Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

క్రమ శిక్షణతో కృషి చేస్తేనే విజయం

Success if you work with discipline training
పెద్దపల్లి: జీవితంలో మనిషి ఏర్పార్చుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే క్రమ శిక్షణతో కృషి చేసినప్పుడే అందులో విజయాన్ని సాదించగలడని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన అన్నారు. శుక్రవారం పెద్దపల్లి ట్రినిటి ఫార్మసి కళాశాలలో పోలీస్ ఉద్యోగాలు ఆకాంక్షించే వారికి పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణా కార్యక్రమాన్ని రామగుండం పోలీస్ కమీషనర్ విక్రమ్ జీత్ దుగ్గల్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి చదువుకునే వయసులోనే తమ తమ లక్ష్యాలు ఏర్పాటు చేసుకొని చదువు పూర్తయ్యాక వాటిని సాకారం చేసుకునేందుకు అహర్నిశలు కష్టపడ్డాలని అన్నారు . ప్రతి అపజయానికి విజయం తొలి మెట్టు కావాలని, ఓడి పోయిన ప్రతి సారి మరింత కష్టపడి అనుకున్నది సాదించాలని కలెక్టర్ యువకులకు సూచించారు. ఈ శిక్షణలో పాల్గొన్న ప్రతి ఒక్కరు ఉద్యోగం వస్తుందనే ధీమాతో ముందుకెళ్లాలని, రాకున్నా కుంగి పోకుండా మళ్లీ ప్రయత్నించాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు 18,196 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారిచేసిన నేపధ్యంలో పెద్దపల్లి జిల్లాలో ఉన్న పేద ప్రజలకు ఉచిత శిక్షణ అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. రామగుండం పోలీస్ కమీషనర్ విక్రమ్ జీత్ దుగ్గల్ మాట్లాడుతూ జిల్లాలోని 300 మంది యువతి, యువకులను వివిధ రకాల పరీక్షల అనంతరం ఎంపిక చేసి శిక్షణ అందిస్తున్నామని, ఇందులో 100 మంది మహిళలు కూడా ఉన్నారని అన్నారు. మంచి అనుభవం కలిగిన ఉపాధ్యాయులు, పాఠ్య పుస్తకాలను అందుబాటాలో ఉంచామని ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని సూచించారు. పోలీస్ శాఖలో ఉద్యోగం పొందడానికి అవసరమయిన అన్నిరకాల శిక్షణ అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. శిక్షణలో పాల్గొనే విద్యార్థులంతా మానసికంగా శారీరకంగా డృఢంగా ఉండాలని, ఎలాంటి నిరశా వాదానికి లోనుకాకుండా గమ్యాన్ని చేరుకునేందుకు ప్రయత్నం చేయాలని అన్నారు. శిక్షణలో పాల్గొనే విద్యార్థులు రెండు నెలల శిక్షణా కాలంలో క్రమ శిక్షణ పాటించాలని, పాటించని వారిని వెంటనే తొలగించడం జరుగుతుందని అన్నారు. అనంతరం విద్యార్థులకు జిల్లా కలెక్టర్ తో కలిసి కమీషనర్ పోలీస్ సిలబస్‌కు సంబందించిన పుస్తకాలను, ఇతర సామాగ్రిని అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా డిసిపి సుదర్శన్ గౌడ్, గోదావరి ఖని ఎసిపి రక్షితా కే మూర్తి, పెద్దపల్లి ఎసిపి హబీబ్ ఖాన్ డిఆర్‌డివొ ప్రేమ్ కుమార్ పోలీసు ఉన్నతాధికారులు, సంబందిత అధికారులు పాల్గొన్నారు.

Comments

comments