Home ఆఫ్ బీట్ మాజీ డిజిపి కూతురిని బెదిరించిన ప్రభాకర్ రెడ్డి

మాజీ డిజిపి కూతురిని బెదిరించిన ప్రభాకర్ రెడ్డి

Kuknoorpally Sub - Inspector Commit Suicide in Siddipeta

హైదరాబాద్ సిటీబ్యూరో: బ్యూటీషియన్ శిరీష, కుకునూర్‌పల్లి ఎస్‌ఐ ప్రభాకరరెడ్డి ఆత్మహత్యల ఉదంతం రోజురోజుకూ కొత్త మలుపు తిరుగుతోంది. గత ఏడాది ప్రభాకరెడ్డి ఏకంగా రిటైర్డ్ డిజిపి కోటేశ్వరరావును బెదిరించాడని, ఆయన కూతురు శ్వేత పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని తెరపైకి వచ్చింది. ఈ ఉదంతంపై శ్వేత మీడియా ముందుకు వచ్చి అప్పటి ఉదంతంపై వివరణ ఇచ్చారు. కోటేశ్వర్‌రావు తనకు బంజారాహిల్స్‌లో ఉన్న భవాన్ని అద్దెకు ఇచ్చాడు.

అయితే, అందులో హుక్కా సెంటర్, వ్యభిచారం నడుస్తోందని తెలిసి ఖాళీ చేయమని అతని కూతురు శ్వేత కోరింది. ఖాళీ చేసేందుకు కిరాయిదారులు ససేమిరా అన్నారు. అదే సమయంలో అక్కడున్న ఎస్‌ఐ ప్రభాకరరెడ్డి శ్వేత పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా ఫోన్‌లో కోటేశ్వరరావును బెదిరించాడని శ్వేత ఆరోపించారు. ఈ విషయంపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించు కోలేదని ఆమె ఆరోపించారు. ఇదిలావుండగా భవనం ఖాళీ చేయించమని గొడవ పడుతున్న విషయం తెలియగానే ఎస్‌ఐ క్రిష్ణయ్య అక్కడికి వెళ్లినట్లు అధికారులు చెబుతున్నారు. శ్వేత..ఎస్‌ఐ క్రిష్ణయ్యను చూసి ప్రభాకరరెడ్డిగా భ్రమ పడుతున్నారని తాము భావిస్తున్నామని బంజారాహిల్స్ పోలీసులు చెబుతున్నారు.

మనస్థాపం కలిగింది: డిజిపి

రిటైర్డ్ డిజిపి కోటేశ్వర్‌రావును బెదిరించిన ఉదంతంపై బంజారాహిల్స్ పోలీసులు అనుసరించిన విధానంపై మనస్థాపం కలిగిందని డిజిపి అనురాగ్‌శర్మ పేర్కొన్నారు. అతని కూతరు శ్వేత నుంచి ఫిర్యాదు తీసుకుని న్యాయం చేస్తామని ఆయన తెలిపారు. కోటేశ్వర్‌రావు ఆరోగ్యం బాగా లేకున్నా పోలీసు స్టేషన్‌కు పిలిపించడం సమంజసం కాదన్నారు.