Home సూర్యాపేట మత్తు.. చిత్తు..

మత్తు.. చిత్తు..

Alcohol

పట్టణ కేంద్రంలో విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు
ఎక్కువగా విద్యార్థులు, యువకులే బానిసలు
నిఘా పెంచితే తేలిగ్గా అరికట్టవచ్చు

హుజూర్‌నగర్ టౌన్: ఎక్కడో భాగ్యనగరంలో మత్తు మందుల కలకలమే కాదు… చిన్న పట్టణాలకు ఆ మత్తు సోకింది. ముఖ్యంగా విద్యార్థ్ధులు, యువకులు గంజాయి సిగరెట్లకు బానిసలవుతున్నారు. దీంతో కృష్ణ పట్టె ఏరియాగా పేరొందిన హుజూర్‌నగర్, కోదాడ నియోజక వర్గాల్లో గంజాయి వాడకం విచ్చల విడిగా మారింది. ఈ మధ్య కాలంలో హుజూర్ నగర్, కోదాడలలో దొరికిన ముఠాలే ఇందుకు ఉదాహరణ. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలలో గంజా యి సాగు చేసి దానిని పట్టణాలకు సరఫరా చేస్తున్నారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇటీవల ఉమ్మడి నల్గొండ జిల్లాలో గంజాయి అమ్మకాలు బాగా పెరిగాయి. సుమారు ఇరవై రోజుల క్రితం హుజూర్‌నగర్‌లోనూ గంజాయి దొరికింది. ఆ తర్వాత కోదాడలో ఓ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్ధులకు గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు.

తల్లిదండ్రులు ఉద్యోగస్తులు, వ్యాపారులు అంతేగాక ఆయకట్టు ప్రాంతం కావడంతో ఈ ప్రాంతంలో రై తుల పిల్లలకు అవసరాలకు చేతినిండా డబ్బు ఉంటోంది. దీంతో ఖరీదైన బైకులతో పాటు ఖరీదైన దురలవాట్లు అలవడుతున్నా యి. మద్యం, సిగరెట్లు నుంచి తాజాగా గం జాయితో నింపిన సిగరెట్లకు వీరు బానిసలుగా మారుతున్నారు. ఒక్కసారి దానికి బానిసైన వారు తిరిగి దానిని ఎలాగైనా ఆస్వాదించాలనే తపన ఈ మత్తులో ఉంటుంది. దీంతో వారు ఏ అఘాయిత్యానికైనా పాల్పడే ప్రమాదం ఉంది. ఇప్పటికీ రాష్ట్రంలో, దేశంలో ఏ సంఘ విద్రోహ చర్య జరిగినా దాని మూలాలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో బయటపడతాయి. దానిని నిజం చేస్తూ గంజాయి, మత్తు మందుల సంస్కృతి మూడు జిల్లాల్లో చాపకింద నీరులా పాకుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరం ఉమ్మడి జిల్లాలకు చేరువగా ఉండటం కూడా ఇందుకు ఎక్కువ దో హదపడుతోంది.

విద్యార్థులు, యువకులే అధికం
హైదరాబాద్ శివారు ప్రాంతాలతో పాటు నల్గొండ, సూర్యాపేట, కోదాడ, భువనగిరి ఆనుకొని ఉన్న కొన్ని ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్ధులు కొంతకాలంగా గంజాయికి అలవాటు పడినట్లుగా సమాచారం. గత నెలలో చౌటుప్పల్‌లో అరెస్టు అయిన గంజాయి ముఠాను పోలీసులు విచారిస్తే విద్యార్ధులు తీసుకురమ్మంటేనే తీసుకు వెళ్తున్నామని దర్యాప్తులో ఒప్పుకొన్నారు. అంతేగాక కృష్ణపట్టి ప్రాంతాలైన దేవరకొండ, చందంపేట గిరిజన ప్రాంతాల్లో గంజాయి సాగు ఇటీవల బాగా పెరిగినట్లు అధికారులకు సమాచారం అందిందని విశ్వసనీయ భోగట్టా. వీరు కొంత మంది ఏజెంట్ల ద్వారా విద్యార్ధులను లక్షంగా చేసుకొని ఈ అక్రమ దందాను కొనసాగిస్తున్నట్లు తెలిసింది. గిరిజన ప్రాంతాల నుంచి కిలోల చొప్పున తీసుకువచ్చి ఇక్కడ చిన్న చిన్న పాకెట్ల రూపంలో అమ్ముతున్నారు.

గతంలో విశాఖ మాన్యంలోని పాడేరు, చింతపల్లి, అరకు ప్రాంతాల్లో సాగు చేసి ఖమ్మం, సూర్యాపేట మీదుగా ఉమ్మడి జిల్లాలోకి ప్రవేశించేవారు. ఈ తరహాలో సూర్యాపేటలో పలుమార్లు గంజాయి దొరికిన సంఘటనలు కూడా ఉన్నా యి. కానీ అంత దూరం కాకుండా స్థానికంగా కొంత మంది గిరిజనులతో సంబంధాలు పెట్టుకొని మారుమూల ప్రాంతాలలో గంజాయి సాగు చేస్తున్నట్లు తెలిసింది. పదిహేను రోజుల క్రితం కోదాడలో గంజాయి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకొని విచారించగా ఓ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్ధులకు వీరు ఎప్పటి నుంచో గంజాయి సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. ఇరవై రోజుల క్రిత ం హుజూర్‌నగర్ పట్టణ శివారు గోవిందాపురంలో ఓ ఇంటిపై పోలీసులు దాడి చేయగా గంజాయి పట్టుపడింది. పోలీసులు, ఆబ్కారీ శాఖలు సమన్వయంతో పని చేసి గంజాయిని అరికట్టక పోతే యువత పెడదారి పట్టే అవకాశం ఉంది.