Home రాష్ట్ర వార్తలు కళాశాల హస్టల్ క్యాంపస్‌లో విద్యార్థిని ఆత్మహత్య

కళాశాల హస్టల్ క్యాంపస్‌లో విద్యార్థిని ఆత్మహత్య

pass

బాచుపల్లి : బాచుపల్లిలోని విఎన్‌ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజినీరింగ్ కళాశాల హస్టల్ క్యాంపస్‌లో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. జూబ్లీహిల్స్ ప్రాంతానికి చెందిన సిమ్సన్ కుమార్తె జి.స్వప్న (20) బాచుపల్లిలోని విజ్ఞాన జ్యోతి ఇంజినీరింగ్ కళాశాలలో సీఎస్‌ఈ నాల్గోవ సంవత్సరం చదువుతుంది. కళాశాలకు అనుసంధానంగా ఉన్న క్యాంపస్‌లోని హస్టల్‌లో ఉంటుంది. గత పది రోజుల క్రితం అనారోగ్యాంతో ఉండడంతో రెండు రోజుల క్రితమే ఇంటికి వెళ్ళి బుధవారం సాయంత్రమే హస్టల్‌కు వచ్చింది. గురువారం తరగతులకు వెళ్ళకుండా తాను హస్టల్ గదిలోనే ఉంది. హస్టల్ గదిని శుభ్రం చేయడానికి వచ్చిన సిబ్బందిని తిరిగి పంపింది. అప్పటికే స్వప్న జ్వరంతో భాగపడుతూ ఉంది. నాలుగు గంటల సమయంలో కిటికి రాడ్‌కు బెడ్ షీట్‌తో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తోటి విద్యార్థులు వచ్చి చూడగా తలుపుకు గడియ పెట్టి ఉండడంతో వెంటనే గడియను తొలగించి లోపల చూసే సరికి స్వప్న ఆత్మహత్య చేసుకుని ఉంది. స్వప్న ఆత్మహత్య చేసుకొవడానికి గల కారణాలు తెలియరాలేదు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం తమ కూతురు చదువులో బాగా రాణించేదని, ఇటివల కళాశాలలో జరిగిన క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో జేపీ మోర్గాన్ కంపెనీలో ఉద్యోగానికి ఎంపికయిందని, ఆత్మహత్య చేసుకోవల్సిన అవసరం తమ కూతురుకు ఎందుకు వచ్చిందో తెలియదని కన్నీరుమున్నీరయ్యారు. స్వప్న ఆత్మహత్య చేసుకున్న గదిలో ఆధారాల కోసం వెతికిన ఎలాంటివి లభించలేదు. చివరి సారిగా బెంగూళూర్‌లో ఉన్న అమ్ములు అనే స్నేహితురాలితో మాట్లాడినట్లు పోలీసులు తెలిపారు. ఆమెతో ఏమి మాట్లాడిందనే విషయాన్ని అమ్ములును ఫోన్ ద్వారా సంప్రదించగా సరైన సమాధానం చెప్పలేదని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.