Home భద్రాద్రి కొత్తగూడెం సక్సెస్ స్కూళ్లపై అశ్రద్ధ

సక్సెస్ స్కూళ్లపై అశ్రద్ధ

Success is neglect on schools

ఫలితాలు బాగున్నా చొరవ శూన్యం
విద్యార్థులకు శాపంగా మారుతున్న ఇంగ్లీష్ మీడియం
ఇకనైనా దృష్టి సారిస్తే మేలు

మన తెలంగాణ/భద్రాచలం: ఇంగ్లీష్ మాట్లాడే తెలుగు మీడియం పిల్లలను ఇంగ్లీష్ వైపుకు పరుగులు పెట్టించేందుకు సుమారు 8 ఏళ్ల క్రితం అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం(ఏ.పి) చేపట్టిన ఆంగ్లమాధ్యమం చదువులు నేటికి కూడా సరైన రీతిలో ముందుకు సాగే పరిస్థితి కనిపించడం లేదు. మాతృ భాష అయిన తెలుగులో సాగుతున్నచదువులతో పిల్లలు ఇంగ్లీష్‌పై పెద్దగా పట్టు సాధించ లేకపోవడంతో ఇంటర్‌లోనికి ప్రవేశించిన తర్వాత అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో చదువులు సాగించి వచ్చిన విద్యార్థులతో పోటీ పడలేక సతమతమవుతున్నారు. తద్వారా అనుకున్న స్థాయిలో ఫలితాలు రాబట్టడం లేదని గ్రహించిన ప్రభుత్వం దానిని అధిగమించేందుకు తెలుగు రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పాలని ముందుగు అడుగులేసింది. ఇందు కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జిఓనెం.53 ద్వారా రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా కొన్ని ప్రభు త్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా జిల్లాలో సైతం తొలినాళ్లలో 59 ఉన్నత పాఠశాలల్లో ప్రవేశపెట్టారు. రెండేళ్ల క్రితం దాని కొనసాగింపుగా మరో 266 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల్లో నిర్వహిస్తున్నారు. ప్రయోగం మంచిదే అయినప్పటికీ ప్రణాళికలో లోపం ఉండటంతో ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు.
చొరవ శూన్యం : ఈ ఏడాది విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ఇంగ్లీష్ మీడియం విద్యార్థులే అధిక ఉత్తీర్ణతా శాతాన్ని సాధించగలిగారు. ఉత్తమ ఫలితాలు వస్తున్నప్పటికీ ముందు కు సాగడంలో ప్రభుత్వం, ఉపాధ్యాయులు అడుగు కదపడం లేదనే ఆరోపణలు పెద్దఎత్తునే వస్తున్నాయి. భవిష్యత్ లో ఇంగ్లీష్‌తో పెద్ద ఎత్తున ప్రయోజనం ఉండటంతో తల్లిదండ్రులు వేలకు వేలు వెచ్చించి ప్రైవేటు స్కూళ్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇంగ్లీష్ మీడియం చెబుతున్న ప్రభుత్వం పాఠశాలల్లో 100 శాతం ఫలితాలను 15 పాఠశాలలు సాధించగా, అదే తెలుగు మీడియంలో మాత్రం 100 శాతం సాధించిన పాఠశాలలు జిల్లాలో ఐదే ఉండటం గమనార్హం. జిల్లాలో ఉన్న పాఠశాలల్లో 6వ తరగతిలో ఇంగ్లీష్ మీ డియం ప్రవేశపెట్టేందుకు జిల్లా విద్యాశాఖాధికారి ఆయా ప్రథానోపాధ్యాయుల నుండి ఈ విద్యా సంవత్సరానికి దరఖాస్తులు ఆహ్వానించారు. కానీ 10 లోపు మాత్రమే దరఖాస్తులు అందినట్లు తెలుస్తోంది. ఇటు ప్రథానోపాధ్యాయులు సైతం ముందుకు రాకపోవడం వెనుక అనేక కారణాలు ఉన్నట్లు తేటతెల్లమవుతోంది.
బోధించే వారు లేకే : చాలా పాఠశాలల్లో తెలుగు మీడియం బోధించే వారే ఇంగ్లీష్ మాధ్యమాన్ని సైతం చెబుతున్నారు. దీంతో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నట్లు పలు విమర్శలున్నాయి. ప్రస్తుతం మన రాష్ట్రంలో బిఇజి, డిఇడి చదువులు సాగించిన వారు తెలుగు మీడియంలలో చదవడం వల్ల వారికి అంత పెద్దగా ఇంగ్లీష్ బోధనపై పట్టు ఉండటం లేదని తెలుస్తోంది. చిన్న నాటి నుండి ఇంగ్లీష్ మీడియంలో చదువులు సాగించిన వారు ఇంజనీరింగ్ తో పాటు ఇతరత్రా సంపాదన అధికంగా ఉన్న ఉద్యోగాలను వెతుక్కోవడంతో ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో చదువుకున్నవారు,తెలుగు మీడియంలో చదువుకున్న వారు మాత్రమే ఉపాధ్యాయ విద్యా కోర్సులు చదువుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇంగ్లీష్ బోధన కష్టతరంగా మారుతోంది. ప్రస్తుతం ప్రభుత్వ బడుల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు సైతం తాము ఈ ఒక్క సంవత్సరం ప్రైవేటు స్కూళ్లలో చదువుకుంటాం అంటూ పట్టు బడుతున్నట్లు సమాచారం. దీనికి కారణాలు ఏమిటని అన్వేషిస్తే బోధన సమస్య తలెత్తుతున్నట్లు పలువురు విద్యార్థులు చెప్పకనే చెబుతున్నారు. ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేసి ఇంగ్లీష్ మాధ్యంలో బోధన చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, ఇంగ్లీష్‌లో భోదించ గల సామ ర్ధం ఉన్న ఉపాధ్యాయులకు ప్రత్యేక తర్ఫీదు నిచ్చి వారు ఇంగ్లీష్ బోధనను సరళంగా, సవ్యంగా చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వబడుల్లో ఇంగ్లీష్ మీడియం చదువుతున్న పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. మరో ప్రక్క ప్రథమిక విద్య నుండే ఇంగ్లీష్ మీడియంపై ఆసక్తి ఉన్న వారికి అందిస్తే రాబోయే రోజుల్లో మరింత సులభతరం అవుతుందని, ఇకనైనా దృష్టి సారిస్తేవిద్యార్థుల భవిష్యత్ బాగుంటుందని పలువురు భావిస్తున్నారు.