Search
Wednesday 14 November 2018
  • :
  • :

ఆ విద్యార్థులు వన్యప్రాణి ప్రేమికులు..

Animal

అక్కడ విద్యార్థులు క్యాంపస్‌లో చదువుకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో… ఏ వన్య ప్రాణికైనా, పక్షికైనా హాని జరిగితే క్షణాలో ప్రత్యక్షమై వాటిని రక్షిస్తారు. ఎందుకని అడిగితే.. అంతరించిపోతున్న వన్య ప్రాణులు, పక్షి జాతులను పరిరక్షించుకోవాల్సిన గురుతర బాధ్యత మాపై ఉంది అంటారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని కొంత మంది విద్యార్థులు జంతురక్షకులుగా ‘వైల్డ్ లెన్స్ గ్రూప్’ గా ఏర్పడి మిగతా క్యాంపస్‌లకు మార్గదర్శకులుగా నిలిచారు.

హైదరాబాద్ విశ్వవిద్యాలయం.. హరితహారం కళ్లకుకట్టినట్లుగా ఉంటుంది. ఆ రక్షిత వనంలో, జింకలు పరుగులు తీస్తుంటాయి. కుందేళ్ళు దోబూచులాడుతుంటాయి. అడవి పందులు హంగామా చేస్తుంటాయి. నెమళ్ళు పచ్చికల మీద క్యాట్‌వాక్ చేస్తుంటాయి. ఒకటారెండా, వంద రకాల జీవజాతులు. పక్కనే అందమైన ఒక కొలను. రంగుల రెక్కల సింగారెంచుకుని పక్షులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాలతాయి. వర్షాకాలంలో ఆ అందం రెట్టింపు అవుతుంది.పచ్చని ప్రకృతి మధ్య చదువుకోవడమంటే అక్కడి విద్యార్థులకు మహా ఆనందం. ఇక్కడ జంతు పక్షుల ప్రేమికులు పూర్తికాల సంరక్షకులుగా ఉంటారు. ఎక్కడ ఏ పక్షికి గాని మృగానికి హాని జరిగితే ఆగమేఘాల మీద చేతులకు గ్లవ్స్, మొహానికి మాస్క్ పెట్టుకొని ఆ ప్రాంతమంతా కంటికి రెప్పలా పరిరక్షిస్తుంటారు.

హానికి గురైన వన్య ప్రాణులకు సేవచేసేందుకు వారు తమ బృందానికి ‘వైల్డ్ లెన్స్ గ్రూప్’ అనే పేరు పెట్టుకున్నారు. ఐదుగురితో మొదలైన వైల్డ్ లెన్స్ బృందంలో ప్రస్తుతం 30 మంది సభ్యులున్నారు. ఒకరు ఆర్ట్ గ్రూప్ విద్యార్థి కావచ్చు. మరొకరు కామర్స్ పరిశోధకుడు కావచ్చు. క్యాంపస్‌ను వన్య ప్రాణులకు సురక్షితమైన ప్రాంతంగా రూపొందించేందుకు రక్షక దళంలా ఏర్పడ్డారు. క్యాంపస్ చుట్టూ కంచె ఏర్పాటు చేసినా వేటగాళ్ళు క్యాంపన్‌లోకి జొరపడి జంతువులనూ, పక్షులనూ నిర్ధాక్షిణ్యంగా వేటాడుతుంటారు. ఎటు చూసినా జంతు కళేబరాలే కళ్లముందు దర్శనమిస్తుంటాయి.

ఈ ఘోరానికి చెక్ పెట్టేందుకే ‘వైల్డ్ లెన్స్ గ్రూప్’ ఏర్పాటైంది. ప్రతీ రెండు వారాల్లో ఆదివారం నాడు.. నేచర్ వాక్ నిర్వహిస్తారు. ఈ బృందంతో పాటు మరో కొంతమంది వందల సంఖ్యలో వాక్‌లో పాల్గొంటారు. క్యాంపస్ అంతా కలియ తిరుగుతూ వన్య ప్రాణులను, పక్షులను పలకరిస్తుంటారు. చెట్లను నరికి వేయడం పట్ల విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. వైల్డ్ లెన్స్ సభ్యులు పక్షుల గుడ్ల సంరక్షణ బాధ్యతను తీసుకుంటారు. నిర్ధాక్షిణ్యంగా పక్షులను, వన్య ప్రాణులకు వేటాడే వేటగాళ్లను పసిగట్టి పోలీసులకు సమాచారం అందిస్తారు. క్యాంపస్‌లో అరుదైన జంతు స్థావరాలున్నాయి. వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి నిరంతరం నిఘా ఏర్పాటు చేశారు.

Comments

comments