరిస్థితిని చూసి కన్నీరుమున్నీరయ్యారు.