Search
Thursday 22 November 2018
  • :
  • :
Latest News

ఆధార్‌తో బడి తిండికి బై!

Choopu-Cartoon

ఆధార్ చట్టం సెక్షన్ 7 క్రింద గత నెల 28న మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఒక నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఆ నోటిఫికేషన్ ప్రకారం మధ్యాహ్న భోజన పథకం కింద బడివేళ ఉచిత భోజనం కోరే వారు ఆధార్ కార్డు చూపాలి. ఆధార్ నెంబర్ లేని వారు, ఆధార్ పథకంలో నమోదు కానివారు జూన్ 30లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఆధార్ నెంబర్‌ను దరఖాస్తుదారుకు కేటాయించే వరకు కొన్ని గుర్తింపు పత్రాలపై పథకాల ప్రయోజనాలు కల్పిస్తారు.

అవి ఏవంటే –

  1. ఎ)ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ చీటీ బి) ఆధార్ కోసం దరఖాస్తు చేసుకొన్నట్టు చూపే పత్రం.
  2. తమ బిడ్డ ఏ ఇతర స్కూల్‌లో ఎన్‌రోల్ కాలేదని తల్లిదండ్రు లలో ఒకరు లేదా సంరక్షకుల నుంచి లిఖిత పత్రం
  3. ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాలు ఏడింటిలో ఏదైనా ఒకటి.

పిల్లలపై పరోక్ష నిర్బంధం

ఈ నోటిఫికేషన్ ప్రకారం బడి పిల్ల లేదా పిల్లవాడు ఆధార్‌లో ఎన్‌రోల్ కాకపోతే ఎన్‌రోల్‌మెంట్ దరఖాస్తు పత్రంతోపాటు రెండు ఇతర గుర్తింపు పత్రాలను చూపితేనే మధ్యాహ్న భోజనానికి అర్హులుగా నిర్ణయిస్తారు. ఇటువంటి దారుణ ఉత్తర్వుపై వారం తర్వాత వివరణ ఇచ్చారు. ఇది బలవంతపు ఎన్‌రోల్‌మెంట్ కార్యక్రమం కాదని స్వచ్ఛంద ప్రక్రియ అని ఒక పత్రికా ప్రకటనలో ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఆధార్ లేనంతమాత్రాన ఎవరికీ ప్రయోజనాలను నిరాక రించడం లేదు. బడిపిల్లల ఆధార్ నెంబర్లను సేకరించాలని మధ్యాహ్న భోజన, సమగ్ర శిశు అభివృద్ధి పథకాల ప్రయోజనాల కోసం స్కూళ్ల ను, అంగన్‌వాడీలను ఆదేశించామని అధికారులు తెలిపారు. ఒకవేళ వారికి ఆధార్ నెంబర్లు లేనిపక్షంలో ఎన్‌రోల్ అయ్యేలా స్కూళ్లు, అంగన్‌వాడీలు చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించినట్లు వివరణ ఇచ్చారు.
ఇది పిల్లల మధ్యాహ్న భోజనానికి ఆధార్‌ను తప్పనిసరి చేయడం అవుతుందేతప్ప స్వచ్ఛంద ఎన్‌రోల్‌మెంట్‌ను ప్రోత్సహించడం ఎలా అవుతుందని పిల్లల తల్లిదండ్రులు అడుగుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో సడలింపు ఏదీ లేనప్పటికీ మీడియాలో మధ్యాహ్న భోజనానికి ప్రభుత్వం ఆధార్ నిబంధనను సడలించి, ఇతర గుర్తింపు పత్రాలతో సరిపెడుతోందని ప్రచారం జరిగింది. నిజానికి ఆ పథకాన్ని ఆధార్‌కు అనుసంధానించడంలో ఎటువంటి సడలింపు ప్రభుత్వం చేయలేదు. ఫిబ్రవరి 28న జారీ అయిన నోటిఫికేషన్ బడి పిల్లలకు ఎటువంటి మినహాయింపులు లేకుండా యధాతథంగా కొనసాగు తోంది. మధాహ్న భోజన పథకానికి ఆధార్‌ను అనుసంధానించడం రెండు రకాలుగా ప్రశ్నార్థకం. ప్రస్తుత ఆధార్ చట్టం కింద పిల్లలను ఎన్‌రోల్ కమ్మని బలవంతం చేయడం చెల్లదు. వారు మైనర్లు కాబట్టి అలా బలవంతపెట్టడం వారి అభీష్టానికి విలువలేకుండా చేస్తున్నట్లే నని చట్టం పేర్కొంటోంది.
ఎటువంటి అదనపు రుజువులు చూపనక్కరలేకుండా మధ్యాహ్న భోజనం ఆరగిస్తున్న పిల్లలను ఆధార్ కోసం బలవంతపెట్టడం అక్రమం. ఆధార్ అన్నది అడ్డంకులు లేకుండా చేసేదే అని ప్రచారంలో ఉన్నమాటను పక్కనబెట్టి, అడ్డంకులను సృష్టించేదిగా ప్రభుత్వం చేస్తోందన్న విమర్శకు తావు ఏర్పడింది. ఇలా బలవంతపెట్టడం మధ్యాహ్న భోజనం పథకం పట్టాలు తప్పడానికి, ఆధార్ ప్రక్రియ సైతం అవాంతరాల్లో పడడానికి దారితీయవచ్చు. అంతేకాకుండా విద్యాలయాల్లో చదువుల అసలు కార్యక్రమానికి భంగం కలుగవచ్చు. టీచర్లను, స్కూలు యాజమాన్యాన్ని ఆధార్ నమోదు కార్యక్రమాల్లోకి దించడం వల్ల చదువులు కుంటుపడడం ఖాయమని విద్యా నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆధార్ కోసం పాకులాడకుండా ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకంలోకి ప్రస్తుతంవలే నేరుగా నమోదును ప్రోత్సహించాలని వారు సూచిస్తున్నారు. పైగా ఆ పథకంలో ఆధార్‌కు స్థానమే లేదు. దాని అవసరం లేకుండానే సాగుతున్న పథకానికి కొత్తగా దాన్ని లింకు చేయడం వ్యర్థమని కూడా వినిపిస్తోంది.

లోపాలకు ఆధార్ అతీతంకాదు

పిల్లలను ఆధార్‌లో చేరేలా చేయడానికే ఈ నిర్ణయమని నోటిఫి కేషన్‌లో వివరించారు. దానివల్ల అదనంగా మధ్యాహ్న భోజనం మెరుగుపడేది లేనప్పుడు ఆ పథకం ద్వారా పిల్లలను బలవంత పెట్టడం న్యాయం కాదని నిపుణులు అంటున్నారు. ఆధార్ లింక్‌తో అదనపు రుజువులు చూపాలన్న ఆదేశం తెచ్చినట్లు అయింది. ఆధార్ భారాన్ని మోయలేక మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి గ్యారంటీ (ఎంజిఎన్‌ఆర్‌జిఎ) చట్టం, ప్రజాపంపిణి వ్యవస్థ (పిడిఎస్) కూడా కొన్ని చోట్ల చతికిలపడ్డాయి. పిల్లలందరికీ ఆధార్ ఉండాలని ప్రభుత్వం భావిస్తే మామూలు బయోమెట్రిక్ పద్ధతిని అనుసరించడం మంచిదని సామాజికులు సూచిస్తున్నారు. పెన్షన్లు, పిడిఎస్, ఎంజిఎన్ ఆర్‌జిఎ (ఉపాధిహామీ) పథకాల్లో ఆధార్ ప్రవేశపెట్టిన అనుభవంవల్ల విరుద్ధ ఫలితాలే వచ్చాయి. ఆ యత్నం విఫలం అవుతుందన్న సంకేతం బలంగా వెలువడింది. కొన్ని సందర్భాల్లో ఆధార్ నెంబర్లను తప్పుగా ఇచ్చారు.
సరిచేయవలసిందని మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి. అందుకు దూరంలో ఉన్న బ్లాక్ ఆఫీసుకు బాధితులు వెళ్లాలి. ఈలోగా పథకం అమలు నిలిచిపోవచ్చు. ఎందుకంటే సరిదిద్దడానికి ఎంత లేదన్నా మూడు, నాలుగు వారాలు పడుతుంది. కొన్ని కేసుల్లో వేలి ముద్రలు మారిపోతున్నాయి. లేదా గుర్తుపట్టలేని పరిస్థితి కలుగు తోంది. వాటి గుర్తింపుకు వాడే పరికరాల్లో కూడా లోపాల వల్ల ఈ ప్రక్రియ ఆలస్యం అవుతోంది.
హాజరు పట్టీల్లో తేడాపాడాల నివారణకే ‘బయోమెట్రిక్ అథెంటికే షన్’ ప్రక్రియ ఉపయోగపడుతుంది. మధ్యాహ్న భోజన పథకంలో హాజరీ అమితంగా ఉండే సమస్య మామూలు. దాన్ని ఎదుర్కోవడానికే ఆ ప్రక్రియ పనికి వస్తుంది తప్ప పథకానికి అర్హులను నిర్ణయించడానికి కాదు. ఇటువంటి పథకాల విషయంలో ఉదాత్తంగా వ్యవహరించాలే తప్ప క్రమ శిక్షణ బెత్తాన్ని ఉపయోగించరాదు.
మధ్యాహ్న భోజన పథకానికి ఎల్‌పిజి సబ్సిడీని 2015 ఆగస్టులో ప్రభుత్వం నిలిపివేసింది. ప్రస్తుతం పిల్లలకు తలసరిన మధ్యాహ్న భోజనం ఒక్కింటికి రూ. 5 ఇస్తున్నారు. అందులో ఒక గుడ్డు, అన్నం, పప్పు మాత్రమే ఇవ్వగలుగుతున్నారు. అది సరిపోదు. ఆ చాలీచాలని తిండికి కూడా అదనపు రుజువులు తెమ్మనడం భావ్యం కాదని గట్టిగా వినబడుతోంది.

– రీతికా ఖెరా

Comments

comments