Home ఆఫ్ బీట్ ఆకాశమే హద్దుగా…

ఆకాశమే హద్దుగా…

World-famous-Personolities

సక్సెస్ స్టోరీ: ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌కు చెందిన నికోలస్ జేమ్స్ వుజిసిక్‌ది స్ఫూర్తిమంతమైన జీవితం. టెట్రా ఎమీలియా సిండ్రోమ్ (భుజాలు, కాళ్లు లేకుండా పుట్టడం)తో పుట్టాడు నిక్. ఈ రకమైన లోపంతో పుట్టేవారు చాలా అరుదుగా ఉంటారు. శారీరకంగా ఉన్న లోపాలను లెక్కచేయకుండా ఉన్నతంగా ఎదిగాడు నిక్. అలాగని తన జీవితంలో కష్టాలే లేవా అంటే ఎందుకులేవు, పదేళ్ల వయసులోనే ఆత్మహత్య ప్రయత్నం చేసేన్ని కష్టాలబారిన పడ్డాడు. పుట్టగానే తన తల్లి కూడా దగ్గరికి తీసుకోవడానికి నిరాకరించిన నిక్ నేడు ప్రపంచవ్యాప్తంగా ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నాడు, ఎందరి జీవితాలనో మార్పుదిశగా మలుస్తున్నాడు…

దిన పత్రిక జీవితాన్ని మార్చింది
నిత్య జీవితంలో మానసికంగా, శారీరకంగా, భావోద్వేగాల పరంగా ఎదుర్కుంటున్న కష్టాలకు తట్టుకోలేక తన పదేళ్ల వయసులో ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ఎదుగుతున్న దశలో అంటే యుక్తవయసులో కూడా నిక్‌ను చాలామంది మోసం చేశారు. ఆ సమయంలో మరింత కుంగిపోయాడు నిక్. ఒక రోజు అనేక రకాల వైకల్యాలున్న వ్యక్తిని గూర్చిన వ్యాసం దినపత్రికలో అచ్చవడంతో దాన్ని నిక్‌కు చూపించింది అతని తల్లి. దాంతో తన పదిహేడేళ్ల వయసులో చర్చి ప్రేయర్ గ్రూపుల్లో నిక్ ప్రసంగాలివ్వడం మొదలుపెట్టి, మతప్రచారకుడిగా మారాడు. అదే స్ఫూర్తితో చదువు కొనసాగించి గ్రిఫ్త్ విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్‌లో ఎకౌంటెన్సీ, ఫైనాన్షియల్ ప్లానింగ్ సబ్జెక్ట్‌లతో డిగ్రీ పూర్తిచేశాడు.

బెస్ట్ యాక్టర్ అవార్డ్
కెరీర్ లైఫ్ వితవుట్ లింబ్స్ అనే ఎన్‌జివొ ను, తర్వాత ఆటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్ అనే సెక్యులర్ స్ఫూర్తిదాయక మాటల కంపెనీని స్థాపించాడు. తర్వాత ‘ద బటర్ ఫ్లై సర్కస్’ అనే షార్ట్ ఫిల్మ్‌లో హీరోగా నటించాడు. ‘మెథడ్ ఫెస్ట్ ఇండి పెండెంట్ ఫిల్మ్ ఫెస్టివల్ 2010’లో షార్ట్ ఫిల్మ్‌లో వేసిన ‘విల్’ పాత్రకు బెస్ట్ యాక్టర్ అవార్డ్ అందుకున్నాడు.

నిక్ రాసిన పుస్తకాలు
లైఫ్ వితౌట్ లిమిట్స్, యువర్ లైఫ్ వితౌట్ లిమిట్స్, లిమిట్‌లెస్, అన్‌స్టా పబుల్, ద పవర్ ఆఫ్ అన్‌స్టాపబుల్ ఫెయిత్, స్టాండ్ స్ట్రాంగ్, లవ్ వితౌట్ లిమిట్స్, బి ద హ్యాండ్స్ ఆండ్ ఫీట్.

ప్రపంచవ్యాప్తంగా అభిమానులు 
ప్రస్తుతం సదర్న్ కాలిఫోర్నియాలో నివసిస్తున్న నిక్ క్యానీ మియారేను వివాహం చేసుకోగా వారికి ఇద్దరు పిల్లలు. ఎన్నో దేశాలు తిరుగుతూ స్ఫూర్తిదాయక ఉపన్యాసాలిస్తున్నాడు నిక్. ఇప్పటికి 57కు పైగా దేశాల్లో 3000 పైగా ప్రసంగాలిచ్చాడు. వాటిల్లో ఒకటైన ప్రసంగానికి 11 లక్షల మంది ఆకర్షితులైనారు.

చేయని పనిలేదు
రెండు భుజాలు లేని నిక్ రెండు అతి చిన్న పాదాలు కలిగిఉన్నాడు. కాలికి ఉన్న వేళ్లు ఒకదానికొకటి అతుక్కొని ఉండడంతో, సర్జరీ చేసి వాటిని విడదీశారు. అలా విడదీసిన కాలివేళ్లను ఉపయోగించి ఏదైనా వస్తువును తీసుకోవడం, పేజీని తిరగెయ్యడం, మిగతా పనులు చేయడం లాంటివి చేస్తూనే అవే పాదాలతో ఎలక్ట్రిక్ వీల్ ఛైర్, కంప్యూటర్, మొబైల్ ఫోన్‌లను కూడా వాడతాడు, పెయింటింగ్ చేస్తాడు. సర్ఫింగ్, స్కై డైవింగ్, స్విమ్మింగ్, ఇలా ఎన్నో రకాల ఆటలు ఆడతాడు నిక్. ఇతడు రాసిన ‘లవ్ వితౌట్ లిమిట్స్’ అంతర్జాతీయంగా అత్యధిక కాపీలు అమ్ముడయ్యాయి.

ఫెయిల్యూర్ స్టోరీ: కుంగు బాటుకు గురవ కుండా ఓటమిని ఎదుర్కొగలిగితే, విజయ తీరాలు చేరుకోవడం ఖాయం. దానికి కావల్సిందల్లా.. నిరంతర శ్రమ, పట్టుదల, ఓర్పు, నేర్పు.. అవును అపజయాలను విజయాలుగా మార్చుకుని వరల్డ్ నెం.1 అయిన కొందరి జీవితాలు

మడొన్నా: కాలేజీ చదువులు మధ్యలో ఆపేసి, న్యూయార్క్ సిటీకి పయనమైంది. అక్కడికి చేరాక త్వరగానే డంకిన్ డోనట్స్, రష్యన్ రెస్టారెంట్‌లో హ్యాట్ చెక్ వుమెన్‌గా చేరింది, అయితే అంతే త్వరగా ఉద్యోగాలనుండి తొలగింపబడింది. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు న్యూడ్ మోడలింగ్ వేదికలను పంచుకున్నది, ఈ విధంగా గంటకు ఏడు డాలర్లు సంపాదించింది. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూనే ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను నిలబెట్టుకుంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 300 మిలియన్లకు పైగా ఆల్బమ్‌లను అమ్మింది. రికార్డింగ్ ఆర్టిస్ట్(మహిళ) గా మడొన్నా సాధించిన విజయం ఎవరికీ అందనంత దూరంలో ఉన్నది నేటికి.

మైకేల్ జోర్డాన్: బెస్ట్ బాస్కెట్‌బాల్ ప్లేయర్‌గా గుర్తింపుపొందిన మైకేల్ జోర్డాన్ తన స్కూల్ బాస్కెట్‌బాల్ టీం నుంచి తీసివేయబడ్డాడు. అయితే జోర్డాన్ దాన్ని సవాలుగా తీసుకొని మరింత ఎక్కువ సమయం ఆటకు కేటాయించాడు. నా కెరీర్‌లో 9,000 పైచిలుకు షాట్స్‌ను తప్పుగా ఆడి, 300 ఆటలను పోగొట్టు కున్నా ను, వాటిల్లో 26 సార్లు గేమ్ విన్నింగ్ షాట్‌ను తప్పుగా ఆడడం వల్ల ఓడిపో యాను. అనేకానేక సార్లు ఓడిపోవడం వల్లనే నేను జీవితంలో గెలిచాను అని చెబుతాడు జోర్డాన్.

జెకె రోలింగ్: హ్యారీ పాటర్ నవలల రచయిత్రి అయిన రోలింగ్ మొదట ఒక రెస్టారెంట్‌లో వెయిట్రెస్‌గా పనిచేసింది. అదే సమయంలో తన హ్యారీ పాటర్ సిరీస్‌లోని మొదటి నవలను రాస్తున్నది. అయితే ఆ పుస్తకాన్ని ప్రచురించమని దాదాపు డజన్‌మంది పబ్లిషర్లు తిప్పిపంపారు. చివరకు హ్యారీపాటర్ పుస్తకాన్ని పబ్లిష్ చేసినతను, తన ఎనిమిదేళ్ల అమ్మాయి అభ్యర్థన మేరకు దాన్ని పబ్లిష్ చేశాడు. ఆ తరువాత ఆపుస్తకం రేపిన సంచలనం, నేడు అత్యంత ధనవంతుల జాబితాలో రోలింగ్ చేరడం కూడా మనకు తెలిసిందే.

-అనిత యెలిశెట్టి