Home బిజినెస్ సెలవు పై చందా కొచ్చర్

సెలవు పై చందా కొచ్చర్

Subscription Kochhar on Vacation

సిఒఒగా సందీప్ బక్షినియామకం                                                                                                                                ప్రకటించిన ఐసిఐసిఐ బ్యాంక్ బోర్డు

న్యూఢిల్లీ: ఐసిఐసిఐ బ్యాంక్ సిఒఒ(చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్), పూర్తి కాలం బ్యాంక్ డైరెక్టర్‌గా సందీప్ బక్షిని ఐసిఐసిఐ బ్యాంక్ నియమించింది. అదే సమయంలో వీడియోకాన్ వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రస్తుత సిఇఒ, ఎండి చందా కొచ్చర్‌ను దర్యాప్తు పూర్తయ్యేంత వరకు సెలవుపై పంపాలని నిర్ణయించింది. ఈమేరకు బిఎస్‌ఇ ఫైలింగ్‌లో బ్యాంక్ వెల్లడించింది. ఐదేళ్ల పాటు సిఒఒగా బక్షి నియమించగా, నియంత్రణ సంస్థ నుంచి ఆమోదం లభించాల్సి ఉంది. రెగ్యులేటరీ, ఇతర అనుమతులతో జూన్ 19 నుంచి బక్షి సిఒఒగా బాధ్యతలును స్వీకరించనున్నారు. బ్యాంక్ బోర్డు సభ్యులు అందరూ బక్షీకి రిపోర్ట్ చేయనుండగా, చందా కొచ్చర్‌కు బక్షి రిపోర్ట్ చేస్తారు. బక్షీని బ్యాంక్ సిఇఒ, ఎండిగా మాత్రం నియమించలేదు. కాగా చందా కొచ్చర్‌పై వచ్చి ఆరోపణల విషయమైన అభిప్రాయం తెలియజేయాలని కోరుతూ ఐసిఐసిఐ బ్యాంక్ చైర్మన్ ఎంకె శర్మ ఇటీవల బోర్డు సభ్యులకు ఇమెయిల్ పంపారు. అనంతరం ఈ నిర్ణయం వెలువడడం గమనార్హం. ఐసిఐసిఐ బ్యాంక్ ఏర్పాటు చేసిన స్వతంత్ర దర్యాప్తు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు కొచ్చర్‌ను నిరవధిక సెలవుపై పంపాలనే విషయమై శర్మ బోర్డు సభ్యులను కోరగా.. వారంతా అంగీకరించారని తెలిసింది. గత పదేళ్లుగా బ్యాంకు సిఇఒగా కొనసాగుతున్న చందాకొచ్చర్ పదవీకాలం 2019 మార్చిలో ముగియనుంది. అయితే ఇటీవల ఆమె వీడియోకాన్ గ్రూప్ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. బ్యాంకు నిబంధనలను ఉల్లంఘించి క్విడ్ ప్రోకో ప్రాతిపదికన వీడియోకాన్‌కు 2012లో రుణాలు మంజూరు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

4 శాతం పెరిగిన ఐసిఐసిఐ బ్యాంక్
ఐసిఐసిఐ బ్యాంక్ సిఇఒగా చందా కొచ్చర్‌ను సెలవుపై పంపనున్నారనే వార్తల నేపథ్యంలో సోమవారం కంపెనీ షేరు జోరందుకుంది. ఆమె స్థానంలో ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లైఫ్ సిఇఒ సందీప్ బక్షీ బాధ్యతలు అప్పగించనున్నారనే వార్తలతో స్టాక్‌మార్కెట్‌లో బ్యాంక్ షేర్లు భారీగా పెరిగాయి. ఉదయం నుంచి లాభాల్లో సాగిన ఐసిఐసిఐ షేరు విలువ 4శాతానికి పైగా పెరిగింది. ఆఖరికి 4.07 శాతం జంప్ చేసి రూ.294 వద్ద స్థిరపడింది. కొచ్చర్ స్థానంలో సందీప్ బక్షీని నియమించనున్నారనే వార్తల కారణంగానే ఐసిఐసిఐ షేర్లు లాభపడ్డాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సందీప్ బక్షి నియామకం జరిగితే షేర్లకు మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
వీడియోకాన్ వివాదం విషయాలు
2012లో వీడియోకాన్ సంస్థకు ఐసిఐసిఐ బ్యాంక్ ఈ రుణం ఇచ్చింది
వీడియోకాన్‌కు రూ. 3,250 కోట్ల రుణ మంజూరులో సిఇఒ చందాకొచ్చర్ సాయం చేసినట్లు ఆరోపణలు
వీడియోకాన్ గ్రూప్‌కు చెందిన వేణుగోపాల్ ధూత్, చందాకొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్, మరో ఇద్దరు బంధవులు కలిసి 2008లో నూపవర్ కంపెనీ ఏర్పాటు చేశారు.
– ఐసిఐసిఐ బ్యాంక్ ఇచ్చిన రుణంలో రూ.2,810 కోట్లు అంటే 86 శాతాన్ని వీడియోకాన్ తిరిగి చెల్లించలేకపోయింది.
2017లో ఇది మొండి బకాయిగా మారింది.
వీడియోకాన్ రుణం నిబంధనలకు విరుద్ధంగా క్విడ్ ప్రోకో(నీకిది నాకది) ప్రాతిపదికన ఇచ్చారని, దీంతో కొచ్చర్ కుటుంబీకులు ప్రయోజనం పొందారని ఆరోపణలు వచ్చాయి.
అయితే ఈ ఆరోపణలను ఐసిఐసిఐ బ్యాంక్ బోర్డు కొట్టిపారేసింది. చందాకొచ్చర్ ప్రమేయం ఏమీ లేదని పలుమార్లు బ్యాంక్ బోర్డు చెప్పింది. కొచ్చర్‌పై తమకు పూర్తి విశ్వాసం ఉందని పేర్కొంది.
వీడియోకాన్ కేసును సిబిఐ దర్యాప్తు చేపట్టింది. చందాకొచ్చర్ భర్త దీపక్, వీడియోకాన్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్‌లను అనుమానితులుగా చేర్చి, వారిని విచారిస్తోంది.
చందాకొచ్చర్‌పై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఈనెల 11న సెబీ నోటీసులు జారీ చేసింది. వీడియోకాన్ గ్రూప్, నూపవర్‌తో బ్యాంక్ ఒప్పందాలపై వివరాలను సెబి కోరింది.
సెబి నోటీసులు జారీ చేసిన కొద్ది రోజుల తర్వాత బ్యాంక్ తాజాగా స్వతంత్ర దర్యాప్తు నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ ఆధ్వర్యంలో స్వత్రంత కమిటీ ఏర్పాటు చేశారు.