Home ఎడిటోరియల్ సంపాదకీయం: విద్యార్థుల ఆత్మహత్యలు

సంపాదకీయం: విద్యార్థుల ఆత్మహత్యలు

sampadakeyam

కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థి, విద్యార్థినుల ఆత్మహత్యలు కొత్తకాకపోయినా, ఈ మధ్య ఆకస్మికంగా పెరగటం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేశాయి. రెండు రాష్ట్రాల్లో మంత్రులు హడావిడిగా కాలేజీ యాజమాన్యాలు, తల్లిదండ్రుల సమావేశాలు ఏర్పాటు చేసి, ఈ పరిస్థితి అనుమతించబోమని, పరిస్థితుల మెరుగుదలకై తక్షణమే చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల మానసిక ఒత్తిడి తగ్గించేందుకు కౌన్సిలింగ్ నిర్వహించాలని వగైరా వగైరా హుకుంలు జారీ చేశారు. కార్పొరేట్ కాలేజీలో విద్యాబోధన తీరు, జైళ్లను తలపించే హాస్టళ్ల తీరుతెన్నులు, వార్డెన్‌ల దురుసుతనం, ప్రిన్సిపాల్ కోమేనేజరుకో తమ ఇబ్బందుల గూర్చి ఫిర్యాదు చేసే వాతావరణం, అవకాశం లేకపోవటం రెండు రాష్ట్రాల ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులకు తెలియనివికావు. నిజాయితీపరులైన అధికారులెవరైనా యాజమాన్యాలను మందలించాలనుకున్నా వారి స్థాయి చాలదు. ఒకప్పుడు పరస్పరం పోటీపడిన నారాయణ,
శ్రీచైతన్య కాలేజీల అధిపతులు ఇప్పుడు ఉమ్మడి కాలేజీలు నిర్వహిస్తున్నారు. నారాయణగారేమో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రి అయినారు. ఇక వారిని ప్రశ్నించగలవారెవ్వరు?
ఈ భయంకర పరిస్థితులకు ప్రభుత్వానిది, తల్లిదండ్రులది ప్రధాన బాధ్యత. ప్రభుత్వ కాలేజీలను దీటుగా వృద్ధిచేసి ఉంటే కార్పొరేట్ కాలేజీల పట్ల ఇంత ఆకర్షణ ఉండేది కాదు. ఇంజినీరింగ్, మెడికల్ విద్యకు ఎంసెట్ కీలకం కావటంతో (ఇప్పుడేమో అఖిల భారత పరీక్షలొచ్చాయి) తల్లిదండ్రులు ఎంతైనా కుమ్మరించి పిల్లల్ని కార్పొరేట్ కాలేజీల్లో చేర్చుతున్నారు. యాజమాన్యాలేమో విద్యార్థుల మానసిక వికాసం కొరకుగాక ర్యాంకుల కొరకు విరామం లేకుండా రుబ్బుతున్నారు. తల్లిదండ్రులు పిల్లల మార్కులు చూసుకుంటున్నారేగాని వారి మానసిక స్థితిని గమనించటం లేదు; మార్కు లు తగ్గితే సతాయిస్తున్నారు. ఇక పిల్లలు తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలి? విపరీతమైన మానసిక ఒత్తిడి అందరిపై ఉన్నా దుర్బలులు ఆత్మహత్య చేసుకుంటున్నారు.
ఇంటర్మీడియెట్ విద్యార్థుల ఆత్మహత్యలను నిరోధించేందుకు తీసుకోవలసిన చర్యలపై సిఫారసుల కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిటైర్డ్ ఐఎఎస్ అధికారి, ఇంటర్మీడియెట్ బోర్డు మాజీ కమిషనర్ డి.చక్రపాణి, పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయ మాజీ వైస్‌ఛాన్సలర్ ఎస్.రత్నకుమారిలతో నియమించిన కమిటీ వెల్లడించిన అభిప్రాయాలు ఎవరికైనా కనువిప్పు కలిగిస్తాయి. ‘విద్యార్థులు అనేక పరీక్షలు రాయాలి. స్టడీ టైమింగ్స్ చాలా కష్టంగా ఉన్నాయి. విద్యార్థులను ఉదయం 4.30 గంటలకు గంటమోగించి నిద్రలేపింది మొదలు వారి దినచర్య రాత్రి 11.30 వరకు కొనసాగుతుంది. సరిగ్గా తినటానికి, నిద్రకు తగిన సమయముండదు. బహుళ అంతస్థుల హాస్టళ్లకు లిఫ్ట్‌లుండవు. సెల్‌ఫోన్ అనుమతించరు. 500 మంది విద్యార్థులకు ఒకట్రెండ్ లాండ్‌లైన్ ఫోన్‌లుంటాయి. నిర్దేశించిన వేళల్లోనే వాటిని వినియోగించాలి’. ఇలాంటి నిర్బంధంలో ఇక ఆటపాటలకు, వ్యాయామానికి అవకాశమెక్కడ? హాస్టల్ గదిలో ఏడెనిమిదిమందికి కిక్కిరిసి మంచాలుంటాయి. ఫ్యాన్‌లు పనిచేయవచ్చు, చేయకపోవచ్చు. యాజమాన్యాలకు మార్కులు, ర్యాంకులు, ధనార్జన యావ తప్ప మానవత్వం ఉండదు. అదేమంటే, అందుకే గదా, తల్లిదండ్రులు పిల్లల్ని మాకు అప్పగించారు అంటారు. తెలంగాణలోని అవే కార్పొరేట్ కాలేజీల్లో అవే పరిస్థితులు. చక్రపాణి కమిటీ సిఫారసులను ఎపితోపాటు తెలంగాణ ప్రభుత్వం కూడా అమలు చేయవచ్చు. విద్యార్థులను మరమనుషులుగా చూసే ఈ విధానం మారనంతవరకు విషాద వార్తలు వింటూనే ఉంటాం. ప్రభుత్వాలు అప్పటికప్పుడు కన్నీటితుడుపు మాటలతో సరిపెట్టుకోక సరైన నియంత్రణ, పర్యవేక్షణ చర్యలను శాశ్వత ప్రాతిపదికపై తీసుకోవాలి. అంతకన్నా మించి ప్రైవేటు ఇంటర్ విద్యకు దీటుగా ప్రభుత్వ కాలేజీలను అభివృద్ధి చేసి నీట్, ఎంబిబిఎస్ వంటి అఖిల భారత పరీక్షలకు సిద్ధం చేయాలి. అప్పుడు ద్విముఖ ప్రయోజనాలు నెరవేరతాయిప్రైవేటు విద్య కొరకు పరుగు తగ్గుతుంది, పట్టణగ్రామీణ వ్యత్యాసం తగ్గుతుంది.